శ్రీ ఆర్యాద్విశతి

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి / (శ్రీ లలితాస్తవరత్నమ్)  వైభవము

మన ప్రాచీన భారతీయ ఋషులలో శ్రీవిద్యలోనూ, శైవములోనూ రెండిటా సిధ్ధిని పొంది, పరబ్రహ్మమును దర్శించినవారు, శ్రీ లలితా పరాభట్టారికా అమ్మవారి యొక్క పన్నెండు మంది ప్రఖ్యాత శ్రీవిద్యోపాసకులలో ఒకరైనవారు, సాక్షాత్తు శివాంశలో జన్మించినవారు శ్రీశ్రీశ్రీ దుర్వాసో మహర్షి. దుర్వాసో మహర్షినే క్రోధ భట్టారక అనే పేరుతోనూ పిలుస్తారు, క్రోధ భట్టారక అంటే వారిది సాధారణ మానవులలాగా ఉండే తామసిక/ జసిక క్రోధము కాదు. వారి క్రోధము లోక కళ్యాణము కోసమై ఉపకరిస్తుంది. అందుచేత మనవంటి వాళ్ళకు కలిగే తుఛ్చమైన కోపముతో వారి కోపమును పోల్చకూడదు. మహాత్ముల ప్రతీ గుణమూ లోకకళ్యాణము కొరకే అని గుర్తెరిగి ఉండాలి. దుర్వాసో మహర్షి, అమ్మ వారి యొక్క సాత్త్విక కోపమునకు ప్రతీక. ఆయన కోపము, భక్తులను సరిదిద్దడానికి , తద్వారా వారిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇదే అమ్మ వారి యొక్క అమితమైన క్రియా శక్తి.
 
ఆర్ష వాఙ్మయములో భట్టారకాఅని పిలువబడినవారు ముగ్గురు. ఒకరు సాక్షాత్తు శ్రీ లలితా పరాభట్టారికా అమ్మవారు. రెండవవారు క్రోధ భట్టారక అని పిలువబడిన దుర్వాసో మహర్షి, మూడవవారు శృంగార భట్టారక అని పిలువబడిన మహాకవి కాళిదాసు గారు. శ్రీ దుర్వాసో మహర్షి సాక్షాత్తు పరమ శివుని అంశలో, అత్రి మహర్షి మరియు అనసూయ మాతకి పుట్టారు. త్రిమూర్తులు అత్రి అనసూయల తపస్సును పరీక్షించడానికి వచ్చినప్పుడు, అనసూయ మాత వారికి భోజనం వడ్డించబోతే, ఆమె నగ్నంగా వడ్డిస్తేనే ఆతిథ్యం స్వీకరిస్తామని అనడంతో, త్రిమూర్తులే ఇలా వచ్చారు అని గుర్తు పట్టిన ఆ తల్లి, తన పాతివ్రత్య బలముతో ఆ ముగ్గురిని పసి పాపలుగా చేసి, అన్నం తినిపించి, ఊయలలో వేసి ఆడిస్తూ ఉంటుంది. ఇంతలో త్రిమూర్తుల యొక్క భార్యలైన ముగురమ్మలు, వారి వారి పతులకోసం వెతికి అత్రి ఆశ్రమానికి వచ్చి, పతి భిక్ష పెట్టమని అర్ధిస్తారు. అంతట అనసూయ మాత ఆ పాపలను మళ్ళీ మంత్ర జలం చల్లి త్రిమూర్తులకు యథా స్వరూపాన్నిస్తుంది. అప్పుడు అనసూయ మాత యొక్క పాతివ్రత్యానికి మెచ్చిన త్రిమూర్తులు వరం కోరుకోమంటారు.

ఆ తల్లి త్రిమూర్తులే నాకు బిడ్డలుగా రావాలని అడుగుతుంది. తత్ఫలితంగా, శివుడు దుర్వాసుడిగానూ, శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుల వారి గానూ, చతుర్ముఖ బ్రహ్మగారు చంద్రుడి గానూ పుట్టిన వైనం అందరికీ తెలిసే ఉంటుంది. పరమశివుడే నాలుగు యుగాలలోనూ దుర్వాస, పరశురామ, ధౌమ్య మరియు ఆదిశంకరభగవత్పాదాచార్యులుగా వచ్చారని పెద్దలు చెప్తారు. శ్రీ దుర్వాసో మహర్షి అమ్మవారిని ఆరాధించ ప్రముఖమైన శ్రీవిద్యోపాసకులలో ఒకరు. దుర్వాస మహర్షి ఇచ్చిన శ్రీవిద్యా విభాగమును సాది విద్య అంటారు. అలాగే లోపాముద్ర అమ్మ ఇచ్చిన శ్రీవిద్యా విభాగమును హాది విద్య అంటారు.

కంచి కామాక్షీ అమ్మవారి మూల స్వరూపం ఎదురుగా భూప్రస్థాన శ్రీచక్రమును ప్రతిష్ఠ చేసినది శ్రీ దుర్వాసో మహర్షియే. వారు అమ్మవారిని కీర్తిస్తూ, లలితా స్తవరత్నము (దీనినే ఆర్యా ద్విశతి అంటారు), త్రిపుర మహిమ్న స్తోత్రము (ఈ స్తోత్రం మొత్తం మంత్ర శాస్త్రమే), పరాశంభు మహిమ్న స్తోత్రము అనే మూడు అద్భుతమైన స్తోత్రములు చేశారు.   వారు చేసిన లలితా స్తవరత్నము అనే స్తోత్రము ఆర్యా ద్విశతిగా ప్రఖ్యాతి వహించిన స్తోత్రము. కామాక్షీ అమ్మవారి వైభవమును, శ్రీచక్ర రహస్యాలను వర్ణించే స్తోత్రములు ఇప్పటి వరకు ఆర్షవాఙ్మయములో మూడు ఉన్నాయి. మొదటిది దుర్వాసో మహర్షి ప్రణీత ఆర్యాద్విశతి, రెండవది శంకర భగవత్పాదులు చేసిన సౌందర్య లహరి, మూడవది మూకశంకరులు చేసిన మూకపంచశతి.

ఈ మూడు స్తోత్రములు అమ్మవారిని కీర్తించిన అత్యత్ద్భుతమైన స్తోత్ర రాజములు. దుర్వాసో మహర్షియే సరస్వతీ అమ్మవారి శాపం వలన, మూక శంకరులుగా తిరిగి జన్మించారని పెద్దలు చెప్తారు. పైన వ్రాసిన స్తోత్రములే కాకుండా, శ్రీ దుర్వాస మహర్షి "సౌభాగ్య చింతామణి కల్పము" ఇచ్చారు. దీనినే దుర్వాస సంహిత అని కూడా అంటారు. ఈరోజుకీ కంచి కామాక్షీ అమ్మవారి దేవాలయములో అమ్మవారి ఆరాధన ఈ చింతామణి కల్పము ఆధారముగానే చేస్తారు. 
 
దుర్వాస మహర్షి, కంచి కామాక్షీ అమ్మవారి ఆలయంలో అనేక మంది భక్తులకి వారు ప్రత్యక్ష  దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. కామాక్షీ అమ్మవారికి చందనోత్సవం చేసినప్పుడు ఇప్పటికీ, అమ్మవారి కుడి వైపు దుర్వాస మహర్షిని చూడవచ్చని, ఆ దర్శనం చేయగలిగిన సత్పురుషులకు వారు కనబడతారని పెద్దల విశ్వాసం. ఎంతో మంది శ్రీవిద్యోపాసకులకు దుర్వాసో మహర్షి ఆరాధ్య దైవం మరియు సద్గురువు. గురువు నుండి పొందిన శ్రీవిద్యా మంత్రాలు, ఏ కొంచెమైనా కూడా, పూనికతో కామాక్షీ ఆలయంలో అనుష్ఠిస్తే, వారికి తప్పకుండా దుర్వాసో మహర్షి అనుగ్రహం లభిస్తుందనీ, వారికి ఆయనే ఉపాసనలో ముందుకు నడిపించే దిశానిర్దేశం చేస్తారనీ ఎంతో మంది భక్తుల అనుభవం.   
 
దీనికి ఉదాహరణ, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మీనాక్షీ అమ్మళ్ అని ఒక తల్లి ఉండేది. ఆమెకి చాలా చిన్న వయసులోనే ఆమె మామగారే గురువై శ్రీవిద్యా దీక్ష ఇచ్చారు. అయితే, ఆమె ఎన్నో రోజులు సాధన చేయకమునుపే, ఆ గురువు (ఆమె యొక్క మావగారు) తనువు చాలించారు. అప్పటికి ఆ తల్లికి శ్రీవిద్యోపాసనలో ఇంకా సాధనాబలం లేదు. ఆమెకి గురువు గారు ఇచ్చిన మూలమంత్రము ఒక్కటే తెలుసు.

ఆమె ఆ మూలమంత్రమునే భక్తితో కొంత కాలం సాధన చేసింది. అయితే ఆమె తరచుగా తిరువారూర్ లో ఉన్న కమలామ్బికా అమ్మవారి క్షేత్రములో కూర్చుని ఆ మంత్ర జపము చేసేది. ఒకనాడు, అదేవిధముగా ఆ ఆలయములో జపం చేస్తూ ఉంటే, మంచి స్ఫురద్రూపి అయిన ఒక వృధ్ధుడు ఆమె యెదుటకి వచ్చి, నువ్వు కంచిలోని శ్రీవిద్యా పరమేశ్వరీ అమ్మవారి సన్నిధికి (అంటే కామాక్షీ అమ్మయే) వెళ్ళు, అక్కడ నీవు చేసే మంత్ర జపమునకు న్యాసము (కరన్యాసము, అంగన్యాసము) కూడా దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెంటనే కంచి కామాక్షీ అమ్మవారి సన్నిధికి వెళ్ళింది. ఆశ్చర్యంగా ఆమెకి ఇక్కడ కూడా అదే వృధ్ధుడు దర్శనమిచ్చి, అక్కడ అమ్మ వారి ప్రాంగణములోనే ఉన్న మరొకరిని చూపించి ఆయనని ఆశ్రయించమని చెప్పారు. వెంటనే ఆ తల్లి పరుగు పరుగున వెళ్ళి వారి పాదములకు నమస్కారం చేసి, జరిగినదంతా చెప్పింది. 

ఆ పెద్ద మనిషి మైసూర్ కు చెందిన శ్రీ యజ్ఞనారాయణ శాస్త్రి అనే ఒక గొప్ప శ్రీవిద్యోపాసకుడు. శాస్త్రి గారు, నేను నీకు ఎలా తెలుసమ్మా అని ఆవిడని అడిగితే, ఆ తల్లి వెనుకకు తిరిగి, అక్కడ నిల్చున్న వృధ్ధుడిని చూపించింది. విచిత్రముగా, ఆ వృధ్ధుడు శాస్త్రి గారు, ఆ తల్లి ఇద్దరూ చూస్తుండగా అంతర్ధానం చెందారు. తదుపరి ఆ తల్లి కామాక్షీ ఆలయంలో ప్రదకక్షిణ చేస్తూ ఉండగా, దుర్వాస మహర్షి సన్నిధికి వచ్చి నమస్కరించగానే, అక్కడ అంతర్ధానం చెందిన వృధ్ధుడే దుర్వాస మహర్షి మూర్తి యందు కనబడి, ఆమెను దీవించారు. ఇది నిత్య సత్యమైన లీల. ఇప్పటికీ ఆ తల్లి ప్రతీ యేటా కంచి వెళ్ళి అమ్మ దర్శనముతో పాటు, దుర్వాస మహర్షి యొక్క దర్శనము కూడా పొందుతారు.

దుర్వాస మహర్షి చేసిన ఆర్యా ద్విశతిలో శ్రీనగర(శ్రీచక్ర) వర్ణన చేయబడినది. శ్రీమాత శ్రీచక్రము శ్రీవిద్యా ఈ మూడు అభేదములు. ఈ స్తోత్రములో మొత్తం రెండు వందల శ్లోకాలు ఉన్నాయి. ఈ స్తోత్రము అరుదైన ఆర్యా ఛందస్సులో ఆర్యా మహాదేవిపై వ్రాయబడిన పరమ పవిత్రమైన స్తోత్రము. శ్రీచక్ర బిందు స్థానములో, కామేశ్వరుని వామాంకారూఢయై, వివిధ ఆవరణలలో నివసించే దేవతలందరి చేత నిత్యం పూజలందుకొనే శ్రీరాజరాజేశ్వరీ అమ్మ వారిని అభివర్ణిస్తుంది ఈ ఆర్యాద్విశతి స్తోత్రం. నడిచే దేవుడు, కంచి పరమాచార్య, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వామి వారు ఈ స్తోత్రం చదవితే, మనో నేత్రం ముందు అంబికా రూపం కనబడుతుంది అనిచెప్పారు.
 
ఇంత అద్భుతమైన ఈ స్తోత్రమును 1920 లో బ్రహ్మశ్రీ కనుపర్తి వెంకటరామ శ్రీవిద్యానందనాథ గారు మొట్ట మొదట తెలుగులోకి అనువదించారు. అది పూర్తి గ్రాంధిక తెలుగులో ఉంటుంది. వీరి తర్వాత 1935 - 38 ప్రాంతంలో, కంచి కామకోటి అరవై ఎనిమిదవ పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వామి వారి ప్రత్యక్ష దర్శన, ఆశీస్సులను పొందిన శ్రీ కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు అనే పండితుడు ఆర్యా ద్విశతి మరియు మూక పంచశతి లను తెలుగులోకి అనువదించారు. అయితే వీరు చేసిన ఈ అనువాదములు ప్రస్తుతం ఎక్కడా లభించలేదు.
 
వీరి తర్వాత, 1998 ప్రాంతములో, బ్రహ్మశ్రీ నాగపూడి కుప్పుస్వామి అయ్యర్ అనే గొప్ప సంస్కృత, తమిళ, తెలుగు భాషలలో పండితుడు, దుర్వాస కృత ఆర్యా ద్విశతికి మరియు శ్రీ శ్రీవిద్యానందనాథ వారు వ్రాసిన శ్రీచక్ర నగర వర్ణన ని రెంటినీ ప్రామాణిక తెలుగులోకి అనువాదం చేశారు. అదృష్టవశాత్తు వీరు వ్రాసిన ఈ అద్భుతమైన పుస్తకము, ఇప్పుడు కూడా దొరుకుతోంది. కావలసిన వారు ఈ క్రింది లంకె నుండి ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=5203 

ఈ స్తోత్రములో ఉన్న శ్లోకాలను, రోజుకి ఇరవై శ్లోకాల చొప్పున, పది రోజులలో దీనిని అందరితో పంచుకోవాలని సంకల్పము. అవ్యాజకరుణామూర్తి అయిన శ్రీ కామాక్షీ అనుగ్రహముతో ఇంత అత్యద్భుతమైన ఈ ఆర్యాద్విశతి స్తోత్రము అందరమూ చదివి, అమ్మవారి కృపకు పాత్రులము అవుదాము.