సుందర కాండ గానం - M . S . రామా రావు - మొదటి భాగము

Within the ruins at Dhanushkodi is the temple of Lord Rama. Legend says that this is the land where Lord Rama set foot on and built a sethu (bridge) with the help of the monkey King Hanuman and his army. After Rama won the war, he crowned Ravana's brother Vibhishana as the new king of Lanka. Vibhishana requested Rama to destroy the bridge. Rama broke the bridge with one end of his bow. Hence, the name Dhanushkodi or "end of the bow" (dhanush meaning bow and kodi meaning end).
శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా నీ పలికెద సీతారామకథా

శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు - అతి బలవంతుడు రామ భక్తుడు 
లంకకు పోయి రాగల ధీరుడు - మహిమోపేతుడు శత్రు ఘర్షణుడు |
జాంబవదాది వీరులందరును - ప్రేరేపింపగా సమ్మతించెను
లంకేశ్వరుడు అపహరించిన - జానకీ మాత జాడ తెలిసికొన ||

తన తండ్రి యైన వాయుదేవునకు - సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు
వానరేంద్రుడు మహేంద్రగిరిపై - వందనములిడే పూర్వాభిముఖుడై |
రామ నామమున పరవశుడయ్యే - రోమరోమమున పులకితుడయ్యే
కాయము పెంచే కుప్పించి ఎగసే - దక్షిణ దిశగా లంక చేరగా ||

పవన తనయుని పద ఘట్టనకే - పర్వత రాజము గడ గడ వణకే
ఫలపుష్పాదులు జల జల రాలే - పరిమళాలు గిరి శిఖరాలు నిండే |
పగిలిన శిలల ధాతువులెగసే  - రత్న కాంతులు నలు దిసల మెరసే
గుహలను దాగిన భూతములదిరే - దీనారవముల పరుగిడే బెదిరీ ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

రఘుకులోత్తముని రామచంద్రుని - పురుషోత్తముని పావన చరితుని
నమ్మినబంటుని అనిలాత్మజుని - శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని |
నీకడ కొంత విశ్రాంతి తీసికొని - పూజలందుకొని పోవచ్చునని
సగర ప్రవర్దితుడు సాగరుడెంతో - ముదమున పలికే మైనాకునితో ||

మైనాకుడు ఉన్నతుడై నిలిచే - హనుమంతుడు ఆగ్రహమున గాంచె
ఇది ఒక విఘ్నము కాబోలునని - వారిథి పడద్రోసే పురము చేగిరిని |
పర్వత శ్రేష్టుడా పోటున క్రుంగే - పవన తనయుని బలము గని పొంగే
తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే - తన శిఖరము పై నరుని రూపమై ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

వానరోత్తమా ఒకసారి నిలుమా - నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా
కందమూలములు ఫలములు తినుమా - నా పూజలు గొని మన్నన లందుమా|
శతయోజనముల పరిమితముగల జలనిదినవలీల దాటిపోగల
నీదు మైత్రి కడు ప్రాప్త్యము నాకు - నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు ||

పర్వతోత్తముని కరమున నిమిరి - పవన తనయుడు పలికెను ప్రీతిని
ఓ గిరీంద్రమా సంతసించితిని - నీ సత్కారము ప్రీతినందితిని |
రామ కార్యమై యేగుచుంటిని - సాధించు వరకు ఆగనంటిని
నే పోవలె క్షణమెంతో విలువలే - నీ దీవెనలే నాకు బలములే||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా
అనాయాసముగా అంబర వీధిని - పయనము చేసేడు పవన కుమారుని
ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు - పులకాంకితులై ప్రస్తుతించిరి |
రామకార్యమతి సాహసమ్మని - రాక్షసబలమతి భయంకరమని
కపివరుడెంతటి ఘనకరుడోయని - పరిశీలనగా పంపిరి సురసని ||

ఎపుడో నన్ను నిన్ను మ్రింగమని - వరమొసగి  మరీ బ్రహ్మ పంపెనని
అతిగా సురస నోటిని తెరచే - హనుమంతుడలిగి కాయము పెంచే |
ఒకరినొకరు మించి కాయము పెంచిరి - శతయోజనములు విస్తరించిరి
పైనుండి సురలు తహతహ లాడిరి - ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి ||

సురస మొఖము విశాలమౌట గని - సూక్ష్మ బుద్దిగొని సమయమిదేనని
క్షణములోన అంగుష్ఠ మాత్రుడై - ముఖము జొచ్చి వెలివచ్చే  విజయుడై |
పవన కుమారుని సాహసము గని - దీవించే సురస నిజరూపము గొని
నిరాలంబ నీలాంబరము గనుచు - మారుతి సాగెను వేగము పెంచుచు ||

జలనిధి తేలే మారుతి చాయను రాక్షసి సింహిక అట్టే గ్రహించెను
గుహను పోలు తన నోటిని తెరచెను - కపివరుని గుంజి మ్రింగ జూచెను |
అంతట మారుతి సూక్ష్మ రూపమున - సింహిక ముఖమును చ్రొచ్చి చీల్చెను
సింహిక హృదయము చీలికలాయెను - సాగరమున బడి అసువులు బాసెను ||

వారిథి దాటెను వాయుకుమారుడు - లంక చేరెను కార్య శూరుడు
నలు వంకలను కలయ జూచుచూ - నిజ రూపమున మెల్లగా సాగుచూ |
త్రికూటాచల శిఖరము పైన - విశ్వకర్మ వినిర్మితమైన
స్వర్గ పురముతో  సమానమైన - లంకాపురమును మారుతి గాంచెను ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

అనిలకుమారుడా రాత్రి వేళలను - సూక్ష్మ రూపుడై బయలు దేరెను
రజనీకరుని వెలుగు చేతను - రజనీచరుల కంట బడకను |
పిల్లివలె పొంచి మెల్లగా సాగెను - ఉత్తర ప్రాకార ద్వారము చేరెను
లంకా రాక్షసి కపివరు గాంచెను - గర్జన సేయుచు అడ్డగించెను ||

కొండకోనల తిరుగాడు కోతివి ఈ పురికి ఈ పనికి వచ్చితివి
లంకేశ్వరుని ఆనతిమేర - లంకాపురికి కావలి యున్న |
లంకను నేను లంకాధి దేవతను - నీ ప్రాణములను నిలువున దీతును
కదలక మెదలక నిజము పల్కుమని - లంక ఎదుర్కొనే కపి కిశోరుని ||

అతి సుందరమీ లంకా పురమని - ముచ్చటపడి నే చూడవచ్చితిని
ఈ మాత్రమునకు కోపమెందుకులే - పురము గాంచి నీ మరలి పోదులే |
అని నెమ్మదిగా పలుకగా విని - అనిలాత్మజుని చులకనగా గొని
లంకా రాక్షసి కపి కిశోరుని - గర్జించి కసరి గద్దించి చరచెను||

సింహనాదమును మారుతి చేసే - కొండతగా తన కాయము పెంచే
వామహస్తమున పిడికిలి బిగించే - ఒకే పోటున లంకను గూల్చె |
కొండబండలా రక్కసి డొల్లె - కనులప్పగించి నోటిని తెరచే
అబలను చంపుట ధర్మము కాదని - లంకను విడిచే మారుతి దయగొని ||

ఓ బల భీమా వానరోత్తమా - నేటికి నీచే ఓటమెరిగితి
ఈ నా ఓటమి లంకకు చేటని - పూర్వమే బ్రహ్మ వరమొసగేనని |
రావణుడాదిగా రాక్షసులందరూ - సీత మూలమున అంతమొందేదరు
ఇది నిజమోయని నీదే జయమని - లంకా రాక్షసి పంపే హరీశుని ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

కోటగోడ అవలీలగా ప్రాకెను - కపి కిశోరుడు లోనికి ద్రుమికెను
శత్రు పతనముగా వామ పాదమును - ముందుగ మోపెను ముందుకు సాగెను |
ఆణిముత్యముల తోరణాలు గల - రమ్యమైన రాజవీధుల
వెన్నెలలో లంకాపురి శోభను - శోధనగా హరీశుడు గాంచెను ||

సువర్ణమయ సౌద రాజముల - ధగ ధగ మెరసే ఉన్నత గృహముల
కళకళ లాడే నవ్వుల జల్లులు - మంగళ కరమౌ నృత్య గీతములు |
అప్సరసల మరపించు మదవతుల - త్రిష్టాయి గొలుపు గానమాదురులు
వెన్నెలలో లంకాపురి శోభను - శోధనగా హరీశుడు గాంచెను ||

సుందరమైన హేమ మందిరము - రత్న కచితమౌ సింహ ద్వారము
పతాకాంకిత ధ్వజాకీర్ణము  - నవరత్న కాంతి సంకీర్ణము |
నృత్య మృదంగ గంభీర నాదితము - వీణా గాన వినోద సంకులము
లంకేశ్వరుని దివ్య భవనమది - శోధనగా హరీశుడు గాంచెను ||

అత్తరు పన్నీట జలకములు - కాలాగరు సుగంధ ధూపములు
స్వర్ణ ఛత్రములు వింధ్యా మరలు - కస్తూరి పునుగు జవ్వాజి గంధములు |
నిత్య పూజలు శివార్చనలు - మాస పర్వముల హోమములు
లంకేశ్వరుని దివ్య భవనమది - శోధనగా హరీశుడు గాంచెను ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

యమ కుబేర వరుణ దేవేంద్రాదుల - సర్వ సంపదల మించినది
విశ్వ కర్మ తొలుత బ్రహ్మ కిచ్చినది - బ్రహ్మ వరమున కుబెరుడందినది |
రావణుండు కుబేరుని రణమందు - ఓడించి లంకకు కొని తెచ్చినది
పుష్పకమను మహా విమానమది - మారుతి గాంచెను అచ్చెరువొందేను ||

నేలను తాకక నిలిచి యుండునది - రావణ భవన మధ్యంబుననున్నది
వాయు పథమున ప్రతిష్టిత మైనది - మనమున తలచిన రీతి పోగలది|
దివినుండి భువికి దిగిన స్వర్గమది - సూర్య చంద్రులను దిక్కరించునది
పుష్పకమను మహా విమానమది - మారుతి గాంచెను అచ్చెరువొందేను ||

లంకాదీశుని ప్రేమమందిరము - రత్న కచితమౌ హేమ మందిరము
చందనాది సుగంధ బంధురము - పానభక్ష్య పదార్థ సమృద్ధము |
ఆయా పరిమళ రూపానిలము - అనిలాత్మజుచే ఆఘ్రానితము
పుష్పకమందు రావణ మందిరమ్మది- మారుతి గాంచెను అచ్చెరువొందే ||

మత్తున శయనించు సుదతుల మోములు - పద్మములనుకుని మువ్వు భ్రమరములు
నిమీళిత విశాల నేత్రములు - నిశా ముకుళిత పద్మ పత్రములు |
ఉత్తమ కాంతల కూడి రావణుడు - తారాపతి వలె తీజరిల్లెడు
పుష్పకమందు రావణ మందిరమ్మది - మారుతి గాంచెను అచ్చెరువొందే ||

రావణుండు రణమందున గెలిచి - స్త్రీలెందరినో లంకకు జేర్చెను
పిత్రుదైత్య గంధర్వ కన్యలు - ఎందెందరో రాజర్షి కన్యలు |
సీత దక్క వారందరూ కన్యలే - రావణు మెచ్చి వరించిన వారలే
పుష్పకమందు రావణ మందిరమ్మది - మారుతి గాంచెను అచ్చెరువొందే ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

ఐరావతము దంతపు మొనలతో - పోరున బోడచిన గంటులతో
వజ్రాయుధపు ప్రభాతముతో - చక్రాయుధపు ప్రహరనములతో |
జయ పరంపరల గురుతులతో - కీర్తి చిహ్నముల కాంతులతో
లంకేశుడు శయనించే కాంతలతో - సీతకై వెతకే మారుతి ఆశతో ||

మినప రాశి వలె నల్లని వాడు - తీక్షణ దృక్కుల లోహితాక్షుడు
రక్తచందనా చర్చిత గాత్రుడు - సంధ్యారుణ ఘన తేజోవంతుడు |
సతుల గూడి మధు బ్రోలిన వాడు - రతికేళి సలిపి సోలిన వాడు
లంకేశుడు శయనించే కాంతలతో - సీతకై వెతకే మారుతి ఆశతో ||

అందొక వంక పర్యంకము జేరి - నిదురించుచుండే దివ్యమనోహరి
నవరత్న ఖచిత భూషణ ధారిణి - నలువంకలను కాంతి ప్రసారిణి |
స్వర్ణ దేహిని చారు రూపిణీ - రాణులకు రాణి పట్టపు రాణి
లంకేశుని హృదయేశ్వరి - మండోదరి లోకోత్తర సుందరి ||

మండోదరిని జానకి యనుకుని - ఆడుచు పాడుచు గంతులు పెట్టి
వాలము బట్టి ముద్దులు పెట్టి - నేలను గొట్టి భుజములు తట్టి |
స్థంభములెగసి క్రిందకు దుమికి - పల్లటీలు గొట్టి చెంగున దుమికి
చంచలమౌ కపీశ్వ భావమును పవన తనయుడు ప్రదర్శన చేసెను ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

రాముని సీతా ఇటులుండునా ?
రాముని సీతా ఇటులుండునా ? - రావణు జేరి శయనించునా?
రాముని బాసి నిదురించునా ? భుజియించునా భూషణముల దాల్చునా ? |
పరమ పురుషుని రాముని మరచునా ? పరపురుషునితో కాపురముండునా ?
సీత కాదు కాదు కానే కాదని - మారుతీ వగచుచు వెతక సాగెను ||

పోవగ రాని తావుల బోతి - చూడగ రానివి ఎన్నో జూచితి
నగ్నముగా పరున్న పరకాంతల - పరిశీలనగా పరికించితిని |
రతికేళి సలిపి సోలిన రమణుల - ఎందెందరినో పొడగాంచితిని
ధర్మము గానని పాపినైతినని - పరితాపముతో మారుతి క్రుంగెను ||

సుదతుల తోడ సీత యుండగా - వారల జూడక వెదకుటేలాగా
మనసున ఏమి వికారము నొందక - నిష్కామముగా వివేకము వీడక |
సీతను వెదకుచు చూచితి గాని - మనసున ఏమి పాపమెరుగనని
స్వామి సేవ పరమార్థముగా గొని - మారుతి సాగెను సీత కోసమని ||

భూమీ గృహములు నిశా గృహములు - క్రీడా గృహములు లతా గృహములు
ఆరామములు చిత్రశాలలు - బావులు తిన్నెలు రచ్చ వీధులు |
మేడలు మిద్దెలు ఇల్లు కోనేళ్ళు - సందులు గొందులు బాటలు తోటలు
ఆగి ఆగి అడుగడుగునా వెదకుచు - సీతను గానక మారుతి వగచే ||

సీతా మాత బ్రతికి యుండునో - క్రూర రాక్షసుల పాల్పడి యుండునో
తాను పొందని సీత ఎందుకని - రావణుడే హత మార్చి యుండునో |
అని యోచించుచు అంతట వెదకుచు - తిరిగిన తావుల తిరిగి తిరుగుచు
ఆగి ఆగి అడుగడుగునా వెదకుచు - సీతను గానక మారుతి వగచే ||

సీత జాడ కనలేదను వార్తను - తెలిపిన రాముడు బ్రతుక జాలడు
రాముడు లేనిదే లక్ష్మణుడుండడు - ఆపై రఘుకుల మంతయు నశించు |
ఇంతటి ఘోరము కాంచినంతనే - సుగ్రీవాదులు మడియక మానరు
అని చింతించుచుపుష్పకము వీడి - మారుతి చేరే ప్రాకారము పైకి ||

ఇంత వినాశము నావల్ల నేను - నీ కిష్కింధకు పోనే పోను
వానప్రస్థాశ్రమవాసుడనై - నియమ నిష్ఠలతో బ్రతుకు వాడనై |
సీతా మాతను జూచి తీరెదను - లేకున్న నేను అగ్ని దూకెదను
అని హనుమంతుడు కృత నిశ్చయుడై - నలుదెసల గనే సాహస వంతుడై ||

చూడమరచిన అశోక వనమును - చూపు మేరలో మారుతి గాంచెను
సీతారామ లక్ష్మణాదులకు - ఏకాదశ రుద్రాది దేవులకు |
ఇంద్రాది యమ వాయు దేవులకు - సూర్య చంద్ర మరుద్గణములకు
వాయు నందనుడు వందనములిడి - అశోక వని చేరెను వడి వడి ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

విరి తేనియలు బ్రోలు భ్రుంగములు - విందారగ సేయు ఝంకారములు
లేజివురాకుల మెసవు కోయిలలు - పంచమ స్వరముల పలికే పాటలు |
పురులు విప్పి నాట్యమాడు నెమలులు - కిల కిల లాడే పక్షుల గుంపులు
సుందరమైన అశోక వనమున - మారుతి వెదకెను సీతను కనుగొన ||

కపికిశోరుడు కొమ్మ కొమ్మను - ఊపుచూ ఊగుచూ దూకసాగెను
పువ్వులు రాలెను తీవెలు తెగెను - ఆకులు కొమ్మలు నేలపై బడెను |
పూలు పైరాల పవన కుమారుడు - పుష్ప రథము వలె వనమున దోచెడు
సుందరమైన అశోక వనమున - మారుతి వెదకెను సీతను కనుగొన ||

పూవులనిన పూ తీవియలనిన - జానకి కెంతో మనసౌనని
పద్మ పత్రముల పద్మాక్షుని గన - పద్మాకరుల  పొంత జేరునని |
అన్ని రీతుల అనువైనదని - అశోక వని సీత యుండునని
శోభిల్లు శింశుప తరు శాఖలపై - మారుతి కూర్చొని కలయ జూచెను ||

శ్రీ హనుమను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతా రామ కథా

సుందరమైన అశోకవనమున - తను కూర్చొనిన తరువు క్రిందున
క్రుంగి కృశించిన సన్న గిల్లిన - శుక్ల పక్షపు శశి రేఖను |
ఉపవాసముల వాడి పోయిన - నివురు కప్పిన నిప్పు కణమును
చిక్కిన వనితను మారుతి గాంచెను - రాక్షస వనితల క్రూర వలయమున ||

మాసిన పీత వసనమును దాల్చిన - మన్నున పుట్టిన పద్మమును
పతివియోగ శోకాగ్ని వేగిన - అంగారక పీడిత రోహిణిని |
మాటి మాటికీ వేడి నిట్టూర్పుల - సెగలను గ్రక్కే అగ్ని జ్వాలను
చిక్కిన వనితను మారుతి గాంచెను - రాక్షస వనితల క్రూర వలయమున ||

నీలవేణి సంచాలిత జఘనను - సుప్రతిష్ఠను సింహమధ్యను
కాంతులొలుకు ఏకాంతప్రశాంతను - రతీదేవి వలె వెలయు కాంతను |
పుణ్యము తరిగి దివి నుండి జారి - శోక జలధి పది మునిగిన తారను
చిక్కిన వనితను మారుతి గాంచెను - రాక్షస వనితల క్రూర వలయమున ||

పతిచెంత లేని సతి కేలనని - సీత సోమ్ములదగిల్లె శాఖల
మణిమయ కాంచన కర్ణ వేష్టములు - మరకత మాణిక్య చెంప సరాలు |
రత్న ఖచితమౌ హస్త భూషలు - నవరత్నాంకిత మణిహారములు
రాముడు తెలిపిన గురుతులు గలిగిన - ఆభరణముల గుర్తించే మారుతి ||

సర్వ సులక్షణ లక్షిత జాత - సీత గాక మరి ఎవరీ మాత
కౌసల్యా సుప్రజా రాముని - సీత గాక మరి ఎవరీ మాత |
వనమున తపించు మేఘ శ్యాముని - సీత గాక మరి ఎవరీ మాత
ఆహా కంటి కనుగొంటి సీతనని - పొంగి పొంగి ఉప్పొంగే మారుతి ||

శ్రీ హనుమను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతా రామ కథా

పువ్వులు నిండిన పొలములందున  - నాగేటి చాలున జననమందిన
జనక మహారాజు కూతురైన - దశరథ నరపాలు కోడలైన |
సీతా లక్ష్మి కి కాదు సమానము - త్రైలోక్య రాజ్య లక్ష్మీ  సహితము
అంతటి మాతకా కాని కాలమని - మారుతి వగచే సీతను కనుగొని ||

శత్రు తాపకరుడు మహా శూరుడు - సౌమిత్రికి పూజ్యురాలైన
ఆశ్రిత జన సంరక్షకుడైన - శ్రీ రఘు రాముని ప్రియ సతియైన |
పతి సన్నిధియే సుఖమని ఎంచి - పడునాల్గేండ్లు వనమునకేగిన
అంతటి మాతకా కాని కాలమని - మారుతి వగచే సీతను కనుగొని ||

బంగారు మేని కాంతులు మెరయ  - మందస్మిత ముఖ పద్మము విరియ
హంస తూలికా తల్పమందున - రాముని గూడి సుఖింపక దగిన|
పురుషోత్తముని పావన చరితుని - శ్రీ రఘు రాముని ప్రియ సతియైన
అంతటి మాతకా కాని కాలమని - మారుతి వగచే సీతను కనుగొని ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా

మూడు ఝాములా రేయి గడువగా - నాల్గవ ఝాము నడచుచుండగా
మంగళ వాయిద్య మనోహర ధ్వనులు - లంకేశ్వరుని మేలుకొల్పులు |
క్రతువులొనర్చు షడంగ వేద విధుల - స్వరయుత శబ్ద తరంగ ఘోషలు
శోభిల్లు శింశుపా శాఖలందున - మారుతి కూర్చొని ఆలపించెను ||

రావణాసురుడు శాస్త్రోక్తముగా - వేకువనే విధులన్నీ యొనర్చెను
మదోత్కటుడై మదన తాపమున - మరి మరి సీతను మదిలోనెంచెను |
నూర్గురు భార్యలు సురకన్యల వలె - పరిసేవింపగా  దేవేంద్రుని వలె
దశకంఠుడు దేదీప్యమానముగా - వెడలెను అశోకా వనము చేరగా ||

లంకేశునితో వెడలిరి సతులు - మేఘము వెంట విద్యుల్లతల వలె
మధువు బ్రోలిన పద్మ ముఖుల - మ్రుంగురులు రేగే భ్రుంగముల వలె
క్రీడల త్రేలిన కామినీ మణులు - నిద్రలేమి పడు అడుగులు తూలె
దశకంఠుడు దేదీప్యమానముగా - చేరెను అశోకా వనము వేగముగా ||

లంకేశుని మహా తేజమును గని - మారుతి కూడ దిగ్భ్రాంతి చెందెను
దశకంఠుడు సమీపించి నిలచెను - సీత పైననే చూపులు నిలిపెను
తొడలు చేర్చుకుని కడుపును దాచి - కరములు ముడిచి చనుగవ గాచి
సుడిగాలి పడిన కడలీ తరువు వలె - కటిక నేలపై జానకి తూలె ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా

ఓ సీతా ఓ పద్మనేత్రా - నా చెంత నీకు ఏల చింత
ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య - ఎందుకోసమీ వనవాస వ్యధ |
నవ యవ్వన త్రిలోక సుందరి - నీకెందుకు ఈ మునివేషధారీ
అని రావణుడు కామాంధుడై నిలిచే - నోటికి వచ్చిన దెల్ల పల్కే ||

రాముడు నీకు సరిగాని వాడు - నిను సుఖ పెట్టడు తను సుఖ పడడు
గతి చెడి వనమున తిరుగుచుండెనో - తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో |
మరచి పొమ్ము ఆ కొరగాని రాముని - వలచి రమ్ము నను యశో విశాలుని
అని రావణుడు కామాంధుడై నిలిచే - నోటికి వచ్చిన దెల్ల పల్కే ||

రాముడు వచ్చుట నన్ను గెల్చుట - నిన్ను పొందుట కలలోని మాట
బలవిక్రమ ధన యశములందున - అల్పుడు రాముడు నా ముందెందున |
యమ కుబేర ఇంద్రాది దేవతల - గెల్చిన నాకిల నరభయమేల?
అని రావణుడు కామాంధుడై నిలిచే - నోటికి వచ్చిన దెల్ల పల్కే ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా

నిరతము పతినే మనమున తలచుచు - క్షణమొక యుగముగా కాలము గడపుచు
రావణ గర్వమదంబుల ద్రుంచు - రాముని శౌర్య ధైర్యముల దలచుచు |
శోకతప్తయై శిరమును వంచి - త్రుణమును త్రుంచి తనమున్దుంచి
మారు పల్కే సీత దీన స్వరమున - తృణము కన్నా రావణుడే హీనమన ||

రామలక్ష్మణులు లేని సమయమున - అపహరించితివే నను ఆశ్రమమున
పురుష సింహముల గాలికి బెదిరి - పారిపోతివి శునకము మాదిరి |
యమకుబేర ఇంద్రాది దేవతల - గెలిచిన నీకీ వంచనలేల?
మారు పల్కే సీత దీన స్వరమున - తృణము కన్నా రావణుడే హీనమన ||

ఓయి రావణా నా మాట వినుము - శ్రీరామునితో వైరము మానుము
శీఘ్రముగా నను రాముని జేర్చుము - త్రికరణ శుద్ధిగా శరణు వేడుము |
నిను మన్నించి అనుగ్రహింపుమని  - కోరుకొందు నా కరుణా మూర్తిని
అని పల్కే సీత దీన స్వరమున - తృణము కన్నా రావణుడే హీనమన ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా

ఓ సీతా నీవెంత గడసరివే - ఎవరితో ఏమి పల్కుచుంటివే?
ఎంతటి కర్ణ కఠోర వచనములు - ఎంతటి ఘోర అసభ్య దూషణలు|
నీపై మోహము నను బంధించెను - లేకున్న నిన్ను వధించియుందును
అని గర్జించెను ఘనతరగాత్రుడు - క్రోధో దీప్తుడై దశకంఠుడు ||

నీకొసగినc ఏడాది గడువును - రెండునెలలలో ఇక తీరిపోవు
అంతదనుక నిన్నంటగా రాను - ఈ లోపున బాగోగులు కనుగొను |
నను కోరని నిను బలాత్కరించను - నను కాదను నిను కనికరించను
అని గర్జించెను ఘనతరగాత్రుడు - క్రోధో దీప్తుడై దశకంఠుడు ||

ఓ రావణా నీ క్రొవ్విన నాలుక - గిజగిజలాడి తెగి పడదేమి?
కామాంధుడా నీ క్రూర నేత్రములు - గిరగిర తిరిగి రాలి పడవేమి?
పతి యాజ్ఞ లేక ఇటులుంటి గాని - త్రుటిలో నిను దహింపనా ఏమి?
అని పల్కే సీత దివ్య స్వరమున - తృణము కన్నా రావణుడే హీనమన ||

క్రోధాగ్నిరగుల రుసరుస లాడుచూ - కొరకొర చూచుచూ నిప్పులు గ్రక్కుచూ
తన కాంత లెల్ల కలవరమొందగా - గర్జన సేయుచూ దిక్కులదరగా |
సీతనేటులైన ఒప్పించుడనీ - ఒప్పుకొననిచో భక్షించుడనీ
రావణాసురుడు అసుర వనితలను - అజ్ఞాపించీ మరలీ పోయెను ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా

అందున్న ఒక వృద్ధ రాక్షసి - తోటి రాక్షసుల ఆవల ద్రోలి
కావలెనన్న నన్ను వధించుడు - సీతను మాత్రం హింసింపకుడు |
దారుణమైన కలగంటి నేను - దానవులకది ప్రళయమ్మేను
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

శుక్లాంబరములు దాల్చిన వారు - రామలక్ష్మణులు అగుపించినారు
వైదేహికి ఇరువంకల నిలిచి - దివ్య తేజమున వెలుగొంది నారు |
తెల్లని కరిపై మువ్వురు కలసి - లంకా పురిపై పయనించినారు
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

దేవతలందరు పరిసేవింప - ఋషిగణంబులు అభిషేకింప
గంధర్వాదులు సంకీర్తింప - బ్రహ్మాదులు మునుముందును దింప|
సీతారాముడు విష్ణు దేవుడై - శోభిల్లెను కోటి సూర్య తేజుడై
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

తైలమలదుకొని రావణాసురుడు - నూనె త్రాగుచూ అగుపించినాడు
కాలాంబరమును ధరియించినాడు - కర వీరమాల దాల్చినాడు |
పుష్పకమందుండి నేలబడినాడు - కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

రావణుండు వరాహము పైన - కుంభకర్ణుడు ఒంటె పైన
ఇంద్రజిత్తు మకరము పైన - దక్షిణ దిశగా పడి పోయినారు |
రాక్షసులందరూ గుంపు గుంపులుగా - మన్నున కలిసిరి సమ్మూలమ్ముగా
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

తెల్లని మాలలు వలువలు దాల్చి - తెల్లని గంధము మేన బూసుకొని
నృత్య మృదంగ మంగళాధ్వనులతో - చంద్రకాంతులెగజిమ్ము ఛత్రముతో |
తెల్లని కరి పై మంత్రి వర్యులతో - వెడలె విభీషణుడు దివ్య కాంతితో
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

విశ్వకర్మ నిర్మించిన లంకను - రావణుండు పాలించెడు లంకను
రామ దూత ఒక వానరోత్తముడు - రుద్ర రూపుడై దహియించినాడు |
ప్రళయ భయానక సద్రుశమాయెను - సాగరమున లంక మునిగి పోయెను
అను పల్కు త్రిజట మాటలు వినుచూ - నిద్ర తూలిరి రాక్షస వనితలు ||

హృదయ తాపమును జానకి తూలుచూ - శోక భారమున గడ గడ వణకుచూ
జరగి జరగి అశోక శాఖలను - ఊతగా గొని మెల్లగా నిలిచి |
శ్రీరాముని కడసారి తలచుకొని - తన మెడ జడతో ఉరిబోసుకొని
ప్రాణత్యాగము చేయబూనగా - శుభ శకునములు తోచే వింతగా||

సీత కెంత దురవస్థ ఘటిల్లె - నా తల్లి నెటుల ఊరడించవలె
నన్ను నేనెటుల తెలుపుకోవలె - తల్లి నెటుల కాపాడుకోవలె |
ఏ మాత్రము నే ఆలసించినా - సీతా మాత ప్రాణములుండునా?
అని హనుమంతుడు శాఖల మాటున - తహ తహ లాడుచూ మెదల సాగెను||

నను గని జానకి బెదరక ముందే - పలికెద సీతా రామ కథా
సత్యమైనది వ్యర్థము గానిది  - పావనమైనది శుభకరమైనది |
సీతా మాతకు కడుప్రియమైనది - పలుకు పలుకునా తేనెలొలుకునది
అని హనుమంతుడు మృదు మధురముగా - పలికెను సీతా రామ కథా ||

దశరథ విభుడు రాజోత్తముడు - యశము గొన్న ఇక్ష్వాకు వంశజుడు
దశరధునకు కడు ప్రియమైన వాడు - జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘు రాముడు |
సత్య వంతుడు జ్ఞాన శ్రేష్ఠుడు - పిత్రు వాక్య పరిపాలన శీలుడు
అని హనుమంతుడు మృదు మధురముగా - పలికెను సీతా రామ కథా ||

శ్రీ రాముని పట్టాభిషేకము - నిర్ణయమైన శుభ సమయమున
చిన్న భార్య కైక దశరదు చేరి - తనకోసగిన రెండు వరములు కోరే |
భరతునకు పట్టాభిషేకము - పడునాల్గేండ్లు రామ వనవాసము
అని హనుమంతుడు మృదు మధురముగా - పలికెను సీతా రామ కథా ||