సుందర కాండ గానం - M . S . రామా రావు - రెండవ భాగము
తండ్రి మాట నిలుప రామ
చంద్రుడు - వల్కల ధారియై రాజ్యము వీడే
సీతా లక్ష్మణులు తనతో రాగా
- పడునాల్గేండ్లు వనవాసమేగే |
కరదూషనాది పదునాల్గు వేల -
అసురుల జంపె జనస్థానమున
అని హనుమంతుడు మృదు
మధురముగా - పలికెను సీతా రామ కథా||
రాముడు వెడలె సీత కోర్కె పై
- మాయలేడిని కొని తెచ్చుటకై
రామలక్ష్మణులు లేని సమయమున
- అపహరించే లంకేశుడు సీతను |
సీతను గానక రామచంద్రుడు -
అడవుల పాలై వెదకు చుండెను
అని హనుమంతుడు మృదు
మధురముగా - పలికెను సీతా రామ కథా||
రామ సుగ్రీవులు వనమున
కలిసిరి - మిత్రులైరి ప్రతిజ్ఞల పూనిరి
శ్రీ రఘురాముడు వాలిని కూల్చెను - సుగ్రీవును కపి రాజుని చేసెను |
సుగ్రీవునాన లంక చేరితి -
సీతా మాతను కనుగొన గలిగితి
అని హనుమంతుడు మృదు
మధురముగా - పలికెను సీతా రామ కథా||
వానరోత్తముడు పలుకుట మానెను
- జానకి కెంతో విస్మయ మాయెను
భయము భయము గా నలువంకలు గని
- మెల్లగా మోమెత్తి పైకి జూచెను |
శోభిల్లు శింశుపా శాఖలందున
- బాలకుని వలె మారుతి తోచెను
మారుతి రూపము చిన్నదైనను -
తేజోమయమై భీతి గొల్పెను ||
శ్రీ హనుమాను గురుదేవులు నా
ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా
తల్లీ తెల్పుము నీవు ఎవరవో
- దేవ గంధర్వ కిన్నెరాంగనవో
కాంతులు మెరసే బంగరు మేన -
మలినాంబర మేల దాల్చితివో |
ఓ కమలాక్షి నే కనులో ఈ -
నీలాలేల నింపితివో
అని హనుమంతుడు తరువు నుండి
దిగి - అంజలి ఘటించి చెంతన నిలిచే ||
రావణాసురుడు అపహరించిన -
రాముని సతివో నీవు సీతవో
రామలక్ష్మణులు వనమున
వెదకెడు - అవనీజాతవో నీవు సీతవో |
సర్వ సులక్షణ లక్షిత జాతవు
- తల్లీ తెల్పుము నీవు ఎవరవో
అని హనుమంతుడు సీతతో పలికే
- అంజలి ఘటించి చెంతన నిలిచే ||
జనక మహీపతి ప్రియ పుత్రికను
- దశరథ మహీపతి పెద్ద కోడలను
శ్రీ రఘురాముని ప్రియసతి
నేను - సీతయను పేర వరలు దానను |
పరిణయమైన పదిరెండేడులు -
అనుభవించితిమి భోగ భాగ్యములు
అని పల్కే సీత
వానరేంద్రునితో - రామకథను కీర్తించిన వానితో ||
రావణుడు ఒసగిన ఏడాది గడువు
- రెండు నెలలలో ఇక తీరిపోవు
రాముడు నన్ను కాపాడునని -
వేచి వేచి వేసారి పోతిని |
అసురులు నన్ను చంపక మున్నే
- నాకై నేను పోనెంచితిని
అని పల్కే సీత
వానరేంద్రునితో - రామకథను కీర్తించిన వానితో ||
అమ్మా సీతా నమ్ముము నన్ను -
రాముని దూతగా వచ్చినాడను
రామలక్ష్మణులు క్షేమమన్నారు - నే క్షేమమరసి రమ్మన్నారు |
రాముడు నీకు దీవేనలంపే -
సౌమిత్రి నీకు వందనములిడే
అని హనుమంతుడు సీతతో పలికే
- అంజలి ఘటించి ముందుకు జరిగే ||
మారుతి ఎంతగా ముందుకు
జరిగేనో - జానికి అంతగా అనుమానించెను
రావణాసురుడే ఈ వానరుడని -
కామ రూపుడై వచ్చియుండునని |
ఆశ్రమమున ఒంటిగా నున్న తనను
- వంచించిన సన్యాసి ఇతడని
తలవాల్చుకొని భయకంపితయై -
కటిక నేలపై జానకి తూలె ||
వానర రాజు సుగ్రీవును
మంత్రిని - నన్ను పిలుతురు హనుమంతుడని
రామ సుగ్రీవులు
మిత్రులైనారు - నే జాడ తెలియ వేచియున్నారు |
రామలక్ష్మణులు వానర రాజుతో
- లంక చేరెదరు వానర కోటితో
అని హనుమంతుడు సీతతో పలికే
- అంజలి ఘటించి చెంతన నిలిచే ||
శ్రీ హనుమాను గురుదేవులు నా
ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా
ఓ హనుమంతా హాయి పొందితిని -
నీ పలికిన శ్రీరామకథ విని
రామలక్ష్మణుల ఎట్లెరిగితివి?
- రూపు రేఖలను ఎట్లు గాంచితివి? |
వారి మాటలను ఎట్లు వింటివి ?
- వారి గుణములను ఎట్లు తెలిసితివి?
అని పల్కే సీత హనుమంతునితో
- రామ కథను కీర్తించిన వానితో ||
సర్వ జీవన సంప్రీతి
పాత్రుడు - కమలనేత్రుడు దయసాంద్రుడు
బుద్ది యందు బృహస్పతి సముడు
- కీర్తి యందు దేవేంద్రుని సముడు |
క్షమా గుణమున పృథ్వీ సముడు
- సూర్య తేజుడు శ్రీ రఘు రాముడు
అని హనుమంతుడు సీతతో పలికే
- అంజలి ఘటించి చెంతన నిలిచే ||
అన్నకు తగు తమ్ముడు
లక్ష్మణుడు - అన్నిటా రాముని సరిపోలు వాడు
అన్నకు తోడు నీడయై
చెలగెడు - అజేయుడు శత్రు భయంకరుడు |
సామాన్యులు గారు
సోదరులిరువురు - నిను వెదకుచు మము కలిసినారు
అని హనుమంతుడు సీతతో పలికే
- అంజలి ఘటించి చెంతన నిలిచే ||
పవన కుమారుని పలుకులను విని
- అతడు నిజముగా రామదూత యని
ఆనందాశ్రులు కన్నులు నిండగా
- చిరు నగవులతో జానకి చూడగా |
ఇదుగో తల్లీ ఇది
తిలకింపుము - రాముడంపిన అంగుళీయకము
అని హనుమంతుడు భక్తి మీరగను
- అంగుళీయకమును సీతకొసగెను ||
శ్రీ హనుమాను గురుదేవులు నా
ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా
రామచంద్రుని ముద్రిక చేకొని
- అశ్రులు నిండిన కనులకత్తుకొని
మధుర స్మృతులు మదిలో మెదల -
సిగ్గుచేత తన శిరము వంచుకొని |
ఇన్ని రోజులకు తనకు కలిగిన
- శుభశకునముల విశేషమనుకొని
జానకి పల్కే హనుమంతునితో -
సంపూర్ణ మైన విశ్వాసముతో ||
ఎన్నడు రాముడు ఇట
కేతెంచునో - ఎన్నడు రావణుని హతము సేయునో
లక్ష్మణుండు తన అగ్ని శరముల
- క్రూర రాక్షసుల రూపు మాపునో |
సుగ్రీవుడు తన వానర సేనతో -
చుట్టుముట్టి ఈ లంకను గూల్చునో
అని పల్కే సీత హనుమంతునితో
- సంపూర్ణ మైన విశ్వాసముతో ||
రామలక్ష్మణులు వచ్చు దాకను
- బ్రతుక నిత్తురా అసురులు నన్ను
రావణుడొసగిన ఏడాది గడువు -
రెండు నెలలలో ఇక తీరి పోవు |
ప్రాణములను అరచేత
నిల్పుకొని - ఎదురు చూతునీ రెండు మాసములు
అని పల్కే సీత హనుమంతునితో
- సంపూర్ణ మైన విశ్వాసముతో ||
నీవలె నే శ్రీరామచంద్రుడు -
నిద్రాహారములు మరచెనమ్మా
ఫలపుష్పాదులు ప్రియమైనవి
గని - హా సీతా యని శోకించునమ్మా |
నీ జాడ తెలిసి కోదండపాణి -
తడవు సేయకే రాగలడమ్మా
అని హనుమంతుడు సీతతో పల్కే
- అంజలి ఘటించి చెంతన నిలిచే ||
ఓ హనుమంతా నిను గనినంతా -
నాలో కలిగే ప్రశాంతత కొంత
వానరోత్తమా నిను వినినంతా -
నే పొందితిని ఊరట కొంత |
రాముని వేగమే రమ్మని
తెల్పుము - రెండు నెలల గడువు మరువ బోకుము
అని పల్కే సీత హనుమంతునితో
- సంపూర్ణ మైన విశ్వాసముతో ||
శ్రీ హనుమాను గురుదేవులు నా
ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా
తల్లీ నీవిటు శోకింపనేల?
- వగచి వగచి ఇటు భీతిల్లనేల?
ఇపుడే నీకీ చేరే
విడిపింతును - కూర్చుండుము నా మూపు మీదను |
వచ్చిన త్రోవనే కొని
పోయెదను - శ్రీ రామునితో నిను చేర్చెదను
అని హనుమంతుడు సీతతో పల్కే
- అంజలి ఘటించి చెంతన నిలిచే ||
పోనివ్వక పోతివిగా హనుమా -
సహజమైన నే చంచల భావము
అరయగ అల్ప శరీరుడవీవు - ఏ
తీరుగా నను గొని పోగలవు? |
రాముని కడకే నను చేర్చేదవో
- కడలి లోననె జార విడుతువో
అని పల్కే సీత హనుమంతుని తో
- తనలో కల్గిన వాత్సల్యముతో||
సీత పలికిన మాటల తీరును -
హనుమంతుడు విని చిన్న బోయెను
సీత చెంత తన కామ రూపమును -
ప్రదర్శింపగా సంకల్పించెను |
కొండంతగా తన కాయము పెంచెను
- కాంతి వంతుడై చెంత నిలిచెను
జయ హనుమంతుని కామ రూపమును -
ఆశ్చర్యముతో జానకి చూచెను ||
అద్భుతమౌ నీ కామ రూపమును -
కాంచితినయ్యా శాంతిమపుమయ్యా
పవనకుమారా నీవు గాక మరి -
ఎవరీ వారిధి దాటెదరయ్యా |
క్రూర రాక్షసుల కంట బడకయే -
లంక వెదకి నను కన గలరయ్యా
అని పల్కే సీత హనుమంతుని తో
- సంపూర్ణమైన విశ్వాసముతో ||
శ్రీ హనుమాను గురుదేవులు నా
ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా
తల్లీ నేను నీయందు గల భక్తి
భావమున అటుల తెల్పితి
క్రూర రాక్షసుల బారి నుండి
నిను కాపాడ నెంచి అటుల పల్కితి |
వేగమే నిన్ను రాముని జేర్చు
శుభ ఘడియలకై త్వరపడి పల్కితి
అని హనుమంతుడు సీతతో పల్కే
అంజలి ఘటించి చెంతన నిలిచే ||
తల్లీ నీవు తెలిపిన వన్నీ
శ్రీ రామునకు విన్నవించెద
సత్య ధర్మ పవిత్ర చరిత్రవు
శ్రీ రామునకు తగిన భార్యవు |
అమ్మా ఇమ్ము ఏదో గురుతుగా
శ్రీరాముడు గని ఆనందింపగా
అని హనుమంతుడు సీతతో పల్కే
అంజలి ఘటించి చెంతన నిలిచే ||
చిత్ర కూటమున కాకాసురు కథ
కన్నీరొలుకగా గురుతుగా తెలిపి
చెంగుముడినున్న చూడామణిని
మెల్లగా తీసి మారుతి కొసగి |
పదిలముగా కొని పోయిరమ్మని
శ్రీ రామునకు గురుతుగ నిమ్మని
ప్రీతీ పల్కే సీత
హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ||
చేతులారగ చూడామణి గొని
ఆనందముగా కనులకద్దుకొని
వైదేహికి ప్రదక్షిణలు చేసి
పదముల వ్రాలి వందనములిడి |
మనమున రాముని ధ్యానించుకుని
మరలి పోవగా అనుమతి గైకొని
అంజనీ సుతుడు కాయము పెంచే
ఉత్తర దిశగా కుప్పించి ఎగసే ||
శ్రీ హనుమాను గురుదేవులు నా
ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా
శ్రీ హనుమాను గురుదేవులు నా
ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా
సీత జాడ గని మరలిన చాలదు
చేయవలసినది ఇంకను గలదు
కల్పించుకుని కలహము పెంచేద
అసుర వీరుల పరిశీలించెద |
రాక్షస బలముల శక్తి
గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద
అని హనుమంతుడు యోచన చేయుచు
తోరణ స్తంభము పైన నిలిచెను ||
పద్మాకరముల పాడొనరించి
జలాశయముల గట్టులు త్రెంచి
ఫల వృక్షముల నేలను గూల్చి
ఉద్యానముల రూపును మాపి |
ప్రాకారముల బ్రద్దలు చేసి
ద్వార బంధముల ధ్వంసము చేసి
సుందరమైన అశోక వనమును చిందర
వందర చేసే మారుతి ||
మృగసమూహములు భీతిల్లినవై
దద్దరపాటుగా పరుగులు తీయగా
పక్షుల గుంపులు చెల్లా
చెదురై దీనారవముల ఎగిరి పోవగా |
సీత యున్న శింశిపా తరువు
మినః వనమంతయు వినాశము కాగా
సుందరమైన అశోక వనమును చిందర
వందర చేసే మారుతి ||
వనమున రేగిన ధ్వనులకు అదిరి
లంకా వాసులు నిద్ర లేచిరి
కావలి యున్న రాక్షస వనితలు
రావను చేరి విన్నవించిరి |
దశకంఠుడు మహోగ్రుడై పలికే ఆ
వానరుని బట్టి దండింపుడనే
ఎనుబది వేల కింకర వీరులు
హనుమంతునిపై దాడి వెడలిరి ||
ఎనుబది వేల కింకర వీరుల
ఒక్క వానరుడు హతము చేసెను
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను |
జంబుమాలిని తగిన బలము గొని
ఆ వానరుని దండింప బొమ్మనెను
జంబుమాలి ప్రహస్తుని సుతుడు
హనుమంతుని పై దాడి వెడలెను ||
శ్రీ హనుమాను గురుదేవులు నా
ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా
జంబుమాలిని సర్వ సైన్యమును
ఒక్క వానరుడు ఉక్కడగించెను
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను |
మంత్రి కుమారుల తగిన బలము
గొని ఆ వానరుని దండింపగా పొమ్మనే
మంత్రి కుమారులు
ఏడ్గురు చేరి హనుమంతుని పై దాడి వెడలిరి ||
మంత్రి సుతులను సర్వ సైన్యమును మారుతి త్రుటి లో సంహరించెను
ఎటు జూచిననూ మృత దేహములు
ఎటు పోయిననూ రక్తపుటేరులు |
ఈ వృత్తాంతము వినిన రావణుడు
కొంత తడవు యోచించి పల్కేను
సీనాపతులను తగిన బలము గొని
ఆ వానరుని దండింప పొమ్మనెను ||
సేనాపతులను సర్వ సైన్యమును
పవన కుమారుడు నిర్మూలించెను
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిశ్చేష్టితుడై పరివీక్షించెను |
తండ్రి చూపులు తనపై సోకగా
అక్ష కుమారుడు ఇతవుగ నిలువగా
రావణుడు పలికే కుమారుని గని
ఆ వానరుని దండింపగా పొమ్మని ||
శ్రీ హనుమాను గురుదేవులు నా
ఎద పలికిన సీతారామ కథా
నే పలికెద సీతారామ కథా
అక్షకుమారుడు నవ యవ్వనుడు
వేగవంతుడు తేజోవంతుడు
దివ్యాస్త్రములను పొందిన
వాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు |
కాలాగ్ని వోలె ప్రజ్వరిల్లెడు
రణధీరుడు మహా వీరుడు
అక్ష కుమారుడు దివ్య రథముపై
దాడి వెడలెను హనుమంతుని పై ||
మూడు శరములతో మారుతి
శిరమును పది శరములతో మారుతి ఉరమును
అక్ష కుమారుడు బలముగా
నాటెను రక్తము చిందగా గాయ పరచెను |
ఉదయ భాస్కర సమాన తేజమున
మారుతి ఎగసే గగన మార్గమున
ఇరువురి నడుమ భీకరమైన పోరు
చెలరేగే ఆకాశమున ||
అతి నేర్పు తోడ రణము
సల్పెడు అక్ష కుమారుని మారుతి దయగొని
బాలుని చంపగా చేతులు రావని
వేచి చూచెను నిగ్రహించుకొని |
అక్ష కుమారుడు అంతకంతకును
అగ్నిహోత్రుడై రణమున రేగెను
ఇరువురి నడుమ భీకరమైన పోరు
చెలరేగే ఆకాశమున ||
అగ్ని కణమని జాలి కూడదని
రాగులక మునుపే ఆర్పుట మేలని
సింహ నాదమును మారుతి చేసెను
అరచేత చరచి హయముల చంపెను |
రథమును బట్టి విరిచి వేసెను
అక్షుని త్రుంచి విసరి వేసెను
అక్షుని మొండెము అతి
ఘోరముగా నేలపై బడే రక్తపు ముద్దగా ||
అక్ష కుమారుని మరణవార్త
విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను
మెల్లగా తేరి క్రోధము పూని
తన కుమారుని ఇంద్రజిత్తు గని |
ఆ వానరుడు సామాన్యుడు గాడని
వానిని వేగ బంధించి తెమ్మని
రావణాసురుడు ఇంద్రజిత్తును
హనుమంతునిపై దాడి పంపెను ||
కపికుంజరుడు భయంకరముగా
కాయము పెంచి సమరము సేయగా
ఈ వానరుడు సామాన్యుడు కాదని
మహిమోపేతుడు కామరూపుడని |
ఇంద్రజిత్తు బహు యోచన చేసి
బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే
దేవ గణంబులు సంగ్రామము గని
తహతహలాడిరి ఏమగునో యని ||
కట్టుపడియున్న వానరోత్తముని
అసురులు తలచిరి తమకు లొంగెనని
త్వరత్వరగా దానవులు దరిచేరి
నారే చీరలతో బిగి బంధించిరి |
బ్రహ్మ వరమున బ్రహ్మాస్త్ర
బంధము క్షణ కాలములో తొలగి పోయెను
మారుతి మాత్రము నారె చీరలకు
కట్టుపడినటుల కదలకయుండే ||
వానరోత్తముని దూషణలాడుచు
రావణుని కడకు ఈడ్చుకు పోవగా
ఈ వానరుని వధించి వేయుడని
మనయెడ ద్రోహము చేసినాడని |
రక్త నేత్రముల నిప్పులు
రాలగ లంకేశ్వరుడు గర్జన సేయగా
రావణు తమ్ముడు విభీషణుడు
దూతను చంపుట తగదని తెల్పెను ||
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
అన్నా రావణ తెలిసిన వాడవు
శాంతముగా నా మనవిని వినుమా
దూతను చంపుట ధర్మము గానిది
లోకముచే గర్హింప బడునది |
శూరుడవైన నీకు తగనిది రాజ
ధర్మ విరుద్ధ మైనది
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తగదని తెలిపే ||
అన్నా వీనిని వధింపకుమా
తగురీతిని దండించి పంపుమా
దూత యెడల దండింప బడినవి వధ
గాక తగు దండనలున్నవి |
తల కొరిగించుట సబుకు వేయుట
గురుతు వేయుట వికలాంగు సీయుట
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తగదని తెలిపే ||
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
కపులకు వాలము ప్రియ భూషణము
కావున కాల్చుడు వీని వాలము
వాడవాడల ఊరేగింపుడు
పరాభవించి వదలి వేయుడు |
కాలిన తోకతో వీడేగు గాక
అంపిన వానికి తలవంపు కాగ
అని రావణుడు విభీషణుని గని
ఆజ్ఞాపించెను కోపమనచుకొని ||
చీర్ణాంబరములు అసురులు
తెచ్చిరి వాయు కుమారుని తోకకు చుట్టిరి
నూనెతో తడిపి నిప్పంటించిరి
మంటలు మండగ సంతసించిరి |
కపికుంజరుని ఈడ్చుకుబోయిరి
నడివీదులలో ఊరేగించిరి
మారుతి మాత్రము
మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను ||
కపిని బంధించి తోక
గాల్చిరని నడివీదులలో త్రిప్పుచుండిరని
రాక్షస వనితలు వేడుక మీరగ
పరుగున బోయి సీతకు తెలుపగా |
అంతటి ఆపద తనమూలమున వాయు
సుతునకు వాటిల్లెనని
సీతామాత కాదు చింతించెను
అగ్ని దేవుని ప్రార్థన చేసెను ||
ఓర్వరానివై మండిన మంటలు
ఒక్కసారిగా చల్లగా తోచెను
అగ్ని దేవునకు నా జనకునకు
అన్యోన్యమైన మైత్రి చేతనో |
రామదూతనై వచ్చుట చేతనో
సీతామాత మహిమ చేతనో
మండే జ్వాలలు పిల్ల గాలులై
నిల్వ సాగేనని మారుతి పొంగెను ||
ఆనందముతో కాయము పెంచెను
బంధములన్ని తెగిపడి పోయెను
అడ్డగించిన అసురలన్దరిని
అరచేత చర్చి అట్టడగించెను |
గిరిశిఖరము వలె ఎత్తుగనున్న
నగరద్వార గోపురమందున
స్థంభము పైకి మారుతి ఎగసెను
లంకా పురిని పరివీక్షించెను ||
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
ఏ మంటల నా వాలము గాల్చిరో ఆ
మంటలనే లంక గాల్తునని
భీమరూపుడై గర్జన సేయుచు
రుద్రరూపుడై మంటల జిమ్ముచు |
మేడమిద్దెల వనాల భవనాల
వెలిగించెను జ్వాలా తోరణాల
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన
ఘన విఖ్యాతి గణించే మారుతి ||
ఒకచో కుంకుమ కుసుమ కాంతుల
ఒకఎడ బూరుగు పుష్పచ్చాయల
ఒకచో మోదుగు విరుల తేజముల
ఒకఎడ కరగిన లోహపు వెలుగుల |
కోటి సూర్య సమాన కాంతుల
లంకాపురము రగిలెను మంటల
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన
ఘన విఖ్యాతి గణించే మారుతి ||
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
హనుమంతుడు సముద్ర జలాల
చల్లర్చుకునే లాంగూల జ్వాల
తలచిన కార్యము
నెరవేర్చితినని తేరి పార జూచే వెనుకకు తిరిగి |
కనిపించెను ఘోరాతి ఘోరము
జ్వాలాభీలము లంకా పురము
మారుతి వగచే తా చేసిన
పనిగని తన కోపమే తన శత్రువాయేనని ||
సీతామాత క్షేమము మరచితి కోప
తాపమున లంక దహించితి
లంకాపురము సర్వము పోగా ఇంకా
జానకి మిగిలి ఉండునా |
సిగ్గుమాలిన స్వామీ
ద్రోహిని సీతను చంపినా మహా పాపిని
మారుతి వగచే తా చేసిన
పనిగని తన కోపమే తన శత్రువాయేనని ||
సీత లేనిదే రాముడుండడు
రాముడు లేనిదే లక్ష్మణుడుండడు
భరతశత్రుఘ్న సుగ్రీవాదులు ఈ
దుర్వార్త విని బ్రతుక జాలరు |
ఈ ఘోరమునకు కారణమైతిని నాకు
మరణమే శరణ్యమని
మారుతి వగచే తా చేసిన
పనిగని తన కోపమే తన శత్రువాయేనని ||
శ్రీ రఘురాముని ప్రియసతి
సీతా అగ్ని వంటి మహా పతివ్రత
అగ్నిని అగ్ని దహింప
నేర్చునా ? అయోనిజను అగ్ని దహించునా ?
నను కరుణించిన అగ్ని దేవుడు
సీతను చల్లగా చూడకుండునా !
అని హనుమంతుడు తలచు చుండగా
శుభశకునములు తోచే ప్రీతిగా ||
ఎల్ల రాక్షసుల సిరిసంపదలు
మంటల పాలై దహనమాయేనని
అశోక వనము ద్వంసమైనను జానకి
మాత్రము క్షేమమేనని |
లంకాపురము రూపుమాసినను
విభీషణుని గృహము నిలిచియుండేనని
అంబర వీధిని సిద్ధ చారణులు
పలుకగా విని మారుతి పొంగెను ||
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
అశోక వనము మారుతి చేరెను
ఆనందాశ్రువుల సీతను గాంచెను
తల్లీ నీవు నా భాగ్యవశమున
క్షేమమున్టివని పదముల వ్రాలెను |
పోయి వత్తునిక సెలవునిమ్మని
అంజలి ఘటించి చెంత నిలిచెను
సీతామాత హనుమంతునితో
ప్రీతిగా పలికెను ఆనందముతో ||
హనుమా అతులిత బలధామా
శత్రుకర్షనా శాంతి నిదానా
ఇందుండి నన్ను ఈ క్షణమందే
కొనిపోగల సమర్థుడ వీవే |
రాముని వేగమే తోడ్కొని
రమ్ము రాక్షస చెర నాకు తొలగింపుము
అని పల్కే సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో ||
తల్లీ నిన్ను చూచినదాదిగా
త్వరపడుచుంటిని మరలి పోవగా
భీతి నొందకుము
నేమ్మదినుండుము త్వరలో నీకు శుభములు కలుగు |
రామలక్ష్మణసుగ్రీవాదులను
అతి శీఘ్రముగా కొని రాగలను
అని మారుతి సీత పదముల
వ్రాలె సెలవు గైకొని రివ్వున మరలె ||
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
అరిష్టమను గిరిపై నిలిచి
మారుతి ఎగసెను కాయము పెంచి
పవన కుమారుని పదఘట్టనకే
పర్వతమంతయు పుడమిని క్రుంగె |
సీతను గాంచిన శుభవార్త వేగ
శ్రీరామునకు తెలియచేయగా
మారుతి మరలెను అతి వేగముగా
ఉత్తర దిశగా వారిథి దాటగా ||
గరుడుని వోలె శర వేగముగా
పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని
మార్గ మధ్యమున మైనాకుని గని
ప్రేమ మీరగా క్షేమము కనుగొని |
దూరము నుండి మహేంద్ర గిరిని
ఉత్సాహముగా ముందుగా గని
విజయ సూచనగా గర్జన సేయుచూ
మారుతి సాగెను వేగము పెంచుచు ||
సుందరమైన మహేంద్ర గిరి పైన
సెలయేట దిగి స్నానమాడి
జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందములిడి |
చూచితి సీతను చూచితి సీతను
అను శుభ వార్తను ముందుగ పలికెను
కపి వీరులు హనుమంతుని
పొగడిరి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి ||
జాంబవదంగద హనుమదాదులు
ప్రసవన గిరి చేరుకొనినారు
రామలక్ష్మణసుగ్రీవాదులకు
వినయముతో వందనములిడినారు |
ఆంజనేయుడు శ్రీరామునితో
చూచితి సీతనను శుభవార్త తెలిపే
చూడామణిని శ్రీరామునకిడి
అంజలి ఘటించి చెంతన నిలిచే ||
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
చూడామణిని రాముడు గైకొని తన
హృదయానికి చేర్చి హత్తుకొని
మాటలు రాని ఆనందముతో
అశ్రులు నిండిన నయనాలతో |
హనుమా సీతను ఎట్లు
గాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెల్పినది ?
అని పల్కిన శ్రీ
రామచంద్రునకు మారుతి తెలిపే తన లంకాయానము ||
శతయోజనముల వారిథి దాటి
లంకాపురమున సీతను గాంచితి
రాళ్ళు కరుగగా సీత పలుకగా
నా గుండెల క్రోధాగ్ని రగులగా |
అసురుల గూల్చితి లంక
గాల్చితి రావణునితో సంవాదము సల్పితి
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను ||
నిరతము నిన్నే తలచుచున్నది
క్షణమొక యుగముగా గడుపుచున్నది
రెండు నెలల గడువు తీరక
మునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది |
రామ లక్ష్మణ సుగ్రీవాదులకు
సీత క్షేమమని తెలుపమన్నది
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను ||
రామలక్ష్మణుల
భుజములనిడుకొని వేగమే లంకకు గొనివత్తునని
రామలక్ష్మణుల రావణాదులు
కూలుట నిజమని |
ఎన్నో రీతుల సీతామాతకు
ధైర్యము గొలిపి నే మరలి వచ్చితి
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను ||
అందరు కలసి అయోధ్యకు చేరి
ఆనందముగా సుఖించేదరని
సీతారామ పట్టాభిషేకము
కనులపండువుగా జరిగి తీరునని |
ఎన్నో రీతుల సీతామాతకు
ధైర్యము గొలిపి నే మరలి వచ్చితి
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను ||
ఆనందముతో అశ్రులు జారగా
సీతా మాత నను దీవించగా
పదముల వ్రాలి నే పయనమైతిని
పదములు రాకనే మరలి వచ్చితి |
ఒప్పలేదు గాని ఎపుడో
తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా ?
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను ||
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
సీత క్షేమమను శుభవార్త నేడు
మారుతి నాకు తెల్పకుండిన
నేటి తోడ మా రఘుకులమంతా
అంతరించి యుండెడిది కదా |
మమ్మీ తీరుగా ఉద్ధరించిన
మారుతికి ఏమివ్వగలనని
సర్వమిదేనని కౌగిట చేర్చెను
హనుమంతుని ఆజానుబాహుడు ||
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
నలుగురు శ్రద్ధతో ఆలకించగా
నలుగురు భక్తితో ఆలపించగా
సీతారామ హనుమానులు సాక్షిగా
సర్వజనులకు శుభములు కలుగగ
కవికోకిల వాల్మీకి పలికిన
రామాయణమును తేట తెలుగునా
శ్రీ గురుచరణా సేవా
భాగ్యమున పలికెద సీతా రామ కథా
శ్రీ హనుమాను గురు దేవులు
నా ఎద పలికిన సీతా రామ కథా
నే పలికెద సీతా రామ కథా
మంగళ హారతి గొను హనుమంతా
సీతారామ లక్ష్మణ సమేత
నా అంతరాత్మ నిలుమో అనంతా
నీవే అంతా శ్రీ హనుమంతా
ఆ .. ఆ ....