• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

షణ్ముఖ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శరవణభవ

షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలంకారాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధంముఖాన చిరునవ్వు, కటియందుహస్తాన్ని దాల్చి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, షట్ కృత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మ తపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు) రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరణభవుడు.

శమింపజేయువాడు
రతిపుష్టిని ఇచ్చువాడు
వంధ్యత్వం రూపుమాపువాడు
రణమున జయాన్నిచ్చేవాడు
భవసాగరాన్ని దాటించేవాడు
వందనీయుడు
అని శరవణభవకు గూఢార్థం.

ఆ స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు, వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి. ఈ పేర్లలో ఎంతో నిగూఢార్థం ఉంది.

షణ్ముఖుడు: సుబ్రహ్మణ్యస్వామి ఆరు ముఖాలుగలవాడు కనుక షణ్ముఖుడనబడుతున్నాడు. అదేవిధంగా షణ్ముఖుడు పంచభూతాల సంగమానికి సంకేతం. ఆయన ఈ సృష్టిలోని సమస్తంలో ఉన్నాడు.

సుబ్రహ్మణ్యస్వామి: షణ్ముఖుని స్వరూపం జ్యోతిర్మయమైనది. పరమశివుని త్రికూటి నుండి వెలువడిన అగ్ని  కీలలతో ఆరుముఖాల షణ్ముఖుడు ఉద్భవించాడు. ఆ జ్యోతి స్వరూపుడు మనలోని అజ్ఞానాంధకారాన్నిపారద్రోలి, మన మనసులలో జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు. శూరపద్ముని ఆవరించియున్న మాయను తొలిగించి, అతనికి మోక్షమార్గాన్ని చూపినందుకే స్వామిని మనమంతా సుబ్రహ్మణ్యస్వామి అని కొలుచుకుంటున్నాం. సుబ్రహ్మణ్యుడు కరుణామయుడు.

స్కందుడు: స్వామి దగ్గరకు మనం మోకరిల్లితేనే చాలు మన ఊపిరి సుగంధపరిమళాలతో నిండిపోతుంది. ఈ విషయాన్ని ముందుగా స్వామి తల్లి పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామిని ఆరు తామరపుష్పాలలో గమనించినపుడు తెలుసుకుని మురిసిపోయింది. అలాగే స్కందఅంటే ఒకటిగా చేరినది అని అర్థం. పార్వతీదేవి ఆరుపద్మాలలో ఆరు శిశువులను చూసిన కాసేపటికి ఆ ఆరు శిశువులు ఒకే శిశువుగా మారి ఆరు తలలతో పన్నెండు చేతులతో ప్రత్యక్షమయ్యాడు. అందుకే స్కందుడయ్యాడు.

శరవణభవ: శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తేచాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. శరవణభవ మంత్రంలో
లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
అగ్నిబీజము అధిదేవత అగ్ని
అమృతబీజము అధిదేవత బలభద్రుడు
యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
అమృతబీజము అధిదేవత చంద్రుడు

గాంగేయుడు: శివుని త్రినేత్రం నుండి వెలువడిన జ్యోతి కిరణాలు శరవణపోయ్ గై అనే నదిలో ఐక్యం అయిన తరువాత స్వామి ప్రత్యక్షమవడం వలన గాంగేయుడు అని పిలువబడుతున్నాడు. గాంగేయుడు అంటే గంగపుత్రుడు.

వేలాయుధుడు: స్వామి ఆయుధం శూలం (వేల్ అని తమిళంలో అంటారు) ఈ వేల్ తోనే శూరపద్ముడు, అతని దుష్టపరివారమంతా సంహారించబడింది. వేల్ జ్ఞానశక్తికి ప్రతీక. స్వామి తన తన వేలాయుధంతో మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానదీపికలను వెలిగిస్తున్న వేలాయుధుడు. ఇలా స్వామి యొక్క ప్రతినామంలో ఎంతో గూఢార్థం ఉంది. ఇక, హరిహరుల తత్త్వమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుల వారి తత్త్వం.

పురుషో విష్ణురుత్యుక్తః శివోవా నామతః స్మృతః
అవ్యక్తంతు ఉమాదేవి శ్రీర్వాపద్మనిభేక్షణా!
తత్సం యోగాత్ సముధ్బూతః సహిసేనాపతి ర్గుహః

పురుషోత్తముడైన విష్ణువు లేదా పరమేశ్వరుడు అవ్యక్త శక్తి శ్రీమహాలక్ష్మీ లేదా పార్వతీదేవి వీరిరువురి సమన్వయ సమైక్యతా తత్త్వ మూర్తియే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని స్కంధ పురాణం తెలియజేస్తుంది.

వివరంగా చెప్పాలంటే శ్రీ సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీ నారాయణులను కలిపి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వమే శ్రీ సుబ్రహ్మణ్య తత్త్వం. అదే హరిహరులు ఒక్కటేనన్న అద్వైత తత్త్వం.

అందుకనే తమిళనాడులో పళముదిర్ చోళై అనబడే శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీమహావిష్ణు, శ్రీసుబ్రహ్మణ్యులు ఒకే ప్రాగణంలో వెలసియున్నారు.
నమస్తే నమస్తే మహాశక్తి పాణే
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే
నమస్తే నమస్తే సదాభీష్టపాణే

Surasamhāraఈ షణ్మతాలలోను ముఖ్యమైనది అగ్ని ఆరాధన. అగ్ని కారమైన ఔపాసనకు శ్రీసుబ్రహ్మణ్యుడు అధిదేవత. అందువలన ఆయనను వదలిపెట్టి తక్కిన ఐదుగురు గణపతి, సూర్యుడు, శ్రీమహావిష్ణువు, ఈశ్వరుడుఅంబికలను పంచాయతన పూజలో ఆరాధిస్తూన్నాము. అందువలన ఆయన ఆరాధన, పంచాయతన పూజా కలిసి, షణ్మత సాధన అవుతోంది.

వైదిక కర్మలలో అగ్నికార్యం హోమం ప్రధానమైనది. శ్రీసుబ్రహ్మణ్యుడు దేవతా విశేషములలో అగ్నిస్వరూపుడు. బయట అగ్ని స్వరూపుడు, ఆత్మ స్వరూపాన గుహుడు. ఆయనకు అగ్నిభూః అనే పేరుంది. సేనాని అగ్నిభూః, గుహః అని శ్రీ సుబ్రహ్మణ్య నామావళి కూర్చబడింది. కుండలినీ శక్తి జాగృతమైన షట్చక్రాల నుండి పైకిప్రాకి అగ్ని తత్త్వమైన సుషుమ్నా మార్గంలో ఉత్పన్నమయ్యే శక్తియే ఆయన. సంవత్సరాగ్నిగా, కాలస్వరూపుడిగాఆరు ఋతువులు ఆయనకు ఆరు ముఖాలు. పన్నెండు మాసాలు ఆయనకు గల పన్నెండు చేతులు. ఆయన అభయ స్వరూపుడు.

సేనా విదారక స్కంధ మహాసేన మహాబల
రుద్రోమాగ్నిజ శాద్వాక్త్ర గంగార్భా నమోస్తుతే

రాక్షససైన్యాన్ని నశింపజేసినవాడా! శరవణ తటాకము నుండి ఒడ్డుకు జారినవాడా! గొప్ప సైన్యాన్ని నిరంతరం అదుపు రక్షణగా ఉంచుకునే వాడా, సాటిలేని శక్తి సామర్థ్యములు గలవాడా, శంకరునకు పార్వతికి అగ్నికి కుమారుడవైనట్టివాడా, గంగాదేవి గర్భవాసం చేసినట్టివాడా, షణ్ముఖా, నీకు నమస్కారం.

ఈ శ్లోకం మనకు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క సంపూర్ణ స్వరూప, స్వభావ, మహాత్మ్యాలను తెలియజేస్తుంది. దీనిని చెప్పుకొని ప్రార్థిస్తే ఆయన కృపకు ప్రాత్రులమౌతాము.

స్వామిఅన్న పదం అందరి దేవతలకు వర్తించినా, అది శ్రీసుబ్రహ్మణ్య స్వామికి మాత్రమే అనువర్తిస్తుంది. అమరకోశంలో స్వామి అను పదానికి దేవసేనాపతి, శూరః, స్వామీ గజముఖానుజః అని శ్రీ సుబ్రహ్మణ్యుని గూర్చి పదాలలో ఉపయోగింపబడి ఉంది. స్వామి అన్న నామధేయం ఆయనదే.

ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై వుంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారాలు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు జ్యోతులలోకెల్లా జ్యోతియైన పరంజ్యోతి. ఆత్మ స్వరూపుడు. షణ్మతాలకు అధిపతి. గణపతిని ప్రధానంగా ఉపాశించునది గాణ పత్యము. సూర్యుని ఉపాశించునది సౌరము. అంబికను ఉపాశిస్తే అది శాక్తము. శివోపాసన శైవము. శ్రీమహావిష్ణు ఉపాసన వైష్ణవం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పరమాత్మ అని ఉపాశించడం కౌమారం.

శివశక్తులు కలిసి నందువల్లనే జ్ఞానజ్యోతి ఏర్పడింది. అట్లేర్పడిన జ్యోతిస్వరూపుడైన కుమారుడే శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుడు. లోకానుగ్రహార్థం మూర్తీభవించినపుడు శ్రీసుబ్రహ్మణ్యుడిగా విలసిల్లుతున్నాడు. ఆయన శివశక్తుల సమ్మేళనం వలన ప్రభవించిన జ్ఞానఫలం. అందువలన ఆయన తన దివ్యశక్తిచే మన బాహ్యాంతరములందలి అజ్ఞానాన్ని శాశ్వతంగా పోగొట్టి మనకు అమరత్వాన్ని, అమృతత్వాన్ని కలుగజేస్తున్నాడు.

అరుణగిరినాధుడనే  శ్రీ సుబ్రహ్మణ్య భక్తుడు తమిళగడ్డపై జన్మించాడు. ఆయననుణ కందరనుభూతి అనే గ్రంథాన్ని వ్రాశాడు. దానిలో వేర్వేరుగానున్న శివశక్తులు ఏకమై ఒకదివ్యశక్తిని ఉత్పాదించాయని, ఆశక్తి అనుగ్రహం వలన మనలోని ద్వైత భ్రమ తొలిగి ఏకత్వంలోకి తీసుకొని వెళ్ళి తనలో కలుపుకొంటున్నాడని వివరించాడు. ఆయన తిరుపుగళ్ అనే తమిళ స్తోత్ర గ్రంథంలో కూడా శివశక్తులకు జన్మించిన శ్రీసుబ్రహ్మణ్యుని వైష్ణవ పరంగా కూడా కీర్తించడం విశేషంగా ఉంటుంది.

తమిళభాషలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని మురుగన్అని అంటారు. ఆమాటకు అందమైన వాడని అర్థం. ఆయనకు మరుమగన్అని కూడ పేరున్నది. ఆ మాటకు అర్థం మేనల్లుడని. ఒక ఇతివృత్తం ప్రకారం శ్రీవల్లీ దేవసేనలిరువురు శ్రీమహావిష్ణువు కుమార్తెలే అని, వారిని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వివాహమాడిన కారణంగా, ఆయన శ్రీమహావిష్ణువునకు మేనల్లుడు, అల్లుడు అయ్యాడని తెలుపబడింది.

ఈ విధంగా శ్రీసుబ్రహ్మణ్యుడు శైవానికి, వైష్ణవానికి సబంధించినవాడని తెలుసుకోవాలి. ఐతే, ఉత్తరభారతంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి గృహస్థుడుగా కాక నిరంతర బ్రహ్మచారిగా వ్యవహరింపబడుతున్నాడు. అక్కడ ఆయనకు కార్తికేయుడు అన్న పేరే ప్రసిద్ధమైనది. కుమారస్వామి అన్న పేరు కూడా వారికి

విదియమైనదే. కాళిదాసు మహాకవి సంస్కృతంలో కుమార సంభవమనే గ్రంథాన్ని రచించారు. దీని ప్రస్తావన మొదట వాల్మీకి రామాయణంలోనే వచ్చినది. బాలకాండంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు స్కంధుని జన్మవృత్తాంతము తెలియజేస్తాడు. కుమారా స్సంభవ శ్చైవ ధన్యః పుణ్యస్తధైవచఅని వ్రాయబడింది. వాల్మీకి మహామునికి సాధారణంగా రామాయణ సర్గల పారాయణానికి ఫలశ్రుతి చెప్పే అలవాటు లేదు. కాని, ఇక్కడ ఫలశ్రుతి చెప్పాడు. వాల్మీకి బాలకాండంలోనే ఉపయోగించిన కుమార సంభావమను రెండు పదాలను మహాకవి కాళిదాసు మంగళవాక్యంగా భావించి తన గ్రంథమునకు కుమార సంభవమను పేరు పెట్టాడు.

స్కందుడన్న పేరు కూడా శ్రీ స్వామి వారికి ప్రసిద్ధమైనది. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే శ్రీసుబ్రహ్మణ్యుడు. స్కందుడను పేరును మనస్సులో ఉంచుకొని శ్రీవ్యాసులవారు స్కంద పురాణాన్ని రచించారు. ద్రవిడ భాషలో స్కందుడను పదమునకు వికృతి కందుడు.

మాతృదేవోభవ, పితృ దేవోభవ అనేవి వేద శానములు. శివ, శక్తులు మాతాపితలుగా వేర్వేరుగా కాక అర్థనారీశ్వర రూపంలో కలిసి ఉన్నారు. సత్ పరేమేశ్వరుడు కాగా చిత్ అంబిక. ఈ సత్ చిత్ రెండును ఏకము కాగా ఆనందం ఉద్భవించింది. ఆ సచ్చిదానందమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. శివమనే మంగళం, అంబిక అనే కారుణ్యం కలిసిన రూపమే శ్రీసుబ్రహ్మణ్యుడు.

శ్రీసుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపి, తేజస్వి. అగ్నితేజం గలవాడు. కాని, గంగా తనయుడగుటచే అమృతంవలె చల్లదనమునిచ్చే స్వభూవము గలడు. తిథులలో అరవది షష్టి. ఆయన జన్మతిథి కూడా అదే. షష్ఠి ప్రియుడు, షడాననుడు అనగా ఆరు ముఖములుగలవాడు. ఆయన మంత్రం షడక్షరి శరవణభవ”. ఇది మిక్కిలి మహిమాన్వితమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లను ఆరు దుర్గుణములను నశింపచేసి విజ్ఞానవంతులుగ రూపొందించునట్టిది. ఇహపర సుఖదాయకమైనది.

ఇట్టి విశిష్ట జ్ఞానస్వరూపుడగు శ్రీసుబ్రహ్మణ్యుని ఆరాధన సర్వానర్థాలను తొలగించి, సర్వాభీష్టసిద్ధిని కలిగించి జ్ఞానసంపన్నులను చేస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

శీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శివ శక్తులకు జన్మించిన తిథి మార్గశిరశుద్ధ షష్ఠి. మహనీయులు జన్మలు లోక కంటకులను నిర్మూలించి, సజ్జనులను కాపాడటానికేనన్న విషయం లోక విదితమైనదే. తారకాసుర, శూర పద్మాసురాది రాక్షసులను దునుమాడుటకై కార్తికేయుడు ఉద్భవించాడు. ఆ మహామహితాత్ముడు జన్మించిన రోజును శ్రీసుబ్రహ్మణ్యషష్ఠియని స్కందషష్ఠియని, సుబ్బారాయుడి షష్ఠి అని, కుమారషష్ఠియని వ్యవహరిస్తారు.

భవిష్యోత్తరపురాణం ప్రకారం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనాధిపతిగా 5 రోజులు భీకరమైన పోరాటం సాగించి ఆరవరోజు యుద్ధంలో తారకాసురాది రాక్షసులను సంహారించి పదునాల్గు భువనాలకు సంతోషాన్ని కలిగించాడు. ఆయన అసాధారణ శక్తి సామర్థ్యాలను త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు కొనియాడారు. శ్రీస్వామివారు లోక సంరక్షణార్థమునకు శాటి స్థాపనకు చేసిన కృషికి గుర్తింపుగా మార్గశిరశుద్ధషష్ఠి ఆయన జన్మదినంగా పరిగణించి, వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలు కొన్ని ప్రాంతాలలో మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి షష్ఠి వరకు నిర్వహిస్తారు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు దేవసేనను షష్ఠి రోజునే పరిణయం చెసుకొన్నారు. శ్రీవేదవ్యాసభగవానులు షష్ఠి ప్రాముఖ్యతను తెలియ జేస్తూ తస్మాత్ షష్ఠీ మహాతిథిః అని అన్నారు.

షష్ఠి రోజున ఉపవాసముండి షణ్ముఖూని పూజించి బ్రహ్మచారికి వస్త్రదానమిచ్చి భోజనం పెట్టి ఆనందింప జేయాలి. కొంతమంది శ్రీస్వామివారిని సర్పాకారంగా ఆరాధించి పుట్టలో పాలు పోస్తారు.

కుజదోషమున్నవారు ఆ రోజున ఉపవాసముండి, సర్పదేవతను ప్రార్థించి పుట్టలో పాలుపోసి తమ దోషాలను పోగొట్టమని శ్రీస్వామివారిని వేడుకొంటారు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని చాలామంది సర్పాకారంలో పూజిస్తుంటారు. ఇందువెనుక కొన్ని జ్యోతిశ్శాస్త్ర అంశాలున్నాయి. ఈయన మేష లగ్నం, వృశ్చిక రాశిలో జన్మించాడు. వృశ్చికరాశి జలరాశి అని కూడా పేర్కొనబడినది. శరవణ తటాకంలో జన్మించాడు గదా! మేష రాశికి అధిపతి కుజుడు. పురుషత్వానికి ప్రధాన కారకుడు శ్రీస్వామి శివతేజంవల్ల జన్మించాడు కావున అగ్ని స్వరూపుడు. అగ్నిధరుడని కూడా అంటారు. కుజునకు అధిష్ఠాన దేవత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి. ఆయనను సేవిస్తే తప్పక సంతానప్రాప్తి కలుగుతుంది.

ఇక, షణ్ముఖుడు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానాన్ని సంస్కృతంలో సుబ్రహ్మ అంటారు. అందువలన ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఈయన జన్మరాశి వృశ్చికం నుండి జన్మలగ్నమైన మేషం వరకు 6 రాశులు ఉన్నాయి. ఈ ఆరురాశులు మన శరీరంలోని షట్ చక్రాలు. వృశ్చికరాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది. ఈ పద్ధతిలో శ్రీస్వామివారు కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించినది. అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగ భూషణుడని ప్రసిద్ధి చెందాడు. ఈ పన్నాగాలు సుషుమ్నా నాడీ రూపంలో ఉన్న షణ్ముఖుని విభూతి రూపాలు. ఆ కారణంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సర్ప రూపంలో పూజిస్తారు.

ప్రాణశక్తి మన శరీరంలో మూలాధారమనే చోట సర్పరూపంలో కేంద్రీకరింపబడి ఉంటుంది. మనకు దాని మహాశక్తి తెలియదు. అది నిద్రిస్తున్న సర్పము వంటిది. దానిని తట్టి లేపుటకు అసాధారణమైన యోగసాధన అవసరం.

ఒక వ్యక్తి యోగాభ్యాసం చేస్తూ నేలపై కూర్చుండి యుండినపుడు అతని ఆకారం యోగ పరంగా గమనిస్తే పాము శరీరంలాగా ఉంటుంది. ఇలా కనిపించడంలో ప్రతిపక్షవ్యక్తి జ్ఞానపరంగా అభివృద్ధి చెంది, యోగాభ్యాసం చేసి తరించాలన్నది దానిలోని అంతరార్థం. మన శరీరంలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు ఆరు ఉన్నట్లు యోగశాస్త్రం చెబుతుంది. ఈ ఆరింటిలో మూలాధార చక్రంలోనే ప్రాణశక్తి ఉంటుంది. అది సర్ప రూపంలో వుంటుంది. స్వప్నావస్థలో నున్నందున దాని శక్తి మనకు తెలియదు. యోగాభ్యాసం ద్వారా చేసే సాధనవల్ల మనం గొప్ప జ్ఞానశక్తిని సాధించి స్వప్నావస్థలోనున్న జ్ఞానశక్తిని లేపగల్గినపుడు అసాధారణ జ్ఞానం సిద్ధించి పరమానందం కలుగుతుంది.


శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి ఆరు అంకెతో సంబంధముంది. ఆయన షణ్ముఖుడు. సహజంగా జ్ఞానస్వరూపుడు. యోగమూర్తి. పూర్వజన్మలో సనత్కుమారులుగ జన్మించిన బ్రహ్మమానసపుత్రుడు. నిరంతర తపస్సమాధిలో వుంటూ ఈ సృష్టిలోనే దేనినీ బేధభావంతో చూడక, వేదమూర్తిగా భాసించాడు. అదే ప్రవృత్తి ఈ జన్మలోనే సిద్ధించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు నిరంతరం జ్ఞాననిష్ఠలో వున్న భక్తులను రక్షిస్తూనే వుంటాడు.

ఇంకా చదవండి »

ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత కరావలంబ స్తోత్రం ఆవిర్భావం

ఆదిశంకరభగవత్పాదులు ఒకటి లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం చేశారురెండు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేశారు. ఇంకా ఏమైనా వారు చేసిన కరావలంబ స్తోత్రం ఉన్నాయేమో నాకు తెలియదు. అసలు కరావలంబం అంటే ఏమిటిస్వామి వారిని "మాకు సహాయం చేసే చేతులను ఇవ్వు..." అని వేడుకోవడం. అంటే ఈ సకల లోకాలనూ రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని. కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఆదిశంకరులు ఒక విపరీతమైన ఆపద సమయములో నరసింహస్వామి వారిని కరావలంబస్తోత్రముతో పిలిస్తేస్వామి తత్క్షణమే వచ్చి ఆదిశంకరులను రక్షించారు. అందుకే వేదము కూడా స్వామి వారిని మొదట నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అని వెంటనే నమ అస్తు ధన్వనే బాహుబ్యా ముతతే నమః అని చెప్పింది రుద్రం. అంటే స్వామీ మీ బాహువులకు నమస్కారము. లలితా సహస్రనామములలో కూడా అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణించాలి కదాకానీ మొదట అమ్మవారి యొక్క బాహువుల గురించి చెబుతారు. చతుర్బాహు సమన్వితాయై నమః అని కీర్తించబడినది. ఎందుకు అమ్మవారిని ముందు పాదముల నుంచో లేక కేశాది పాదాది పర్యంతమో స్తోత్రం చేయకుండా ఎందుకు అమ్మవారి బాహువులను కీర్తించారుఅనే విషయానికిపూజ్య గురువు గారు లలితా సహస్ర నామములపై ప్రవచనము చేస్తూ ప్రారంభములోనే చెప్పారు. అసలు రూపమే లేని వాడుమనకోసం ఒక రూపం ధరించిఒక ఆయుధమోముద్రో పట్టిమనల్ని అనుగ్రహించడానికి గుణములు పొందినవాడైవస్తాడు. అటువంటి భగవత్స్వరూపాలను చూస్తేభగవంతుని బాహువులుఆయన చేతులలో పట్టుకునే వాటికి విశేషమైన ప్రాశస్త్యమ్ ఉంటుంది అని గురువు గారు చెప్పారు. 


అందునా శంకరులు మమదేహి కరావలంబం అని అంత అద్భుతమైన రెండు స్తోత్రాలు ఇచ్చారు అంటేవాటిని ప్రతీరోజు మనం అనుసంధానం చేసుకుంటేఏ విధముగా ఆపదల నుంచి రక్షింపబడిస్వామి యొక్క కృపకి పాత్రులము అవుతామో మన ఊహకి కూడా అందదు.

ఇంకా చదవండి »

కుమార షష్ఠి – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తత్త్వం

ఆషాఢ శుక్ల పంచమిని నాగపంచమిగానూ, ఈరోజు సోమవారం అనగా ఆషాఢ శుక్ల షష్ఠిని కుమార షష్ఠి” గానూ జరుపుకోవడం మన తెలుగునాట సాంప్రదాయం. ఈ సందర్భంగా, శివశక్తుల అనురాగమునకు ఫలము, జ్ఞాన పండిత అని కీర్తించబడ్డ వాడు, గజముఖానుజుడు, దేవసేనాపతి, వల్లీనాయకుడు అయిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వైభవమును తలచుకుని స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులమౌదాము. ఇక్కడ వ్రాయబడిన కుమారస్వామి వైభవం, తత్వ విశేషాలు, గురువుల నుండి విన్నవి, సుబ్రహ్మణ్య ఉపాసనా గ్రంధము నుండి గ్రహించినవి, స్వామి వారు ఇచ్చిన బుధ్ధి ప్రచోదనం మేరకు వ్రాయబడినది. ఇందు దోషములు ఏమైనా ఉంటే పెద్దలు తెలియజేయగలరు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి / కుమార స్వామి వారి వైభవం:
షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము. అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు. అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది.

మనకి వైదిక వాఙ్మయంలో కుమార అనే నామం వినగానే గుర్తుకు వచ్చేది కేవలం బుజ్జి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య గణపతులు పరబ్రహ్మ స్వరూపులేకాక, “కుమారతత్వానికి ప్రతీక. జగత్తులో మాతాపితృ తత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు. (లేదా లక్ష్మీ నారాయణులు... ఎలా పిలిచినా ఒకటే). అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం. ఇందులో అమ్మవారు-అవ్యక్తం, అయ్యవారు-వ్యక్త స్వరూపాలకు సంకేతం అయితే, గణపతి-మహత్తత్వం, కుమారస్వామి-అహంకారం. అహంకార తత్త్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు సృష్టింపబడినది అని చెప్తారు పెద్దలు. నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.

ఇక్కడ అహంకారం అంటే లోకంలో అనుకునే గర్వం అనే భావం కాదు. నేను అనే స్పృహను అహంకారం అంటారు. ఈశ్వరుని పరంగా ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభం అవుతుంది. చైతన్యం యొక్క లక్షణం అహంకారం. ఈ సృష్టిలో కృత్రిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటి జ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ, దానికి నేను చేస్తున్నానుఅనే అహంభావం, స్పందన ఇవ్వలేము. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ కేంద్రం ఈ అహం తత్వమే.

'అహం'తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక గుహఅన్నారు స్వామిని. శివతేజస్సు నుండి ఉద్భవించిన వాడు కనుక జ్ఞానతత్త్వం కలిగి గురుగుహఅని స్వామికి నామం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః అని అర్ధంగా ఇవ్వబడినది.

పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.

అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ, లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామి తత్త్వం.

కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలు ఉన్నాయి. పరతత్వం-అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలో కనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్ కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచి ఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు అయ్యాడు.

కాలస్వరూపం: వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలు - ఆరు ఋతువులు. పన్నెండు చేతులు - పన్నెండు మాసాలు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.

జ్ఞానస్వరూపుడుః సుబ్రహ్మణ్యస్వామి వారు రాసిభూతమైన జ్ఞానస్వరూపం. సునిసితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తి ఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారు ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదే అజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము. జ్ఞానశక్త్యాత్మాఅనేది స్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజః పుంజం కుమారస్వామి. ఆరుకోణాల చక్రం -  బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడా కుమారస్వామి ఉపాసన చెప్పబడినది. షణ్ముఖీ ప్రతిభప్రసాదించే ఈ కార్తికేయుని కవిగా పేర్కొన్నాయి శాస్త్రాలు.

పుట్టన్ బుట్ట శరంబునన్ మొలువఅనే పద్యంలో పోతన గారు…”కావ్య రచనా సామర్ధ్యానికి నేను వాల్మీకిని కాను (పుట్టన్ బుట్ట), శరవణభవుణ్ణి కాను (శరంబునన్ మొలువ)అంటూ ప్రార్ధించారు. ఈ మాటలో కూడా కవితా శక్తి నిధిగా స్కందుడోచరిస్తున్నాడు. శివతేజం స్కన్నమై వచ్చి రూపుకట్టిన దైవం కనుక ఈయన స్కందుడు. రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా, మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి.

కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు. ఓ రామా! ఈ కుమారసంభవం ధన్యపుణ్యగాథఅని విశ్వామిత్రుని మాట (వాల్మీకి రామాయణం బాలకాండ).
ఏషతే రామ గంగాయా విస్తరోమయా I
కుమారసంభవశ్చైవధన్యం పుణ్యస్తథైవ చ II
భక్తశ్చయః కార్తికేయే కాకుత్ స్థ భువిమానవాః I
ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ II

మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి. ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువుల నుంచి తెలుసుకోవలసిన విషయం. రామాయణం లో రామచంద్రప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి. అది రావణ సంహారమునకు అవసరము. సుబ్రహ్మణ్య స్వామి వారిని అందుకే ఆంగ్ల భక్తులు “The God of War” అని సంబోధిస్తారు. దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి, రాముడికి-రావణుడికి, పాండవులకి-కౌరవులకి మధ్య జరిగే యుధ్ధములలో దేవతా సైన్యం విజయం సాధించాలంటే, దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. ఇక్కడ ఇలా చెప్పడంలో రాముడిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదుఅసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు యజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది. అందులోనే శ్రీమహావిష్ణువుకి స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనఃఅనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.  మరి విష్ణువే రాముడు కదా, ఆయనకి విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే రాముడు అవతార ప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు, అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము. ఇదే విషయం భారతంలో ధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం, తారకాసుర సంహారం చెప్పబడడలోనూ వర్తిసుంది.

అయితే రామాయణం లోనూ, మహాభారతంలోనూ, శివమహాపురాణంలోనూ, స్కాందపురాణంలోనూ చెప్పబడ్డ సుబ్రహ్మణ్య స్వామి జనన, లీలా విశేషాలలో చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపించవచ్చు. కానీ, అవి అన్నీ సత్యాలే. ఒకే కుమారసంభవమును అనేక కోణాలలో మహర్షులు దర్శించారు.

కుమారస్వామి వారి పేరు చెబితే మనందరికీ గుర్తుకు వచ్చే ఒక గొప్ప కావ్యం…..”కుమారసంభవం”. మహాకవి కాళిదాసు గారు రచించిన ఈ కుమారసంభవం మొత్తం ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యుడి ప్రసక్తి ఉండదు. కేవలం శివ పార్వతుల కళ్యాణ ఘట్టం వరకు చెప్పి ముగిస్తారు కాళిదాసు. శివ పార్వతుల ఏకత్వమే కుమారుని సంభవం. అష్టాదశపురాణాలలో లక్ష శ్లోకాలు ఉన్న పురాణం స్కాందపురాణం. ఈ పురాణం పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడు, అందుకే స్కాంద పురాణం అయ్యింది. తంత్ర శాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి.

ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక వల్లీ అమ్మ. మనందరిలోనూ కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రము నందు ఉంటుంది. అయితే ఆ కుందలినీశక్తిని కదపడం అనేది కేవలం సమర్ధుడైన గురువు పర్యవేక్షణలో తప్ప ఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు.
ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులే దేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న positive energy కి ప్రతీక. వల్లీ, దేవసేనా అమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు.

నీవంటి దైవము షడానన! నేనెందుకు కాననురా! మారకోటులందు గల శృంగారము, ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!అని స్కందుని కీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి. అలాగే శ్రీముత్తుస్వామి దీక్షితార్ గారు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం పొంది, స్వామి అనుగ్రహం పొందిన మహనీయుడు. ప్రఖ్యాత ఆరుపడైవీడు క్షేత్రములలో ఒకటైన తిరుత్తణిలో కుమారస్వామి ఒక వృధ్ధ గురురూపంలో కనిపించి ముత్తుస్వామి దీక్షితార్! ఏదీ నీ నోరు తెరూఅని చెప్పి ఆయన నోటిలో పటికి బెల్లం వేసివెళ్ళిపోయారు. దీక్షితార్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ స్వామి లేరు. అప్పటి నుంచే దీక్షితార్ గారు ఆసువుగా సంగీత, సాహిత్య, మంత్రశాస్త్ర, నాదరహస్యాలు కలబోసిన అనేక దివ్యమైన కృతుల్ని చేశారు. ప్రతీ కీర్తనలో గురుగుహఅనే నామముతో ముద్రాంకితం చేశారు. శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ! శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ!”, “స్వామినాథ! పరిపాలయాశు మాం స్వప్రకాశ! వల్లీశ! గురుగుహ! దేవసేనేశ!ఇలా ఎన్నెన్నో కీర్తనలను స్వామివారిపై కీర్తించారు.

అలాగే తమిళనాట విశేష సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. అరుణగిరినాథర్ అనే గొప్ప భక్తుడు సుబ్రహ్మణ్యానుగ్రహముతో తిరుప్పుగళ్ అనే పేరుతో కొన్ని వేల కీర్తనలు చేశారు.


చివరిగా నడిచేదేవుడు, కంచికామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి మాటలలో చెప్తే, ఉపాసనలో పరమశివుడికి కొన్ని ఇష్టం, అలాగే అమ్మ వారికి కొన్ని ఇష్టం, భక్తులు అమ్మకి అయ్యకి ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యస్వామి వారికి పూజ చేస్తే చాలుట. ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే. అదీ కుమార తత్వం. ఇక్కడే కుమార తత్వం గురించి మరో చక్కని మాట విన్నాను. పరమశివుడు ఎప్పుడూ తనలోతానే రమిస్తూ ఉంటాడు కదా, ఆయనకి అవతారాలు ఎత్తడం అవీ ఉండవు. మనకి బాలకృష్ణుడు ఉన్నాడు, అలాగే బాలరాముడు ఉన్నాడు, మరి బాలశంకరుడిని ఎక్కడ చూడగలం? అంటే పరమశివుడు చిన్నపిల్లవాడైతే….అదే మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి ముద్దులొలికే నా చిట్టి తండ్రి, మూర్తీభవించిన అందం, తేజస్సు, చిరునవ్వు, అచ్చం అమ్మ పోలికలో ఉండే కారుణ్యమూర్తి, నను గన్న తండ్రి, భక్తుల వరాలను ఇట్టే తీర్చే కామధేనువు, సంతానము లేనివారికి సత్సంతాన భాగ్యం ప్రసాదించే అభయప్రదాత, ఇహమునందు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి, అంత్యమున తనలో కలుపుకునే స్వామి…..అటువంటి మన కుమారస్వామి అనుగ్రహ కటాక్షములు భక్తులు ఎల్లరకు కలగాలనీ, సుబ్రహ్మణ్యస్వామి వారు త్వరగా అవతరించాలనీ, ఈ జగత్తులోనూ మరియు మనలోనూ ఉన్న ఆసురీ, అవైదిక, అధార్మిక శక్తులను సంహరించి, ధర్మస్థాపనం చేయాలనీ స్వామి వారి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను.

ఇంకా చదవండి »