రామాయణం బాలకాండ లోని ఒక ఘట్టం


ఒక రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వాల్మీకి మహర్షి వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు " బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన శ్లోకమే రామాయణ కథ." అన్నారు. శ్లోకానికి అర్ధం చూడండి......

"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన రామ, నీకు మంగళం జెరుగుగాక, అని శ్లోక అర్ధం మారింది.

బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.


వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారు.