శ్రీ రామ జననం-శ్రీ రామాయణం


విధంగా, మహాత్ముడైన దశరథ మహారాజు తల పెట్టిన అశ్వమేధమూ, పుత్రకామేష్టీ పూర్తికాగా, దేవతలు హావిర్భాగాలు స్వీకరించి వెళ్ళిపోయారు. దీక్షానియమాలు నెరవేర్చుకుని భార్యలతోనూ, భృత్యులతోనూ, చతురంగబలాలతోనూ, వాహనాలతోనూ, దశరథుడు అయోధ్యకు ప్రయణమైనాడు. రాజులందరూ దశరథుడు చేసిన సత్కారాలకు చాలా ఆనందించి మునిపుంగవుడైన వసిష్ఠుడు వద్ద సెలవు పొంది, తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిపోయిన తరువాత దశరథుడు బ్రాహ్మణులను ముందు ఉంచుకుని అయోధ్య ప్రవేశించాడు. ఋష్యశృంగుడున్నూ గొప్ప గొప్ప సత్కారాలు పొంది, ఆనందించి, శాంతను వెంటబెట్టుకుని రోమపాదునితో కూడా వెళ్ళిపోయాడు.

ఇలాగ, వారందరూ ఎవరి దారిని వారు వెళ్ళిపోయాక, దశరథుడు సంపూర్ణ మనోరథుడై పుత్రోత్పత్తి నిరీక్షించుకుంటూ వున్నాడు. ఉండగా ఉండగా చైత్రమాసంలో, నవమినాడు, పునర్వసు నక్షత్ర కర్కట లగ్నంలో, కౌసల్యాదేవి రాముణ్ణి కన్నది. సమయంలో ఐదు గ్రహాలు స్వోచ్చస్థానాలలో వున్నాయి. జగన్నాథుడూ, సర్వలోక పూజ్యుడూ, సర్వలక్షణ సంపన్నుడూ అయిన విష్ణుమూర్తి అర్థాంశమే అలాగ ఇక్ష్వాకు వంశవృద్ధికోసం పుట్టాడు. కైకకు భరతుడు పుట్టాడు. అతను సాక్షాత్తూ విష్ణుమూర్తిలో ఎనిమిదోభాగం. తరువాత సుమిత్రకి లక్ష్మణుడూ, శత్రుఘ్నుడూ పుట్టారు. వారు విష్ణుమూర్తిలో ముడు పరకలు. భరతుడు పుష్యమీ నక్షత్రయుక్త మీనలగ్నంలో పుట్టాడు. సూర్యోదయం అయిన తరువాత ఆశ్రేషా నక్షత్ర కర్కటక లగ్నంలోలక్షణ శత్రుఘ్నులు పుట్టారు. వారు పుట్టినప్పుడు గంధర్వులు పాడారు. అప్సరసలు నృత్యం చేశారు. దేవదుందుభులు మోగాయి. పుష్పవర్షం కురిసింది.

అప్పుడు అయోధ్యానగరంలో గొప్ప ఉత్సవం విరాజిల్లింది. దశరథుడు బ్రాహ్మణులకు అపారంగా ధనము, లెక్కలేనన్ని ఆవులూ యిచ్చాడు. పన్నెండో దినాన అతను కొడుకులకు నామకరణ మహోత్సవం చేశాడు. వసిష్ఠుడు కౌసల్య కొడుక్కి రాముడని, కైకెయి కొడుక్కి భరతుడనీ, సుమిత్ర పెద్దకొడుక్కి లక్ష్మణుడనీ, చిన్నకొడుక్కి శత్రుఘ్నుడనీ పేర్లు పెట్టాడు. దశరథుడు కొడుకులకు జాతకర్మ మొదలైనవన్నీ జరిపించాడు. ఆవేళకూడా బ్రాహ్మణులకు , పౌరులకూ భూరి సంతర్పణలు చేయించి, విశేషీంచి బ్రాహ్మణులకు అనేక రత్నరాసులు ఇచ్చాడు.

వారిలో జేష్ఠుడైన రాముడు తండ్రికి మిక్కిలి సంతోషం కలిగిస్తూ జనుల కందరికీ ప్రీతి పాత్రుడైనాడు. అన్నదమ్ములు నలుగురూ వేదవేత్తలైనారు, శూరులైనారు, అందరికీ ఆదరనీయులైనారు. సకల సుగుణాభిరాములైనారు. జ్ఞానవంతులున్నూ అయినారు. వారందరిలోనూ రాముడు పరాక్రముడూ, అందరికీ మిక్కిలి ఇష్టుడూ, చంద్రుడులాగ దర్శనీయుడూ అయినాడు. అన్ని విద్యలలోనూ ధనుర్విద్య అంటే అతనికి చాలా ఇష్టం. తల్లిదండ్రులను పూజించడంలో కూడా అతనికి శ్రద్ధాసక్తులెక్కువ.

చిన్నప్పటినుంచీ లక్ష్మణునకు రాముని యెడల చాలా స్నేహం కలిగింది. లక్ష్మీ వర్థనుడైన లక్ష్మణుడు అందరికీ ప్రియకరుడే; కాని రామునికి మిక్కిలి ప్రియుడు. దీనికి తగ్గట్టు అతను రామునికి బహిఃప్రాణమే. లక్ష్మణుడు దగ్గర లేకపోతే రాముడు అన్నం ముట్టడు. నిద్రపోడు. రాముడు గుర్రమెక్కి వేటకు బయలుదేరితే వెనుక లక్ష్మణుడుండవలసిందే.

ఇటు వీరీలా వుండగా, అటు లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుణ్ణి అనుసరించి ఉంటాడు. తన ప్రాణాలకంటేనూ భరతుణ్ణి ఎక్కువగా చూసుకుంటాడు. శత్రుఘ్నుడంటే భరతుడూ అక్షరాలా అలాగే ఉంటాడు. నలుగురు కొడుకులవల్లా దశరథుడు పరమ ప్రీతుడవుతూ వుంటాడు. వారు శిశువులుగా వున్నప్పుడే యింత సంతోషించిన దశరథుడు, వారు జ్ఞానవంతులై, సుగుణవంతులై, కీర్తివంతులై దీర్ఘదర్శులై సాటిలేకూండా ప్రకాశించడం చూసి మరీ సంతోషించాడు. వారు కూడా తల్లిదండ్రులు గారాబంగా చూసిన కొద్దీ మరీ శ్రద్ధాసక్తులతో వేదశాస్త్రాలు చదువుకుని, తల్లిదండ్రులను పూజించసాగారు.


కొడుకులు నలుగురూ ఇలాగ దినదినమూ వృద్ధినొందుతూ వుండడం చూసి దశరథుడు వారికి వివాహాలు చెయ్యదలచి తగిన కన్యలను వెదకసాగాడు. ఒకనాడు దశరథుడు మహాసభలో కూచుని విషయం మంత్రులతో కూడా ఆలోచిస్తు వుండగా, గాధికుమారుడైన విశ్వామిత్రుడు వచ్చాడు. రాజు అతనికి ఎదురుగా వెళ్ళి సభలోకి తీసుకుని వచ్చి ఉన్నతాసనం యిచ్చి, అర్ఝ్యపాద్యలున్నూ ఇచ్చి పూజించాడు. దశరథుడు విశ్వామిత్రుణ్ణి చూసి మహర్షీ మీరాక వలన మాకు అమృతం లభించినట్లయింది. నీ రాకకు కారణం యేమిటో, నువ్వు ఏమి కోరి దయచేసావో అది చెబితే నేను వెంటనే చేస్తాను. నీ కోరిక తీర్చడానికి నాకు గల సర్వస్వమూ వినియోగిస్తాను అని అన్నాడు. ఇది విని విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు.