కథాసరస్వతికి నీరాజనం తెలుగు కథకులు - కథన రీతులు

‘‘వైవిధ్యం, వైచిత్య్రం, వైదగ్ధ్యం ఉట్టిపడేటట్లుగా వస్తుగ్రహణం చేయాలి. యధార్థ జీవిత సంఘటనంతోబాటు ఒక్కింత కల్పన కూడా మేళవించి కథ రసవంతంగా ఉండేట్లు చూడాలి. ధర్మప్రబోధాలు, సిద్ధాంత ప్రచారాలు కథలో చొప్పించినప్పటికీ అవి మిట్టపండ్లలా బయటపడగూడదు. కథనం ప్రత్యక్షంగా ఎట్టయెదుట కూర్చున్న శ్రోతకు చెప్పినట్టుండాలి. వార్తలా, కరపత్రంలా కాకుండా కథ ఒక కళాఖండంగా వుండాలి...’’ ఇవీ తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి కథానికా పరిణామం గురించి అన్నమాటలు. తెలుగు కథాపరిణామాన్ని ఎంతో మంది విమర్శకులు, రచయితలు నమోదుచేసినాతెలుగు కథకులు - కథన రీతులుపేరుతో నూరుమంది కథారచయితల కథనరీతుల్నీ వ్యక్తిత్వ విశేషాల్ని నాలుగు పుస్తకాలుగా ముద్రించి విశాలాంధ్ర ప్రచురణల సంస్థ సరికొత్త చరిత్రకు నాందిపలికింది. క్రమంలో వెలువడిన ‘‘తెలుగు కథకులు - కథనరీతులు’’ తొలి సంకలనం గురించి చూద్దాం.

శివశంకరశాస్త్రి తెలుగు కథాసాహిత్యంలో గణనీయమైన సేవచేసిన వారుగా 36 మందిని పేర్కొన్నారు. 1952లో గొర్రెపాటి వెంకటసుబ్బయ్య ‘‘అక్షరాభిషేకం’’ పేరుతో తొమ్మిది మంది కథకుల గురించి వివరంగా రాశారు. 1982లో అప్పటి ఆంధ్రప్రదేశ్సాహిత్య అకాడమీ ‘‘తెలుగు కథారయితలు’’ అన్నపేరుతో పన్నెండుమంది కథకులపై పరిశీలనాత్మక వ్యాసాలు ప్రచురించింది. తల్లా వజ్ఝల ప్రచురించిన వ్యాసంలోని 36 మందిలో గొర్రెపాటి వెంకటసుబ్బయ్య అక్షరాభిషేకంలోనూ గురజాడ అప్పారావు ప్రస్తావనలేదు. సాహిత్య అకాడమీ ప్రచురించినతెలుగు కథారచయితలులో ఆయన్ని చేర్చారు. ఇక తర్వాత ఎవరు కథకుల గురించి మాట్లాడినా ఆయనతోనే ప్రారంభించడం ఆనవాయితీగా మారింది.

విశాలాంధ్ర ప్రచురించిన ‘‘తెలుగు కథకులు - కథనరీతులు’’ స్వరూపస్వభావాల్ని మధురాంతకం రాజారాం నిర్దేశించారు. ఆయనకు సింగమనేని నారాయణ సహకరించారు. తర్వాతి సంపుటాలకు నారాయణ పూర్తి సంపాదకులవ్వడం విశేషం. ‘తెలుగు కథకులు - కథన రీతుల్లో పాతికమంది కథకులపై ఇరవై మంది వ్యాసాలు రాశారు. గురజాడపై రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, శ్రీపాదపై అబ్బూరి ఛాయాదేవి, చలంపై ఓల్గా, చింతాదీక్షితులు, బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం, కరుణకుమార్‌, కె.సభా, కొనకళ్ల వెంకటరత్నం - అయిదుగురిపై మధురాంతకం రాజారాం రాశారు. వేలూరి శివరామశాస్త్రిపై డా|| మహతీశంకర్‌, మల్లాది రామకృష్ణశాస్త్రిపై ఇంద్రగంటి జానకీబాల, మునిమాణిక్యం నరసింహారావుపై పోలాప్రగడ సత్యనారాయణమూర్తి, సురవరంపై కాలువ మల్లయ్య, అడివి బాపిరాజుపై వి.సిమ్మన్న, విశ్వనాథ సత్యనారాయణపై ముదివేడు ప్రభాకరరావు, పాలగుమ్మిపై వాడ్రేవు వీరలక్ష్మీదేవి, బుచ్చిబాబుపై పోరంకి దక్షిణామూర్తి, కొడవటిగంటి కుటుంబరావుపై ఓల్గా, గోపీచంద్పై ఆర్‌.ఎస్‌.సుదర్శనం, బాలగంగాధరతిలక్పై కోడూరి శ్రీరామూర్తి, చాసోపై సింగమనేని నారాయణ, సత్యం శంకరమంచిపై వావిలాల సుబ్బారావు, మా.గోఖలేపై పాపినేని శివశంకర్‌, రావిశాస్త్రిపై కాత్యాయనీ విద్మహే, పూసపాటి కృష్ణంరాజుపై భరాగో, పురాణం సుబ్రహ్మణ్యశర్మపై రామమోహనరాయ్లు రాయడం విశేషం.


గురజాడ అప్పారావు మీద రాసిన వ్యాసంలో రాచపాళెం చంద్రశేఖరరెడ్డి - ‘‘పాత్రోచితంగా మాండలిక భాషను ప్రయోగించడంలో ఛాంపియన్గా కన్యాశుల్కం నాటకం ద్వారా నిరూపించుకున్న గురజాడ కథానికల్లో కూడా తన సత్తా ప్రదర్శించాడు. కథనంలో శిష్ట వ్యవహారికాన్ని, సంభాషణల్లో పాత్రోచిత భాషను వాడడం తర్వాతి కథకులకు గురజాడ పెట్టిన ఒరవడి’’. అబ్బూరి ఛాయాదేవి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిపై రాస్తూ - ‘‘ప్రాచీన సంప్రదాయాలూ ఆచారాలూ మూఢవిశ్వాసాలపట్ల విముఖతా, సంఘర్షణ, వ్యావహారిక భాషలపట్ల మక్కువా, సంఘసంస్కరణ విషయంలో కందుకూరి వీరేశలింగం గారికీ, వ్యావహారిక భాషావాదంలో గురజాడకీ వారసులయినప్పటికీ, శ్రీపాద కథారచనలో తమ వ్యక్తిత్వాన్నీ ప్రత్యేకతనీ నిలుపుకుని అనేకమంది సాహితీ ప్రముఖుల మన్ననలందుకున్నారు’’ - అంటారు. చలంపై రాస్తూ ఓల్గా - ‘‘కథలలో కథనరీతులలో చలం చేసిన ప్రయోగాలు తర్వాత వచ్చిన కొడవటిగంటి కుటుంబరావు వంటి రచయితలకు విశాలమైన ఆవరణను కల్పించి పెట్టాయి. వస్తువులో కథనంలో తర్వాత వచ్చిన ఆధునికతకు చలం మార్గదర్శకుడని చెప్పవచ్చు. అయితే కథనరీతులలో ‘‘యిన్ని ప్రయోగాల యింత వైవిధ్యంతో చేసిన రచయితలు చలం తర్వాత లేరనే చెప్పాలి’’ అంటారు. ‘‘పురాణం కథలు దిగువ మధ్యతరగతి జీవితపు వెలుగునీడల్ని చిత్రించి జీవన మాధుర్యాన్ని చవిచూపి మార్గదర్శకమయ్యాయి. మునిమాణిక్యం వారి కథలకంటే పురాణం కథలలో విషాదంపాలు ఎక్కువ. అయినా జీవితం జీవించటానికేనని, విలువైనదని, కన్నీళ్లను గలగల నవ్వుల్ని ఇచ్చే జీవితాన్ని జారవిడుచుకోవద్దని పురాణం కథలు చెబుతాయి’’ అంటారు రామమోహనరాయ్‌. ‘‘లిఖిత సంప్రదాయానికి చెందిన కథారచయిత అయినప్పటికీ రావిశాస్త్రి మౌఖిక సంప్రదాయానికి చెందిన కథన ధోరణులను, అభివ్యక్తి సూక్ష్మితులను కథారచనలో సమగ్రంగానూ, సమర్థవంతంగాను ఉపయోగించుకున్నారు... తెలిసిన రూపం చూపి, తెలియని అసమ సామాజిక జీవనసారం తెలుసుకొనటానికి సామరస్యం కుదుర్చుకుని సామాజిక బాధ్యతలతో కథలు వ్రాసిన రావిశాస్త్రి, తెలుగు కథా సాహిత్య చరిత్రకు నిర్దిష్ట దృక్పథాన్ని, అభివ్యక్తి నైశిత్యాన్ని ఇచ్చి సుసంపన్నం చేశాడు’’ అంటారు కాత్యాయనీ విద్మహే.


గ్రంథంలో రాసిన సమీక్షకులందరూ ఆయా రచయితుల కథల్లో చాలావరకు చదివారన్నది మనకు తెలుస్తుంది. వారికి నచ్చిన కథల సంక్షిప్త ఇతివృత్తాలను అక్కడక్కడా ఇచ్చారు. కొన్ని పాత్రల గురించి తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఒక రచయిత గొప్పవాడని అంటే రచయిత ఎందుకు గొప్పవాడో తెలియజేయడానికి ప్రయత్నించారు. ఆయా రచయితలపై ఒకప్పటి విమర్శకులు, సాహితీ చారిత్రకులు, సమకాలిక రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలను స్పష్టం చేశారు. కొంతమంది జానపద, చారిత్రక, సామాజిక కథలుగా, తల్లీకూతుళ్లూ, అత్తాకోడళ్లు కథలు, వితంతు వివాహం, తండ్రీ కూతుళ్ల కథలు, నిరుద్యోగం, సంస్కరణ, వేశ్యలు, అస్పృశ్యత ఇలా అధ్యాయాలుగా విభజించారు. రచయితలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం లోపలి పేజీల్లో వరుసగా ముద్రించారు. పాతికమందిలోనూ దొరికిన 18 మంది ఛాయాచిత్రాల్ని పై కవరు, వెలిపలి కవర్లమీదే చిత్రించడం విశేషం. సమీక్షకులు రచయితల శైలిని, వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాలను వారి కథల ద్వారానే నిరూపించారు. తెలుగు కథకులు, కథన రీతులు 2, 3, 4 పేర్లతో మొత్తం నూరుమంది కథకుల కథనరీతుల్ని పరిచయంచేసే బృహత్ప్రయత్నాన్ని విశాలాంధ్ర సంస్థ తొలి సంకలనంతో ప్రారంభించి నాలుగు సంకలనాలుగా ప్రాజెక్టు వర్థిల్లింది. తెలుగు కథల్ని అభిమానించే వారు తప్పక దీన్ని అభిమానిస్తారనడంలో సందేహంలేదు.