పెద్దల ముందు ఒద్దికగా ఉండాలి

మన పురాణాలు భక్తి, ముక్తి మార్గాల్ని మాత్రమే ప్రబోధించి వూరుకోలేదు. ఎవరు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చక్కగా వివరించాయి. ప్రధానంగా యువత పెద్దల సమక్షంలో ఎలా ప్రవర్తించాలనే విషయంపై ఎన్నో పురాణ కథలున్నాయి. అలాంటి వాటిలో బ్రహ్మవైవర్త పురాణం శ్రీ కృష్ణ జన్మఖండం ఇరవై మూడో అధ్యాయంలో ఉన్న కథ ఒకటి. కథ ఇలా కనిపిస్తుంది.


ధేనుకాసురుడు అనే గాడిద కృష్ణుడిని సంహరించటానికి వచ్చింది. గాడిద పూర్వ జన్మలో గొప్ప ఇంట్లోని వ్యక్తే. పాపం చేసినందువల్ల అలా గాడిదగా జన్మించాల్సి వచ్చింది. అంతటి ఘోరపాపం ఏమిటి? అని నారదుడు నారాయణ రుషిని అడిగాడు. అప్పుడు నారాయణ రుషి తాను గంధమాదన పర్వతం మీద ఉన్నప్పుడు స్వయంగా ధర్మదేవుడు చెప్పిన విషయాలన్నీ వివరించాడు. గాడిదగా జన్మించింది ఎవరో, ఎందుకు జన్మించాల్సి వచ్చిందో తెలియచెప్పాడు. పూర్వం పద్మకల్పంలో బలి చక్రవర్తి కుమారుడైన సాహసికుడు అనే యువకుడు ఉండేవాడు. సాహసికుడు అన్నీ మంచి లక్షణాలతోనే ఉన్నా ఒకసారి అనుకోకుండా తప్పుచేశాడు. గంధమాదన పర్వతం మీద విహరిస్తున్న సమయంలో అతడికి అప్సరసల్లో ఒకరైన తిలోత్తమ కనిపించింది. ఇద్దరూ ఒకరి అందానికి మరొకరు ఆకర్షితులయ్యారు. అదే పర్వతం మీద దూర్వాస మహర్షి శ్రీకృష్ణుడిని గురించి తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు.

తిలోత్తమాసాహసికులు గంధమాదన పర్వతం మీద యథేచ్చగా మదనకేళిలో తేలియాడసాగారు. మితిమీరిన మోహావేశంలో ఉన్న ఇద్దరూ దూర్వాస మహర్షిని గమనించలేదు. కామం కన్నుగప్పిన తిలోత్తమ, సాహసికులు మహర్షి ఎదుటే ఆయన తపస్సు భగ్నమయ్యేలా ప్రవర్తించారు. తపోభంగమైన మహర్షి కళ్ళు తెరిచి చూశాడు.

ఎదుట నిర్లజ్జగా వ్యవహరిస్తున్న ఇద్దరూ కనిపించారు. వెంటనే కోపోద్రిక్తుడయ్యాడు దూర్వాసుడు. దేవతలు, మనుషులు, దైత్యులు, గంధర్వులు ఇలాంటి వారంతా శృంగార సమయాల్లో లజ్జను అనుభవిస్తుంటారని, కేవలం పశువులు మాత్రమే నిర్లజ్జగా వ్యవహరిస్తాయని, పశుజాతికి చెందిన గాడిద మరీ లజ్జావిహీనంగా ప్రవర్తిస్తుందని, పనే చేసిన సాహసికుడు మరుజన్మలో గాడిదగానే జన్మిస్తాడని శపించాడు. అప్సరసల్లో ఒకరై ఉండీ దైత్యుడితో సంబంధం కలిగిన కారణంగా తిలోత్తమ మరుసటి జన్మలో దానవ స్త్రీగా జన్మిస్తుందని శపించాడు. మహర్షి శాపాన్ని విన్న తర్వాత ఇద్దరూ తాము చేసిన తప్పేమిటో గ్రహించి పశ్చాత్తాప హృదయులై మహర్షి పాదాలపై పడి క్షమించాలని పరిపరివిధాలా వేడుకొన్నారు

ప్రార్థనలకు దూర్వాస మహర్షి శాంతుడయ్యాడు. తన శాపం తప్పదని, అయినా బలి చక్రవర్తి అంతటి వాడి కుమారుడు కాబట్టి సాహసికుడు వరాహకల్పంలో బృందావనం చెంత తాటి తోటలో శ్రీకృష్ణుడిని దర్శించి, ఆయనకు విరోధిగా కనిపించి, ఆయన చేతి సుదర్శన చక్రం వల్ల మరణం పొందుతాడని వివరించాడు. అప్పుడు గాడిద రూపం పోయి శ్రీకృష్ణుడిలో లీనమయ్యే అదృష్టాన్ని పొందుతాడని అన్నాడు. తిలోత్తమ బాణాసురుడికి ఉష అనే పేరుతో కుమార్తెగా జన్మించి కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడిని వివాహమాడి తర్వాత స్వర్గలోకానికి చేరగలదని అన్నాడు. కథా సందర్భంలో యువతకు చక్కటి సందేశం ఉన్నట్లు కనిపిస్తోంది. నేడూ కారణాంతరాలవల్లో, తెలిసో తెలియకో పెద్దల ముందు యువత తప్పుగా ప్రవర్తించడం తరచూ కనిపిస్తోంది. అలాకాక పెద్దల ముందు సరైన మార్గంలో ప్రవర్తించడం ఎంతైనా అవసరం. నిర్లజ్జ, అతివినయం, అవిధేయతలు ప్రమాద హేతువులే మరి.
                                                                                   డాక్టర్యల్లాప్రగడ మల్లికార్జునరావు (ఈనాడు)