ఒక సత్యాన్వేషకుడి జీవితాదర్శాలు

మహామహులు ఎక్కడినుంచో రారు. మన మధ్యలోంచే వస్తారు. మట్టిలోంచే వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంత మందినో తన ఆలోచనలతో, తన జీవన విధానంతో, తన వ్యాఖ్యానాలతో ప్రభావితం చేసిన జిడ్డు కృష్ణమూర్తి వివిధ సందర్భాల్లో స్వయంగా రాసిన అనేక అంశాల్ని ‘‘కామెంటరీస్ఆన్లివింగ్‌’’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించారు. పుస్తకాన్ని ప్రసిద్ధ కథారచయిత్రి అబ్బూరి ఛాయాదేవి తేటతెలుగులోకి అనువదించారు. ‘‘మన జీవితాలు’’ పేరుతో గ్రంథం తెలుగు పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంతకీ గ్రంథంలో ఏముందో చూద్దాం.

జిడ్డు కృష్ణమూర్తి రచనలుగా చెలామణిలో ఉన్న అనేకానేక రచనలకీ, గ్రంథానికీ ఉన్న తేడా ఏమిటంటే అవి అన్నీ ఆయన వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు. అంటే మౌఖికంగా వ్యక్తం చేసినవన్నమాట. కామెంటరీస్ఆన్లివింగ్‌’ పేరుతో వెలువడినవి మాత్రం ఆయనే స్వయంగా రాసినవన్నమాట.

* ఆకాంక్ష ఏరకమైనదైనా, సంఘం కోసం గాని, వ్యక్తిగత మోక్షం కోసం గాని, ఆత్మశుద్ధి కోసం గాని తక్షణం చర్య తీసుకోకుండా తప్పించుకునేటట్లు చేస్తుంది. కోరిక అనేది ఎప్పుడూ భవిష్యత్తుకి సంబంధించినదే... అస్తిత్వం అనేది ప్రస్తుతంలోనే ఉంది. అస్తిత్వంలో ఉండటమే అత్యున్నతమైన పరివర్తన.

* కుతూహలం కనపరచటం అర్థం చేసుకోవటానికి మార్గం కాదు. స్వీయ జ్ఞానంతోనే అవగాహన కలుగుతుంది. బాధపడే వాళ్లు ఎప్పుడూ కుతూహలం కనపరచరు. ఉత్తి ­హలతో కూడిన కుతూహలం ఆత్మజ్ఞానానికి అవరోధం.

* ఆలోచన ఆవేశపూర్తిమైనదీ, ఉద్రిక్తకరమైనదీ కాబట్టి అది ప్రేమ కాదు. ఆలోచన ఉన్నప్పుడు ప్రేమకి తావులేదు. ఆలోచన జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ జ్ఞాపకం కాదు.

* సత్యాన్ని అర్థం చేసుకోవటంలో గురువూ లేడూ, శిష్యుడూ లేడు, పురోగమించిన వాడూ లేడు. అధోగతిలో ఉన్నవాడూ లేడు. గడించిన క్షణం యొక్క భారంగాని చిహ్నంగాని లేకుండా ఉన్నదానిని, అంటే వర్తమానాన్ని అనుక్షణమూ అర్థం చేసుకోవటమే సత్యం.

* లోకంలో గాని, ఇంకోచోట గాని ప్రతిఫలం చూపుతానన్న వాడిని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి.

* సంపద, సుఖం, హోదా - వీటిని వదిలిపెట్టటం అంత కష్టమేమీకాదు. కాని, ఏదో ఉండాలనీ, ఏదో అవాలనీ పడే తాపత్రయాన్ని వదిలిపెట్టాలంటే విశేషమైన తెలివీ, అవగాహనా కావలసి ఉంటుంది.

* మీరు సత్యంలోని అత్యున్నత ఆనందాన్ని చవిచూడాలంటే అన్నిరకాల పూజల్నీ, సిద్ధాంత రీతుల్నీ వదిలించుకోవాలి.

* జ్ఞానం అనేది రెండు చీకట్ల మధ్య తళుక్కుమనే మెరుపు. కాని జ్ఞానం చీకటి పైకిగాని, దానికన్న ముందుకిగాని పోలేదు. సాంకేతిక నైపుణ్యానికి జ్ఞానం అవసరమే. యంత్రంలో బొగ్గు అవసరమైనట్లు. కాని, తెలియని దానిని అది చేరుకోలేదు. తెలియనిది తెలిసిన దానిలో చిక్కుకునేది కాదు. తెలియనిది ఆవిష్కృతం కావటానికి ఉన్న జ్ఞానాన్ని తొలగించుకోవాలి.

* ‘నా’, ‘నాదిఅని అనుకున్నప్పుడు హృదయంలో ఔదార్యం ఉండదు.

* మాన్యత అనేది ఒక శాపం. మనస్సునీ, హృదయాన్నీ హరించివేయగలిగేటంతచెడ్డది’. మనకు తెలియకుండానే మనలో దూరి మన ప్రేమను ధ్వంసం చేస్తుంది.

* మత సంబంధమైనది గానీ, రాజకీయమైనది గానీ, మరే సిద్ధాంతాన్ని గానీ అనుసరించినందువల్ల సమైక్యత సిద్ధించదు. విస్తృతమైన, ప్రగాఢమైన ఎరుక, చైతన్యం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఎరుక చైతన్యపు లోతుల్లోకి కూడా పోవాలి. ­రికే పైపై ఫలితాలతో తృప్తిపడితే చాలదు.

* అనుభవం ఒకటి, అనుభవం పొందటం వేరొకటి. గతానుభవం అనేది అనుభవించడానికి ప్రతిబంధకం. గతానుభవం ఎంత ఆహ్లాదకరమైనదైనా, ఎంత అసహ్యకరమైనదైనా, ప్రస్తుతం ‘‘అనుభవిస్తూ’’ ఉండటం అనే దాన్ని వికసించనియ్యదు.

* సద్గుణం హృదయానికి సంబంధించినది; మనస్సుకి చెందినది కాదు. మనస్సు ఒక సద్గుణాన్ని అలవరచుకుంటున్నదంటే బాగా కపటంగా ఆలోచిస్తున్నట్లే. అదొక ఆత్మరక్షణ. పరిసరాలకనుగుణంగా, తెలివిగా సర్దుకుపోవటమే.

* కాలం అన్నింటినీ దోచేస్తుందని తెలిసి కాలరహితమైన దానికోసం ప్రాకులాడతాం.

* మనలో ఉన్నవి ఎన్నో; ఒకటి కాదు. ఉన్నవన్నీ పోతేగాని ఒకటి అవదు. అవన్నీ ఒకటితో ఒకటి పోట్లాడుకుంటూ రోజూ రాత్రీ, పగలూ గొడవచేస్తూ ఉంటాయి. పోరాటమే జీవితంలోని బాధ. ఒకదాన్ని నాశనం చేస్తాం. దాని స్థానంలో మరొకటి బయలుదేరుతుంది. రకంగా అనంతంగా సాగుతూ ఉన్నట్లుండేదే మన జీవితం!

* ప్రేమను పోల్చి చూడటం, దానిచుట్టూ కంచె కట్టడం కుదరదు.

* మనస్సు తెలిసిన దాన్నుంచి తెలిసిన దానికి కదులుతూ ఉంటుంది. మీకు తెలియనిదాన్ని గురించి మీరు ఆలోచించలేరు. అది అసంభవం. మీరు ఆలోచించేదంతా తెలిసిన దాన్నుంచే వస్తుంది.

* సత్యం గురించి చెప్పటానికి వీలుకాదు. వీలున్నట్లయితే, అది సత్యమే కాదింక! సత్యాన్ని అన్వేషించలేరు. ‘మీరులేనప్పుడేసత్యంఉంటుంది.

* మంచి పౌరుడు మంచి మనిషి అయి ఉండాలని లేదు. కాని మంచి మనిషి అయి ఉంటే అతడు సరియైన పౌరుడు అయితీరుతాడు... వివేకవంతుడైన మంచి మనిషి మంచి సమాజానికి దోహదం చేస్తాడు. కాని మంచి పౌరుడు మనిషి అత్యున్నత వివేకాన్ని పొందగలిగే సమాజాన్ని సృష్టించలేడు. పౌరుడు ఆధిక్యం ప్రదర్శిస్తున్నప్పుడు పౌరుడికీ, మనిషికీ మధ్య సంఘర్షణ అనివార్యం.

మనిషిని కావాలని నిర్లక్ష్యంచేసే సమాజమైనా నాశనమవుతుంది. మనిషి మానసిక ప్రక్రియ అర్థం చేసుకున్నప్పుడే పౌరుడికీ మనిషికీ సామరస్యం కుదురుతుంది.

* పై డాబుసరి ఎంత ఎక్కువగా ఉంటే లోపలి దారిద్య్రం అంత ఎక్కువగా ఉంటుంది.

* మన నమ్మకం ప్రకారమే జీవితం గడపాలనుకుంటాం. ఏదో ఒక నమూనా లేనట్లయితే పని అయినా ఎలా సాధ్యం?

* ప్రచారకులు మతాన్ని ప్రచారం చేసినా, లౌకిక వాదాన్ని ప్రచారం చేసినా సత్యాన్ని చెప్పేవారు మాత్రం కాదు.

* అహంతో కూడిన కార్యకలాపాలన్నీ సంఘర్షణకీ, దుఃఖానికీ కారణమవుతాయి.

* మనలో చాలా మంది భ్రమలలో బతకడానికీ ఇష్టపడతారు. ఇంకా తీవ్రమైన, విస్తారమైన భ్రమలను కనుక్కోవటంలో ఆనందం ఉంటుంది. కానీ, భ్రమలను పోగొట్టుకుంటామన్న భయమే నిజాన్నీ, వాస్తవాన్నీ కప్పిపెట్టి, దాన్ని కనిపించకుండా చేస్తుంది. వాస్తవికతని అర్థం చేసుకునే శక్తి మనకి లేక కాదు. వాస్తవికతని తిరస్కరించి భ్రమలను పట్టుకోవటం వల్లనే మనం భయపడుతూ ఉంటాం.

‘‘మన జీవితాలు’’లో ఎనభై ఎనిమిది అంశాలపై జిడ్డు కృష్ణమూర్తి స్వయంగా రాతపూర్వకంగా తెలియచేసిన అభిప్రాయాల సమాహారమిది. సమన్వయకర్త డా|| గజాననరావు అన్నట్లు ‘‘దర్పణంలా మనల్ని మనమే పరిశీలించుకునే అవకాశం కల్పించే’’విగా వ్యాఖ్యానాలు సాగుతున్నాయి. జిడ్డు కృష్ణమూర్తి జీవితాన్ని ఎంత లోతుగా, గంభీరంగా, విశాలంగా అర్థం చేసుకున్నారో వ్యాఖ్యానాలు చాటుతున్నాయి. మనోతత్వ విచారణ, తాత్వికత, మత ధర్మాల్ని కలిపిన ఆయన బోధనలు సమగ్రమైన, సంపూర్ణ జీవిత దర్శనాన్ని పాఠకులకు అందిస్తున్నాయనడంలో సందేహంలేదు.


(మన జీవితాలు; జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు; అనువాదం: అబ్బూరి ఛాయాదేవి; ప్రచురణ: ప్రగతి పబ్లిషర్స్‌, హైదరాబాద్‌; పుటలు: 325; వెల: 125 రూ.లు)