అర్జున

నరనారాయణావతారములలో నరుడే అర్జునుడు. ఇంద్రానుగ్రహం వల్ల కుంతీ పాండురాజులకు జన్మించిన కుమారుడు. కుమార అస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో ధనుర్ధరుడై విష్ణువువలె నున్న అర్జునుని జూచి ప్రజలు విధంగా అనుకొన్నారు- "వీడె సర్వాస్త్ర విద్యలందు నేర్పరి, ఇతడే ధర్మం తెలిసిన వారిలో ఉత్తముడు. ఇతడే భరతవంశానికంతటికీ కీర్తి వచ్చేటట్లు కుంతి కడుపు చల్లగా పుట్టిన గొప్ప భుజబలుడు అని". 

అర్జునుడు ఇంద్రానుగ్రహంతో కుంతీపాండురాజులకు జన్మించిన కుమారుడు.

"స్థిరపౌరుషుండు లోకోత్తరు డుత్తర ఫల్గునీ ప్రథమపాదమునన్, సురరాజు వంశమున భాసురతేజు వంశకరుడు సుతు డుదయించెన్"-
స్థిరమైన, పౌరుషం గలవాడు, లోకంలోకెల్ల శ్రేష్ఠుడుప్రకాశించే తేజస్సు కలవాడు, వంశాన్ని నిలిపేవాడు అయిన కుమారుడు దేవేంద్రుని అంశతో ఉత్తరఫల్గునీ నక్షత్ర ప్రథమపాదంలో జన్మించాడు.

పుట్టగానే ఆకాశవాణి ఉరుము వలె గంభీరంగా ఇలా పలికింది. ఇతడు అర్జుననామంతో వెలిగి, దేవతల నోడించి ఖాండవాన్ని దహిస్తాడని. ఎల్లరాజుల జయించి అన్నగారైన ధర్మజుచేత రాజసూయ యాగాన్ని చేయించి దేవతల వలన దివ్యాస్త్రాలు పొంది శత్రుంజయుడు కాగలడని భవిష్యత్తును చెప్పింది. పూలవాన కురిసింది.

ధర్మజుడనే ధర్మశక్తికి, భీముడు భౌతికబలాన్ని కూర్చగా, అర్జునుడు దైవబలాన్ని అనుసంధించేవాడు అయ్యాడు. ఆభిజాత్యం గురించి తెలుసుకున్నాక, సంస్కారవంతుడెలా అయ్యాడో తెలుసుకుందాం.

విద్యాభ్యాసం: ద్రోణుడు కురుపాండవుల ఆస్థాన విలువిద్యాచార్యుడుగా నియుక్తుడయ్యాడు. నా దగ్గర అస్త్రవిద్యలు నేర్చి నా కోరిక మీలో ఎవ్వడు తీర్చగలడని అడుగగా కౌరవులందరూ పెడమొగాలు పెట్టి మౌనం వహించగా, అర్జునుడు నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు. ఆచార్య హృదయము గెలుచుకున్నాడు. అర్జునుడు శస్త్రాస్త్రవిద్యానైపుణ్యంలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుని సంతోషపరచేవాడు.

ద్రోణుని వలన గొప్ప శస్త్రాస్త్రవిద్యాబోధనను పొందటంలో రాకుమారులంతా సమానమే అయినా అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వ శ్రేష్ఠుడయ్యాడు. కుమారాస్త్ర విద్యాప్రదర్శన సమయమున ప్రజలందరూ, అర్జునుడు చూపిన అస్త్రవిశేషములకు ఆశ్చర్యచకితులై- 

వీడె కృతహస్తు డఖిలాస్త్రవిద్యలందు
వీడె అగ్రగణ్యుడు ధర్మవిదులలోన
వీడె భరతవంశం బెల్ల వెలుగ గుంతి
కడుపు చల్లగా బుట్టిన ఘనభుజుండు

అర్జునుడే అస్త్రవిద్యలన్నింటిలో నేర్పరి. ఇతడే ధర్మం తెలిసిన వాళ్లలో మొదట లెక్క పెట్టదగినవాడు. ఇతడే భరతవంశానికంతటికీ కీర్తి వచ్చేటట్లు కుంతి కడుపు చల్లగా పుట్టిన గొప్ప భుజబలుడు. తల్లి కుంతీదేవి ధన్యురాలు గదా!

ద్రుపదావమానజనితమన్యు ఘూర్ణమాన మానసుండయిన ద్రోణుడు, 13 సంవత్సరాల తర్వాత తనంతటి శిష్యుడైన అర్జునుని వలన "ఐశ్వర్యకారణదారుణగర్వితుండైన" ద్రుపదుని, రథాక్షమునకు కట్టి తెచ్చి, తన పాదాలపై బడేట్లుగా గురుదక్షిణ పొందాడు. దీనితో ద్రోణార్జునుల సంబంధము సామాన్య గురుశిష్యస్థాయి ననుగమించి పుత్రస్థాయి నందుకొన్నది. ఆచార్యుడు అర్జునునకు బ్రహ్మాస్త్రము బోధించి అతిరథవీరుడుగా తీర్చిదిద్దాడు.

ఇది మొదలు అర్జునుని అస్త్రవిద్యాకౌశలము అసాధారణమైన జయముల సాధించినది. అపారకీర్తి నార్జించినది. ద్రుపదపురమున మత్స్యయంత్రము ఛేదించి సకలరాజసమక్షమున ద్రౌపదిని గెలుచుకొన్నది.

శ్రీకృష్ణుని ప్రశంసను, ప్రేమను పొందినది; సుభద్రా వివాహముతో శ్రీకృష్ణ సఖ్యము బాంధవ్యముగా పరిణమించింది. యాదవబలము కొనితెచ్చినది. అంతేగాక, అర్జునుని అస్త్రవిద్యాకౌశలము ఖాండవదహనమున అగ్నిహోత్రునికి సాయపడి గాండీవమును, అక్షయతూణీరమును దివ్యరథమును సాధించినది.

రాజసూయపూర్వ దిగ్విజయము ఆయనను లోకైకవీరుడుగా చాటింది. అరణ్యవాససమయంలో పరమేశ్వరుని మెప్పించి పాశుపతము నార్జించుకొన్నాడు. దేవేంద్రుని అనుగ్రహమును, దేవతలందరి చేత దివ్యాస్త్రములు పొంది, సాటిలేని వీరుడుగా, గణుతికెక్కి క్షత్రియలోకమున అద్వితీయ ధనుర్ధరుడై అజేయుడనిపించుకొన్నాడు. ఇంత కీర్తిమంతుడైనను అర్జునుడు గురువు పట్ల గాని, అన్నల పట్ల గాని, పెద్దల పట్ల గాని, అవిధేయతను ఎన్నడు ప్రకటింపలేదు. ధర్మబద్దుడుగా, సౌశీల్యవంతుడుగా రాణించాడు.

ఉత్తరగోగ్రహణ సందర్భంలో అర్జునుడు గురునికి ప్రదక్షిణముగా తేరు నడిపి ఆయన ఆశీర్వాదబలము పొంది విజయుడయ్యాడు.

అభిమన్యుని వధతో కుమిలిపోవుచు, పుత్రుని చంపిన సైంధవుని సూర్యాస్తమ సమయము కాక ముందే చంపుదునని, కాదేని గాండీవముతో పాటు అగ్నిలో ప్రవేశింతునని ప్రతినబూని, అర్జునుని శకటవ్యూహంలో అడ్డగించిన గురుని, అర్జునుడు పుణ్యాత్మా! నన్ను, అశ్వత్థామను సమానమైన ప్రేమతో పెంచావు. ద్రోహియైన సైంధవుడిని చంపటానికి నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరేటట్లు చేయుము అని అర్ధించాడు. తన్ను జయించుటకు వెంటబడిన గురుని జూచి, నాకు గురుడవు కాక శత్రుడవా? యుద్ధంలో కోపగించిన నిన్నెదుర్కొనటానికి నాకు సాధ్యమా? అది శివుడి కొక్కడికే సాధ్యం అంటూ పొగడాడే తప్ప పరుషోక్తుల నిందింపలేదు.

చివరకు ద్రోణుని దారుణముగ వధించిన ద్రుష్టద్యుమ్నుని గూడ దూషించకుండ విడువలేదు. విధంగా అర్జునుని గురుభక్తి ఆద్యంతము అచంచలంగా నిలిచి ఆదర్శశిష్యప్రవృత్తికి ధ్వజప్రాయమై నిలిచింది. శాశ్వతకీర్తి ఇరువురినీ వరించింది.

అర్జునుని భ్రాతృభక్తి అసమానం. ధర్మజుని భక్తి గౌరవములతో సేవించినాడు. అప్పుడప్పుడు ఆవేశముతో అన్న నెదిరించు భీమసేనుని అనునయించి సాంత్వవచనములతో ఓదార్చినాడు. అన్న ద్యూతవ్యసనమును, దాని దారుణ పరిణామములను, కష్టనష్టములను ఓపికతో భరించినాడు. భీమసేనుడు ఆవేశపడి జూదమాడిన అన్న చేతులు కాల్తునని విజ్రుంభించినపుడు, అర్జునుడు ధర్మరాజే ధర్మం తప్పితే భూమండలమంతా తల్లడిల్లదా ? స్నేహంగా ఆడుకునే జూదానికి, ధర్మం కొరకు చేసే యుద్ధానికి ఇతరులు పలుమార్లు పిలిస్తే ప్రభువైనవాడు పూనుకోకుండ, పెడమొగం పెట్టి పోకూడదన్న శుభక్షత్రియధర్మాన్ని ఆయన లోకంలో నిలిపాడని సమర్థించాడు. ధర్మజుని ఆజ్ఞననుసరించి దుర్యోధనుని గంధర్వుల బారి నుండి రక్షించాడు. సైంధవుని భీముడు చంపబోవ, అన్న మాట గుర్తు చేసి వాని ప్రాణరక్ష కావించాడు. అర్జునుని భ్రాతృభక్తి, ధర్మరక్తి అనుపమానములు.

గగుర్పాటు కలిగించే సన్నివేశమొకటి కర్ణపర్వంలో చూద్దాము. సమతాగుణశోభితుడైన ధర్మరాజు, కర్ణుని చేత చావుదెబ్బలు తిని సమతను కోల్పోయి, అర్జునుని నిందించి గాండీవము అన్యుల కిమ్మనుట, భ్రాతృభక్తికి పరాకాష్ఠగా నిల్చిన తమ్ముడు, అన్నను హత్య జేయబూనుట, ఊహింపరాని ఆశ్చర్యకర సంఘటన! శ్రీకృష్ణుని చొరవతో ఇది పరిష్కారం కావటం నిజంగా ముదావహం. లేకున్న పరిణామాలు మహాదారుణంగా ఉండేవి.

తన రెండవనాటి యుద్ధంలో కర్ణుడు, ధర్మరాజుపై విజ్రుంభించి పలుబాణాలతో బాధించాడు. అతడు భీముని వద్దకు పోయిదాక్కున్నాడు. కర్ణుడు అతడిని వెంటాడి వేధించాడు. ధర్మజుడు ఎదుర్కొనలేక విచారంతో నిజశిబిరానికి తిరిగి వెళ్లాడు.

అర్జునుడానాడు రణం ప్రారంభించే ముందు కర్ణుని వధించిగాని తిరిగి రానని ప్రతిజ్ఞ చేశాడు. ధర్మరాజుకు కలిగిన బడలికలను గురించి పరామర్శించటానికై అర్జునుడూ, కృష్ణుడూ మధ్యాహ్నమే తిరిగి రావటం, ఆయనకు ఆశ్చర్యానందాలు కలిగించింది.

కృష్ణార్జునులిరువురూ ధర్మరాజును కుశలప్రశ్నలతో పలుకరించారు. అర్జునుడు యుద్ధంలో కర్ణుడిని చంపివచ్చాడనే అభిప్రాయంతో అతడిని ధర్మరాజు అభినందించాడు. కర్ణుడిని చంపిన విధానాన్ని వివరించుమని ఆర్జునుడిని ఆసక్తిగా అడిగాడు.

దీనికి అర్జునుడు తటపటాయిస్తూ, మీరు కర్ణుడిచేత బాధితులయి రణరంగం వదలివచ్చారని, శిబిరంలో ఉన్నారని భీమసేనుని వలన విని, మీ కుశలం తెలిసికొని తిరిగిపోయి కర్ణుడిని సంహరిద్దామని వచ్చానన్నాడు.

అర్జునుడి మాటలు విని, ధర్మరాజు మండిపడ్డాడు. కర్ణుడింకా బ్రతికి ఉన్నాడన్న వార్త అతడికి ఉడుకెక్కించింది. కినుకతో, అర్జునా! దుర్యోధనాదులు చూస్తూ ఉండగా కర్ణుడు నన్ను యుద్ధంలో అవమానాలపాలు చేశాడు. భీముడు సదా నన్ను రక్షిస్తూనే ఉన్నాడు. రోజున అభిమన్యుడు గాని, ఘటోత్కచుడు గాని ఉన్నట్లయితే నా స్థితి ఇట్లా ఉండేదా?

అర్జునా, కృష్ణుడు అండగా ఉండగా భయపడి ఎందుకు వచ్చావు? నీవు గాండీవాన్ని కృష్ణున కిమ్ము, నీవు నొగలెక్కి కూర్చుండి రథచోదకుడవు కమ్ము. శ్రీకృష్ణుడే కార్యనిర్వాహకుడౌతాడు అని అన్నాడు.

ధర్మరాజు మాటలకు ధనంజయుడు మండిపడ్డాడు. కత్తి పైకెత్తి ధర్మజుడిపై లంఘించాడు. కృష్ణుడు అడ్డుపడి పార్థా, మనం కౌరవుల మీద దాడి చేయడం లేదు. ధర్మరాజును పరామర్శిస్తున్నాం. ఇది సంతోషకాలం గాని, క్రోధసమయం కాదు. అన్నగారిని వధించరాదని హెచ్చరించాడు. కృష్ణా, నా గాండీవాన్ని ఇతరుల చేతికిమ్మని అన్నవాడితల పగులగొడుతానని నేను ప్రతిజ్ఞ చేశాను. మా అన్న ధర్మాత్ముడైనా నా మాటను నేను నిలబెట్టుకుంటాను. దీనికి నీవేమి చెబుతావో చెప్పుము. సకల ధర్మసాకల్యవేదివి నీవు చెప్పినట్లు చేస్తానన్నాడు అర్జునుడు.

అపుడు శ్రీకృష్ణుడు ధర్మసూక్ష్మంగా, పెద్దలను దూషించుట వారిని చంపటం వంటిదే. అందువలన నీ ప్రతిన తీరేటట్లుగా ధర్మరాజును వధించకుండా నోరార నిందించుము (తిట్టుము). మీద గురునిందా పాపం పోయేటట్లు మీ అన్నకు నమస్కరించి నిన్ను నీవు కీర్తించుకోమన్నాడు. అర్జునుడు గోవిందుడి హితవు పాటించాడు.

"అపార బాహుబలసంపన్నుడు అయిన భీముడు నన్ను పరిహసించి మాట్లాడవచ్చు గాని, భుజబలప్రదర్శనంలో చాలక యుద్ధభూమిలో నిలిచిపోరాడలేని నీకు, ఇట్లా నొవ్వజేసి చెడ్డమాటలాడే యోగ్యత ఎక్కడున్నది?

నా సంగతి బాగా తెలిసికూడా ఇట్లా మాట్లాడతగునా? ఇట్లన్న నీ నాలుక ఎందుకు పెక్కు ముక్కలుగా చీలిపోలేదో? ఇంతగా మాట్లాడేందుకు నీవేప్పుడైనా యుద్ధంలో ఏమైనా సాధించావా? కవలలు తమ బాహుబలంతో విరోధి సైన్యాలను బాణాఘాతాలతో అతలాకుతలం చేస్తారు కాని, నీ మాదిరిగా నోరు పారేసుకున్నారా?

నీవు జూదమాడినందువలననే కౌరవపక్షంతో మనకు పగ కలిగింది. రాజ్యం పోవటం, అడవుల పాలవటం, సేవకవృత్తి నెరపటం మొదలైన భరించజాలని కష్టాలు తెచ్చిపెట్టావు. ఇంతైనప్పటికి, ఇసుమంత సిగ్గు నీ మనస్సులో పుట్టడం లేదు. పొగరుబోతువాడివలె ఎగసి మాట్లాడితే చులకనైపోతావు. ఇంతవరకు నీవు చేసినదేదో చేసావు. ఇకనైనా వక్రబుద్ధిమాని, తగిన మగబలిమి లేనందున, దుశ్చేష్టలు మాని ఊరకుండుము. ఇన్ని కష్టాలు అనుభవించిన మేము నీ చేష్టలు సహించి ఊరకుండలేము" అని ధర్మరాజును నిష్ఠురోక్తులతో నిందించి, మనస్సులో బాధపడి, నిట్టూర్చి కత్తిని తీసి తన తల నరకుకొనుటకు సిద్ధపడ్డాడు.

అది చూసి, ఇది ఏమని ప్రశ్నించిన శ్రీకృష్ణునకు, ధర్మరాజును తూలనాడినందులకు ప్రాయశ్చిత్తమనగా, శ్రీకృష్ణుడు నిన్ను నీవు పొగడికొనుము, అది మరణంతో సమానమని చెప్పగా అర్జునుడు-

"ముల్లోకాలలో శివుడు తప్ప ఇంకొక ధనుస్సు పట్టినవాడు, నాకు సాటిరాగలిగినవాడు లేడు. నీవు చేసిన రాజసూయయాగంలో దక్షిణలు ఇచ్చేందుకు దిగ్విజయాలు సాగించి అపారధనరాశులను తెచ్చి నీకు సంతోషం చేకూర్చాను. మహాపరాక్రమవంతులైన సంశప్తకులనే వీరుల సమూహాన్ని అణచాను. కౌరవసేన నాచేత నశించి ఎట్లా దీనంగా ఉన్నదో నీవు కళ్లారా చూడు" అని పలికి, అన్నగారికి పాదాభివందనం చేశాడు. ధర్మజుడు శ్రీకృష్ణుని, "కలత చెంది ఉన్న నన్ను మంచిమాటలతో తేరుకొనేటట్లు చేసి దయాపూర్ణమతితో హితాన్ని బోధించావు. లోకవృత్తం ఎరుగని మమ్ము ఆపదలనెడి సముద్రంలో మునిగిపోకుండా అభిమానంతో కాపాడావు. కృష్ణా, పుణ్యస్వరూపుడవు నీవు" అంటూ కీర్తిస్తాడు.

ఆదిపర్వంలో గరుడోపాఖ్యానంలో అమృతభాండాన్ని గ్రహించి, అలోడుడై తీసుకువెళ్తున్న తరుణంలో తన బలపరాక్రమాలు ఎరుగగోరిన ఇంద్రునితో, గరుడుడు "పరనిందయు, ఆత్మగుణోత్కరపరికీర్తనము జేయగా నుచితమె సత్పురుషులకు" అంటాడు.

ఇతరులను నిందించటం, తమ గుణాల సముదాయాన్ని మెచ్చుకోవటం సజ్జనులకు తగునా? (తగదు).  

సభాపర్వంలో విషయాన్నే శిశుపాలునితో ధర్మరాజు -
"భూరిగుణోన్నతులనదగువారికి, ధీరులకు, ధరణివల్లభులకు, వాక్పారుష్యము చన్నె? మహాదారుణ మది, విషము కంటె దహనము కంటెన్" అంటాడు.

గొప్పగుణాల చేత శ్రేష్ఠులని చెప్పదగినవాళ్లకు, పండితులకు, ప్రభువులకు కఠినంగా మాట్లాడటం తగునా? మాట కాఠిన్యం విషం కంటే, అగ్ని కంటే అతిభయంకరం కదా?

భీష్మపితామహుడంతటి వాడు, ఉత్తరగోగ్రహణ సందర్భంలో అర్జునునుద్దేశించి-
"చిరకాలమునకు గంటిమి నరు నక్కట! వీడు సజ్జన ప్రియుడు, సుహృత్పరతంత్రుడు, బాంధవహితు, డరిభీకరుం డిట్టివార లవనింగలరే?"

ఎంతో కాలానికి అర్జునుడిని చూచాం. వీడు సజ్జనులకు ప్రియుడు, స్నేహశీలి, బంధుహితుడు, శత్రువులకు భీకరుడు. ఇట్లాంటివాళ్లు భూమిపై ఉన్నారా? (లేరని భావం).

ద్రౌపది దృష్టిలో అర్జునుడు:
మహావదాన్యుడు, ఇంద్రియనిగ్రహం గలవాడు, భయంకరమైన పరాక్రమం చేత శత్రువులను తరింపజేయగలవాడు, స్వచ్ఛమైన వర్చస్సు గలవాడు, ఎవరికినీ జయింప శక్యం కానివాడు. "అవశగతి గామరోషాదివికారము లొందినను మదిని ధర్మపథప్రవిహతి గానీడు" అంటూ ప్రశంసిస్తుంది.

పొందు కోరి విఫలమనోరథయైన ఊర్వశి శాపం తెలిసి దేవంద్రుడు, "నీయట్టి ధైర్యవంతుని నే యుగములనైన గాన మెన్నండును ధర్మాయత్తమతివి మునులకు నీ ఇంద్రియ జయము కీర్తనీయము తండ్రీ" అంటాడు. నీవు ధర్మాత్ముడివి. నీవంటి ధైర్యవంతుని కాలంలోనైనా చూడలేము. నీవు ఇంద్రియాలపై సాధించిన విజయం ఋషీశ్వరులు కూడా ఉగ్గడించతగింది అంటూ కొడుకును శ్లాఘించాడు.

అర్జునుని స్థిరవిజయసాధనకు కర్మకౌశలము, సౌశీల్యము ముఖ్యకారణములు. సభాపర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పార్థుడి రక్షాబలం, భీముడి భుజబలం, నా నీతిబలం నీకుండగా అసాధ్యమేముంది? అని అంటాడు.

పురుషకారానికి దైవబలం తోడైతే విజయం తథ్యమని ఆంధ్రమహాభారతం పార్థుని చరిత్ర ద్వారా తెలియజేస్తున్నది.

మహాప్రస్థాన సమయంలో అర్జునుడు యాత్ర సాగిస్తూ తన గాండీవాన్ని వదలక వెంట తీసుకుపోతున్నాడు. జీవితంలో గాండీవం అతనికంత కీర్తి నార్జించింది. అందుచేత దాని మీద అర్జునునకంత మమకారము! చివరకు అగ్నిదేవుడు హెచ్చరించిన గాని అర్జునుడు దానిని వదలలేదు.