గరుత్మంతుడు
గరుత్మంతుడు ఒక గరుడ పక్షి (గ్రద్ద).
శ్రీమహావిష్ణువువాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి.
ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు
సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపనులను రక్షిస్తూఉంటాడు.
అనూరుని శాపం
కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత,కద్రువులకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ
కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప
ప్రజాపతి కోరుకొంటాడు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువకు అండాలనుండి వాసుకి, ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యిపాములు జన్మిస్తాయి. వినత అది చూసి
తొందరపడి తన ఆండాన్ని చిదుపుతుంది. అందునుండి కాళ్లు లేకుండా, మొండెము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు.
అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుడు తల్లితో నువ్వు సవతి
మత్సరముతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతి కి దాసీగా ఉండు. రెండవ అండాన్ని
భద్రంగా ఉంచు. అందునుండి జన్మించినవాడు నీదాస్యాన్ని విడుదల చేస్తాడు అని
చెబుతాడు. సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి రథసారథి గా అనూరుడు
వెళ్లిపోతాడు.
వినత - కద్రువల పందెం
వినత, కద్రువ లు ఒక రోజున
సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీర సాగరమధనం లో వచ్చిన ఉచ్చైశ్రవము అనే
ఇంద్రుడి గుర్రము దూరముగా కనిపించింది. అప్పుడు దూరముగా కనిపిస్తున్న గుర్రమును
చూసి, కద్రువ తన సవతి తో
"చూడు ఆ ఉచ్చైశ్రవము శరీరం అంత తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉన్నది" అని
అంటుంది. ఉచ్చైశ్రవము తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు దాని తోక తెల్లగ ఉన్నదని అంటుంది. దీనితో కద్రువకు
మనస్సులో పట్టుదల పెరిగి పందెం వేదాము , తోక తెల్లగా ఉంటే
నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నువ్వు నాకు
దాస్యం చేయాలి అంటుంది.
వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దు పోయిందని
తరువాతి రోజు వచ్చి ఆ గుఱ్ఱాన్ని చూడవచ్చని ఇద్దరు అంగీకరించుకొని వారి ఇండ్లకి
వెళ్ళిపోతారు.
సంతానానికి కద్రువ శాపం
కద్రువ ఇంటికి వెళ్ళి తన సంతానాన్ని పిలిచి పందెం గురించి
చెప్పి ఆ గుఱ్ఱం తోక కు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్లు చేయమని కొడుకులను
అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించక పోయేసరికి కోపముతో మాతృ వాక్యపరిపాలన
చెయ్యని మీరందరు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు చేసే సర్ప యాగంలోమరణిస్తారు అని
శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకొని
నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు.తరువాతి రోజు వినత, కద్రువ లు వెళ్ళి చూడగానే గుఱ్ఱం తోకకర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా
కనిపిస్తుంది. అది చూసి వినత బాధ పడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది.
గరుత్మంతుని జననం
కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు. గరుడుడిని చూసి కద్రువ,
"వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా
నా దాసుడే అని గరుడుడిని కూడా దాసీవాడు గా చేసుకొంటుంది. గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన
వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు. ఒకరోజు ఇలా త్రిప్పుతుండగా గరుత్మంతుడు
సూర్యమండలం వైపు వెళ్లి పోతాడు. ఆ సూర్యమండలం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుడిని
ప్రార్థించి వర్షం కురిపిస్తుంది. ఆతరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది.
దానితో దుఃఖితుడై గరుత్మంతుడు తనది, తన తల్లిది దాసీత్వం పోవాలి అంటే చేయవలసిన కార్యాన్ని అడుగుతాడు.
అప్పుడు కద్రువ కుమారులు, ఆలోచించి అమృతం పొందాలనే
కోరికతో తమకు అమృతంతెచ్చి ఇస్తే గరుత్మంతుడి మరియు వినత ల దాసీత్వం పోతుందని
చెబుతారు.
గరుత్మంతుని దాస్యవిముక్తి
గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో
ఇంద్రుడు కనిపించి "నాయనా గరుత్మంతా! అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు.
అందరికి అమరత్వం సిద్దించరాదు" అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు -ఇంద్రుడు
ఒడంబడిక చేసుకొంటారు. గరుత్మంతుడు అమృతకలశం తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు,
అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని
పారిపోయేటట్లు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్భల పై ఉంచుతాడు.అమృతం
ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతడి తల్లి
దాసీత్వము పోతుంది.
సర్పాలకు ద్విజిహ్వత్వం
అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ
పాములు స్నానం చెయ్యడానికి వెళ్తాయి. అవి అలా స్నానానికి వెళ్లిన తడవుగా ఇంద్రుడు
వచ్చి ఆ అమృతకలశాన్ని ఎత్తుకొని పోతాడు. స్నానం చేసి వచ్చి జరిగింది గ్రహించి
సర్పాలు బాధ పడతాయి. అయినా ఆశ చావక, ఆ పాములు దర్భలపై
ఉంచి నప్పుడు ఒలికిన అమృతాన్ని తమ నాలుకతో నాకుతాయి. ఆ విధంగా నాకడం వల్ల వాటి
నాలుకలు చీలి పోతాయి. ఆవిధంగా సర్పాలకు ద్విజిహ్వత్వం (రెండు నాలుకలు) సిద్ధించింది.
ఉపసంహారం
ఆ విధంగా తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా వెళ్లిపోతాడు. సర్వ శక్తిమంతుడు
అయి ఉండి, తల్లి మాటకోసం సవతిసోదరులను
వీపున మోస్తూ, అవమానాలను భరించి, తల్లికీ,తనకూ కూడా ఉన్న
దాస్యబంధనాలను ఛేదించుకొని ఉన్నతస్థానానికి వెళ్లిన గరుత్మంతుడు
ప్రాతస్స్మరణీయుడు.