పీఠికలోని ఇష్ట దైవ ప్రార్థనలు

శ్రీ కైవల్య పదమును చేర్చ గలిగినది భక్తి మార్గమొక్కటే. అట్టి భక్తి మార్గమును సహజ పాండిత్యుడు శ్రీ బమ్మెర పోతనామాత్యుడు తన భాగవత రచన ద్వారా అమృతోపమానంగా మన కందించాడు. ఆ పోతన భాగవతం లోని పీఠికలోని పద్యములు నిత్య పారాయణ యోగ్యములు. 

శ్రీ మహా విష్ణువు ప్రార్థన శార్దూలము:-                              
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు, భక్త పాలన కళా సమ్రంభకున్, దానవో
ద్రేక స్తంభకు, గేళి లోల విలసద్దృగ్జాల సంభూతనా
నాకంజాత భవాండ కుంభకు, మహా నందాంగనా డింభకున్.

ఈశ్వర ప్రార్థన ఉత్పలమాల:-
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా
శాలికి, శూలికిన్, శిఖరిజాముఖ పద్మ మయూఖ మాలికిన్,
బాల శశాంక మౌళికి, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మును ముఖ్య మనస్సరసీరుహాళికిన్.

బ్రహ్మ ప్రార్థన ఉత్పలమాల:-
ఆతత సేవ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకు, గల్మష జేతకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్.

గణపతి ప్రార్థన ఉత్పలమాల:-
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి, దోష భేదికి, బ్రపన్న వినోదికి, విఘ్న వల్లికా
చ్ఛేదికి, మంజు వాదికి, నశేష జగజ్జననంద వేదికిన్
మోదక ఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.

సరస్వతీ ప్రార్థన ఉత్పలమాల:-
క్షోణి తలమ్మునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు. సైకత
శ్రోణికి, జంచరీక చయ సుందర వేణికి, రక్షితామర
శ్రేణికి, దోయ జాత భవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి, నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

శార్దూలము:-
పుట్టం బుట్ట , శరంబునన్ మొలవ, నంభోయాన పాత్రంబునన్,
నెట్టం గల్గను, గాళి గొల్వను, బురాణింపన్ దొరంకొంటి, మీ
దె ట్టేవెంట జరింతు, దత్ సరణి నాకీవమ్మ! యో యమ్మ! మేల్
పట్టున్ నా కగుమమ్మ ! నమ్మితి జుమీ, బ్రాహ్మీ! దయాంభోనిధీ.!

ఉత్పలమాల:-
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషారఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధా పయోధి సితి తామర సామర వాహినీ శుభా
కారతనొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!

ఉత్పలమాల:-
అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ! శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి! ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా
చుంబిత దిగ్విభాగ! శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ! భా
వాంబర వీధి విశ్రుత విహారిణి! నన్ గృప జూడు భారతీ!

దుర్గాదేవి ప్రార్థన ఉత్పలమాల:-
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చిన యమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్థి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

లక్ష్మీదేవి ప్రార్థన మత్తేభము:-
హరికిన్ బట్టపు దేవి, పున్నెములప్రో వర్థంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు,భారతీ గిరిసుతల్ దో నాడు పూబోడి, దా
మరలన్ దుండెడి ముద్దరాలు, జగముల్ ,మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్.

కృతి పతి నిర్ణయము ఊత్పలమాల:-
ఇమ్మనుజేశ్వరాథములకిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు కొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి, కాలుచే
సమ్మెట వ్రేటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.

ఎంత అద్భుతమైన భక్తిభావ పూరితమైన పద్యాలో .