అప్రియము కలిగించేది సత్యమైనా సరే చెప్ప కూడదు
నేను కళ్ళారా చూచింది
చెపితే నాన్న కొడతాడు. చెప్పకపోతే అమ్మ కొడుతుంది. మరెలా? అని ఇంటిలో పిల్లడు సంకట స్థితిలో పడినట్లే మనం కూడా
ఒక్కొక్క సారి ఈ విషయం చెప్పాలా వద్దా? చెపితే కుటుంబాలు విడిపోతాయేమో? చెప్పకపోతే అన్యాయం
జరిగిపోతుందేమో? అని అప్పుడప్పుడు సంకట
స్థితిలో పడిపోతుంటాం. మనం ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయాన్ని సూచిస్తున్న ఈ క్రింది శ్లోకాన్ని
పరిశీలిద్దామా?
శ్లోకము:
నభ్రూయాత్ సత్యమప్రియం
ప్రియోపి నానృతం భ్రూయాత్
ఏష ధర్మస్సనాతనః.
తేటగీతి:
సత్యమును పల్క వచ్చును సరస
మతిని.
ప్రియము పల్కగ వచ్చును
ప్రీతి తోడ.
బాధ కలిగించు సత్యము పలుక
తగదు.
ప్రియము గొలుప నసత్యము
ప్రేల రాదు.
ఆహా ఎంత చక్కగా
చెప్పబడింది. మనము చక్కగా సత్యమును పలుక వచ్చునట. ఆందరికీ ప్రియము గొలుపు
విధముగానూ మాటాడ వచ్చునట. ఐతే మనము పలికేది సత్యమైనప్పటికీ అది ఎవరికయినా బాధ
కలిగించేదయినట్లయితే అటువంటి సత్యమును పలుక కూడదట. ఇతరులకు ప్రీతి కలిగించుటకొరకని
అసత్యమును మాత్రము పలుక రాదట. ఎంత చక్కగా వుంది దీనిలోని భావన. దీనిని బట్టి
మనకర్థమయింది కదా ఎప్పుడు, ఎలా మాటాడాలో. అలాగే
చేద్దామా మరి?