పరమ ధర్మం

పేరు లేని ఒక పతివ్రత, కౌశికుడనే ఒక బ్రాహ్మణుడు, ధర్మవ్యాధుడనే ఒక కిరాతకులస్థుడితో  ముడిపడిన ఘట్టం వాటిలో ఒకటి. అరణ్యపర్వం, పంచమాశ్వాసంలో(ఎఱ్ఱాప్రగడ అనువాదం) ఉన్న ఈ ఘట్టాన్ని నిర్మించిన తీరే ఎంతో విస్మయం కలిగిస్తుంది. అది హఠాత్తుగా పాఠకుల్ని మహాభారత ప్రపంచానికి భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెడుతుంది. వారి ముందు భిన్న సమాజాన్ని ఆవిష్కరిస్తుంది. ఇంకా చెప్పాలంటే, అది నేరుగా సమకాలీన సమాజంలోకి తీసుకొస్తుంది. పైగా లోతైన చర్చ, విమర్శ, ఆత్మవిమర్శ రూపంలో ఆ ఘట్టం సాగడం మరింత ఆశ్చర్య చకితం చేస్తుంది. అన్నింటికంటె విశేషం- అందులోని మూడు పాత్రలూ నేటి ఒక స్ర్తీవాదికి, ఒక అగ్రకులస్థునికి, ఒక నిమ్న కులస్థునికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఉండడం.

కథ: 
కౌశికుడు వేదాధ్యయనం చేస్తున్నబ్రహ్మచారి. అతనొక రోజున ఒక చెట్టు కింద కూర్చుని వేదం వల్లె వేస్తుండగా చెట్టుపైనున్న ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు కోపంతో దానివైపు తీక్షణంగా చూసేసరికి అది చచ్చి కింద పడిపోయింది. అతనికి బాధ కలిగింది. ఆత్మవిమర్శ అంకురించింది. నా హృదయంలో ఇంత కాఠిన్యం ఎందుకుంది, నిష్కారణంగా కొంగను ఎందుకు చంపాను, దీని నుంచి నాకు మనశ్శాంతి ఎలా లభిస్తుందనుకున్నాడు. అంతలో మధ్యాహ్నం కావడంతో వికలమనస్సుతోనే భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. ఓ ఇంటిముందు నిలబడి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇల్లాలు భిక్ష ఇవ్వడానికి పాత్ర కోసం వెతుకుతుండగా ఆమె భర్త ఇంటికి వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాడు. ఆమె భర్తకు పీట వేసి అన్నం పెట్టి తాంబూలమిచ్చింది. అతను విశ్రాంతి తీసుకుంటుండగా పాదాలు ఒత్తింది. అప్పటికి కానీబ్రాహ్మణుడు భిక్ష కోసం వచ్చి వాకిట్లో నిలబడి ఉన్నాడన్న సంగతి ఆమెకు గుర్తు రాలేదు. నొచ్చుకుంటూ భిక్ష తీసుకుని వచ్చింది.

కౌశికుడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అడిగిన వెంటనే భిక్ష ఇవ్వకుండా నన్నింత సేపు నిలబెట్టి అవమానిస్తావా అని ప్రశ్నించాడు. ఆకలితో వచ్చిన భర్తకు అన్నం పెట్టి సపర్యలు చేయడంలో మునిగిపోయి నీ సంగతి మరచిపోయాను, తప్పుగా భావించద్దు, ఓరిమి వహించమని ఆమె అంది. బ్రాహ్మణుల కన్నా మొగుడు ఎక్కువా, కొవ్వెక్కి నీ కళ్ళు మూసుకుపోయాయని కౌశికుడు తూలనాడాడు. అవమానితుడైన బ్రాహ్మణుడి క్రోధాగ్నికి పర్వతాలు, అడవులు, ద్వీపాలు సహా భూమండలం సమస్తం బూడిదైపోతుందన్న సంగతి నీకు తెలియదా అన్నాడు.

 బ్రాహ్మణుల మహిమ నాకెందుకు తెలియదు, ఒకాయన సముద్ర జలాల్ని తాగేశాడు, ఇంకొకాయన దండకారణ్యాన్ని దగ్ధం చేశాడు. తెలిసి తెలిసి కొరివితో తల గోక్కునేంత వెర్రిదాన్ని కాను, అయినా సరే ఎందుకు ఆలస్యం చేశానంటావేమో, నాకు నా భర్తే దైవం, ఆయనను సేవించుకోవడమే నా ధర్మం, ఇతర ధర్మాలేవీ నా దృష్టిలో అంతకంటె ఎక్కువ కావు, నువ్వు అమిత కోపిష్టివన్న సంగతీ తెలుసు, నీ కోపానికి ఒక కొంగ ఆహుతవడాన్ని నా పాతివ్రత్య మహిమతో చూశానులే అని ఆమె అంది.

ఆ మాటతో కౌశికుడు ఆశ్చర్యపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆమె  కౌశికునికి ధర్మబోధ ప్రారంభించింది.  కోపాన్ని గొప్ప చేసి మాట్లాడడం మంచిదికాదు; కోపం, మోహం అనే రెండు శత్రువుల్ని జయించలేనివాడికి బ్రాహ్మణ్య గౌరవం ఎలా లభిస్తుంది, అయినా చదువుసంధ్యలు లేని స్త్రీలు తప్పు చేస్తే సహించవద్దా అని ప్రశ్నించింది. వేదాలు వల్లె వేయడమే తప్ప నీకు ధర్మ సూక్ష్మాలు తెలియవని ఆక్షేపించింది. వెంటనే బయలుదేరి మిథిలా నగరం వెళ్ళు. అక్కడ జితేంద్రియుడు, సత్యవాది, మాతాపితృభక్తుడు అయిన ధర్మవ్యాధుడనే కిరాతకుడున్నాడు. అతడు నీకు అన్ని ధర్మాలూ వివరించి సందేహ నివృత్తి చేయగల మహాత్ముడంటూ అతని చిరునామా ఇచ్చింది.

 కౌశికునికి ఆశ్చర్యం మీద ఆశ్చర్యం. అతనెంతో గొప్పగా భావించే బ్రాహ్మణ్యం చదువు సంధ్యలకు దూరం చేసిన ఒక స్ర్తీ అతనికి ఉపదేశకురాలైంది. స్ర్తీలను జ్ఞానానికి దూరంగా ఉంచారన్న ఎత్తుపొడుపు కూడా ఆమె మాటల్లో ఉంది. బ్రాహ్మణ్యమనే ఇరుకు ప్రపంచంలో ఉన్న అతనిని ఆమె ఉపదేశం విశాల ప్రపంచంలోకి తీసుకొచ్చింది. అతని కోపానికి కొంగ ఆహుతవడాన్ని పాతివ్రత్య మహిమతో చూశానన్న ఆమెమహిమలు, మంత్రాలు బ్రాహ్మణాధీనాలన్న ఊహను పటాపంచలు చేసింది. ఆమె అభిశంసన అతనిలో కోపాన్ని పెంచలేదు సరికదా, అతని వికల మనస్సుపై అమృతపు జల్లులా పని చేసింది.

తల్లీ నీకు శుభ సమృద్ధులు లభించుగాక అంటూ ఆ క్షణంలోనే కౌశికుడు మిథిలా నగరానికి బయలుదేరాడు. ధర్మవ్యాధుని ఆచూకీ తెలుసుకుని మాంస ఖండాలు వేలాడదీసిన ఓ అంగడిని సమీపించాడు. మాంసం కొనడానికి నిరంతరాయంగా వస్తున్న జనాల మధ్య ధర్మవ్యాధుడు నిపించాడు. ఆ పరిసరాలు జుగుప్సాహవంగా తోచి కౌశికుడు దూరంగా నిలబడిపోయాడు.

కౌశికుని రాకను ధర్మవ్యాధుడు అతీంద్రియ దృష్టితో గమనించాడు. తనే అతనివద్దకు వెళ్ళి నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. ఆ పతివ్రతా తిలకం నా గురించి చెబితే నువ్వు వచ్చావు, ఏ కోరికతో వచ్చావో కూడా నాకు తెలుసునన్నాడు. ఇంతకు ముందు పతివ్రత ఎరుకకు ఆశ్చర్యపోయిన కౌశికుడు, ధర్మవ్యాధుని ఎరుక రెండో ఆశ్చర్యం అనుకున్నాడు.

 ధర్మవ్యాధుడు కౌశికుని తన ఇంటికి తీసుకువెళ్ళి యథోచిత మర్యాదలు చేశాడు. కాసేపు సాధారణ విషయాలు మాట్లాడుకున్న తర్వాత కౌశికుడు తన సందేహాన్ని బయటపెట్టాడు. ధర్మం తెలిసినవాడివి కదా, జీవ హింసతో గడపడం ఏ విధంగా యోగ్యం, ఆ ఘోర కర్మ చూడగానే నాకు దుఃఖం కలిగిందన్నాడు. ధర్మవ్యాధుడు సమాధానమిస్తూ, బ్రాహ్మణునికి తపస్సు, స్వాధ్యాయం; రాజులకు దండనీతి; వైశ్యులకు వ్యవసాయం, పశుపాలన; శూద్రులకు సేవ ఎలా పరమధర్మాలో మాకు జంతుమాంసం మీద ఆధారపడి జీవించడం అలాగే పరమ ధర్మం, పైగా అది మాకు తాత ముత్తాతలనుంచి వస్తున్న వృత్తి అన్నాడు. అయితే ఇతరులు జంతువులను చంపి తెచ్చిన మాంసాన్నే కొని, తగిన వెలకు అమ్ముతూ బతుకుతున్నాను తప్ప తానుగా ఎప్పుడూ జీవహింస చేయననీ, శాంతియే తన ధనమనీ అన్నాడు. మిథిల రాజు జనకుడికి వర్ణాశ్రమ ధర్మ నిర్వహణపై పట్టింపు ఎక్కువని కూడా అన్నాడు. తను తక్కువ కులంలో పుట్టినా వినయం, అతిథి సేవ, సత్యం, శౌచం, ఓరిమి, అసూయా రాహిత్యం, ఏకపత్నీవ్రతం, నిందాస్తుతుల పట్ల సమతుల్యత వంటి గుణాల వల్ల నిర్మలుడినయ్యానన్నాడు.

కుల ధర్మాన్ని పాటించడం పరమధర్మమని పెద్దలంటారు. అయితే, మనసులో కృప కలిగి ఉండడం ముఖ్యం. అలాగే ఓరిమి కూడా ఉండాలి. కోరికల విషయంలో విడుపు అవసరం. విడుపును మించిన గొప్ప గుణం మరొకటి లేదు. పరిత్యాగికి సాధ్యం కానిదేమీ ఉండదు. కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో మనసు మలినమవుతుంది. అయినా సరే ధర్మం తప్పకుండా జీవించడం ఉత్తమ మార్గం. క్రోధ, లోభాలు రెండూ అన్ని పాపాలనూ మించిన పాపాలు. ఆ రెండింటినీ జయించినవాడే పరమ ధార్మికుడు. దానం, తపస్సు, సత్యం, మితంగా మాట్లాడడం, దయార్ద్రత మొదలైన శిష్టాచారాలను పాటించడం వల్ల ప్రయోజనమేమిటంటావేమో, అది అంతఃకరణలో సంతోషం నింపుతుంది. అటువంటి సంతృప్తి మరే మార్గంలోనూ లభించదన్నాడు.

ఆ తర్వాత ధర్మవ్యాధుడు హింస- అహింసల చర్చలోకి వెడుతూఏది హింసో, ఏది అహింసో నిర్ణయించడం ఎవరి తరం? బ్రాహ్మణులు యజ్ఞాలలో పశువులను వధించడం లేదా? పితృకార్యాలలో మాంసం శ్రేష్టమనీ, ఆ పితృశేషాన్ని భుజించడం యోగ్యమనీ మునులు చెప్పలేదా? భూమి, నీరు, ఆకాశం సమస్తం ప్రాణిమయం కనుక ఆయా కర్మలు చేసేటప్పుడు హింస తప్పదు. హింస చేయనిదే దేహయాత్రసాగదు.ఇదేమీ ఆలోచించకుండా, అహింసావ్రతులమంటూ మునులు అడవుల్లో గడుపుతూ ఉంటారు. వారు కందమూల ఫలాలు కోసి తినడం కూడా హింసే. కనుక, హింస చేయనివాడంటూ ఈ ప్రపంచంలో ఒక్కడూ ఉండడు. సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ఉండడమే అహింస. ఈ విధంగా ధర్మం అనేక విధాలుగా ఉంటుంది. ధర్మ సూక్ష్మాలు గ్రహించడం అంత తేలిక కాదు. అందుకే శ్రుతులను, పెద్దల ఆచారాలను ప్రమాణంగా తీసుకోవాలి. ధర్మాచరణ వల్ల మనసు తేటపడి ప్రసన్నమవుతుంది. ఇంద్రియ సుఖాలు శుష్కమైనవన్న ఎరుక కలుగుతుంది. క్రమంగా పరిణతి లభిస్తుంది.

చివరగా... నువ్వడిగిన అన్ని ధర్మాలూ క్లుప్తంగా చెప్పానుఇంకా వినవలసినదేమైనా ఉందా అని ధర్మవ్యాధుడు అడిగాడు. లేదు, అన్నీ వివరంగా తెలిశాయి. జ్ఞానసిద్ధి కలిగింది. నువ్వు సర్వజ్ఞుడివన్న సంగతి అర్ధమైందని కౌశికుడు అన్నాడు. దానిపై ధర్మవ్యాధుడు, నాకీ ఉత్తమ జ్ఞానం సిద్ధించడానికి మూలమైన ధర్మం వేరొకటి ఉంది, దానిని ప్రత్యక్షంగా చూపిస్తానంటూ అతన్ని తన అభ్యంతర గృహంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడున్నవృద్ధ దంపతులను చూపించి, వీరు నా తల్లిదండ్రులు. వీరిని సేవించుకుంటూ ఉండడం వల్లనే కానీ పరిజ్ఞానం సిద్ధించింది. అందరూ ఏవేవో కోరికలతో దేవతలను పూజిస్తారు. నాకు మరో దేవుడు లేడు. నా తల్లిదండ్రులే నా పాలి వేల్పులు. నా భార్యా, నేనూ వీరికి అన్న వస్త్రాలు, ఫల పుష్పాలు ఇచ్చి భక్తితో నిరంతరం సేవించుకుంటున్నాం. వేదాలు, యజ్ఞాలు, వ్రతాలు అన్నీ మాకు వీరే. అదలా ఉంచి, ఆ పతివ్రత పంపగా నువ్వు నా దగ్గరకు వచ్చావు కనుక ఆమె పట్ల అభిమానంతో నీకివన్నీ చెప్పాను కానీ; నీ మీద ఇష్టంతో కాదు. ఎందుకంటే నువ్వొక తప్పు చేశావు. వృద్ధాప్యంలో నువ్వు తమకు తెప్ప వవుతావన్న ఆశతో బతుకుతున్న తల్లిదండ్రులను విడిచిపెట్టి, వారి అనుమతి లేకుండా నిశ్చింతగా నువ్వు వేదాధ్యయనంతో గడుపుతున్నావు. ఇంతకంటె క్రూరత్వం ఉండదు. నీ కోసం దుఃఖించి దుఃఖించి భగ్న హృదయులై కంటి చూపు కోల్పోయి భారంగా రోజులు దొర్లిస్తున్న ఆ వృద్ధ దంపతుల వద్దకు వెళ్ళి వారి శోకాగ్నిని ఆర్పు. తల్లిదండ్రుల సేవ మరచి నువ్వు జరిపే అధ్యయనం వృథాప్రయాస- అని ధర్మవ్యాధుడు అన్నాడు.

కౌశికుడు అతనితో ఏకీభవిస్తూ, నువ్వు ఇలాంటి జన్మ ఎత్తడానికి కారణమేమిటని అడిగాడు. ధర్మవ్యాధుడు సమాధానమిస్తూ- గత జన్మలో తాను బ్రాహ్మణుడిననీ, ఒక రాకుమారునితో స్నేహం వల్ల ధనుర్వేదం అభ్యసించాననీ, ఒక రోజు అతనితో వేటకు వెళ్ళి మృగాలపై బాణం వేయబోగా అది ఒక ముని కుమారునికి తగిలిందనీ, అతను కోపించి, బ్రాహ్మణుడివై ఉండీ శూద్ర కర్మకు పాల్పడ్డావు కనుక ఎరుక కులంలో పుట్టమని శపించాడనీ, తను క్షమాపణ కోరి శాపాన్ని ఉపసంహరించమని ప్రాధేయపడేసరికి, ఎరుక కులంలో పుట్టినా ధర్మజ్ఞుడివవుతావనీ, మరు జన్మలో మళ్ళీ బ్రాహ్మణుడివవుతావని ముని శాప విముక్తిని అనుగ్రహించాడని చెప్పాడు.


 కౌశికుడు ఇక శెలవు తీసుకుంటానంటూ ధర్మవ్యాధునికి ప్రదక్షిణం చేసి, తన తల్లిదండ్రుల వద్దకు బయలుదేరాడు.