ప్రకృతి నుండి నేర్చుకో వలసిన కృతజ్ఞతా గుణం

ఈ నాడు మనం ఎందరినో చూస్తున్నాం. నేను వాడికెంత ఉపకారం చేశానో. వాడికస్సలు విశ్వాసం లేదు. అంటూ వాపోతుంటారు. అలా జీవితంలో ప్రతీ ఒక్కడూ ఎప్పుడో ఒకప్పుడు మదన పడడం మనం చూచినప్పుడు మనకి కూడా అయ్యో పాపం అనిపిస్తుంది.

మనం వీలయితే ఇతరులకు ఉపకారంచెయ్యాలి. అది మానవుడై పుట్టిన వాని కనీస ధర్మంగా సహృదయులు భావిస్తారు. ఐతే అది మానవ ధర్మం మాత్రమే. మానవ కనీస కర్తవ్యం ఒకటుంది. అది ఏమిటంటే ఎవరయినా తనకు ఏమాత్రం చిన్న ఉపకారం చేసినా దానిని జీవితాంతం మరిచిపోకూడదు. అంతే కాదు. వీలున్నప్పుడల్లా వారికి ధర్మ బద్ధంగా ప్రత్యుపకారం చేస్తూనే ఉండాలి. ఈ విషంలో ఒక చక్కని శ్లోకముంది. చూద్దామా!

శ్లోకము:-

ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః
శిరసి నిహిత భారా నారికేళా నరాణాం.
సలిలమమృత కల్పం దద్యు రాజీవితాంతం
నహి కృతముపకారం సాధవో విస్మరంతి.

తేటగీతి:-
చిన్న తనమున త్రాగిన చిన్న పాటి
నీటి విషయము మరువకేనాటివరకు
బ్రతుకునన్నాళ్ళు మ్రోయుచు, ఫలములిచ్చు
మేలు మఱువక సతతము మేలు చేయు.

ఉత్పలమాల:-
కొబ్బరి చెట్టు, చిన్నపుడు గోముగ నీటిని పోసి పెంచె నా
డబ్బురమంచు, పొంగి మది, హాయి నొసంగు జలంబులిచ్చు తా
నిబ్బరమున్ ఫలంబులను నిత్యముమోయుచు. మానవాళికిన్.
అబ్బు కృతజ్ఞతన్ సతము హాయినొసంగుట. సజ్జనాళికిన్.

భావము:-
కొబ్బరి మొక్కను నాటి మనము నీరు పోసి పెంచినందుకు ఆ కొబ్బరి మొక్క చెట్టయి , చిన్నతనములో తనకు తీయని నీరు పోసి పెంచినారు అనే కృతజ్ఞతా భావంతో తాను బ్రతికున్నన్నాళ్ళూ బరువయిన తీయని నీటితో కూడిన కొబ్బరి కాయలను తలపై పెట్టుకొని మ్రోయుచూ మానవాళికి తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారంగా అందజేస్తుంది. ఎవరయినా ఏ చిన్నపాటి మేలు తనకు చేసినా బ్రతికున్నన్నాళ్ళూ కృతజ్ఞతా భావం కలిగి ప్రత్యుపకారం చేయడమన్నది సజ్జనాళికి అబ్బును కదా!

కృతజ్ఞత, ప్రత్యుపకార బుద్ధి, అందరిలోనూ ఉన్ననాడు ఎవరికీ ఎట్టి బాధా కలిగించకుండా మనం కూడా సంతోషంగా హాయిగా బ్రతుక వచ్చును కదా! మరి మనం కూడా మనలోని సద్ గుణాల్ని పెంచుకోవాలి కదా ...