రుద్రము - నమకము - అనువాకము 8
అనువాకము 8
యజుస్సు 1.
ఓం నమస్సోమాయచ రుద్రాయచ.
ఉమతో గూడి యున్నట్టియు, సకల జీవుల రోదన హేతువైన దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 2.
నమస్తామ్రాయచారుణాయచ.
ఉదయ
కాలమున ఆదిత్య రూపుఁడగుటచే అత్యంత రక్త వర్ణుఁడై ఉన్నట్టియు, ఉదయానంతరమున ఇంచుకంత రక్త వర్ణుఁడై ఉన్నట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 3.
నమశ్శంగాయచ పశుపతయేచ.
సుఖమును పొందించు వాఁడును, సుఖము నుత్పాదించు వాఁడును, భయ హేతువులైన పాప
రోగ చోరాదుల నుండి రక్శించు వాఁడును అగు మహా దేవునకు నమస్కారము.
యజుస్సు 4.
నమ ఉగ్రాయచ భీమాయచ.
విరోధులను నశింప జేయుటకు క్రోధ యుక్తుఁ డైనట్తి వాఁడును, దర్శన మాత్రము చేత విరోధులకు భయ హేతు వైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 5.
నమో
అగ్రేవధాయచ దూరేవధాయచ.
అగ్రమునందు వధ కలవాఁడును (ముందున్నవానిని సంహరించువాఁడు) దూరమునందు వధ కలవాఁడును, అగు శివునకు నమస్కారము.
యజుస్సు 6.
నమోహంత్రేచహనీయసేచ.
దూర
సమీప వర్తి శత్రువులను ధ్వంసము చేయువాఁడును, శత్రు ధ్వంసము చేయువాఁడును, సర్వాతిశాయి శక్తిచే సర్వులను సంహరించు వాఁడును అగు
శివునకు నమస్కారము.
యజుస్సు 7.
నమో
వృక్షేభ్యో హరికేశేభ్యః.
కల్పవృక్షాది స్వరూపుఁడును, హరిత వర్ణములును, కేశ సదృశములునగు ఆకులు గల వృక్షములు స్వరూపముగా కలవాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 8.
నమస్తారాయ.
ఓంకార రూపమైన ప్రణవముచే ప్రతిపాదింపఁబడు శివునకు నమస్కారము.
యజుస్సు 9.
నమశ్శంభవేచమయోభవేచ.
సుఖము నుత్పాదించు వాఁడును, లోకములకు సుఖము భావించు వాఁడు నగు శివునకు నమస్కారము.
యజుస్సు 10.
నమశ్శంకరాయచ మయస్కరాయచ.
విషయ సుఖములను జేకూర్చు వాఁడును, మోక్ష సుఖమును జేకూర్చువాఁడును అగు శివునకు నమస్కారము.
యజుస్సు 11.
నమశ్శివాయచ శివతరాయచ.
కల్యాణ స్వరూపుఁడై స్వయముగ నిష్కల్మషముగ నుండు వాఁడును, మిక్కిలి కల్యాణ స్వరూపుఁడుగా నుండునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 12.
నమస్తీర్థ్యాయచ కూల్యాయచ.
ప్రయాగాది తీర్థములందు సన్నిహితుఁడై యుండునట్టియును, నదీ తీరములందు ప్రతిష్టింపఁబడిన లింగరూపమున నుండునట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 13.
నమ పార్యాయచ వార్యాయచ.
సంసార సముద్రము దాటించి, మోక్ష కాములచే ధ్యానింప దగిన వాఁడును, సంసార మధ్యమున నున్నవారికి కామ్య ఫలదుండునగు శివునకు నమస్కారము.
యజుస్సు14.
నమః
ప్రతరణాయచోత్తరణాయచ.
గొప్ప మంత్ర జపాదుల యొక్క రూపము వలనఁ బాప
తరణమునకు హేతువైనట్టియు, తత్వ జ్ఞాన రూపమున సంపూర్ణముగా సంసారము నుండి దాటించు వాఁడునగు శివునకు నమస్కారము.
యజుస్సు 15.
నమ ఆతార్యాయచాలాద్యాయచ.
జీవ
రూపమున మరల
సంసార గమనమునకు అర్హుఁడైనట్టియు, సంపూర్ణముగా కర్మఫలము ననుభవించు జీవుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 16.
నమశ్శష్ఫ్యాయచ ఫేన్యాయచ.
గంగా తీరాదులతో జన్మించు కుశాంకురాదులకు అర్హుఁడైనట్టియును, నదీ మధ్య గత ఫేనమునకు అర్హుఁడైనట్టి శివునకు నమస్కారము.
యజుస్సు 17.
నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ.
సికతకు అర్హుఁడైనట్టియును, ప్రవాహమునకు అర్హుఁడైనట్టి శివునకు నమస్కారము.
అనువాకము 8 సంపూర్ణము.