రుద్రము - నమకము - అనువాకము 7

అనువాకము 7
యజుస్సు 1.
నమో దుందుభ్యాయచాహన్యాయచ.
భేరీ నుండి బయల్వెడలిన శబ్దము స్వరూపముగా కలవాఁడును, దుందుభిని మ్రోగించు దండముతో మొత్తుటచే బయల్వెడలిన నాదము రూపముగా కలవాఁడును, వంశ దండోద్భవుఁడు అగు శివునకు నమస్కారము.

యజుస్సు 2.
నమోధృష్ణవేచ ప్రమృశాయచ.
యుద్ధమున పలాయన రహితుఁడును, పర సైన్య వృత్తాంతమును పరామర్శించువాఁడును అగు శివునకు నమస్కారము.

యజుస్సు 3.
నమో దూతాయచప్రహితాయచ.
స్వామి వృత్తాంతములను స్వస్వామి జనులకు తెలియ జేయుటలో కుశలుఁ డైనట్టియు, స్వామిచే పంపఁ బడిన పురుషుఁడైనట్టి శివునకు నమస్కారము.

యజుస్సు 4.
నమో నిషఙ్గిణేచేషుధిమతేచ.
ఖడ్గము కలవాఁడును బాణాధారమైన అమ్ముల పొది కలవాఁడును అగు శివునకు నమస్కారము.

యజుస్సు 5.
నమస్తీక్ష్ణేషవేచాయుధినేచ.
వాడి బాణములు కలవాఁడును, బహ్వాయుధములు కలవాఁడునగు శివునకు నమస్కారము.

యజుస్సు 6.
నమస్స్వాయుదాయచసుధన్వనేచ.
శోభనమైన త్రిశూల రూపమగు ఆయుధము కలవాఁడును, శోభనమైన పినాక రూపమగు ధనుస్సు కలవాఁడును అగు శివునకు నమస్కారము.

యజుస్సు 7.
నమస్సృత్యాయచ పథ్యాయచ.
పాద సంచార యోగ్యమైన క్షుద్ర మార్గమునకు అర్హుఁడును, రథాశ్వాది సంచార యోగ్యమైన ప్రౌఢమార్గము కలవాఁడును అగు శివునకు నమస్కారము.

యజుస్సు 8.
నమః కాట్యాయచ నీప్యాయచ.
కుత్సితమైన జలము అనగా అల్ప జలము ప్రవహించు చోటును కటము అందురు. అందు జల రూపమున నున్న శివుఁడు కాట్యుఁడు. అతనికి నమస్కారము. అథో ముఖము గాను, అడ్డము గాను జలము ప్రవహించు చోటను జల రూపమున నున్న శివునకు నమస్కారము.

అనువాకము 7 సమాప్తము.