రుద్రము - నమకము - అనువాకము 6

అనువాకము 6
యజుస్సు 1.
నమోజ్యేష్ఠాయచ కనిష్ఠాయచ.
విద్య ఐశ్వర్యము మున్నగు వానిచే జ్యేష్ఠుఁడైనట్టి వాఁడున్నూ విద్యాదులతో కనిష్ఠుఁడైన వాడును అగు మహాదేవునకు నమస్కారము.

యజుస్సు 2.
నమః పూర్వజాయచాపరజాయచ.
జగదాదిని హిరణ్య గర్భ రూపమున జన్మించి నట్టి జగ దవసాన సమయమున అగ్ని రూపమున జన్మించినట్టి మహాదేవునకు నమస్కారము.

యజుస్సు 3.
నమోమధ్యమాయచాపగల్భాయచ.
మధ్య కాలమున దేవ తిర్య గాది రూపమున జన్మించి నట్టియును, ప్రరూఢములు కాని ఇంద్రియములు కలవాఁడును అగు మహాదేవునకు నమస్కారము.

యజుస్సు 4.
నమో జఘన్యాయచ బుధ్నియాయచ.
గవాదులపశ్చాత్భాగమున వత్సాది రూపమున నున్నట్టియును, వృక్షాదుల మూలమున శాఖాదుల రూపమున నున్నట్టి పరమ శివునకు నమస్కారము.

యజుస్సు 5.
నమస్సోభ్యాయచ ప్రతిసర్యాయచ.
పుణ్య పాపములతో కూడుకొన్నవాఁడును, రక్షాబంధమున కర్హమైనట్టి శివునకు నమస్కారము.

యజుస్సు 6.
నమో యామ్యాయ క్షేమ్యాయచ.
యమలోకమునఁ బాపులను శిక్షించు వాని రూపమున జన్మించి నట్టియును, మోక్షమున కర్హుడై యున్నట్టి శివునకు నమస్కారము.

యజుస్సు 7.
నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ.
సర్వ సస్యములతో నిండిన భూమితో ధాన్యాది విశేష రూపమున ఉన్నట్టియు, మేడి, నక్కు నాగలి రూపమున భూమిని దున్ని, అందలి సారమును వెలిబుచ్చునట్టి శివునకు నమస్కారము.

యజుస్సు 8.
నమశ్శ్లోక్యాయచావసాన్యాయచ.
వేదమంత్రములచే తెలియ దగు మహిమ కలవాఁడై, వానిలోనున్నట్టియును, వేదాంతములైన ఉపనిషత్తులచే నిరూపింప దగు తత్వము కలవాఁడు కాన వానిలో నున్నట్టి శివునకు నమస్కారము.

యజుస్సు 9.
నమో వన్యాయచ కక్ష్యాయచ.
వృక్షాది రూపమున నున్నట్టియును, లతాది రూపమున నున్నట్టి శివునకు నమస్కారము.

యజుస్సు 10.
నమశ్శ్రవాయచ ప్రతిశ్రవాయచ
శబ్ద రూపుఁడును ప్రతి ధ్వని రూపుఁడును అగు శివునకు నమస్కారము.

యజుస్సు 11
నమ అశుషేణాయచాశురథాయచ.
వేగముగా పోవు సేన కలిగినట్టి, వేగముగా పోవు రథము కలిగినట్టి శివునకు నమస్కారము.

యజుస్సు 12.
నమశ్శూరాయచావభిందతేచ.
యుద్ధమున ధైర్యము కలవాఁడును, శత్రువులను సంహరించువాఁడును అగు శివునకు నమస్కారము.

యజుస్సు 13.
నమో వర్మిణేచ వరూధినేచ.
కవచము కలిగినట్టియు, గృహము కలవాఁడును అగు శివునకు నమస్కారము.

యజుస్సు 14.
నమో బిల్మినేచకవచినేచ.
బిలము ఉపమానముగా కలదియును, యుద్ధమున శిరో రక్షకమునగు కిరీటము కలవాఁడును, శరీర రక్షకమైన కవచము కలవాఁడును అగు శివునకు నమస్కారము.

యజుస్సు 15.
నమశ్శ్రుతాయచ శ్రుత సేనాయచ.
వేద ప్రసిద్ధుఁడైనట్టియు, శత్రు నిగ్రహమందు ప్రసిద్ధమైన సేన కలవాఁడునగు శివునకు నమస్కారము.

అనువాకము 6 సమాప్తము.