మంత్ర బలం -గాయత్రీ మంత్ర జపం చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి?

గాయత్రీ మంత్ర జపం చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటిదానికంత ప్రాముఖ్యత మన వాళ్ళు ఎందుకిచ్చారుఅంటూ ఇటీవల ఒక దూరపు బంధువు నన్ను సందేహ పూర్వకంగా ప్రశ్నించాడు.నేను కొంచెం ఆశ్చర్యపడిన మాట వాస్తవమే! అయినా ఉండబట్టలేక నేనన్నాను. అదీ నిజమేలెండి! ముక్కు మూసుకొని ఒక అర గంట కాలం గాయత్రీ మంత్రాన్ని మననం చేసినంత మాత్రం చేతనే ఫలితం దక్కుతుందా!అని.అయితే నాకు ఫలితమేదీ ఎప్పుడూ కనబడలేదే! ఇది ఆయన మరో అనుమానం.
                                           
ద్విజులకు బ్రహ్మోపదేశం ద్వారా లభించే ప్రధాన విద్య ఇది అవడం చేత,దీన్నిఎంతో విపులంగా,గొప్పగా చెప్పడం జరిగింది.
              "న గాయత్ర్యా:పరంమంత్రం,న మాతు:పర దైవతం"
అన్నగొప్ప విశేష గౌరవాన్ని దక్కించుకున్న మంత్రమిది. మరి ఇంత గొప్పదనాన్ని సంతరించుకోవడంలో ఇందులోని అంతరార్ధమేమై ఉంటుందిఈ ప్రశ్నకు సమాధానాలు "దేవీ భాగవతం" విపులంగా కూలంకషంగా జవాబిస్తుంది.

రాజైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి ఈ మంత్రమే ముఖ్య కారణం. మానవుణ్ణి రజస్తమో గుణాలనుండి విడదీసేది సత్వ గుణాభిముఖుణ్ణి చేసేది ఈ లక్షణాలు ఈ మంత్రంలో ఉన్నాయి. అయితే ఎవరైతే గాయత్రీ మంత్రాన్నిబహు నిష్ఠతో నియమంతో త్రికరణ శుద్ధితో  జపిస్తాడో! వానిని వాని బుద్ధిని ఆ దేవత ఎల్లవేళలా నడుపుతూనే  ఉంటుంది. ఇందులో ఏ మాత్రం సందేహంలేదనే చెప్పాలి. ఈ మంత్ర సిద్ధిని పొందిన మానవునకు ఆ దేవతా సాక్షాత్కారం కలిగి, సర్వమూ తెలుసుకొన గలిగిన స్థితి అతనికి కలగక పోవచ్చును. ఎవడైతే ఈ మంత్ర జపాన్నిచేస్తాడో! నిత్యం చేస్తూనే.....ఉంటాడో! వాడికి ఆ అమ్మ అనుగ్రహాన్నిఎల్లవేళాలా అందిస్తూనే ఉంటుంది.మనం ఏ విధంగా చక్కగా ఆలోచించి ,ఆ ఆలోచనలకు తగిన రీతిలో మంచి మంచి పనులు ఏవైతే  ఆచరిస్తామో! ఆ...ఆలోచనలన్నీఆ అమ్మ ప్రేరేపించినవి కాదంటారా? ఆ...ఆలోచనల ద్వారా లభించిన లాభమంతా ఆ అమ్మదయ కాదని మనం అనగలమాసాధకుని నిరంతరం "దినదిన గండం నూరేళ్ళ ఆయువు" అనేలా గడిచే ప్రతి రోజూ, మన  ఆపదలనుండి, విముక్తులను చేస్తూశుభాలందించేది ఆమెయే కదా!కాదనగలమా?
                           
గాయత్రి సౌర విద్య. సవిత యొక్క వరేణ్యమైనటువంటి  భర్గమునుసాధకుడు ప్రతి రోజూనియమంగా ధ్యానిస్తాడు.సామాన్యంగా మనలో స్మార్తులు ఈ మంత్రాధిస్ఠాన దేవతను ముక్తావిదృమహేమనీల, ధవళచ్చాయ ముఖములు కల్గినట్టి ఒకానొక  స్త్రీ మూర్తిగా భావించి జపిస్తారు. అదే వైష్ణవులు ఈ మంత్రాధిస్ఠాన దేవతను  సూర్య మండలాంతర్గతుడైన ఆ శ్రీమన్నారాయణునిగా ధ్యానిస్తూ ఉంటారు. అందుకే
                   ధ్యేయస్సదాస్సవితృ మండల మధ్యవర్తీ,
                   నారాయణస్సరసిజాసన సన్నివిష్ట:
                   కేయూరవాన్,మకర కుండలవాన్,కిరీటి
                   హిరణ్మయ వపుర్ధృత శంఖచక్ర:
ఈ విధంగా ఆ సూర్య మందలాంతర్గత శక్తిని కొందరు స్త్రీగామరి  కొందరు పురుషునిగా భావిస్తున్నారు. మరి ఇలాంటి గాయత్రీ మంత్రాన్ని ధారావాహికంగా జపించే సాధకుని దేహం నుండిసప్త వర్ణోద్భాసితమైన కాంతి పుంజం గోపురాకారంగా ఆ సూర్య మండలం వైపు ప్రయాణం చేయడం తాను చూశానని "వెడ్ బీటర్"అనే దివ్యజ్ఞాన సమాజీయుడు వ్రాశాడు.అది సత్యం కాదాఅది మనం నమ్మలేమాసూర్య కిరణాలు సప్త వర్ణ కిర్మీరితములేగా! అందుకే సప్తాశ్వ రధమారూఢుడు ఆ సూర్యుడని మన వాజ్మయం చెపుతోది.

       ఏతావతా తేలిందేమిటంటే ఏ దేవతా మంత్రాన్ని పఠించినా ఆ మంత్ర శబ్దం సాధకుని మనస్సులో అదృశ్య విద్యుత్తరంగాల రూపంలో ప్రవహిస్తుంది. ఇది సాధనా రహస్యం దీనిపై ఏ విధమైన సందేహాలూ అవసరం లేదని చివరికి ఆయన్ని సర్ది చెప్పాటప్పటికి నా తల ప్రాణం తోకకు వచ్చిందంటే నమ్మండి! మరి అలాంటి ఆ గాయత్రీ మంత్రాన్ని పున:పున:పునశ్చరణ చేస్తూఅమ్మ కృపకు ప్రతి ఒక్కరూ పాతృలు కావాలని నా ఆకాంక్ష. అప్పుడు ఆ...అమ్మ దయ దానంతట అదే సంప్రాప్తమవుతుంది. మంత్ర బలం మన మనంలోనే ఉంది. ధ్యానం పరధ్యానమైతే మంత్రం  బలహీన మవుతుంది కదా!