గ్యా ప్...కా ...శ క్తి...( జ్ఞాపక శక్తి )

Natural Remedies That Boost Memory Power | Nutriclue  www.hawaiiislandrecovery.com
ఉత్తరాయణం ,వైశాఖమాసం ఉపనయనాలు చేయడానికి అనువైన శుభప్రదమైన మాసంగా పెద్దలు చెపుతారు.మానవుడు తాను నిజ జీవితంలో విధిగా ఆచరించవలసిన 16 సంస్కారాలలో ,అతి ముఖ్యమైన కర్మ"కుమారుని ఉపనయన సంస్కారం". ఇది ఆ కుమారుడు తల్లి కడుపులో ఉన్న నెలలు కూడా లెక్కగట్టి సరిగ్గా 8 వ సంవత్సరం లోగా మేధా జనన సిద్ధికోసం దాన్ని పూర్తి చెయ్యాలని శాస్త్రం చెపుతోంది. నేడు పెళ్ళికి ముందో పెళ్ళి వయసు వచ్చాకనో ! ఎంతో ఆర్భాటంగానే ఏదో అయిందని పిస్తున్నరు దానికి కూడా పెళ్ళికి ఎంత హడావిడి  చేస్తామో , అంత హడావిడి చేస్తున్నాం  డబ్బు కూడా తెగ ఖర్చు చేస్తున్నాం. కానీ అసలు ఎందుకు చేస్తున్నామో అనే విషయం గాలికి వదిలేసి , మిగిలిన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం.
                          
                   కుమారునికి గర్భాష్టమంలో ఉపనయనం చేస్తే మేధా జనన సిద్ధి వల్లనూ ఆ గాయత్రీ మాత అనుగ్రహం వల్లనూ అఖండ విద్యలూ సిద్ధిస్తాయి. "ఇవేమీ !అక్కర లేకుండా ,ఇవేవీ ఆచరించ కుండానే అవన్నీ నేడు సిద్ధిస్తున్నాయి కదా !" అనే వితండ వాదుల సంస్కారానికి, ఒక నమస్కారం. బ్రహ్మోపదేశం  చేసే తండ్రి గురువు కదా ! తానూ ప్రతి రోజూ గాయత్రని ఉపాసించాలి . ముఖ్యంగా ఉపనయన సంస్కారానికి   ముందు తాను  సహస్ర గాయత్రి చేసి అందుకు తగిన అర్హత కలిగి ఉండాలి. అప్పుడే ఆ మంత్రం తీసుకున్న వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకూ , వంట పడుతుంది. 

ఈ విషయం మీద నాకు స్ఫురించిన  ఒక చక్కని  హాస్య ఊపాఖ్యానాన్ని వినోదానికై  వివరిస్తాను.                 
                 ఒకానొక గృహస్తు , తన కుమారునికి ఉపనయనం చేయాలని నిర్ణయించుకున్నాడు .అనుకున్న రోజు , రానే వచ్చింది.ఇల్లంతా బంధువులతో , కళ కళలాడుతోంది.మామిడి మండలు అందంగా తోరణాలు కట్టారు.వాకిట్లో పందిళ్ళు వేశారు.పందిరి గుంజలకి అరటి కాయలతో ఉన్న,అరటి గెలలు అందంగా కట్టారు.నడిమి హాల్లో , బరకాలు పరిచారు.ఒక వైపు ఆడంగులు ,మరో వైపు మగంగులు ఆసీను లయ్యారు. పసుపు రాసి కుంకుమ పట్టీలు పెట్టిన ,కళ్యాణ పీఠం (పెండ్లి పీట )మధ్యలో వేశారు .పీఠం మీద దృఢ కాయంతో మన యువక రత్నం "వటువు "గా ఆసీనుడయ్యాడు.

           
           ఎదురుగా చక్కని వేద పండితుడు పురోహితునిగా ,శాస్త్రోక్తంగా  తంతు నడుపుతున్నాడు. వటువు చేత హోమాలు చేయిస్తున్నాడు.ముహూర్తపు వేళ ఆసన్నమయింది .సుముహూర్తం వేళకి , వటువు నెత్తిన జీలకర్ర ,బెల్లం పెట్టించాడు .పురోహితుడు  గాయత్రీ మంత్రోపదేశం చేయించడానికి ఉపక్రమించాడు .ఒక వైపున తండ్రి, మరో వైపున పురోహితుడు కూర్చున్నారు.ముగ్గురి మీదా ఒక పంచెల చాపు ముసుగేశారు.ఆ ముసుగులో వటువుచేత పురోహితుడు గాయత్రీ మంత్రం ఒక్కొక్క పాదమే ,చెప్పిస్తున్నాడు .అప్పుడు వటువు తండ్రి పురోహితునితో ఇలా అన్నాడు !"అయ్యా ! పంతులు గారూ ! ఈ మంత్రమెక్కడొ ?యెప్పుడో  ? నేను కూడా !విన్నట్టుందే ! "అన్నాడు .ఆ మాటలు విని పురోహితుడు నవ్వుతూ ,"ఆహా !ఏమాశ్చర్యం !నీ జ్ఞాపక శక్తి ! పరమాద్భుతం!ఎప్పుడో పాతికేళ్ళ నాడు !నీ ఉపనయనం చేసేటప్పుడు ,పురోహిత స్థానంలో ఉన్న, మా తండ్రి గారు నీచేత ,పలికించిన ఈ గాయత్రీ మంత్రం ! ఇంకా నీకు ఎక్కడో ! విన్నట్లు ! గుర్తుందంటే ! నీ "గ్యాప్...కా ..శక్తీ ! అదేనయ్యా బాబూ ! జ్ఞాపక శక్తి !నిజంగా ! అమోఘం ! సుమా !" అని ఎద్దేవా చేశాడు.కానీ అతను మాత్రం ,భావ గాంభీర్యం ఉట్టిపడేలా ! ముఖం పెట్టి , ఆ పురోహితుడితో  ,"మీరే కాదు లెండి ! నా చెవిని ఏదైనా ఒక మాట పడ్డదంటే ! జన్మలో మర్చిపోనని " , నన్నెరుగున్న  వాళ్ళంతా  యెప్పుడూ ! అంటూనే ఉంటారు "అని తన గొప్ప ప్రయోజకత్వాన్ని , వెళ్ళబెట్టుకున్నాడు .అంటే ఆ మంత్రం అప్పటి నుంచి ,ఇప్పటికి  మరలా  గుర్తుకు వచ్చిందన్న మాట !ఇలా తయారయ్యాయి ! మన సాంప్రదాయాలు.