చిత్రగుప్తుని దేవాలయం
మనుషులు తెల్లవారి లేచిన
దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు,
కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ
ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి
చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది.
కలియుగంలో అతని పేరిట గుళ్లు గోపురాలు కూడా ఉన్నాయి. మన రాజధాని నగరంలోనూ
చిత్రగుప్తుడికో ఆలయం ఉంది. అసలు చిత్రగుప్తుడు ఎవరో, ఆయన మన పాప పుణ్యాల చిట్టా రాయడం ఏమిటో తెలుసుకుందాం...
యమధర్మరాజు ఆస్థానంలో
చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. కానీ
వీటిని వేళ్ల మీద లెక్కించొచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు
ఎక్కువగా ఉన్నారు భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం
చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు
రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది.స్వయంగా రాముడే ఇక్కడ పూజలు
చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్
రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్
రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్ పూర్ లోని
ఫూటాతాల్, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో
, ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు
రెండు శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర
గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం
ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.
ఉత్తర భారత దేశంలో అరుదుగా
ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన
దేవాలయం హైద్రాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు
చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి
గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి. దేవాలయం ముందు నుంచి
తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత
వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు
వెళాల్సి ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న
వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు
కందికల్ గేట్ రైల్వే ట్రాక్ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో.
బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు
మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.
దీపావళి రెండో రోజు
యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం
కొనసాగుతుంది.దీన్నే భాయ్ దూజ్ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం
అని దేవాలయ పూజారీ రంచాచార్యులు చెప్పారు.అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. అకాల మృత్యువును
జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక వాటికి
పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. కేతు గ్రహ దోష
నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని మరో పూజారీ చంద్రకాంత్ జోషి
తెలిపారు. ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య కూడా అంతంత మాత్రమే.ఇంతటి విశిష్టమైన
దేవాలయం అభివృద్ది కాకపోవడానికి వాస్తు దోషమేనంటారు ప్రముఖ వాస్తు నిపుణులు జాలిగామ
నరేష్ కుమార్. తూర్పు ఆగ్నేయం పెరగడం,తూర్పు భారం,ఈశాన్యం బరువు, దక్షిణ నైరుతి గేటు
తెరవడం వల్ల దేవాలయం ఖ్యాతి చెందడం లేదని ఆయన అన్నారు.
మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో
దాదాపు 250 ఏళ్ల క్రితం ఇక్కడ చిత్రగుప్త దేవాలయాన్ని నిర్మించారు.
నిజాం నవాబుల కాలంలో రాజా కిషన్ పర్షాద్ దీన్ని అభివృద్ది చేశారు.కాయస్త్
సామాజిక వర్గానికి చెందిన రాజా కిషన్ పర్షాద్ రెండు సార్లు హైద్రాబాద్
సంస్థానానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. కిషన్ పర్షాద్ పూర్వికులు ఈ దేవాలయ
అంకురార్పణకు కృషి చేసినట్టు వినికిడి. కిషన్ పర్షాద్ ముగ్గురు హిందువులను,
నలుగురు ముస్లింలను పెళ్లి చేసుకున్నారు. హిందూ
భార్యలకు పుట్టిన సంతానాన్ని హిందువులతో, ముస్లిం భార్యలకు
పుట్టిన సంతానాన్ని ముస్లింలతో వివాహం జరిపించారు. వారి సంతానం అపుడపుడు ఈ
దేవాలయానికి వస్తుంటారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వాస్తవానికి ఈ దేవాలయ
నిర్మాత ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. ఉత్తర ప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చిన కాయస్తులు దీన్ని నిర్మించారన్న
ప్రచారం కూడా ఉంది. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయ భూమి రోజు రోజుకి
అన్యాక్రాంతమౌతుంది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సత్రాలు కూడా కబ్జాకు గురయ్యాయి. ఈ
సత్రాల్లోనే ఎన్నో కుటుంబాలు కాపురాలు చేస్తున్నాయి. సాధారణంగా సత్రాలలో దూర
ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూడు నాలుగు రోజులకు మించి ఉండకూడదు. కానీ ఇక్కడ
మాత్రం మూడు నాలుగు తరాల నుంచి తిష్ట వేసిన భక్తులు ఉన్నారు. సత్రాలలో ఉన్న భక్తుల
గూర్చి వాకబు చేయడానికి వెళ్లగా అక్కడ ఓ వృద్ద మహిళ కనిపించింది. ఃఃఇది మా
అత్తగారిల్లు.నా పెళ్లయిన నాటి నుంచి నేటి వరకు ఇదే ఇంట్లో ఉంటున్నాముఃః అని ఎంతో
నిర్బయంగా చెప్పింది. 80 వ దశకంలో కోర్టు ఇచ్చిన
తీర్పు ప్రకారం కబ్జాదారులు ఈ భూమి విడిచి వెళ్లాలి కానీ ప్రభుత్వం వారిని ఇంతవరకు
ఖాళీ చేయించలేక పోయింది. గేదెల పాక ఇదే స్థలంలో ఉండడంతో భక్తులకు కొంత అసౌకర్యం
కలుగుతుంది.
దేవాలయ మెయింటెనెన్స్ కోసం
ప్రయివేటు పాఠశాలకు కొంత స్థలం ఇచ్చారు. తెలుగు, ఇంగ్లీషు మీడియం ఉన్న ఈ పాఠశాల నెలకు ఎంత ఆర్జిస్తుంది.
దేవాలయ నిర్వహణ కోసం ఎంత ఇస్తుంది అన్నది శేష ప్రశ్నే. చిత్ర గుప్త దేవాలయం కాల
క్రమంలో నాలుగుళ్ల దేవాలయంగా మారింది. ఇక్కడే శివాలయం, సాయిబాబా ఆలయం, హనుమంతుడి ఆలయం,
అయ్యప్ప ఆలయం ఇలా నాలుగు ఆలయాలు చిత్రగుప్త
దేవాలయంలో కొనసాగుతున్నాయి కాబట్టి నాలుగుళ్ల దేవాలయంగా ఇటీవలి కాలంలో ఖ్యాతి
పొందింది. ఈ నాలుగు గుళ్లకు కలిపి ఇద్దరు పూజలు ఉన్నారు. ప్రస్తుతం చిత్రగుప్త
దేవాలయం గుడుంబా వ్యాపారులకు అడ్డాగా మారింది. కూలీ నాలీ పనిచేసే కార్మికులు
ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండడంతో ఈ వ్యాపారం మూడుపూవులు ఆరుకాయలుగా
వర్దిల్లుతుంది.దీంతో మహిళా భక్తులు దేవాలయానికి రావడానికి జంకుతున్నారు. దేవాలయ
అభివృద్ది కోసం ఏర్పాటైన ట్రస్ట్ బోర్డ్ కార్యకలాపాలు కూడా సందేహా స్పదంగా
ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన ఎండోమెంట్ కమిటీకి సుదర్శన్ రెడ్డి చైర్మెన్
ఉన్నారు. ఈయన నేతృత్వంలోని కమిటీకి, స్థానిక కమిటీకి
విభేదాలు ఉండడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని స్థాని కులు ఆరోపిస్తున్నారు.
హుండీ ఆదాయాన్ని పంచుకోవడంలో అనేక సార్లు గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. సరైన
పర్యవేక్షణ లేదు. పంచలోహ విగ్రహం కొన్నేళ్ల క్రితం చోరీ అయ్యింది. చిత్రగుప్తుడు
తన ఇద్దరు భార్యలతో కల్సి ఉన్న రాతి విగ్రహం ప్రస్తుతం ఇక్కడ కొలువుతీరింది.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే చారిత్రాత్మక ఈ దేవాలయం ఆనవాళ్లు చెరిగి పోయే
ప్రమాదం ఉంది.
నిజాం నవాబుల హాయంలో
నిర్మించిన చిత్రగుప్త దేవాలయం ప్రహారి గోడలు మట్టితో నిర్మించినవే. ఎంతో మందంగా
నిర్మించిన తూర్పువైపు గోడ వచ్చే తరాలు ఇక చూడక పోవచ్చు.ఈ గోడకే ప్రధానద్వారం
ఉంది. కందికల్ గేట్ వద్ద ఉన్న రైల్వే లెవల్ క్రాస్ వద్ద నిర్మిస్తున్న రోడ్
ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబి) డిజైన్‌లో భాగంగా ప్రహారి గోడను కూల్చే ప్రక్రియ
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించడానికి 27 కోట్లతో ఈ ఓవర్ బ్రిడ్జి ని నిర్మిస్తున్నారు. మాస్టర్
ప్లాన్‌లో ఈ గోడ ఉన్నప్పటికీ అక్రమణదారులు అడ్డుకోవడంతో వాయిదా పడుతూ వస్తుంది.
ప్రహారి గోడకు ఆనుకుని ఉన్న ఇళ్లు, దుకాణాలకు నష్టపరిహారం
క్రింద ప్రభుత్వం ఇప్పటికే చెక్కులను పంపిణీ చేసింది.వారంతా ఖాళీ చేయడంతో జిహెచ్‌ఎంసి
వీలయినంత త్వరలో చిత్రగుప్త గోడను కూల్చడానికి సిద్దమౌతుంది. పొడవైన ఈ
ప్రహారిగోడను కూలిస్తే చిత్రగుప్త దేవాలయం తన పూర్వవైభవాన్ని కోల్పోయే అవకాశం
ఉంది.
బ్రహ్మపుత్రుడు చిత్రగుప్త
సృష్టి కర్త బ్రహ్మకు ఎందరో
పుత్రులు, పుత్రికలు ఉన్నట్టు పౌరాణిక
కథలు చెబుతున్నాయి. అతని మానసపుత్రులు వశిష్ట, నారద, ఆత్రిలతో పాటు మాయా,
కామం, యమ ధర్మ, భరత ఇలా ఎందరికో జన్మనిచ్చిన బ్రహ్మకు చిత్రగుప్తుడు సైతం
సంతానమే. కానీ మిగతా సంతానంతో చిత్రగుప్తుడు వైవిధ్యమనే చెప్పాలి. బ్రహ్మకు
పుట్టిన పిల్లలకు చిత్రగుప్తుడికి చాలా తేడా ఉంది. బ్రహ్మ శరీరంలో నేరుగా పుట్టిన
బిడ్డ చిత్రగుప్తుడు. గరుడ పురాణంలో లిఖితపూర్వ కంగా ఆయన ప్రస్తావన ఉంది. పుట్టిన
ప్రాణి గిట్టక మానదు. ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికీ మరణం తప్పదు. ఎందుకంటే
విధి విధానం అది. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మృత్యు ఒడిలో ఎప్పుడయినా సేదతీరాల్సిందే.
మరణించిన తర్వాత ఏమవుతుంది ఇది ఎప్పటికీ రహస్యమే. ఈ రహస్యాన్ని కూడా చేధించడం
ఇంతవరకు సాధ్యం కాలేదు. కానీ వేదాలు,పురాణాల్లో మాత్రం
ఈ భూలోకం మీద దివ్య లోకం ఉంటుంది. అక్కడ మృత్యుశోకమే ఉండదు.ఆ దివ్య లోకంలో దేవతలు
నివాసముంటారు. ఆ దివ్యలోకం పైన బ్రహ్మ, విష్ణు, శివ లోకాలు ఉంటాయి. ఎప్పుడయితే కర్మఫలానుసారం పాప కార్యాల
వల్ల దోషులవుతారో వారు యమలోకం వెళ్లాల్సి ఉంటుంది.
భూలోకంలో జీవులు చనిపోయిన
తర్వాత వాటి ఆత్మలు నరకానికో, స్వర్గానికో వెళతా యని
అంటుంటారు. నరక లోకానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న యమధర్మ తీవ్ర గందర గోళంలో
ఉండేవాడట. పాపాలు చేసి చనిపో యిన వారి ఆత్మలతో పాటు పుణ్యాలు చేసిన వారి ఆత్మలు
కూడా తన వద్ద వస్తూ ఉండ డంతో కొంత అనిశ్చిత పరిస్థితి ఎదుర్కొ న్నాడు. కొడుకు
ఎదుర్కొంటున్న సమస్య తండ్రి బ్రహ్మకు అర్థమైంది. బ్రహ్మ సృష్టించిన నాలుగు
వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, క్షూద్ర ఉన్నాయి.నోటి నుంచి
బ్రాహ్మణ, భుజాల నుంచి క్షత్రియ,
తొడల నుంచి వైశ్య, పాదాల నుంచి క్షూద్ర వర్ణాలు పుట్టాయట.
అయితే జీవుల పాప పుణ్యాలకు
సంబంధిం చిన వివరాలు సేకరించడానికి బ్రహ్మకు ప్రత్యేకమైన నెట్ వర్క్ లేదు.
ఇందుకు పరిష్కారం వెతికే క్రమంలో బ్రహ్మ 11వేల సంవత్సరాలు
ధాన్య ముద్రలోకి వెళ్లాడు. ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్లు తెరిచి చూసేసరికి
ఆజానుబాహుడు కనిపిస్తాడు. చేతిలో పుస్తకం ,పెన్ను, నడుం భాగంలో కత్తి కనిపిస్తుంది. అపుడు బ్రహ్మ పురుషా నీవు
ఎవరివి. ఎచటి నుండి వచ్చావు అని అడిగాడు. అపుడు ఆ పురుషుడు మీ చిత్ర్ (శరీరం)లో గుప్త్(రహస్యం)గా నివాస
మున్నాను. ఇపుడు నాకు నామకరణం చేయండి, నా కార్యకలాపాలు
ఏమిటో చెప్పండి అని ప్రాధేయపడతాడు. అపుడు బ్రహ్మజీ ఈ విధంగా అన్నారు. నీవు నా
శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త.అదే పేరుతో
వెలుగొందుతావు. అంతే కాదు జీవుల శరీరాల్లో తలదాచుకుని వారి మంచి చెడుల గూర్చి
తెలుసుకుని పాపాత్ములకు శిక్షలు పడే విధంగా కృషి చేయి అని ఆశీర్వదిస్తాడు బ్రహ్మ.
చిత్రగుప్తను సంస్కృతంలో కాయస్త్ అంటారు. కాయం అంటే శరీరం. అస్త్ అంటే అదృశ్యం
అని అర్థం.ప్రస్తుతం ఇదే పేరు ప్రాచుర్యంలో ఉంది.
యమపురికి దారి తెలియాలంటే
మనిషి చచ్చేవరకు బతకాల్సిందే. బతికున్నప్పుడు చేసిన మంచి,చెడులు, పాప,పుణ్యాల మీద స్వర్గమా నరకమా డిసైడ్ అవుతుంది. కాబట్టి
దుష్టులు,దుర్మార్గులకు మాత్రమే ఈ
అడ్రస్ తెలిసే అవకాశం ఉంటుంది. వారిని తీసుకెళ్లడానికి ఎటువంటి ఫ్లయిట్లు మన
వ్యవస్థలో లేవు. యమభటులే వారిని పద్దతి ప్రకారం ఎంత దూరం తీసుకెళ్లాలో అలా
తీసుకెళ్లి యమపురికి చేర్చుతారు. బహుభీతి గ్రామం దాటిన తర్వాత వచ్చేదే యమపురి.
దీనికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. దక్షిణాన ధర్మ ధ్వజుడు అనే ద్వార పాలకుడు కావలి
కాస్తుంటాడు. తమ వెంట తీసుకెళ్లిన ఈ జీవి చేసిన పాప పుణ్యాల గూర్చి యమభటులు ఆ
ద్వార పాలకుడికి సంక్షిప్తం గా సమాచారం అందిస్తారు. ఆ ద్వార పాలకుడు విన్నదంతా
చిత్రగుప్తుడికి వివరి స్తాడు. చిత్రగుప్తుడేమో యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ఇదే
విషయాన్ని చెబుతాడు. నిజానికి యమధర్మరాజు వద్ద వచ్చిన జీవుల పూర్తి బయోడేటా
ఉన్నప్పటికీ పరిపాలన పద్దతి ప్రకారం జరగాలన్న ఉద్దేశ్యంతో చిత్రగుప్తుడి ద్వారా
సమాచారం తెప్పించు కుంటాడు. చిత్రగుప్తుడు కూడా యమభటులు చెప్పిన విషయాన్ని ప్రాతి
పదికగా తీసుకోకుండా శ్రవణులు అనే యమలోకవాసులను అడిగి తెలుసు కుంటాడు. అంటే
గూఢచారులు ఆ కాలంలో నుంచే ఉన్నారన్నమాట. యమ లోకంలో శ్రవణులకు ప్రత్యేక స్థానం
ఉంది. ఈ శ్రవణులు బ్రహ్మదేవుడి కుమారులు. స్వర్గ, మత్స్య, పాతాళ లోకాల్లో వారు
సంచరిస్తుంటారు. కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోని ధ్వనిని వినే శక్తి, చూడగలిగే దృష్టి వీరికి ఉంది. అందుకే వారిని శ్రవణులుగా
పిలుస్తుంటారు. వీరి భార్యల పేర్లు కూడా శ్రవణులు. యమలోకానికి వచ్చే స్త్రీల
విషయాన్ని ఆరా తీస్తారు. వీరు కూడా చిత్రగుప్తుడికి జవాబుదారిగా ఉంటారు. ఇంత
పారదర్శకంగా జరుగుతున్న పరిపాలన వల్లే యమపురిలో తప్పు చేసిన ప్రతి వ్యక్తీ శిక్ష
నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది. పాపాత్ములందరికీ యమధర్మరాజు
ప్రత్యక్షమవుతాడు. కానీ అతి భయంకరంగా. యముడి చేతిలో దండం ఉంటుంది. దున్నపోతు మీద
కూర్చుని ఉంటాడు. తళ తళ లాడే ఆయుధాలు ఆయన చేతిలో ఉంటాయి. ఎర్రని గుంత కళ్లతో,
కోరలున్న ముఖంతో, పొడవైన ముక్కుతో కనిపిస్తాడు యమ ధర్మరాజు. ఇదే సమయంలో
చిత్రగుప్తుడు ఒక ప్రకటన చేస్తాడు. మీరు చేసిన పాపాల ఫలితంగానే మీరు ఇక్కడికి
వచ్చారు. ఇందులో యమధర్మ రాజుది ఎటువంటి లోపం లేదుఃః అని చెబుతాడు. యమధర్మరాజు ఏ
జీవిని డైరెక్ట్‌గా తీసుకెళ్లి పాపకూపానికి పంపించడు. ఒకటికి రెండు సార్లు చెక్
చేసుకున్నాకే పాపాత్ములకు శిక్ష విధిస్తాడు అని గరుడ పురాణం చెబుతోంది.
చిత్రగుప్తుడు హిందువు ల్లోని కాయస్త్ కులానికి చెందిన వాడిగా అందరూ
భావిస్తుంటారు. కాయస్తుల కుల దైవం కూడా చిత్రగుప్తుడే.
చిత్రగుప్తుడికి
ఇద్దరు భార్యలు
చిత్రగుప్తుడికి ఇద్దరు
భార్యలు.మొదటి భార్య సూర్యదక్షిణ నందిని. ఈమె బ్రాహ్మణ స్త్రీ, నలుగురు కొడుకులు.వారి పేర్లు భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను. నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు పక్షిణి,
మాలతీ, రంభ, నర్మదా.రెండో భార్య పేరు పార్వతీ శోభావతి. ఈమె క్షత్రియ
స్త్రీ, ఎనిమిదిమంది కొడుకులు
ఉన్నారు. వారి పేర్లు చారూ, సుచారు, చిత్రాఖ్య, మతిమాన్, హిమవన్, చిత్ర్‌చారు,అరుణ, జితేంద్రలు. కూతుళ్లు
ఎనిమిది మంది. వారి పేర్లు భద్రకాళిని, భుజ్ గాక్షి,
గడ్ కీ, పంకజాక్షి, కొకల్సూత్, సుఖ్ దేవి, కామ కాల్, సౌభాగ్యినిలు.
వేదాలలో కూడా చిత్రగుప్తుడి
గూర్చి ఉంది. యమధర్మరాజు మనుషులు చేసిన పాపాలు, పుణ్యాల గూర్చి తన వద్ద సమాచారం అస్పష్టంగా ఉందని బ్రహ్మతో
మొరపెట్టుకుం టాడు. అపుడు బ్రహ్మ చిత్రగుప్తుడిని సృష్టిస్తాడు. పద్మ పురాణంలో
చిత్రగుప్తుడు యమధర్మరాజు మనుషులు చేసిన మంచిచెడు విషయాల రికార్డు తయారు చేశాడు.
భవిష్యపురాణంలో చిత్రగుప్తుడి సంతానం కాయస్త్ పేరిట భూలోకాన పరిఢవిల్లుతుంది.
విజ్ఞాన తంత్ర కూడా అదే విషయాన్ని చెబుతుంది.
చిత్రగుప్తుడి పూజా
సామాగ్రి:
చిత్రగుప్తుడి పూజలో పెన్ను,
పేపరు, ఇంక్, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్కె, ఆవాలు, నువ్వులు,తమలపాకులు ఉంటాయి. న్యాయం,
శాంతి, అక్షరరాస్యత,
విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్ర
గుప్తుడి పూజా సామాగ్రిలో ఉంటాయి.
అకాలమృత్యువును జయించొచ్చు
వాన రాకడ ప్రాణం పోకడ
తెలియదంటారు పెద్దలు. వాన వచ్చే విషయాన్ని అయినా కొంతవరకు చెప్పవచ్చుగానీ ప్రాణం
పోకడ గూర్చి ఎవరూ చెప్పజాలరు. అకాల మృత్యువు వల్ల ఆ కుటుంబం దిక్కులేకుండా
పోతుంది. వారి మీద ఆధారపడ్డ వారంతా అనాథలవుతారు. పిల్లల చదువులు, పెళ్లిల్లు అర్దాంతరంగా ఆగిపోతాయి.
పుట్టినవారు గిట్టక మానరు
కానీ అకాల మృత్యువును జయించడం సాధ్యం కాదు. దీన్ని ఎదుర్కోవడానికి చిత్రగుప్తుడు
కొంతవరకు సహకరిస్తాడని భక్తుల నమ్మకం. ఎందుకంటే చిత్రగుప్తుడు యమ ఆస్థానంలో
అకౌంటెంట్ లేదా రికార్డ్ కీపర్. మనం చేసిన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తుడి
వద్ద ఉంటుంది.పాపాల చిట్టా పెరిగినప్పుడే యముడు తన లోకానికి తీసుకెళ్తాడన్న
ప్రచారం ఉండనే ఉంది.
కాయస్థుల కులదైవం:
కాయస్త్ కుటుంబాల్లో చిత్ర
గుప్తుడి ఆరాధన విశేషంగా జరుగుతుంది. కోటి కాగి తాల మీద ఓం అనే అక్షరాన్ని రాసే
సంప్రదాయం ఇప్ప టికీ కొనసాగుతోంది. "ఓం" అంటే బ్రహ్మ తాత్పర్యార్థం.
పురాణ, ఇతిహాసాల ప్రకారం సృష్టిలో
కోటి కోటి బ్రహ్మం డాలు ఉన్నాయి. వాటికి రచయిత బ్రహ్మ. పాలకుడు విష్ణు, నాశనకారి శంకరుడు. కానీ చిత్రగుప్తుడు మాత్రం ఒకడే. అతనే
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడికి మూలం. బ్రహ్మ యొక్క ఆత్మ అని కూడా
సంభోదిస్తుంటారు. వైదిక కాలం నుంచి కాయస్థులు ప్రతీ దేవీ దేవతలను కొలుస్తుంటారు.
ప్రతి మతాన్ని వాళ్లు విశ్వసిస్తుంటారు. ప్రతి ఒక్కరిలో
పరబ్రహ్మ(చిత్రగుప్తుడు)ఉంటాడు. అల్లా అయినా, జీసస్ అయినా వాళ్లు నమ్ముతారు. ఈ కారణం గానే కాయస్థులు
అన్యమతస్థులతో కూడా మంచి సంబం ధాలు కొనసాగిస్తుంటారు. చిత్రగుప్తుడి మొదటి భార్య
బ్రాహ్మణురాలు అయినప్పటికీ కాయస్థులు పెద్దగా మడీ ఆచారాలు పాటించరు. అంటరాని
కులాలు అయినా, ఇతర మతాలు అయినా వారిని
చేరదీస్తుంటారు. ఎవరినీ బహిష్కరించరు. ఆకారం లేని చిత్రగుప్తుడికి గుళ్లు గోపురాలు
లేవు. ఎలాంటి చిత్రపటాలు లేవు. ఎటువంటి విగ్రహాలు లేవు. ఎటువంటి పండుగలు, పబ్బాలు లేవు. ఎటువంటి చాలీసాలు లేవు. ఎటువంటి స్తోత్రాలు
లేవు. ఎటువంటి ఆరతిలు లేవు. పురాణ ఇతిహాసాలలో పెద్దగా ప్రస్తావన లేదు. కానీ
కలియుగంలో విగ్రహ పూజతో బాటు వివిధ రకాల పూజలు పెరగడంతో కాయస్థులు కూడా
చిత్రగుప్తుడి చిత్ర పటం లేదా విగ్రహాన్ని పూజించడం ప్రారంభించారు. దాదాపు 600 ఏళ్ళ నుంచి ఇటువంటి పూజలు జరుగుతున్నప్పటికీ కాయస్తుల
అస్థిత్వం మాత్రం వైదిక కాలం నుంచి ఉంది. బ్రహ్మ శరీరంలో పుట్టిన చిత్రగుప్తుడి
రూపం, వేషధారణ అంతా అశాస్త్రీయం,
కాల్పనికం. భ్రమలతో కూడిన కథల ఆధారంగా జయంతి
ఉత్సవాలను జరుపుతున్నారు. వాస్తవానికి చిత్రగుప్తుడు అనాది నుంచి ఉన్నాడు. అనంత
విశ్వంలో ఉన్నాడు. అతనికి జన్మలేదు, అతను అమరత్వం పొంది
ఉన్నాడు. చిత్రగుప్తుడి రూపం వేషం గూర్చి ఎటువంటి వర్ణనలు లేవు.
వ్రత కథ
పూర్వం ఒక రాజు ఉండేవాడు.
అతని పేరు సదాస్. ఈ రాజు పాపాలు చేసేవాడు. ఈ రాజు ఎవ్వరికీ పుణ్యకార్యం చేయలేదు.
ఒకసారి వేటకు వెళ్లిన సమయంలో అడవిలో తప్పిపోతాడు. అక్కడ ఓ బ్రాహ్మ ణుడు
కనిపిస్తాడు. అతను పూజ నిర్వహి స్తుంటాడు. రాజు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి ఓ
బ్రాహ్మణా నీవు ఎవరి పూజ చేసు ్తన్నావు ఇందుకు ఆ బ్రాహ్మణుడు సమా ధానమిస్తూ ఇవ్వాళ
కార్తిక శుక్ల ద్వితీయ (యమ ద్వితీయ). ఈ రోజు నేను యమ రాజు, చిత్రగుప్తుడి పూజ చేస్తున్నాను. ఈ పూజ చేయడం వల్ల నరకం
నుంచి విముక్తి పొందొచ్చు అపుడు ఆ రాజు పూజా విధానం తెలుసుకుని ఇంటికి వెళ్లి పూజ
చేస్తాడు. విధి ప్రకారం ఒక రోజు యమ దూత రాజు ప్రాణం తీసుకోవడానికి వస్తాడు. రాజు
ఆత్మను గొలుసులతో బంధించి తీసుకె ళ్తాడు. యమరాజు దర్బార్ కు వచ్చిని రాజును
యమధర్మరాజు ముందు ప్రవేశ పెడ్తారు. అపుడు చిత్ర గుప్తుడు తనదగ్గరున్న విధి
పుస్తకాన్ని తెరిచి చదువుతాడు. యమ ధర్మరాజా ఈ రాజు చాలా పాపాలు చేశాడు. కానీ ఇతను
కార్తిక శుక్ల ద్వితీయ తిథి రోజు వ్రతమాచరించాడు. అతని పాపాలు నివారమ య్యాయి.
ధర్మానుసారం ఈ రాజుకు విముక్తి ప్రసాదించాలి అని ప్రాధేయపడ తాడు చిత్రగుప్తుడు.
దీంతో ఆ రాజు నరక లోకం నుంచి విముక్తి పొందుతాడు. ప్రస్తుతం ఈ కథ ప్రాశస్త్యంలో
ఉంది.