ఆత్మ - శరీరం

Photo

“మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే! అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.

జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతుడనీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.

సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.

ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది. తన కర్మకు తాను నిర్వరిస్తూ పోతుంది. తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.

భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది లేనివాడు.అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. కానీ ఇందులో ఏ ఒక్కటీ భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు.

కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేదు. అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడిని చూడగలరు.

భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు.

ఇక జీవుని గురించి వివరిస్తాను. ఈ శరీరంలో 20 కోట్లకు పైన రోమ రంధ్రములున్నాయి. 70 ఎముకలు, మాంసముతో నిర్మితమయినదే ఈ స్థూల దేహము. ఇది సుఖకరమైన అనుభవాలను అందిస్తున్నట్టు భ్రాంతి కలిగించే దుఃఖస్వరూపం. సామాన్య మానవులే కాదు, యోగులు, ఋషులు కూడా వాంఛల ద్వారా మాత్రమే జీవించే ఈ శరీరం పట్ల, సుఖముల పట్ల, కోర్కెల పట్ల అనుబంధము పెంచుకుని ఎన్నో కష్టాలు పొందారు.

ఆత్మవేరు, శరీరం గుర్తించే నేను వేరు. అనేక కోరికల ఫలితంగా రూపుదిద్దుకునేదే నేను. ఆత్మకు ఈ వాంఛలు వర్తించవు.కేవలం నిమిత్త మాత్రముగా ప్రవర్తిస్తూ, జీవుని నడిపిస్తుంటుంది. దానికి ఇరువది అయిదు తత్త్వాలు, దశ నాడులు, సప్త ధాతువులచే నిర్మితమైన ఈ శరీరంలో ఏడు పుష్పములున్నాయి.

వీనిలో మొట్టమొదటిది మూలాధారం. గుద స్థానము నందు వుండే మూలధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత.

రెండవది స్వాథిష్టాన చక్రము. ఆధార చక్రమునకు రెండు అంగుళములపై నాలుగు రేకులు కలిగి,మూడు కోణములతో తెల్లని రంగుతో, ప్రకాశవంతంగా, నిర్మలంగా వుంటుంది. ఇది జల తత్త్వాన్ని కలిగి వుంటుంది. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత.

మూడవది మణిపూరకము. స్వాధిష్ఠాన చక్రమునకు పైన ఒక మణివలె ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పది రేకులతో వుంటుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత.

అనాహత చక్రము హృదయ స్థానములో పన్నెండు రేకులతో వుంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూంటుంది .ఇది వాయు స్వభావం కలిగి వుంటుందని యోగుల భావన. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత.

విశుద్ధ అనేది ఐదవ చక్రము. అనాహిత చక్రమునకు పైన, కంఠములో వుంటుంది. పదహారు దళములుంటాయి.

ఆజ్ఞా చక్రము ఆరవది. విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములపైన భ్రూ మధ్య స్థానంలో (త్రికూట స్థానము) ఉంటుంది. రెండు రేకులు కలిగి వుంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది. దీనికి ఈశ్వరుడు అధిష్టాన దేవత.

సహస్రాకారము అనునది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలో, బ్రహ్మరంథ్రము వద్ద వుంటుంది. ఎనిమిది దళాలుంటాయి. వేయి రేకులు కలిగి వుంటుంది.


ప్రాణ వాయువునకు కుడి ఎడమ వేపుల ఇడ పింగళులు అనే నాడులు వున్నాయి. ఇడ పింగళులు సహస్రారము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి వుంటాయి. వీటిమధ్య సుషుమ్ననాడి వుంటుంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి వుంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవ శక్తి జీవుని చలనంతో వుంచుతుంది''