కాలం కాపాడుతుంది

Photo
కాలం, దేశం, క్రియ, కర్త, ఉపకరణ, ద్రవ్యం, ఫలం - ఇవన్నీ నారాయణుడే!’ 
అని భాగవత వాక్యం. అన్నీ నారాయణుడే అయినప్పుడు, ఒకదానికొకటి ప్రతికూలం కావు. పరస్పరం సహకరిస్తూ, సమకూరి పరిపూర్ణమవుతాయి. అందుకే పై ఏడింటినీ భగవత్స్వరూపంగా పవిత్రంగా భావించడమే సాఫల్యం. 

’అన్నీ భగవంతుడే’ అనే భావనను బలపరచుకోవాలి. అప్పుడు తప్పుచేసే లక్షణం తరిగిపోతుంది. ఆ సద్భావన మనలో శక్తిని పెంచుతుంది. ప్రయత్నాలకు సార్థకతను ప్రసాదిస్తుంది.
అందుకే కాలాన్ని ఈశ్వర రూపంగా భావిస్తూ ఈకాలం మనకు అనుకూలం కావాలని ఆకాంక్షిస్తూ నూతన వత్సరాన్ని ఆహ్వానించడం మంగళకరం. పైన చెప్పిన ఏడింటిలో మొదటిది కాలం. దాన్ని ఆధారం చేసుకుని మిగిలిన ఆరూ ఫలవంతమవుతాయి. భగవంతుడు కాలస్వరూపుడై, మిగిలిన తన ఆరు రూపాలను అనుగ్రహిస్తాడు.

ఈ ఏడు రూపాల ఈశ్వరుడి కృప కావాలంటే -ధార్మికమైన అంతఃకరణ అవసరమని వేదవాజ్ఞ్మయం బోధిస్తోంది. ’ఎవరికి విమలమైన మనసు ఉంటుందో వారిని దేవతలు రక్షిస్తారు. 
నర్య, తుర్వీత, యదు, తుర్వశ - అనేవారిని ఇంద్రుడు రక్షించిన ఘట్టమే దీనికి ప్రమాం’ అని ఒక ధార్మిక శ్లోకం. దీనికి ఆధారం ఒక వేద కథ. ఒకప్పుడు నర్య, తుర్వీత, యదు, తుర్వశ - అనే నలుగురు రాజులు వేర్వేరు దేశాలను పాలిస్తున్నారు. వారందరూ ధార్మికులు. వారి పాలనలో రాజ్యమంతా సుభిక్షం, శాంతియుతం. వీరి నైతికత రాజ్యాలకు కవచమై, అన్ని విధాలా అభివృద్ధి సాధించాయి. వారు మిత్రులుగా పరస్పర సహకారంతో ఉన్నారు.

అన్ని రకాలా అభివృద్ధి చెందిన ఈ రాజ్యాలను ఆక్రమించాలనే తలంపుతో శంబరుడనే ఒక దుష్ట రాజు కొందరు దుష్టులను కూడగట్టుకొని యుద్ధానికి వచ్చాడు.
నలుగురు రాజులు అతణ్ణి శాంతి ఒప్పందానికి పిలిచి, ’జననష్ట ధన నష్టాలను వారించడానికై వెనుతిరిగి వెళ్ళవలసింది’గా కోరారు. ఆ రాజుల బలాన్ని చూసి శంబరుడు కాస్త జంకి, అయినా శాంతికాముకులై వారు శౌర్యాన్ని ప్రదర్శించకపోవడంతో కాస్త ధైర్యం చెందాడు.

తాను వెనుతిరుగుతాననీ, కానీ ఆ రాజులు తమ సైన్యాలను కూడా ’విఘటితం’ చేయాలనీ నిర్దేశించాడు. యుద్ధం కోరని ఆ ధార్మిక రాజులు సరేనని, తమ సైన్యాలను బాగా తగ్గించివేశారు.
మరి యుద్ధానికి రానని చెప్పి వెనుతిరిగిన శంబరుడు, కొద్దినాళ్ళలో తన సైన్య బలాన్ని పెంచుకొని, ఒప్పందానికి విరుద్ధంగా హఠాత్తుగా ఆదేశాలపై దాడి చేశాడు. నైతికంగా ఒప్పందానికి బద్ధులైన నర్యుడు, తుర్వీతుడు, యదువు, తుర్వశుడు ఈ ఆకస్మిక దాడికి అచ్చెరువొందారు. తమ సైన్యబలం తగ్గి ఉంది. ఉన్న బలంతోనే ఎదుర్కొన్నారు. వారి ధర్మబద్ధతకీ, ఇన్నాళ్ళ నైతిక ధార్మక జీవనానికీ సంతోషించిన దేవరాజు ఇంద్రుడు తన దేవతా సైన్యాన్ని సహాయకంగా పంపాడు. దేవ సైన్యబలంతో శంబరునీ, అతడి సైన్యాన్నీ ఈ నలుగురు రాజులూ ఓడించారు.

సహకరించిన ఇంద్రుడికి కృతజ్ఞతతో నమస్కరించారు ఆరాజులు. వారి ధర్మనిరతికి సంతోషించిన మహేంద్రుడు అభీష్ట వరాన్ని క్చెప్పమన్నాడు. ’దేవరాజా! నీ కారుణ్యానికి కృతజ్ఞులం. క్లిష్ట సమయంలో నీవు మమ్మల్ని ఆదుకున్నందుక కారణమేమిటి?’ అని ప్రశ్నించిన రాజులతో -
’మీనీతి నిబద్ధతలను గమనించి, నేను రక్షించాను’ అని చెప్పాడు ఇంద్రుడు. ’ఏ నీతినీ, ధర్మాన్నీ చూసి మమ్మల్ని రక్షించావో - ఆ ధార్మిక నైతిక బుద్ధి మాకు ఎల్లవేళలా ఉండేలా అనుగ్రహించు’ అని వరాన్ని కోరుకున్నారు ఆ రాజులు. -కథలో ప్రాచీన భారత ఋషి ఎన్నో అద్భుత సందేశాలనిచ్చాడు. నీతి ధర్మాలను వదలని నిర్మల చిత్తమే నిజమైన బలం. ఇది ఉంటే ఈశ్వరుడి బలం ఉన్నట్లే. ముల్లోకాల సంపదలను ఇవ్వగలిగిన ఇంద్రుడి ముందు, కేవలం ధర్మబుద్ధినే నిలపమని నర్యుడు మొదలైనవారు అడిగారు. అంటే - సంపదకంటే నీతి గొప్పది. ఆ బలం ముందు ధనబలం, జలబలాలు పనిచేయవని తాత్పర్యం.

ధర్మబలం ఉన్నచోట - అధికార కాంక్షులైన శత్రువులు ఎన్ని క్షుద్రవ్యూహాలు పన్నినా విఫలమవుతాయి - అని చాటుతోందీ కథ.
అవినీతి లేని నిర్మల బుద్ధికి - కాలంతో సహా దేశ, క్రియ, కర్త ఉపకరణ, ద్రవ్య ఫలాల రూపంలో ఉన్న భగవంతుడు అనుకూలిస్తాడు. సత్ఫలితాలనిస్తాడు. నూత్న సంవత్సర రూపంలో ఉన్న కాల విష్ణువు ఈ దేశానికి ధర్మబద్ధమైన నైతిక పాలనా తేజాన్ని ప్రసాదించాలని శుభాకాంక్షలు పలుకుతూ స్వాగతిద్దాం!

(ఈనాడు, అంతర్యామి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు)