బమ్మెర పోతనామాత్య ప్రణీతము - భోగినీ దండకము
* శ్రీ సర్వజ్ఞ
సింగరాజ వర్ణనము *
శ్రీమన్మహా
మంగళాకారు, నాకార
లక్ష్మీకుమారుం, గుమారీ మనోరాము,
రామాంబరీషాది రాజన్య
రాజద్యశః కాముఁ, గామాహిత
క్షీరవారాశి తారా శి వాగేంద్ర మందార కుందారవిందాహితాకాశకల్లోలినీ కాశ విఖ్యాత
సత్కీర్తి ముక్తావళీభూషి తాశాంగ నాలోకసీమంతు, సీమంతినీ మానసారామవాటీ వసంతున్, వసంతావనీనాధ సంసేవితాంచత్పదాంభోజు, నంభోజరాజీ సుహృత్తేజుఁ, దేజో జయ ప్రాభవోద్దాము, నుద్దామ జన్యావనీ భీము, భీమప్రతాపానలాభీలకీలా వినిర్మూలితారాతి
పాండ్యక్షమాపాల దుర్వార గర్వాటవీవారు, వారాధిపోరుప్రభా భాసురస్ఫార కల్యాణ దుర్వారు, వారాశివేలా పరీతావనీభార ధౌరేయరాజ న్మహాబాహు,
బాహాకఠోరాసిధారా
వినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్, సమూహా మహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్,
వల్లభా మానసాదుర్లభున్,
దుర్లభారిక్షమానాథ
మత్తేభయూథంబులం జించి చెండాడు రాసింగమున్, సింగభూపాలు, భూపాల గోపాల
గోపాలికా కృష్ణగోపాలు,
* వేశ్యాకన్య రాజుం
జూచి మోహించుట *
గోపాలదేవోత్సవ
క్రీడలో, మేడలోనుండి
జాలాంతరాళంబులన్ వారయోషాతనూజాత, విద్యావయోరూపసౌందర్య
చాతుర్యవిఖ్యాత, చంచద్గుణోపేత,
భృంగాంగనాలబ్ధకేళీ
మహాహస్త కంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషునీకాశయై యుండి తద్వైభవంబుల్ విమర్శించి,
హర్షించి, సంతోష బాష్పాంబుపూరంబు వర్షించి, కందర్ప బాణాహతిం జెంది, లోఁగుంది, మోహించి, సంగంబు నూహించి "యేవేళఁ దల్లిం బ్రమోషింతు,
నేలీల భూపాలకుం జేరి
భాషింతు, నేరీతిఁ
గామానలంబున్ నివారింతు, నే నాతితోడన్
విచారింతు, నేవెంట రాచూలి
వంచింతు, నేజంటఁ గోర్కుల్ ప్రపంచింతు, మున్నే ప్రశస్తారవిందంబనైనన్ మహీపాలు
హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబనై యుందుఁబో, రత్నహారంబునైనన్ శుభాకారు వక్షోవిహారంబుఁ
గైకొందుఁబో, యేల యిట్లైతి
నెట్లోకదే" యంచు శంకించుచున్, నిత్యకల్యాణు,
లీలావతీపంచబాణున్ మనోవీథి
నంకించుచున్, ఘోషమాణాలికిన్,
మందవాతూలికిన్, జంద్రమఃకీలికిన్, గోకిలారావాదంభోళికిన్, జిత్తభూభల్లికిన్, దల్లికిన్ లోఁగి, కామానలజ్వాలలన్ వేఁగి, చింతాభరాక్రాంతయై యేఁగి, సంతాపఘర్మాంబులం దోఁగి చింతించు నింతిం
బరీక్షించి,
* వారకన్య తల్లి
వచ్చి కూఁతు నవస్థఁ గనుఁగొనుట *
బుద్ధిన్
విచక్షించి, తన్మాత
మాయాపరాభూత జామాత, మిథ్యానయోపేత,
విజ్ఞాత నానావశీకార
మంత్రౌషధవ్రాత, లోకైకవిఖ్యాత,
వారాంగనాధర్మశిక్షాది
సంభూత, సమ్మోహితానేక
రాజన్యసంఘాత, వాచాలతాబద్ధ
నానామహాభూత యేతెంచి నీతిన్ విచారించి, బాలన్, మిళత్కుంతలవ్రాతఫాలన్,
గరాంభోజరాజత్కపోలన్,
సమందోష్ణనిశ్శ్వాసజాలన్,
విపర్యస్తసంవ్యానచేలన్,
మహాందోల, నప్రేంఖిత స్వర్ణడోలన్, మృగేంద్రావలగ్నన్, దయావృష్టిమగ్నన్, మనోజాగ్నిభగ్నన్, నిరంధన్, బరిత్రస్త ధమ్మిల్లబంధన్, సముద్విగ్న మోహానుబంధన్, నిరాలాప, నావర్జితాలేప, నస్వీకృతానేక కేయూరహారన్, గళద్బాష్పధారన్, బరిత్యక్తలాస్యన్, బరాభూత లీలావయస్యన్, బదాలేఖనా లక్షితక్షోణిభాగన్, బరిక్షీణరాగన్ విలోకించి, బుద్ధిన్ వివేకించి, లోనం బరాయత్తయై, చిత్తజాతాసిధారా చలచ్చిత్తయై, విన్నయై, ఖిన్నయై యున్న భావంబు భావించి, నెయ్యంబు గావించి, రావించి
* తల్లి కూఁతునకుఁ
గులవృత్తి ధర్మములను బోధించి రాజుపై వలపును వారింపఁ జూచుట *
"బాలా! జడత్వంబు
మేలా? వినోదింప వేలా?
విచారింప నేలా? విలోకింపు బేలా! వయోరూపసౌందర్యముల్ రిత్తగాఁ
జేయు నీవృత్తికిన్ మెత్తురే? వత్తురే కాముకుల్
డాయఁ, గాయంబు
విద్యున్నికాయోపమేయంబు హేయంబు ప్రాయంబు ధారాధరచ్ఛాయ, మెన్నే నుపాయంబులన్ విత్త మాయత్తముం జేయుమా,
రిత్తవారంబు నేరంబు గా దీ
విచారంబు వంశానుచారంబు, సంసారసారంబు, లాభాధికారంబు,
చర్చింప నీకు న్నలంకారమే
కాన ధిక్కారముం జేయరా దీ వికారంబు లేలే, శుభాకార యేలే, గుణోదార యేలే,
కులోద్ధార యేలే, తటిదేహ యేలే, వరారోహ యేలే, లలాటాలక వ్యూహ యేలే, మహోత్సాహ యేలే, విరాజన్ముఖాంభోజ యేలే, మహోరోజ యేలే,
కలాలాప యేలే, జగన్మోహనద్రూప యేలే, చలచ్చంచలాలోకనవ్రాత యేలే, నయోపేత యేలే, మహామర్మభేదంబులై, సుప్రసాదంబులై, కౌముదీమూలకందంబులై, మందమందంబులై, చూడ నందంబులై, మోహనశ్రీవిలాసంబులై యున్న నీ చారుహాసంబులన్
సోలి యేలిన్ భుజంగాలి బాళిం బడం దార్చుటో; కాక, లోలంబులై,
మోహజాలంబులై, కాము బాణంబులై, యప్రమాణంబులై, మీనశోభంబులై, చంచలాభంబులై, మోహితాశేషలోకంబులై యొప్పు లీలావలోకంబులం
గూర్చుటో; కాక, రాజత్త్రిలోకీ వశీకార మంత్రంబులై, యుల్లసత్కామ తంత్రంబులై, దర్పకోద్రేక యంత్రంబులై, మోహవారాశి భంగంబులై, సూచితానేక నర్మప్రసంగంబులై, కాము కేళీకలాపంబులై యొప్పు నీ
భాసమానానులాపంబులన్, విత్తవల్లోక
చిత్తంబులన్ రాగమత్తంబులం జేసి తత్తన్నిమిత్తంబులన్ నిత్యమున్ విత్త మెల్లం
బ్రమోషించి దూషించి, భర్జించి,
తర్జించుటో; కాక, తోరంబులై, మధ్యభారంబులై,
నిర్జితానంగ సౌధోపరి
స్వర్ణకుంభంబులై యొప్పు నీ విప్పు వక్షోజకుంభంబులం జూపి పౌరావళిన్ నర్మలీలా
కురంగావళిం జేసి నిర్జించి వర్జించుటో; కాక, నీ కీ
కులాచారముల్ మాన నే కీరసల్లాప బోధించెనో! నేడు నాతోడు నాతోడ నాతోడ మాటాడుమా,
చూడుమా, కన్యకాలోక చింతామణీ, గోత్రరక్షామణీ, ధీమణీ, యెవ్వ రెవ్వాని భూషించిరే, యేమి భాషించిరే,
నేఁడు నీతోడ భాషించు
ప్రోడల్ కుమారీ! కుమారాన్నపోతావనీనాథ సూనున్ వధూచిత్త విత్తాపహారావధానున్, సదాదాన విద్యానిరూఢున్, మనోజాత హృద్యానవద్యైక విద్యావలీఢున్, బ్రభాభాను, రాగానుసంధాను, మాయారమానాథు, సర్వజ్ఞ సింగ క్షమానాథు నీ సన్నిధానంబునం
జెప్పిరో, యేమి వాతప్పిరో,
యప్పరో, యప్పయోజాత గంధుల్ సుగంధుల్ పురిన్ నీ వయస్యల్
మహాసౌమనస్యల్ సువర్ణా! సువర్ణంబు లార్జించుటల్ చూడవా? చూడ వాంఛింతురా రాజులన్? వార లారాజులం గానరా? రాజుఁ గామింతురా? రాజబింబాననా! రాజరాజాధి రాజోన్నతిన్ రాజులన్
మించి రాజిల్లు నారాజు వంచింప నెంచంగ శోభిల్లునే, చెల్లునే, భూమి నీజాతి యేనాతి యీరీతిఁ బ్రీతిం బ్రకాశించి
రాజిల్లునే, చెల్లదే
నీపటుత్వంబు వాచా కటుత్వంబు, బాలేందు
శోభాలికా! బాలికల్ సేయు యత్నంబులే నీ ప్రయత్నంబు? లంభోజనాళాంతర స్ఫురత్తంతు యోగంబునం జిక్కునే
గంధనాగంబు? కంపించునే
మక్షికాపక్ష విక్షేప వాతాహతిం గాంచనాగంబు? మిథ్యామమత్వంబులన్ రంజకత్వంబులన్ గూఢయంత్రంబులన్ మోహమంత్రంబులన్
మారుతంత్రంబులన్ జిక్కఁడే, చొక్కఁడే,
దిక్కులం జిక్కులం బెట్టు
మేధన్ మహావేధనైనన్ విరోధించి వాకట్టు, నీతిన్ బలారాతిమంత్రిం బ్రమోషించు, భాషావిశేషంబులన్ శేషుతోనైన భాషించు, మాయావిధానంబులన్ మాధవున్ మెచ్చఁ, డచ్చోట నెప్పాట మెప్పించెదే? చీటికిన్
మాటికిన్ బోటి యా మేటి యిచ్చోటికిన్ రాఁడు పాటించి, నీపాటి పాఠీననేత్రల్ ధరిత్రీశు చిత్తంబు
మత్తంబుగాఁ జేయఁగాఁ జాలరే, యేల
రేలుంబగళ్లున్ విచారంబు? చాలింపవే,
వారవేశ్యాభుజంగుండు గాఁడే;
మహారాయ వేశ్యాభుజంగుండు
నిన్నేల యేలున్? పరస్త్రీలకున్
వేళ యీఁ డెన్నఁడున్, దత్తుఁ బాంచాలు
భద్రున్ మరుం గూచిమారున్ వినంవుం జీరవుం జేర వీరీతి నేనాతిచే వింటివే యింటి నీవంటి
దీవెంటలం దంటయై గెంటిపోఁ? దమ్మికంటీ,
నినుం గంట యీవెంటకా?
హా! కనుంగొంటి నీగొంటు
చెయ్దంబు, దైవంబు క్రేఁగంటి
కేనెంత కంటైతినో! జంట నింటింటికిన్ వెంటవెంటం బడన్ బంటనే? దాఁట నింటిన్, జెనంటీ! చిరంటీ గుణం బేటికే? మాయలాఁడే, విభుం డైనఁ బోఁడే, వినోదింప నీఁడే, నిమగ్నుండు గాఁడే, మముం జేరనీఁడే, నినుం జేరరాఁడే, ప్రవేశింపరాదే, ప్రమోషింపఁ గాదే, ప్రవర్తింతు వెచ్చోట నచ్చోటి కేమేఁ బ్రియం
బాడరామే, నినుం బాయలేమే,
మహోపాయవై కన్యకా! ధన్యు
నన్యున్ మదిం గోరుమా, చేరుమా, చేరుమా కిష్టముల్, వీట లేరే మగల్, చేరరారే నినుం గోరి తారే విహారేహులై
గేహళీవాటికిన్ మాటికిన్, వచ్చు నేవారి
నీవారిఁగాఁ జూడవున్ గూడవున్, వారిజామోద! యీవార
రామల్ మనోరాములన్ రిత్తపోరాములం గాని నిక్కంపుఁ బోరాములం జేసి గారాములం జిక్కిరే,
చొక్కిరే, వారు వారాదికృత్యంబులం జేయ వారక్రియల్ చెల్లవే,
తల్లి రాజుల్ బహువ్యాజులే,
భోజులే, చంచలచ్చిత్తులే, మత్తులే, ప్రేరకాయత్తులే, నూతనాసక్తులే, లోభసంయుక్తులే, దోషసంయుక్తులే, రంధ్రసంపాదులే, వీతమర్యాదులే, వారి సేవింపఁగా రాదులే, కాదులే, వాదు లేలా, నవైలాలతాదేహ! సందేహమే దేహమేలే నలంపన్, నిలింపాంగనాభా! సునాభా! మదిన్ మానవే
మానవేశాభిలాషంబులన్, నిన్ను లేమా!
భరింపంగలేమా? కరంగింప లే మా
నరేశున్, జితశ్రీసురేశున్,
గతిశ్రీజితోద్దండ వేదండ!
మాదండ నేదండముం జెందదే, రాచదండంబు గండంబు
పుండ్రేక్షుకోదండ విభ్రాజితభ్రూయుగా! భూమిపాలావరోధంబు లో సన్నిరోధంబు నీకున్
మహాభద్రమా? భద్రమాతంగకుంభస్తనీ!
కన్నవారంబుగామా, హితాదేశముల్
సేయఁగా మాకు ధర్మంబు, కామాశుగాలోకనా!
యేల కామాతురత్వంబునుం జెంద, రామా! భవత్సంగతిన్
మున్నుగామా, త్రిలోకాభిరామాంబరానేక
హేమాదులున్ నీకు నీమా, కులోత్తంస! నే
మాకులత్వంబునుం బొంద మా మాట లేపాట వేమాటు లాలింపువారిన్ నిరీక్షింప కీమానవాధీశుపై
మానసం బేల పట్టించెదే, ముద్దుపట్టీ,
భవచ్చాతురిం బట్టి
సర్వజ్ఞ సింగ క్షమానాథుఁ దప్పించి దర్పించి లోకత్రయిన్ నీకు నర్పింతునే, మారునిం జారుఁ గావించి రప్పింతునే, బ్రాఁతియే పైఁడి? నా పైఁడి! యేపైఁడి లేదింటిలో? వింటివా, రాచపోరామి యిట్టట్టుఁ బోరామికిన్ మూలమే,
మేలమే? యిందునవ్యారవిందాననా! ముందు విన్దాననే లాట
కర్ణాట పాంచాల బంగాళ చోళాది రాజన్య కన్యల్ వయోరూప ధన్యల్ సదాసక్తలై డాసి యున్నా
రటే, రా రటే పాసి, తత్పాద రాజీవ సందర్శనారంభ సంరంభులై వీత
హృద్దంభులై కుంభినీశుల్ బహూపాపన ద్రవ్యహస్తుల్ ప్రశస్తుల్ మహాభక్తి నక్తందివంబుల్
ప్రవేశించి యున్నారు, కన్నారు, విన్నారు లోకుల్, వరాలోక! నీకేల లీలావకాశంబు సిద్ధించు? సిద్ధించెనా మన్మథాకారుతోఁ గూడి క్రీడింపఁగాఁ
బోలదే, వాని వాణిన్
మహావాణి కాఁపున్నదే, మన్న దే
రత్నగర్భంబుతో భూమి తద్బాహుపీఠిన్, దిశాకుంభి కుంభీన
సాగేంద్ర కూర్మాదులం బాసి కూర్మిన్ విలోకంబులన్ లచ్చి వర్తించునే, దిక్కులం దెల్లఁ గీర్తుల్ ప్రవర్తించునే,
దుర్లభుండే, బహుప్రేయసీ వల్లభుండే, సదైకానుషంగంబు భంగంబు పణ్యాంగనాజాతికిన్
నీతికిం దప్పితేఁ జెప్పితిం గూన, సిద్దంబు తద్ధాత
మున్ వారభామాతనూజాతకున్ నేతగా మాత నుజ్జాత గావించె, నిర్ణీతమే యేతదర్థంబు మర్యాద నిమ్మేదినిన్
వారమే నాదినుండిం బ్రయోగింతునే దాదినై, కామశాస్త్రాది విద్యాసమేతన్ భవన్మాత నుద్దామ మాయాప్రభూతన్ గురంగీ విలోకా
నిరంగీకృతుల్ మాని నామాట నీమాటు పాటింపవే, నందనీ! నిందనీయంబు గాదే, మహానందనీయంబుఁ
జిత్తంబులో నందనీవే, జనానందనీయా!
కఠోరాచలవ్రాత కాఠిన్యమున్ డింప, రత్నాకరశ్రేణి
లోఁతున్ నివేదింప, విత్తేశుగేహంబునున్
రిత్తసేయన్, జగచ్చక్షువుం గన్నుమూయన్,
సదాగామి నాఁకట్ట, నుద్యద్భుజంగావలిం బట్ట, వారాంగనాజాతికిన్ న్యాయమే, మామకన్యాయసంపన్నవై పన్ని యో కన్య నీ వన్యులన్
బౌరసంపన్నులన్ భిన్నులన్ ఖిన్నులన్ జేసి మన్మందిరాళింద భూమండలాసన్నులం జేయుమీ,
రాచబిడ్డేటికే బిడ్డ!
వాచాటతల్ సాఁగవే, సాఁగినన్ నీకు
జూదంబులా, కాక
వీణావినోదంబులా, గద్య
పద్యానువాదంబులా, మాళవీముఖ్య
రాగానుకూలంబులా, దండలాస్యాది
నృత్యావధానంబులా, యింద్రజాలాది
మాయావిధానంబులా, వశ్యమంత్ర
ప్రయోగోపసంహార విద్యావిచారంబులా, మందిరారామ
వాటీలతాజాల మూలాభిషేక ప్రచారంబులా, హేమడోలావరోహంబులా,
నీరజావాస వీచీ సమూహావగాహంబులా,
బంధుగేహ ప్రవేశంబులా,
రాజహంసావళీ
మందయానోపదేశంబులా, నీల కంఠావళీ
నృత్యశిక్షావిశేషంబులా, కాముకవ్రాత
చిత్తప్రమోషంబులా, బొమ్మరిండ్లాటలా,
పాటలా, పాటలామోద! రాజోపకంఠాటనంబుల్
కఠోరాసిధారావలేహంబులే, శార్కరాంభోవగాహంబులే,
సింహయోగంబులే, సర్పవల్మీక భోగంబులే, శైలశృంగాగ్ర వీథీవిహారావధానంబులే, తుంగతాళాగ్ర కోటీతప స్సంవిధానంబులే, మత్తశార్దూల కుంజ ప్రచారంబులే, సింధు మధ్యప్రతారంబులే, గంధశుండాల శుండావినోదంబులే, సప్రమాదంబులే, కొమ్మ! మా కొమ్మదే రాచసఖ్యం బసౌఖ్యంబు మే మొల్ల,
మే మొల్లముల్ మాకు
లాభంబులే? డింభ కే వేళ
నెమ్మోము సొంపారు, నేవేళఁ బాలిండ్లు
పెంపారు, నేవేళ ఫాలంబునం
గుంతలశ్రేణు లల్లాడు, నేవేళ మైదీఁగయున్
వీడు, నేవేళ నాయాస
మున్నూడు నంచుం బ్రతీక్షింప నీ వంతవై యింతవై నేఁడు భూపాలు పాలై ప్రవర్తించుచోఁ
గంబుకంఠీ! భవద్దర్శనోత్కంఠతన్ రాజగేహోపకంఠంబులన్ వచ్చు నీవారి వారింతురే వారి దౌవారికుల్
వారధర్మంబువారంచు దుర్వారులై, తన్మహాగేహ
నిర్యూహ సేవారతాయాత భూపాలక వ్రాత వేదండ గండస్థలీ నిస్సర ద్దానధారావళీ జాత జంబాల
సంఘంబు దుర్లంఘనీయంబు మాకున్, మహాదుర్గమంబే
చొరన్ నిర్గమింపన్, మహోత్సాహవై వత్స!
మత్సాహచర్యంబు కార్యంబు గైకొందు రమ్మంచు లె మ్మంచు వల్లించు తల్లిన్ .
* వారకన్య తల్లి
పల్కు నిరాకరించుట *
ధనాదానవిద్యామతల్లిన్
విటస్వాంతభల్లిన్ నిరూపించి కోపించి బుద్ధిం బ్రదీపించి "అమ్మా! విన న్నొల్లఁ
బొమ్మా, విచారించు కొమ్మా,
భవన్నీతి దుర్నీతి,
సన్మానుషం బింతయున్ లేని
దుర్మానసశ్రేణి నీవేల యీవేల భూషించెదే? యేమి భాషించెదే? యేల నన్నుం
బ్రమోషిచెదే? రాయ
చౌహత్తమల్లున్, వధూటీ
సరోజాతభల్లున్, మహారాజ
వేశ్యాభుజంగున్, హయానేకప గ్రామ
హేమాది నానామహాదాన చంగున్, వధూలోక పాంచాలు,
సర్వజ్ఞసింగ క్షమాపాలుఁ
గైకొంట తప్పే? కకుప్పాల
సంకాశుఁడే, వాని యొప్పుల్
సతుల్ చెప్పరే? యేల నొప్పింప?
మాతల్ తనూజాతలన్
జాతవిత్తాశలై యాశలం బేశలత్వంబు లే కర్మిలిం బాపినారోటు? రారోటు రక్షాతతిన్? గోర్కులీరోటు? నీవింత సెగ్గింప నెగ్గేమి గావించితిన్, లోకనిర్మాత నిర్మాతగాఁ జేయ కేలా సదుర్మాతఁ
గావించె? విజ్ఞాత యోషా
మనోవృత్త సంఘాతవున్, మాతవున్, గామసిద్ధాంత విఖ్యాతవున్, జూడ నేతద్దురాలాపముల్ చిత్తసంతాపముల్ గాఁ
బ్రయోగింతురే? కూఁతుఁ
జింతానదిన్ ముంతురే? పిన్ననాఁ డెల్ల
నాఁ డెవ్వరిం గోరవే, చేరవే? మున్ను రంభోర్వశీమేనకాదుల్ సుకందర్ప
సిద్ధాంతవేదుల్ వశీకార విద్యాధురీణుల్ ప్రవీణుల్ వరశ్రేణి నూహింపరే! చూచి
మోహింపరే! వార లూహింపరే నీతులన్? నిర్దయాలాపవై
పాపవై పాపవేలా మనోజవ్యథన్? నిన్ను నేమందు,
నేమందులన్ మానదే
మానసత్త్వంబు, చింతింపు మవ్వా!
విభుండేమి దవ్వా? యెఱింగించి
రప్పించెదో, కాక
కామానలజ్వాలకున్ నన్ను నొప్పించెదో? యింత ఱంతేల నీకుం గొఱంతే లసద్ద్రవ్యముల్, తల్లి! నే నెల్లవేళన్ మనోజాగ్నిచేఁ గంది లోఁ
గుందఁగా మ్రంద, వీమందటల్ చాలు
ముందేటికిం గంటివే? కెంటసం బేల,
ఘంటాభవై మ్రోసెదే?
యన్యకుం గన్యఁ గానైతి,
యుద్దామశృంగారుపై,
దీనమందారుపై, భూమిభృద్గాయగోవాళుపైఁ, గామినీలోలుపై, రాయ శుండాలహర్యక్షుపై, రాయ కందర్ప ఫాలాక్షుపై, రాయ గోపాంగనాబృంద గోవిందుపై, సంతతానందుపైఁ, బోచమాంబా లసద్గర్భ సంజాతుపై, లోకవిఖ్యాతుపైఁ, బాదపీఠాంకితారాతి భూపావళీఫాలుపై, సింగభూపాలుపై వ్రాలి నాచిత్త మున్మత్తమై సోలి,
కామానలాయత్తమై రాదు
తేరాదు, నే నామరుండైన
గౌరీవరుండైన వాణీధరుండైన లక్ష్మీవిభుండైన దేవప్రభుండైన నన్యున్ మదిం గోరఁగా
నొల్లనే, యుల్లసత్ఫుల్ల
మందార రాజన్మరందంబు నందంబునం గ్రోలు మత్తాలి దుత్తూరముం గోరునే? హేమరాజీవరాజీ రజోరాజితాకాశ గంగానదీలోల కల్లోల
డోలాచల ద్రాజహంసంబు శైవాల జంబాల గండూపదీ భేకభేకీ ఢులీ సంకులాసార కాసారముం జేరునే?
మండితాఖండలానీత జీమూత
నిర్యత్పయోధారలం ద్రావు సారంగి కుంభాంతరాంభః ప్రపూరంబులం ద్రావునే? మాధవోజ్జాత చూతాంకుర స్వాదలీలా
లసత్కోకిలేంద్రంబు ఝిల్లీరవక్రూర భల్లాతకీశాఖకుం బోవునే? సింగభూపాల బాహా పరీరంభ సంరంభ సంజాత సంతోషముం
గోరు యోషాశిరోరత్న మాశించునే నీచసంభోగ మంబా! కుతర్కావలంబా! చలంబా! విలం
బానులాపంబులన్ బాలసూర్యాభునిం బాయ నాడన్ పురోభాగినీ! భోగినీరాజుకంటెన్ మహాభాగు,
నాభాగ సౌభాగ్య
శోభాగరిష్ఠున్, వరిష్ఠుం
బ్రవేశించి, నీతిం బ్రకాశించి,
నృత్తావధానంబులన్ మంజుగానంబులన్
జిత్త మార్జింతునే, విత్తమున్ లేమి
వర్జింతునే, యెట్టిదిన్
విత్తమే రిత్తమై యేటికే? నిత్యదంభా!
దురారంభయుక్తిం బ్రమోషింప విద్వేషినే? యేలనే గోలనే, బాలనే, మానలేనే నరాధీశ చూడామణిన్, వారకన్యా జనగ్రామణీ, పాపజాతీ! భవజ్జాతి దుర్జాతి పొ" మ్మంచు,
"లె" మ్మంచు,
"నో చెల్లనేఁ జెల్ల
రేచెర్ల గోత్రోద్భవున్ మానలే" నంచు "నాయన్నలా, యన్యులం జేరఁబో" నంచు హృద్భల్లితో
వక్రవాగ్భిల్లితోఁ దల్లితో మాటఁ జాలించి ధైర్యంబు గీలించి, సంజాత శాతోదరిన్ సోదరిం జూచి
* వారకన్య సోదరిని
దన వెత దీర్ప వేఁడుట *
"అక్కా!
ప్రసూనాస్త్రు ధిక్కారముం జూచితే, నేఁడు రాకేందు
రాకం దురాకంపముం బొందె డెందంబు, చైతన్య సంచాలియై,
కీలియై గాలి యేతెంచె,
కోదండియై, తూణియై, బాణియై, కంపితప్రాణియై, కాముకారాతి తోఁతెంచె, వాసంతవేళా రమాకంద మాకందశాఖావళిం గోకిలారావ
కోలాహలంబుల్ విటస్వాంత హాలాహలంబుల్ దిశల్ మించి యేతెంచెనే, నేఁడు బాలామనోరంతుతోఁ గంతుతో, సింగభూమీశుతో, భోగదేవేశుతో, న న్నివేదింపవే, కాము సంతాపమున్ డింపవే, డింపి పుణ్యంబునం బోఁగదే, రాఁగదే, లేగదే" యంచుఁ జింతించు నాత్మానుజాతం
దనూజాతశంకాసమేతం గృశీభూతఁ గన్గొంచు
* వారకన్య సోదరి
దాని వలపును సింగరాజునకుఁ దెలిపి కావ వేఁడుట *
"బాలా! లలాటాక్షు
సేవింపుమీ, రాహు భావింపుమీ,
శేషభోగిం బ్రకర్షింపుమీ,
చంపకశ్రేణి
వర్షింపుమీ" యంచు భీతిన్ నివారించి, నీతిన్ విచారించి, యారామ యారామ
సౌధాంతరాళస్థలిన్ నర్తనాగారవేదిన్ మణిస్వర్ణ పర్యంకికా భాసమానున్, మనోభూసమానున్, ఘనున్, రావుసింగక్షమానాథ పౌత్రున్, సమీచీన రేచెర్ల
గోత్రాంబు సంజాతమిత్రున్, మహోదారచారిత్రు,
సర్వజ్ఞసింగోర్వరాధ్యక్షు
నీక్షించి దండప్రణామంబు సాపేక్షఁ గావించి, హస్తాబ్జముల్ మోడ్చి "దేవా! భవన్న్యస్త సౌజన్యధన్యన్, జగన్మాన్యఁ, గన్యన్, నిరన్యాంకపీఠాధిరోహన్, నిరన్యోపగూహన్, నిరన్నాభిలాషన్, నిరన్యాభిభాషన్, నిరన్యావకాశన్, నిరన్యప్రకాశన్, బ్రసూలోచన క్షిప్త బాష్పాంబుపూరన్, మనోజాత బాణావళీ శంకితప్రాణభారన్, సఖీమానస న్యస్త చింతాసమూహన్, భగిన్యంక సంప్రాపితానేకదేహన్, భవద్వైభవాకృష్టచిత్తన్, బరాయత్త వృత్తన్ గృపం జూడు" మంచుం
బ్రశంసింప
* సింగరాజు
వారకన్యను జేపట్టి భోగినిఁగాఁ జేయుట *
ఆ భోగదేవేంద్రుఁ,
డా సత్యభాషా హరిశ్చంద్రుఁ,
డా కామినీ లోక పాంచాలుఁ,
డా సింగభూపాలుఁ, డా బాల నాబాలశీతాంశు ఫాలన్, సరోజాతహస్తన్, బ్రశస్తన్, శుకాధీశవాణిన్, లసన్నీలవేణిన్, మృగేంద్రావలగ్నన్, మనోజాగ్నిమగ్నన్ దయాదృష్టి రావించి భావించి
నెయ్యంబు గావించి బాహాపరీరంభ సంరంభ నిర్ముక్త సంతాపఁ గావించి, కందర్పకేళిన్ వినోదించి, సద్భోగినింగాఁ బ్రసాదించి, తన్మాత నుద్యద్గజారూఢఁ జేయించి, విఖ్యాతి మ్రోయించి యిష్టంబు లిప్పించి యొప్పెం
గడున్.
ఉ.
పండితకీర్తనీయుఁ
డగు బమ్మెర పోతన యాసుధాంశుమా
ర్తాండ
కులాచలాంబునిధి తారకమై విలసిల్ల భోగినీ
దండకమున్ రచించె
బహుదానవిహర్తకు రావు సింగభూ
మండల భర్తకున్
విమత మానవనాధ మదాపహర్తకున్.
శ్రీ కృ ష్ణా ర్ప ణ మ స్తు.
భోగినీ దండకము
సంపూర్ణము.