దధీచి గొప్పతనం

ఆధ్యాత్మిక చింతనకే కాకుండా త్యాగానికి, దాతృత్వానికి పెట్టింది పేరు దధీచి. ఈ మహర్షి తండ్రి అధర్వణుడు మహా మేధో సంపన్నుడు. తల్లి శాంతి ఎంతో సాత్వికురాలు. దధీచి అసలు పేరు దధ్యాంగ్. సంస్కృతంలో దధి అంటే పెరుగు (curd). పెరుగులో మంచి పోషకాలు, కాల్షియం ఉంటాయి. పెరుగులో ఉన్న పోషకాలతో శరీర అంగములు ఏర్పడిన వ్యక్తి అని ఈ పేరుకు అర్ధం. దధ్యాంగ్ అనే పదం కొంత కాలానికి రూపాంతరం చెంది దధీచిగా మారింది. దధీచి జ్ఞాపకార్ధంగానే మన దేశంలో అత్యున్నతమైన ''పరమ వీర చక్ర'', ''వజ్ర'' పురస్కారాల ప్రదానం జరుగుతోంది. భాగవతం, ఇంకా అనేక పురాణాల్లో దధీచి ప్రస్తావన వస్తుంది.

ఒకసారి దేవతలు తమ తమ ఆయుధాలను దధీచి దగ్గర దాచుకున్నారు. ఎన్నాళ్ళకీ వాటిని తిరిగి తీసుకోలేదు. మరీ కాలం గడిస్తే ఆయుధాల మహిమ తగ్గిపోతుందని గ్రహించిన దధీచి, వాటిని మంత్ర జలంతో కరిగించి, తాగేశాడు.

దధీచి ఆయుధాలను కరిగించి, తాగిన కొంతకాలానికి, దేవతలు వచ్చి, తమ ఆయుధాలను ఇవ్వమని అడిగారు. దధీచి జరిగిన సంగతి చెప్పాడు. అది విని దేవతలు బాధపడి, తిరిగి వెళ్లారు.

ఇదిలా ఉండగా, దైవాంశ సంభూతుడైన త్వష్ట్రుడికి, రాక్షస అంశ గల స్త్రీతో విశ్వరూపుడు జన్మించాడు. విశ్వరూపుడు రాక్షసులకు రహస్యంగా నైవేద్యం సమర్పించేవాడు. ఈ విషయం తెలిసిన దేవేంద్రుడు కోపంతో దహించుకుపోయాడు. దేవతలకు విరోధులైన రాక్షసులను మెప్పిస్తున్నాడనే ఆవేశంతో విశ్వరూపుని తల నరికేశాడు.

పుత్రుని మరణవార్త విని తట్టుకోలేక, త్వష్ట్రుడు ఘోర తపస్సు చేశాడు. కొన్నాళ్ళకు త్వష్ట్రునికి మహా బలవంతుడైన వృతాసురుడు జన్మించాడు. ఇతను విశ్వరూపుని మించిపోయాడు. వృతాసురుడు రాక్షసంగా ప్రవర్తిస్తూ దేవతలను విసిగించి, వేధించసాగాడు.

దేవేంద్రునికి మరోసారి హృదయం రగిలిపోయింది. కానీ తమాయించుకున్నాడు. మునుపటిలా ఆవేశపడకుండా, శ్రీమహావిష్ణువు దగ్గరికెళ్ళి సంగతి చెప్పి బాధపడ్డాడు.

అంతా విన్న విష్ణుమూర్తి, “దేవేంద్రా, నేను చెప్పేది జాగ్రత్తగా విను...సరస్వతీ నదీ తీరంలో ఒక అందమైన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో గొప్ప తపశ్శక్తివంతుడైన దధీచి అనే మహర్షి ఉన్నాడు. మహిమాన్వితమైన దేవతల ఆయుధాలు దధీచి వెన్నెముకలో ఉన్నాయి. దధీచి గనుక తన వెన్నెముకను దానం చేస్తే, విశ్వకర్మ ఆ వెన్నెముకను ఉపయోగించి అద్భుత శక్తిగల ఆయుధాలను రూపొందించగలడు. అందులో ''వజ్రాయుధం'' మరీ మరీ శ్రేష్ఠమైంది. వృతాసురుడు మహా బలవంతుడు గనుక అతన్ని వజ్రాయుధమే సంహరించగలదు..” అంటూ సంక్షిప్తంగా కర్తవ్యం బోధించాడు.

దేవేంద్రుడు వెంటనే దధీచి ఆశ్రమానికి బయల్దేరాడు. విష్ణుమూర్తి మాటలన్నీ దధీచికి వినిపించాడు. అంతా చెప్పి, చివరికి "మహర్షీ! వెన్నెముక లేనిదే శరీరం నిలబడదు. అంత కీలకమైన వెన్నెముకను అడిగి, ప్రాణత్యాగం చేయమనడం ఎంత మహా పాపమో నాకు తెలుసు. నన్ను క్షమించండి..” అన్నాడు దేవేంద్రుడు.

ఆ మాటలకు దధీచి చిరునవ్వు నవ్వి "దేవేంద్రా, 'జాతస్య మరణం ధ్రువం..' అన్నారు. చావు ఎప్పటికైనా తప్పదు. ఈ శరీరం ఎన్నటికీ శాశ్వతం కాదు. అలాంటప్పుడు నా శరీరం ఒక మహా కార్యానికి ఉపయోగపడితే అంతకంటే కావలసింది ఏముంది? నా వెన్నెముకను నిరభ్యంతరంగా ఇస్తాను. దాంతో వజ్రాయుధం రూపొందించి, లోక కంటకుడైన వృతాసురుని సంహరించడానికి వినియోగిస్తే అంతకంటే అదృష్టం ఇంకేముంది? నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాను..” అన్నాడు.

అదీ దధీచి గొప్పతనం. దేవేంద్రుడు అడిగింది సామాన్యమైన కోరిక కాదు. ప్రాణత్యాగం చేయమని కోరాడు. అయినా దధీచి కోపం తెచ్చుకోలేదు. ఎంతమాత్రం సందేహించలేదు. పైగా సంతోషంగా ఒప్పుకుని కోరిక తీర్చాడు.

దధీచి తన తపోదీక్షతో, శరీరాన్ని శుష్కింపచేసుకుని, వెన్నెముకను దేవేంద్రునికి మిగిల్చాడు.

దధీచి వెన్నెముకతో వజ్రాయుధం తయారైంది. ఇతర శక్తివంతమైన ఆయుధాలు కూడా వచ్చాయి. యుద్దంలో వృతాసురుడు దేవతలతో కలబడ్డాడు. విపరీతమైన బలాధిక్యుడైన వృతాసురుడు దేవేంద్రుని ఏకంగా మింగేశాడు. ఇంద్రుడు, దధీచి వెన్నెముకతో తయారైన వజ్రాయుధంతో వృతాసురుని ఉదరం చీల్చుకుని బయటకు వచ్చాడు. అలా వృతాసురుడు మరణించాడు, దధీచి త్యాగశీలత శాశ్వతంగా నిలిచిపోయింది.