బసవేశ్వరుడు

బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని ఉద్దరించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని మరియు విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. వీరశైవం ఇతను బోధించిన మార్గం. 


కర్ణాటకలోని బాగేవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాధలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి కూడలి అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ వేంచేసియున్న సంగమేశ్వరుణ్ణి నిష్టతో ధ్యానించాడు.


శివుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, నందీశ్వరుడు పంచాక్షరీ మంత్రం ఉపదేశించాడని చెబుతారు. శివుని ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు. 


ఒక వైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ బసవడు భగవద్భక్తి వ్యాప్తికి నిరంతర కృషి చేశాడు. అతని బోధనలలోని సమదృష్టి పలువురిని ఆకర్షించింది. వీరశైవ మతానికి తిరిగి పట్టం కట్టిన బసవని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి ఆంధ్రదేశంలోను వ్యాప్తి చెందినది

ప్రతిరోజు లక్షా తొంభై ఆరువేల మంది జంగములకు మృష్టాన్నములతో అర్చించి అనంతరం తాను భుజించేవాడట. బసవడు తన ఉపదేశాలు ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు వ్రాసాడు. వీటిలో సూక్ష్మమైన తత్త్వం సులువుగా బోధపడేది. సాహిత్య పరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది. ఇతడు మొత్తం 64 లక్షల వచనాలు కూర్చినట్లు ప్రతీతి. కానీ, ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమైనాయి. 


బసవేశ్వరుడు స్థాపించిన వేదాంత గోష్టికి 'అనుభవ మండపం' అని పేరు. బసవేశవరుడు తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహం జరిపాడు. అది ఆనాటి సంఘంలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నూతన దంపదుతులు హత్యకు గురౌతారు. ఈ సంఘటన బసవుని హృదయాన్ని కలచివేస్తుంది. తన అమాత్య పదవిని వదలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వరుని సన్నిధికి చేరి, కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు. 

బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో "లింగాయత ధర్మం"గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశాడు. వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు

ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటినుంచి పారిపోయాడు.
శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశాడు. ఆయన ఉపదేశాలు: 

మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు. 
శివుడే సత్యం, నిత్యం. 
దేహమే దేవాలయం. 
స్త్రీ పురుష భేదంలేదు. 
శ్రమను మించిన సౌందర్యంలేదు. 
భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం. 

దొంగలింపకు, హత్యలు చేయకు 
కల్లలనాడకు, కోపగింపకు ఆత్మస్తుతి పరనిందల విడువు 

అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అంటారు. 


కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవనానికి గౌరవస్థానం కల్పించిన బసవేశ్వరుడు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు. బసవేశ్వరుని దివ్య జీవితగాధను పాల్కురికి సోమనాధుడు రచించిన 'బసవ పురాణం' తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమయింది. 


మానవతావాది బసవన్న 
ఓసాయం సంధ్యవేళ దీపం వెలుతురులో మహాత్మా బసవేశ్వరుడు ఏదో చదువుతూ కూర్చొన్నాడు. ఆయన్ని కలవడానికి కొందరు పెద్దలు వచ్చారు. అందరూ బసవేశ్వరుడికి నమస్కరించి కూర్చొన్నారు. వారంతా ఏదో కార్యార్థమై తనవద్దకు వచ్చారని గ్రహించిన బసవేశ్వరుడు ‘‘నావద్దకు వ్యక్తిగత పని గురించి వచ్చారా? లేదంటే ప్రభుత్వ పని గురించి వచ్చారా? (బసవేశ్వరుడు బిజ్జల మహారాజు కొలువులో మహామంత్రి)’’ అని ప్రశ్నించాడు. 

‘‘మతపరమైన చర్చ గురించి మీవద్దకు వచ్చాం’’ అన్నారు పెద్దలు.  

వెంటనే బసవేశ్వరుడు అప్పటివరకుదీపం వెలుగులో తాను పనిచేసుకుంటున్నాడో, ఆ దీపాన్ని ఆర్పివేసి, మరో దీపం వెలిగించి వారితో మాట్లాడటానికి ఉపక్రమించాడు. 

విషయం పెద్దలకు అర్థంకాలేదు. దీపం మార్చడంలో ఆంతర్యం ఏమిటో? అన్నట్లు బసవేశ్వరునివైపు చూసారు. మొదటి దీపం ప్రభుత్వానిది, రెండవది నా స్వంతానిది అన్నాడు బసవేశ్వరుడు. మతపరమైన చర్చ ధర్మసంబంధంగా నా వ్యక్తిగత విషయం. ఇందుకు ప్రభుత్వం వారి సొమ్ము వాడటంతగదనిఅలా చేసాను అని బదులిచ్చాడు. ఒకచోట ఇసుమంతయినను పసిడి నాకెందుకు? అంటాడు. కాని ఈనాటి పరిస్థితి? 

దాదాపు 800 ఏళ్ళ క్రితమే ఇంత గొప్ప రాజనీతి దృక్పథాన్ని మనకు అందించి నైతిక విలువలను ఆచరించి చూపిన మహనీయుడు బసవేశ్వరుడు. క్రీ.శ.1130-1170 మధ్య మాదలాంబిక, మాదిరాజు దంపతులకు కర్ణాటక రాష్ట్రంలోనిహింగుళేశ్వర బాగెవాడజన్మించాడు బసవేశ్వరుడు. బసవేశ్వరుడి ప్రభావం కర్ణాటక ప్రాంతంలో చాలా ఎక్కువ. ఆయన చెప్పినమాటలువచనాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయన ప్రభావంతోనే తెలుగులో పాల్కురికి సోమనాథుడు విశేషమైన రచనలు చేశాడు. తెలుగులో మొట్టమొదటి దేశిపురాణం బసవపురాణం. మొదటి శతకం వృషాధిప శతకం. ఈ రెండూ సోమనాథుడు బసవేశ్వరుని ప్రభావంతో రచించినవే. పాల్కురికి సోమనాథుడు బసవేశ్వరుని రెండవ శంకరుడనెను. 

కుల రహిత సమాజాన్ని 12వ శతాబ్దంలో ప్రబోధించి ఆచరించి చూపించిన ఘనుడు బసవణ్ణ. శెట్టి అయిన సిరియాళుణ్ణి, రజకుడైన మడివాలు మాచయ్యను, చండాలుడిగా చెప్పే కక్కయ్యను, మాదిగ కులస్థుడైన చెన్నయ్యను, బాలిక అయిన గొడ గూచిని, స్ర్తి అయిన అక్కమహాదేవిని కుల, బాల, స్ర్తి, పురుష బేధం పాటించకుండా శివభక్తి ప్రస్థానంలో మహోన్నత స్థానంలో నిలబెట్టాడు బసవేశ్వరుడు. 

అలనాడు కులాంతర వివాహమును జరిపించి కులాలు మానవ సృష్టియే అని పలికిన మహాత్ముడు బసవన్న. శివనాగుమ్య యనెడి యంత్యజుడుండెను. అతడు దీక్షను స్వీకరించి లింగాంగుడయ్యెను. అతడు దాసోహము చేయగా బసవన్న యతని యింటికేగా ప్రసాదమును బడసెను. గుణవంతులందరు సమానముగా గౌరవింపదగిన వారని తెలిపెను. 

కులాన్ని త్రోసి రాజని సర్వమానముల చేతిలో చిన్ని లింగాన్ని పెట్టి లింగార్చన చేయమన్నాడు. పరమేశ్వరుణ్ణి ప్రతి మనిషి ఎదపై నిలిపే లింగధారణ చేయించాడు. దేవుణ్ణి ప్రతివారి హస్తంలో సుప్రతిష్ఠం చేసి కులపు కుళ్ళును కడిగివేసాడు. ఎంత మాలిన్యమైన హృదయమైనా పరమేశ్వరతత్వం పరిఢవిల్లినపుడు ‘‘అంతా ఈశ్వరమనే’’ సత్యాన్ని లోకానికి చాటి చెప్పాడు బసవేశ్వరుడు. ఈ లింగార్చన ఒక ధ్యానయోగం. ఈ రోజుల్లో ఎందరో తమ మనస్సు శాంతి, ఏకాగ్రత కొరకు ధ్యానం అభ్యాసం చేస్తున్నారు. కాని బసవణ్ణిరోజుల్లోనే సహజంగానే ధ్యానం కుదిరే పద్ధతి వ్యాప్తి చేసాడు. 


ధనమే ప్రధానం అనుకొనేవాడికి శివుణ్ణి చేరడం సాధ్యంకాదు అంటాడు బసవన్న. వడ్డీ వ్యాపారం మానవుల ఆర్థిక అసమానతలకు కారణం అని ఆనాడే నిరసించాడు. ధనవ్యామోహం దుర్బలమైంది అనేది బసవణ్ణ ప్రగాఢ విశ్వాసం. సత్యమే దైవము మరియు అన్ని ప్రాణుల యెడల దయకు మించిన దైవము మరొకటి లేదంటాడు. బసవేశ్వరుడు అస్పృశ్యతా నివారణ, స్ర్తిగౌరవము పెంపుదల, స్ర్తి సమానత్వము, కుటీర పరిశ్రమల పెంపు, ఎకనమిక్ ఈక్వాలిటీ మొదలైన సంస్కరణలు ఆరోజుల్లో అమలుపరచి సత్ఫలితాలను సాధించాడు. సత్యము, అహింస, భూతదయ గురించి ఎన్నో అనుసరించదగిన వచనాలను వచించిన మహాపురుషుడు బసవడు. 

గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, సద్గుణ సంపన్నుడు, అసమాన మేధాసంపన్నుడు అయిన మహాత్మా బసవేశ్వర జయంతి ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు ప్రపంచమంతా జరుపబడును. ఇది వారి 879వ జయంతి. బసవ జయంతి ఉత్సవములు మొదలుపెట్టి 100 సం.లు పురస్కరించుకొనిసంవత్సరము శతమానోత్సవము జరుపుకొనడము మన భాగ్యము.