శ్రీకాళహస్తీశ్వర శతకము
.
జలజశ్రీ గల మంచినీళ్లు గలవే చట్రాతిలో , బాపురే
వెలివాడ న్మరిబాపనిల్లు గలదా వేసాలుగా కక్కటా
నలి నారెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ ఏ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా !
.
శ్రీ కాళహస్తీశ్వరా !
ఎక్కడైనా బండరాతి లోపల పద్మాలతో కూడూన మంచినీరు ఉంటాయా !
వెలివాడ లో ఎక్కడైన విప్రగృహం ఉంటుందా ! ఇవి ఉండవనే విషయం నీకు తెలిసి కూడ వేషాలు కాకపోతే నాలో మంచి గుణాలు కన్పించడం లేదని నీవు నన్ను దూరంగా ఉంచడం ఆశ్చర్యంగా ఉంది .
ఏమైనా సరే నాలో ఉన్న గుణాలలో నీకు నచ్చిన దాన్ని ఎన్నుకొని నన్ను రక్షించవలసినది కాని విడిచి పెట్టవద్దని కవి అభ్యర్ధన.
తనకు మోక్షాన్ని పొందే అర్హత ఏ ఒక్కటి లేకపోయినా ,ఉన్న గుణాల్లో శంకరునికి నచ్చిన గుణాన్ని తీసుకొని తనకు మోక్షమివ్వమని కవి ప్రార్ధన . అంటే కవి దృష్టి లో తన వద్ద నున్న ఏకైక గుణం కవిత్వమే. దాన్ని ఏనాడో మహాదేవునకు అంకితం చేశాడు. కాబట్టి తాను కైలాస వాసానికి అర్హుడననే కవి వాదన.