ఆరో శతాబ్దంనాటి అరుదైన రామాయణం
- వాల్మీకి రామాయణం తర్వాత రెండో పురాతన ప్రతి
- కోల్‌కతాలో కనుగొన్న పండితులు
ఆంధ్రజ్యోతి - కోల్‌కతా, డిసెంబరు 19 2015: ఆరో శతాబ్దం నాటి అరుదైన రామాయణ ప్రతి ఒకటి కోల్‌కతా సంస్కృత సాహిత్య పరిషత గ్రంథాలయంలో అనూహ్యంగా దొరికింది. చరిత్రకారులు చెబుతున్నదాని ప్రకారం.. క్రీ.పూ.4వ శతాబ్దం నాటి వాల్మీకి రామాయణం తర్వాత.. అత్యంత ప్రజాదరణ పొందిన రామాయణాల్లో తమిళ కవి కంబ 12వ శతాబ్దిలో రాసిందే రెండో అత్యంత పురాతన రామాయణ ప్రతి. కానీ, ఇప్పుడు లెక్కలు మారనున్నాయి. ఇక, తాజాగా లభ్యమైన ప్రతి విషయానికొస్తే సీతారాములను దేవతలుగా కంటే మానవులుగానే చిత్రీకరించినట్టు దీన్ని విశ్లేషించిన సాహిత్య పండితులు చెబుతున్నారు.
అసలు ఈ ప్రతి బయటపడిన విధానమే అనూహ్యం. ఆరోశతాబ్దం నాటి వహ్ని (అగ్ని) పురాణం పూర్తి ప్రతి కోసం పండితులు ఆసియాటిక్ సొసైటీ లైబ్రరీలో అన్వేషించగా.. అక్కడ అసంపూర్తి ప్రతి మాత్రమే దొరికింది. దీంతో వారు జర్మన్ పండితుడు ఆఫ్రెక్ట్ రాసిన అంతర్జాతీయ కేటలాగును పరిశీలించి అలాంటి మరో రెండు ప్రతులు ఉన్నాయని గుర్తించారు. వాటిలో ఒకటి లండన్‌లోని ‘ఇండియా ఆఫీస్ లైబ్రరీ’లో ఉండగా.. రెండోది కోల్‌కతాలోని సంస్కృత సాహిత్య పరిషత గ్రంథాలయంలో ఉందని కనుగొన్నారు. ఆ మేరకు, పరిషత లైబ్రరీలోని పుస్తకాలన్నీ గాలించి వహ్నిపురాణం పూర్తి ప్రతిని పట్టుకోగలిగారు.
దాన్నిపరిశీలిస్తుండగా.. ఉన్నట్టుండి అగ్ని పురాణానికి సంబంధంలేని శ్లోకాలు, పాత్రలు కనిపించడం మొదలైంది. తొలుత ఆశ్చర్యపోయినా, తర్వాత నిశితంగా పరిశీలించేసరికి.. అది రామాయణం అని అర్థమైంది. అయితే, వాల్మీకిరామాయణంలో ఏడు కాండలు (బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర కాండలు) ఉండగా.. ఇందులో మొదటి, చివరి కాండలు లేవు. కేవలం ఐదు కాండలు మాత్రమే ఉన్నాయి. రావణ వధానంతరం సీతారాములు వనవాసం ముగించుకుని తిరిగి వచ్చాక, శ్రీరామ పట్టాభిషేకంతో ముగిసిపోయింది. ‘‘ఈ రామాయణంలో కల్యాణం సమయానికి సీతారాముల వయసు ఎంత.. రావణుడు సీతను ఏ రోజున ఎత్తుకెళ్లాడు.. లాంటి ఆసక్తికర వివరాలున్నాయి’’ అని మనబేందు బందోపాధ్యాయ అనే స్కాలర్ చెప్పారు