అతి తెలివి కల పెళ్ళికొడుకు

అనగనగా ఒక వూళ్ళో రాంబాబు అనే అబ్బాయి వుండేవాడు. తను చాలా తెలివైనవాడినని అతని అభిప్రాయం. అంతే కాదు ఎదుటివాళ్ళు ఎంత తెలివితక్కువ వాళ్ళో ఉదాహరణలతో అందరికీ చూపించి వాళ్ళని చిన్నబుచ్చుతుండేవాడు. ప్రతిదానినీ తెలివిగా ఆలోచిస్తున్నాననుకుంటూ అతి తెలివికి పోయేవాడు.

అలాంటి రాంబాబు కి పెళ్ళి కుదిరింది. పెళ్ళికోసం బంధువు లందరితో కలిసి ఆడపెళ్ళివారి వూరికి బయల్దేరి వెళ్ళాడు రాంబాబు. వూరు వెళ్ళగానే రాంబాబుకి ఆడపెళ్ళివారు ఎంత తెలివి గలవారో చూడాలన్న ఆలోచన . అలా తెలుసుకుందుకు వాళ్ళకి కనపడకుండా దాక్కుంటే తనని వెతుక్కోగలరో లేదో చూద్దామనుకున్నాడుట. అనుకున్నదే తడవుగా ఎక్కడ దాక్కుందామా అని తెగ ఆలోచించేసాడుట. పెళ్ళివారు తనని కనిపెట్టలేని చోటేదా అని బాగా ఆలోచించి, చాలా తెలివిగా ఆలోచించా ననుకుంటూ పెళ్ళి కోసమని వేసిన పెళ్ళింటి ముందున్న తాటాకుల పందిరి (ఇదివరకు పెళ్ళిళ్ళకి తాటాకు పందిళ్ళు వేసేవారు) యెక్కి కూర్చున్నాడుట.  

ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్ళికొడుకెక్కడా కనిపించటం లేదు. ఆడపెళ్ళివారు, మగపెళ్ళివారు అందరూ కలిసి చుట్టుపక్కలంతా ఇళ్ళూ. వాకిళ్ళూ, తోటలూ, చెరువులూ అన్నీ గాలించారు. ఎక్కడా పెళ్ళికొడుకు జాడ లేదు.
వాళ్ళంతా వెతికి వెతికి విసిగిపోయి బంధువుల్లోనే వున్న మరో అబ్బాయికి ముహూర్తానికే అమ్మాయి నిచ్చి పెళ్ళి చేసేసారు.

పెళ్ళంతా అయ్యాక రాంబాబు"నన్నెతుక్కోలేకపోయారోయ్.., నన్నెతుక్కోలేకపోయారోయ్.." అని పెళ్ళివారి తెలివితక్కువతనాన్ని ఎత్తిచూపుతున్నట్టు చప్పట్లు కొట్టుకుంటూ మరీ పందిరి మీంచి దిగాడుటఅది చూసి అతని చుట్టాలందరూ తలలు పట్టుకుని "ఓరి నీ అతితెలివి సంతకెళ్ళా.. బంగారం లాంటి అమ్మాయిని నీ పిచ్చి అతితెలివితో వదులుకున్నావు కదరా.." అంటూ చివాట్లు పెడతారన్నమాట.