దుష్టసాంగత్యం

రామాపురంలో నివసించే సుమిత్రకు ఒక్కడే కొడుకు. పేరు వినయ్. సమీపంలోని టౌన్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. సుమిత్రకు భర్త లేడు. దుస్తులు కుట్టి జీవిస్తూంటుంది. కొడుకుని బాగా చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలని అహర్నిశలూ కష్టపడుతోంది. తల్లి పడే కష్టం గమనించి వినయ్ స్కూల్ నుంచి రాగానే బావిలో నీళ్ళు తోడటం, పొయ్యిలోకి కట్టెలుకొట్టి ఇవ్వటం వంటి పనులుచేస్తూ సాయపడుతూండే వాడు. చక్కగా చదువుతూ, క్రమశిక్షణతో ఉంటూ పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఎంతో అభిమాన పాత్రుడయ్యాడు.

రోజు తెలుగు పీరియడ్ జరుగుతోంది. మాస్టారు రాజు అనే విద్యార్థిని దగ్గరకు పిలిచి, ‘‘ఏరా రాజూ! నాలుగురోజులనుంచి పాఠశాలకు రావటం లేదేం?’’అని అడిగారు.

‘‘మా నాయనమ్మ చనిపోయింది సార్!’’ అన్నాడు రాజు.
‘‘మొన్ననే కదరా.. మీ నాయనమ్మ చనిపోయిందని బడి ఎగ్గొట్టావు. మీ నాయనమ్మ నెలకు ఎన్నిసార్లు చనిపోతుందేమిటి? దొంగవెధవా!’’ అంటూ మాస్టారు రాజు అరచేతిమీద బెత్తంతో ఛెళ్ళున కొట్టారు.

మాస్టారు రాజుని కొడుతూంటే వినయ్ గుండె దడదడా కొట్టుకుంది. భయంతో కాళ్ళు వణికాయి. మాస్టారి ముఖంలో కోపం చూడటమంటే భయం వినయ్కి. ఆయనకి కోపం రాకుండా చెప్పినట్లు నడచుకునేవాడు. రాజు మాత్రం మాస్టారు కొట్టే దెబ్బలను మిఠాయ తిన్నంత తేలికగా భరించేవాడు‘‘ పీరియడ్ అంతా క్లాస్ బయట ఎండలో నిలబడు. ఇదే నీకు శిక్ష’’ అని చెప్పి పాఠం చెప్పటంలో మునిగిపోయారు మాస్టారు. క్లాస్ అయిపోయినట్లుగా బెల్కొట్టారు. పిల్లలందరినీ భోజనానికి వదిలారు

రాజు తన్నులు తినటమే కాకుండా పీరియడ్ అంతా ఎండలో నిలబడి ఉండటం చూసి జాలేసింది వినయ్కి. ‘‘నువ్వు క్యారేజీ తెచ్చుకోలేదా?’’ అని అడిగాడు. రాజు తల అడ్డంగా ఊపాడు.

‘‘నేను తెచ్చుకున్నాను. ఒక బాక్స్ నీకిస్తాను. తిందువుగాని రా!’’ పిలిచాడు వినయ్ఇద్దరూ చెట్టుకింద కూర్చుని చెరొక బాక్స్లోని అన్నం తినసాగారు. ‘‘నువ్వు రోజూ బడికి వచ్చి చదువుకుంటే మాస్టారు కొట్టరు కదా!’’ సానుభూతిగా అన్నాడు వినయ్
‘‘సాయంత్రం దాకా కదలకూడదు, మెదలకూడదు, పక్కవాళ్ళతో మాట్లాడకూడదు. పనికిమాలిన పాఠాలన్నీ బట్టీపట్టాలి. థూ! నాకసలు ఇష్టమే లేదు. మా నాన్న పోరు పడలేక బడికి వస్తున్నా!’’ అన్నాడు రాజు.
‘‘బడికి రాకుండా ఏం చేస్తావు?’’
‘‘సినిమాలు చూస్తాను.’’
‘‘సినిమాలా..?’’
‘‘అవును... నువ్వు చూడవా?’’
‘‘ఊహూ...’’
‘‘మీ అమ్మ పంపించదా?’’
‘‘మా అమ్మ కూడా చూడదు... ఇంతకీ సినిమాలు చూడడానికి నీకు డబ్బు ఎక్కడిది?’’ వినయ్ అడిగాడు.
‘‘మా నాన్న నిద్రపోయేటప్పుడు జేబులో నుంచి తీసుకుంటాను. ఒక్కోసారి పేకాటలో గెలుచుకుంటాను’’ అన్నాడు రాజు.
‘‘పేకాట ఆడతావా?’’
‘‘అవును. ఊరుబయట పాడుబడిన సత్రం లేదూ! అక్కడ ఆడతాం.’’
‘‘ఇవన్నీ చేయటం తప్పు కాదా?’’
‘‘ఊహు. ఏవౌతుంది?’’
‘‘దేవుడికి కోపం వస్తుంది. కళ్ళుపోతాయని మా అమ్మ చెప్పింది.’’
రాజు ఫకాలున నవ్వాడు. ‘‘నేను ఎన్నిసార్లోచేశాను. మరి నా కళ్ళు పోలేదేం?’’ కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ అన్నాడు.
‘‘నువ్వు వట్టి పల్లెటూరి మొద్దువి. ఎక్కడికీ వెళ్ళవు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడవు. ఇల్లు, బడి తప్ప నీకేం తెలియదు’’ అన్నాడు రాజు.
వినయ్కి దిగులేసింది. రాజు చెప్పేవన్నీ నిజంగానే తనకు తెలియవు. రాజు తెలివి కలవాడు. అన్ని విషయాలూ తెలుసు.. అనుకున్నాడు.

ఇద్దరూ అన్నం తినటం పూర్తి చేశారు. పంపు దగ్గర బాక్స్లు కడుక్కున్నారు. ‘‘ఈసారి నిన్ను సినిమాకి తీసుకువెళతాను. భలేగా ఉంటుంది. డబ్బు అవసరం లేదులే! ఇంటర్వెల్లో గేటు తీస్తారు కదా! జనంతోపాటు లోపలికి దూరి వెళ్ళవచ్చు. వస్తావా?’’ అన్నాడు రాజు. వినయ్ వస్తానన్నట్లు తలూపాడు.

‘‘ఒక్క నెలరోజులు నాతో ఉన్నావంటే ఊరంతా తిప్పి చూపిస్తాను. నిన్ను తెలివిగలవాడిగా చేసేస్తాను.’’ అన్నాడు రాజు. వినయ్ మనసంతా సంతోషంగా నిండిపోయింది. ‘‘అలాగే!’’ అన్నాడు ఉత్సాహంగా.

అప్పటినుంచీ రాజు వినయ్ని ప్రతిరోజూ తనతో తిప్పుకోసాగాడు. వినయ్ కూడా పేకాట నేర్చుకున్నాడు. ఇద్దరూ ఊరంతా తిరిగేవారు. వినయ్ ఆలస్యంగా ఇంటికి వచ్చి ఏవేవో అబద్ధాలు కల్పించి చెప్పేవాడు.

ఒకరోజు ఇద్దరూ ఊరి చివర సత్రం నుంచి పేకాట ఆడి తిరిగి వస్తున్నారు. సిగ్నల్ కోసం రైలు ఆగిఉంది. ‘‘ఒరేయ్! మనం ఇక్కడ రైలు ఎక్కి స్టేషన్లో దిగుదాం. నడిచే పనిలేకుండా హాయిగా వెళ్ళవచ్చు’’అన్నాడు రాజు.

ఇద్దరూ రైలు ఎక్కారు. సిగ్నల్ ఇవ్వటంతో రైలుబయలుదేరింది. రైలు వెళుతూంటే చల్లటి గాలి వస్తూంది. ఇద్దరికీ హుషారుగా ఉంది. రైలు కాసేపటికి స్టేషన్లో ఆగింది. రైలు దిగి బయటకు వస్తూంటే గుమ్మం దగ్గర టి.సి. ఆపి ‘‘టిక్కెట్’’ అన్నాడు. టి.సి.ని చూడగానే వినయ్ తెల్లమొహం వేశాడు. రాజు గభాలున పరుగు లంకించుకుని జనంలో కలిసిపోయాడు.

టి.సి. వినయ్ని రైల్వే పోలీసులకి అప్పచెప్పాడు. వినయ్కి ఏడుపువచ్చింది. ‘‘టిక్కెట్ లేకుండా ప్రయాణం చెయ్యటం నేరం అని తెలియదా? మేం విచారణ జరిపేదాకా బయటకు వెళ్ళటానికి వీల్లేదు’’ అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్.

వినయ్ బిక్కచచ్చిపోయినట్లు ఉండిపోయాడు. గేటుదగ్గర కానిస్టేబుల్ తుపాకీ పట్టుకుని నిలబడి ఉన్నాడు. పారిపోవటానికి అవకాశం లేదు. వినయ్ కిటికీలోనుంచి దిగాలుగా చూస్తూ గోడదగ్గర నిలబడి ఉన్నాడు.

ఇంతలో రైలువచ్చింది. ప్రయాణీకులు ఎక్కుతూ, దిగుతూ ప్లాట్ఫాం అంతా కోలాహలంగా మారింది. సూట్కేస్ పట్టుకుని రైలు దిగి వెళుతున్న ఒకాయనను చూడగానే ‘‘మాస్టారూ!’’ అని వినయ్ అరిచాడు సంతోషంగా.

తెలుగు మాస్టారు ఇటువైపు చూసి ‘‘అరె..! వినయ్! నువ్వా! ఇక్కడున్నావేం?’’ ఆశ్చర్యంగా దగ్గరికి వస్తూ అడిగాడు. సిగ్నల్ దగ్గర రైలు ఆగటం, ఇద్దరూ ఎక్కటం, రాజు పారిపోటవం క్లుప్తంగా చెప్పాడు వినయ్.
మాస్టారు పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడారు.

‘‘ఏయ్.. అబ్బాయ్..! ఈసారికి వదిలేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేశావా జైలుకే!’’ అన్నాడు ఇన్స్పెక్టర్. వినయ్ చేతులు కట్టుకుని వినయంగా తలూపాడు.

‘‘మా ఇంటికి వెళదాం రారా! లగేజీ ఇంట్లోపెట్టి నిన్ను మీ ఇంటిదగ్గర దింపుతాను’’ అన్నారు మాస్టారు.
ఇద్దరూ ఇంటికి వచ్చారు. మాస్టారు వినయ్ని కాళ్ళూ, మొహం కడుక్కుని రమ్మన్నారు. ఆపిల్కాయ ముక్కలు కోసి అందించారు.

‘‘ మధ్య నువ్వు బడికి సరిగ్గా రావటం లేదేం? చదువుపై కూడా నీకు శ్రద్ధ తగ్గిపోయింది’’ అడిగారు.
వినయ్ రాజుతో పరిచయమైన దగ్గర్నుంచి జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు. మాస్టారు అంతా విన్నారు.
‘‘కొంతమంది ఎక్కువగా మాట్లాడకుండా రిజర్వుడుగా ఉంటారు. అది తమలో ఉన్న సంస్కారం అని తెలుసుకోలేక లోపంగా భావించి బాధపడుతూ ఉంటారు. రాజుమీద జాలిపడి అన్నం పెట్టావు. వాడేం చేశాడు? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను వంటరిగా విడిచి తనదారి తను చూసుకున్నాడు. దుష్టులతో సాంగత్యం ఎప్పటికైనా చేటు కలిగిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నీ మేలు కోరేవారు. వారు చెప్పినట్లుగా చేస్తే మంచి జరుగుతుంది’’ అన్నారు.

‘‘ఇంకెప్పుడూ తప్పు పనులు చేయను సార్! మీరు చెప్పినట్లే నడుచుకుంటాను’’అన్నాడు వినయ్ పశ్చాత్తాపంతో.