అన్నం పర్రబహ్మ స్వరూపం
ఒకప్పుడు
దేవుపల్లిలో దేవయ్య అనే కిరాణా వ్యాపారి
ఉండేవాడు. అతడి కొట్లో దొరకని
వస్తువు ఉండదు. అందుకే ఆ ఊరి జనమంతా
తమకు కావలసినవన్నీ అక్కడే కొనుక్కునేవారు. ఈ క్రమంలో దేవయ్య
బాగా ఆర్జించాడు. అయితే మాత్రం ఏం
లాభం? అతడు పరమ పిసినారి.
ఎంగిలి చేత్తో కాకిని తోలడు. ఊళ్ళో ఎన్నడూ ఏ
మంచి కార్యక్రమానికీ పైసా విరాళం ఇచ్చిన
పాపానపోలేదు. అందుకే అతడంటే అందరికీ ఏవగింపు.
గణపతి
నవరాత్రుల ముగింపు సందర్భంగా పేదలకు అన్నదానం చెయ్యాలని సంకల్పించారు ఉత్సవ బృందం సభ్యులు.
తలొకరు తలా చెయ్యి వేస్తేనే
కదా ఏ కార్యమైనా జరిగేది.
దేవయ్య పైసా విదల్చడని తెలిసికూడా
ఉండబట్టక అతడివద్దకెళ్ళారు ఉత్సవ కమిటీ సభ్యులు.
‘దానాలన్నింటిలో అన్నదానం మహత్తరమైంది. ఆకలితో అలమటించే వ్యక్తిలో దేవుడుంటాడు. అతడి క్షుద్భాధని తొలగించగలిగితే
మనం దైవసన్నిధికి చేరుకోగలుగుతాం. మీరీ ధర్మకార్యంలో తప్పకుండా
పాలుపంచుకోవాలి’’అన్నాడు వచ్చినవారిలో ఓ పెద్దమనిషి. అయితే,
దేవయ్య దగ్గర ఆ సూక్తులు
చెవిటివాడి ముందు శంఖనాదమే అయింది.
ఇలాఉండగా,
ఓరోజు సరుకులు కొనుగోలు చేసేందుకు పట్నం వెళుతూ పనిముగించుకుని
రావడానికి రెండ్రోజులు పడుతుందని అంతవరకు కిరాణాకొట్టు జాగ్రత్తగా చూసుకోమని దేవయ్య భార్యకి చెప్పాడు. తల
ఊపుతూ ‘అలాగే’ అంది అర్ధాంగి ధనలక్ష్మి. దేవయ్య
పట్నం వెళ్ళి సరుకులు కొని ఎడ్లబండిలో వేసుకుని
తిరిగొస్తుండగా, మార్గమధ్యంలో దొంగలు దాడిచేసి అతడివద్దనున్న డబ్బు, సామగ్రిని దోచుకెళ్ళారు. ఉన్నదంతా
ఊడ్చిపెట్టుకుపోవడంతో బిక్కమొహం వేసుకుని ఉత్త చేతుల్తో తిరిగొచ్చాడు
దేవయ్య. తీరా ఇంటికొచ్చేసరికి తలుపుకి
తాళం పెట్టి ఉంది. ‘నాన్నకి ఒంట్లో బాగోలేదని తెలిసి పిల్లలతో మా పుట్టింటికెళుతున్నా ను, ఈలోగా
మీరొస్తే తిన్నగా అక్కడికొచ్చేయండి’ అని ధనలక్ష్మి రాసిపెట్టిన
చీటీ తలుపుపై అంటించి ఉంది.
దాన్ని
చూసేసరికి దేవయ్యకి తిక్కరేగింది. తను వచ్చేంతవరకు ఆగకుండా
వెళ్ళిపోయినందుకు భార్యమీద పీకలదాకా కోపం వచ్చింది. రాత్రంతా
ఎడ్లబండి తోలుకుంటూ రావడం వల్ల బడలికగా
ఉంది. పైగా ఆకలితో పేగులు
ఆర్చుకుపోతున్నాయి. చూస్తే చేతిలో చిల్లిగవ్వలేదు. ఊళ్ళో ఎవరినైనా అప్పు
అడగడానికి మనసొప్పడం లేదు. అడిగినా ఎవరూ
ఇవ్వరని తెలుసు. అందుకే ‘దేవుడా!’అంటూ తిన్నగా అత్తవారింటికి
పయనమయ్యాడు. దారిలో ఓ గ్రామంలో పేదలకు
అన్నదాన కార్యక్రమం జరుగుతోందని తెలిసి బండిని ఆపి అక్కడకెళ్ళాడు. క్షుద్బాధ
భరించలేక అటూ ఇటూ చూసి
తనకు తెలిసిన వాళ్ళెవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆకు తీసుకుని
పంక్తిలో కూర్చున్నాడు. సుష్టుగా భోంచేసి బ్రేవుమని త్రేన్చాడు. కడుపు మంట చల్లారగానే
అతడికి జ్ఞానోదయమైంది. అన్నదానం మహిమ అర్ధమైంది. గతంలో
తాను ఇటువంటి మంచి కార్యక్రమాలకి పైసా
కూడా విదల్చనందుకు సిగ్గుపడ్డాడు.
ఆ
రోజు నుంచి ఊళ్ళో ఏ
కార్యక్రమం జరిగినా అడిగి మరీ చందాలివ్వసాగాడు.
అతడిలో వచ్చిన ఈ మార్పుకు జనమంతా
ఎంతగానో సంతోషించారు. ఎవరికైనా కడుపునిండా అన్నంపెట్టి సంతోషపెట్టవచ్చుగానీ, ధన ధాన్యాలిచ్చి సంతృప్తిపరచలేమని
దేవయ్య తెలుసుకున్నాడు. అన్నం పర్రబహ్మ స్వరూపం
కదా!