మంత్రిగారి సమయస్ఫూర్తి

ఒకప్పుడు మాళవ రాజ్యాన్ని మన్మధసేనుడనే రాజు పాలించేవాడు. వయసు మీదపడటంతో పెద్ద కుమారుడైన రవివర్మకు రాజ్యాధికారాన్ని అప్పగించాలనుకున్నాడు. వెంటనే తన మంత్రివర్యులను సంప్రదించాడు. ఉన్నఫళంగా రాజపురోహితుణ్ణి పిలిపించి యువరాజు పట్ట్భాషేకానికి ముహూర్తం పెట్టమని ఆదేశించాడు.

రాజపురోహితుడు రా మశాస్ర్తీ పంచాంగం తిరగేసి, “మహారాజా! వారంరోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. మళ్లీ ఆరుమాసాలవరకు మంచి ముహూర్తం లేదు ప్రభూ” అన్నాడు వినయంగా. ‘వ్యవధి తక్కువైనా ఫరవాలేదు, ముహూర్తం పెట్టండిఆదేశించాడు మహారాజు.

తన బిడ్డ పట్ట్భాషక్తుడవుతున్నందుకు తెగ సంబరపడి పోయింది రాణి మాలతీదేవి. ముహూర్తం ఖాయమవడంతో ఆర్భాటంగా యువరాజు పట్ట్భాషేక మహోత్సవానికి ఏర్పాట్లుజరుగుతున్నాయి. ప్రజలు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో చిన్నరాణి చాముండేశ్వరి అలిగిందన్న వార్త విని అంతఃపురానికెళ్ళాడు మహారాజు. అంతే, ఆమె అలకకు కారణం తెలుసుకుని హతాశుడయ్యాడు. ఆరునూరైనా తన బిడ్డ రఘువర్మకే పట్ట్భాషేకం జరిపించాలని మంకుపట్టు పట్టింది చాముండేశ్వరి. “రఘువర్మ చాలా చిన్నవాడు పెద్దవాడిని కాదని చిన్నవాడికి పట్ట్భాషేకం చేస్తే ఏం బావుంటుంది చెప్పు?’’అంటూ ఎన్నోవిధాల నచ్చజెప్పి చూసాడు మహారాజు. అయినా, ఆమె తన పట్టువీడకపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు.

ఇదిలా ఉండగా, పులిమీద పుట్రలా పొరుగుదేశం రాజైన జయచంద్రుడు మాళవ దేశంపై దండెత్తే యోచనలో ఉన్నాడన్న కబురు మోసుకొచ్చారు వేగులు. విషయం విన్న మహారాజుకు కాళ్లూ చేతులూ ఆడలేదు. ఎందుకంటే జయచంద్రుడు తనకంటె బలవంతుడు. అతడివద్ద లెక్కలేనంత సైనిక బలం వుంది. అటువంటి వ్యక్తితో యుద్ధానికి తలపడటమంటే కొండతో ఢీకొన్నట్లే. దాంతో మతిపోయింది మన్మధ సేనుడికి. వేగులు తెచ్చిన వార్త అంతఃపురానికి చేరడానికి ఎంతోసేపు పట్టలేదు. ముక్కుపచ్చలారని తన కుమారుడికి పట్ట్భాషేకం చేస్తే సింహాసనం అధిష్టించిన మరుక్షణం అతడు రణరంగానికి వెళ్ళవలసి ఉంటుందని గ్రహించి అదిరిపడింది చిన్నరాణి. రాత్రి మహారాజు అంతఃపురానికి చేరుకున్నప్పుడు- “మహారాజా! నేను నా కోరికను వెనక్కి తీసుకుంటున్నాను. మీరనుకున్నట్లే మీ పెద్ద కుమారుడు రవివర్మకే పట్ట్భాషేకం జరిపించండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు” అంది చాముండేశ్వరి.

మబ్బు తొలగిపోవడంతో అనుకున్న సమయానికి రవివర్మ పట్ట్భాషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిపోయింది‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాడు మన్మధసేనుడు. నెలలు గడుస్తున్నా జయచంద్రుడు మాళవ దేశంమీద దండెత్తకపోవడంతో అతడు మనసు మార్చుకున్నాడేమో? అని అనుకుంది చిన్నరాణి. రవివర్మ పట్ట్భాషేకానికి మార్గం సుగమం చేసేందుకే మహామంత్రి అలా నాటకం ఆడించాడని చాముండేశ్వరికి తెలియదు. తనను గండం నుంచి గట్టెక్కించిన మంత్రిగారి సమయ స్ఫూర్తికి తెగమెచ్చుకున్నాడు మన్మధసేనుడు.