అలసత్వం


ఇతరుల మంచి సలహాను పాటించడంలో అలసత్వాన్ని చూపినవాడు, ఏ విషయంలోనూ ఒకరి సహాయం నాకు అక్కరలేదన్న అహంకారం ఉన్నవాడు ఏ కార్యాన్నీ సమర్థంగా నిర్వహించలేడు. విజయాన్ని సాధించలేడు. సముద్రానికి ఏం తక్కువ? ఎప్పుడూ నీటితో నిండుగా ఉంటుంది. నదులన్నీ వెళ్ళి సముద్రంలోనే సంగమిస్తాయి. దానికితోడు దాని కడుపునిండా రత్నాలే, అయినా, అది ప్రతిక్షణం చంద్రుని సాన్నిధ్యాన్ని కోరుకుంటుంది. అలాగే మనకెంత ఐశ్వర్యం ఉన్నా తెలివైనవారు, బుద్ధిమంతులు, సమర్థుల సాంగత్యం కోరుకుంటే మన ఔన్నత్యం మరింత ఇనుమడిస్తుంది.

ఒకరి సహాయం నాకు అవసరంలేదు అనుకునేవాడు, అలసత్వాన్ని వదలనివాడు, కార్యాచరణలో తొందరపడేవాదు ఎప్పుడూ అపజయాల పాలవుతాడు, ఎన్నటికీ సుఖపడలేడుఅని భీష్ముడు ధర్మరాజుకు హితవుచెబుతూ దృష్టాంతంగా ఈ కధలు చెప్పాడు.

అలసత్వం అనర్థదాయకం:

పూర్వం ఒక ఒంటె బ్రహ్మదేవుణ్ణి గురించి చాలాకాలం తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దేవా! నా మెడ నూరు యోజనాలు పెరిగేటట్టు అనుగ్రహించుఅని వరం కోరుకుంది. వరం అనుగ్రహించి వెళ్ళిపోయాడాయన. ఆ వర గర్వంతో ఒంటె మిడిసిపడుతూ ఎవరి సహాయం కోరక, ఎవరితోనూ కలియక ఒంటరిగా, బద్ధకంగా ఉంటూ ఉండేది. ఒకనాడు ఓచోట పడుకొని తన పొడుగాటి మెడ చాచి అడవిలో మేస్తోంది. అప్పుడు పెద్ద వాన వచ్చింది. ఆ ఒంటె వెంటనే తన మెడను ఒక గుహలో దూర్చి హాయిగా నిద్రపోయింది. ఇంతలో ఒక నక్క అక్కడకు వచ్చింది. దానికి బాగా ఆకలి వేయడంతో గుహలో ఉన్న ఒంటె మెడను కొరుక్కుతినడం ప్రారంభించింది. ఒంటె తన మెడను వెనక్కు తీసుకోలేకపోవడం వల్ల నక్కకు ఆహారమైంది. ఎన్ని వనరులు ఉన్నా ఎన్ని వరాలు పొందినా అలసత్వం ఉంటే అవన్నీ నిష్ప్రయోజనమవుతాయి. అలసేన లబ్ధమపి రక్షితుం న శక్యతే!సోమరి దొరికినదాన్ని కూడా రక్షించుకోలేడు. కనుక అప్రమత్తంగా ఉండడం కార్యశూరుల లక్షణం. జాగరూకులై ఉన్నవారికి వెళ్ళిన దారి పూలబాట అవుతుంది.