సక్కియ నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్ర
సక్కియనాయనారు తిరుచంగమంగయిలోని వెల్లాల కులజుడూ. ఆయనకు
ఇహలోక వ్యాపకాలన్న అయిష్టత ఏర్పడింది. మోక్షమును పొందదలచాడు. మోక్షమునకు ఉత్తమమైన
మంచి మార్గ మభిలషించాడు. బౌద్ధుల ప్రచారము వలలోపడి బౌద్ధ మతావలంబి అయ్యాడు.
బౌద్ధమును స్వీకరించినా అది ఈయనకు ఎక్కువ కాలము సంతృప్తి నీయలేదు.
శైవమతమునకు ఆకర్షితుడయ్యాడు. బాహ్య చిహ్నములేవైనా, బాహ్య ప్రవర్తనమేదైనా దేవునియందు అచంచల భక్తి
ప్రపత్తులున్నచో మోక్షమునందగలడు అని నాయనారు మనస్సుకు గాఢంగా తట్టింది. బాహ్యంగా
బౌద్ధమత చిహ్నాలు వీడకపోయినా ఆయన మనస్సులో శివునియందు అచంచలమైన భక్తి ప్రపత్తులు
నెలకొన్నవి. శివుని గాఢంగా ప్రేమించాడు.
ఒకరోజున శివాలయములో బయట కూర్చుని శివలింగము గూర్చిన తలంపుతో
మైమరిచిపోయాడు. ఆ స్థితిలో శివలింగముపై తాను రాయిని వుంచుట తటస్థించింది. మరునాడు
దేవాలయమునకు వెళ్ళి వెనుకటి దినమున తానేమి చేసాడో ఒక్కసారి జ్ఞప్తికి
తెచ్చుకున్నాడు. భక్తుడు భక్తితో ఏమి సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. ఈ రోజు
కూడా శివునిపై రాయిని వేశాడు. రోజూ ఈ విధమైన పూజ జరిగింది. ఈ పని చేయనిదే ఆహారము
గూడ తీసుకునే బుద్ధయ్యేదికాదు. ఒకరోజున భోజనానికి కూర్చోగానే తాను రోజూ చేసే పూజ
చేయలేదని జ్ఞాపకానికి వచ్చింది. ఆకలిని గూడ మరచి దేవాలయమును దర్శించి భక్తితో
శివునిపై రాయి నుంచాడు. తక్షణమే పరమశివుడు ప్రత్యక్షమై ఆసీర్వదించి కైలాసానికి
తీసుకుని వెళ్ళాడు.