ఉపనిషత్లలో పూజలు, పురస్కారాల గురించి చెప్పలేదు. తత్వ విచారణ మాత్రమే ఉంది అది గ్రహించకుండా దేవత పూజలలో కాలం వ్యర్దం చేయడం దేనికి ?

ఉపనిషత్ జ్ఞానానికి దేవతా పూజల పట్ల విరుద్ధ భావమేమీ లేదు. వైద్యం గురించి, వంటల గురించి కూడా ఉపనిషత్తులలో చెప్పబడలేదు. అలాగని వైద్యాన్ని, వంటల్ని విడిచి పెడుతున్నామా! ఉపనిషత్తుల జ్ఞానం వేరు. వైద్యంలాంటి శాస్త్రాలు వేరు. ఇవి శరీరాన్ని బాగుచేయడానికి, పోషించడానికి చెప్పబడినవి. ఉపనిషత్తు తత్త్వాన్ని చెబుతోంది. తత్త్వాన్ని చింతనలో ఉంచుకొని మన క్షేమం కోసం చేయవలసిన కర్మల్ని మానకుండా చేసుకుంటాం.

అలాగే ఉపనిషత్తత్త్వాన్ని మననం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే, దేవతా పూజలు చేయవచ్చు. ఉపనిషత్తులు దేవతా పూజల్ని నిషేధించలేదు. దేని ప్రయోజనం దానిదే. ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు. దేవతాపూజ కేవలం అభీష్టసిద్ధికీ, అనిష్ట పరిహారానికీ మాత్రమే కాక, ౧. కృతజ్ఞతా భావంతోను౨. చిత్తశుద్ధికోసం, ౩. కృతఘ్నతా దోష నివారణ కోసం చేయాలి.


దేవతల వల్లనే ప్రకృతి శక్తులు, మన ఇమ్ద్రియ శక్తులు సమర్థవంతమౌతున్నాయి. కనుకనే కృతజ్ఞతగా వారిని అర్చిమ్చాలి. లేని పక్షంలొ కృతఘ్నతా దోషం వస్తుంది. అందుకే - ఉపనిషత్తు - "దేవపితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యమ్" - దేవపితృ కార్యాలలో ఏమరుపాటు కూడదు. - అంటే దేవతలను, పితృదేవతలను మరువరాదు’. యజ్ఞ, అర్చనాది కర్మల ద్వారా వారిని ఆరాధించడం మన విధి. వారి ఆరాధన వల్ల శుద్ధమైన చిత్తానికే తత్త్వవిచారం సాధ్యమౌతుంది.