శ్రావణ పూర్ణిమ - హయగ్రీవ జయంతి

జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం  |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||      

వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||

శ్రావణ పూర్ణిమ అంటే రక్ష కట్టుకోవడం అనేది దేశ రక్షణ కోసం అని, సోదరీ  సోదరులకు రక్ష కట్టినట్లయితే వారు రక్షణ కలిపిస్తారని చెబుతారు. శ్రావణ పూర్ణిమ అంటే అంతవరకే ప్రాధాన్యత కాదు. అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం.

  మనిషికి ప్రధానమైనది జ్ఞానం, జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు, శాస్త్రాలకు మూలం వేదం. ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికందరికి కంకణం కడుతారు, వారు రక్షకులు అవుతారు అని. జ్ఞానికి రక్షగా ఉంటారని. ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆతరువాత వేద అంగములైన శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, కల్పకం, చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుడిని ఉపాసన చేసుకొని మొదలు పెడుతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక, వేదాన్ని నేర్చినవారు తిరిగి ఇదే రోజునుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయణం మొదలు పెడుతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్దరించిన రోజు. 


భగవంతునికి లోకంపై ఉండే కరుణ చేత నామ రూపాలు లేని ఈ జీవరాశికి ఒక నామ రూపాన్ని ఇవ్వడానికి చతుర్ముఖ బ్రహ్మకు ఆయనకు వేదాన్ని ఉపదేశం చేసాడు. అయితే వేదం అనేది జ్ఞానం, అది అప్పుడప్పుడు అహంకారాన్ని తెచ్చి పెడుతుంది, అహంకారం ఏర్పడి ఉన్న జ్ఞానాన్ని పోయేట్టు చేస్తుంది. బ్రహ్మగారికి అట్లా ఇంత చేస్తున్న అనే అహంకారం ఏర్పడి వేదాన్ని కోల్పోయాడు ఎన్నో సార్లు. భగవంతుడు తిరిగి ఒక్కో రూపాన్ని ధరించి ఇస్తూ ఉండేవాడు. మశ్చావతారం, హంసావతారం ఇలా ఆయన వేదాన్ని ఇవ్వడానికి వచ్చిన అవతారాలే. చాలా సార్లు ఇచ్చినా కోల్పోయాడు, చివర హయగ్రీవ అవతారంలో ఇచ్చాక బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు. అది శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ రూపంలో. అంతకు ముందు పాడ్యమి నాడు చేసాడేమో అంతగా ఫలితం లేదు, అందుకే పౌర్ణమినాడు ఉపదేశం చేసి చూసాడు. అప్పుడు బ్రహ్మ వేదాన్ని కోల్పోలెదు. 

 మన శాస్త్రాలు అంటే ఎంతో కాలంగా ఆచరించి పొందిన అనుభవాల సారాలు. అందుకే "ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః" చాలా కాలంగా చేసిన ఆచారములే ధర్మములు, అవి మనల్ని రక్షించేవి కనుక వాటిని చెప్పేవి శాస్త్రాలు అయ్యాయి. శాస్త్రాలను బట్టి ఆచారాలు రాలేదు. బ్రహ్మ కాంచీపురంలోని వరదరాజ స్వామి సన్నిదానంలో చేసిన హోమం నుండి శ్రావణ పూర్ణిమనాడు  భగంతుడు గుఱ్ఱపుమెడ కలిగిన ఆకృతిలో వచ్చి గుఱ్ఱం యొక్క సకిలింత ద్వని మాదిరిగా వేదాన్ని వేదరాశిని ఉపదేశం చేసాడు. అందుకే హయగ్రీవ స్వామి శతనామావళితో ఆరాధన చేయాలి. హయగ్రీవ అనే రాక్షసుడిని సంహరించడానికి భగవంతుడు గుఱ్ఱపు ఆకారంలో అవతరించాడు అంటూ ప్రమాణికం కాని కథలను చెబుతారు. కానీ అట్లాటి ప్రస్తావన వేదవ్యాసుడు అందించిన ఏపురాణాలలో లేదు. 

శ్రీమద్భాగవతంలో శ్రీసుఖమహర్షి పరిక్షిత్తు మహారాజుకి చేసే ఉపదేశంలో హయగ్రీవ అవతారం కూడా భగవంతుడు వేదోద్దరణ కోసం ఎత్తిన అవతారం అనేది తెలుస్తుంది. వేద వ్యాసుడు చిట్ట చివరగా పురాణాల సారముగా అందించినదే శ్రీమద్భాగవతం. ఆ తరువాత ఆయన ఎట్లాంటి పురాణాలను అందించలేదు.

శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.