అన్నం తినడంలో కుడిచేతిని ఉపయోగించడం ఎక్కడి నుండి వచ్చింది?

ఏ పనికైనా కుడిచేతిని ( దక్షిణ హస్తాన్ని) ఉపయోగించడం మన అలవాటు. ఆలోచించి చూస్తే ఈ అలవాటు ఎక్కడి నుండి వచ్చింది? ఇది యుగయుగాలుగా మన వేద సంస్కృతి శాసించింది. ఇది మనకు అభ్యాసముగా మారింది. అసుర శక్తుల నుండి యఙ్ఞాన్ని కాపాడేందుకు దక్షిణ హస్త వినియోగాన్ని చేసినట్లుగా వేదం అభివర్ణిస్తోంది. అంటే ఎడమ చేయి ఆసురీ శక్తులను ( negative powers) ఆకర్షించే అవకాశముందన్న మాట.

ఎవరికైనా ఎదైనా ఇచ్చేటప్పుడు కూడా ఎడమచేత్తో ఇవ్వరాదు. రెండు చేతులతో కలిపి ఇచ్చే సందర్భాలలో వేరు. అలాగే ఎవరి చేతి నుండి అయినా ఏడమ చేతితో మాత్రమే వస్తువులను స్వీకరించరాదు.ఇది అగౌరవానికీ, నిర్లక్ష్యానికి చిహ్నం. మనకు దేవతాశక్తుల దీవెనలు లభించాలనే ఉద్దేశంతో పెద్దలు ఈ విధమైన సంప్రదాయాలను ఏర్పరిచారు.ఇవి ఎంతో సూక్ష్మ పరిశీలనతో ఏర్పరిచినవి.

ఇటివల మనదేశానికి దిగుమతి అయిన రేకి వంటి విద్యలలో కూడా కుడిచేయి దేవతా శక్తులకు సంకేతమనే సూచిస్తున్నారు. అలాగే మన పూజాదికాల ఆచారాలలో దక్షిణాచార, వామాచార అనే పద్ధతులు ఉన్నాయి. దక్షిణాచారం సాత్త్వికము, హితకరమూ, వ్యక్తికీ లోకానికీ శుభంకరము అని పెద్దలు చెబుతారు. ఈ ఆచారం లో కుడిచేతిని మాత్రమే ఉపయోగిస్తారు.

దేవతాపూజలు చేసేటప్పుడు కూడా పువ్వులు వేయడం, అర్ఘ్యపాద్యాదుల ధూపదీపనీరాజనాదులు సమర్పించడం కుడిచేతితోనే చెయ్యాలి. పూజా ద్రవ్యాలు మనకు కుడివైపునే ఉంచుకోవాలి. నివేదన చేసే ఆహారాదులు సైతం దక్షిణభాగాన్నే ఉండాలి. దక్షిణ హస్తంతోనే నివేదించాలి.

ఎంతో లోతైన పరిశీలనతో ద్రష్టలైన మన పూర్వీకులు చెప్పిన ఈ విషియాలను మనం పెడచెవిని పెడుతున్నాము. ఎన్నో చోట్ల ఎడమ చేతిని మాత్రమే ఉపయోగిస్తున్నాము. అన్నం తినడంలో ఏడమచేతిని వాడడం కూడా చూస్తూ ఉంటాము. రెండు చేతులతో తినడం అభారతీయం( అనాగరికం), ఇది రాక్షసాచారం. అసురీశక్తుల్ని ఆవహింప చేసుకుని అధోగతి పాలు అయ్యేందుకు అవకాశం. ఏడమ చేత్తో ఆహారపధార్ధాన్ని పట్టుకొని కుడి చేతితో తినడం తగదు. మన అలవాట్లలలో వైదిక మంత్ర బోధ ఎలా కలిసి పోయి వస్తోందో పై మంత్రాన్ని పరిశీలిస్తే అర్ధమూవుతుంది. ఇతరులకు వస్తువులను ఇచ్చేటప్పుడు కూడా ఏడమ చేతితో ఇవ్వడం అమర్యాద. పుచ్చుకోవడమూ అవలక్షణమే.

ఈ మర్యాదలు మనకి అలవాట్లుగా మార్చిన ఇన్నాళ్ళ సంస్కృతిని విస్మరిస్తే మళ్ళీ అభారతీయులమై సనాతన మార్గాన్ని తప్పిన వారమయ్యే ప్రమాదము ఉంది. కనుక తరువాతి తరాలకు ఈ చిన్న చిన్న విషియాలలో సైతం అప్రమత్తంగా ఉండే విధంగా మెలకువలు నేర్పడం పెద్దల బాధ్యత.