అమ్మవారు శివుడు చెప్పిన ప్రకారంగా వాడని బిల్వాల మాల

అమ్మవారు శివుడు చెప్పిన ప్రకారంగా వాడని బిల్వాల మాల వుందిట అక్కడ కాంచీపురంలో. జపమాల అన్నీ వున్నాయి. పైగా పరిచారికలు అక్కడ వచ్చి అమ్మవారికి నమస్కారం చేసి అన్నీ అందించారట. ఇప్పుడు అమ్మవారు అక్కడ తపస్సు చేశారు శివునికోసం. అక్కడ తపఃకామాక్షీరూపంతో ఆవిడ తపస్సు చేసింది. తపస్సు చేస్తున్నప్పుడు తన శక్తి పీఠాలలో వున్న శక్తినంతటినీ తన కళ్ళల్లోకి తీసుకున్నదిట. తన అక్షిలోకి సమస్త శక్తి పీఠాల శక్తిని లాక్కుంది. ఎందుకంటే కళ్ళతో పరమేశ్వరుని వశ్యం చేసుకోవాలి. శక్తినంతటినీ కళ్ళలోకి తెచ్చుకుంది కాబట్టి కామాక్షి. ఆ సమయంలో నారదుల వారు వచ్చి మంత్రోపదేశం చేశారు అమ్మవారికి. ఎందుకంటే సంప్రదాయం సంప్రదాయమే. 

గురువు దగ్గర మంత్రం తీసుకొని సాధన చేయాలి ఎవరైనా. అమ్మవారైనా మరొక రూపం ధరిస్తే మనకి సంప్రదాయం చెప్పడం కోసం ఆవిడకూడా నారదుని నుంచి పంచబాణమను అను ఒక మంత్రాన్నిస్వీకరించిందట. ఆ మంత్రమేమిటో చెప్తారా వ్రాసుకుంటాం అంటే సభలలో మంత్రం చెప్పకూడదు. కొంతమంది పంచబాణ అంటే పంచాక్షరీ మంత్రమే అనుకుంటూంటారు. తప్పులేదు కానీ పూర్తిగా ఒప్పు అని చెప్పలేం. పంచబాణమనేది ఒక రహస్యమైన మంత్రం. అయిదు బీజాక్షరాల మంత్రం. మహా కామేశ్వరీ కామేశ్వర విద్య అది. మహా కామేశ్వరీ కామేశ్వర స్వరూపమైన మంత్రం. 

ఆ మంత్రం అమ్మవారు జపం చేసింది శివుడిని ఉద్దేశ్యంలో పెట్టుకొని. అమ్మవారి ఆ జపంతో శివుడికి అమ్మవారిపై ప్రేమ పెరిగిపోయింది. విరహవేదన తట్టుకోలేకపోయాడు. శివుడు విరహ తాపంతో వుండడం చూసింది శిరస్సుపైనున్న గంగ. ఆయనని చల్లబరచాలి అని పొంగులువారి ఆయన శరీరాన్ని తడిపిందిట. అప్పుడు పరమేశ్వరుడు అక్కడ ఆవిడ తపస్సు చేస్తోంది భంగం చెయ్యి అని చెప్పాడు. శివుడి ఒంటిని తడిపిన గంగానది క్రమంగా దిగివచ్చి కైలాసం నుంచి కాంచీపురం వైపు ప్రవహిస్తూ వచ్చింది. మహానది పొంగుకు వచ్చి లింగాన్ని ఎక్కడ కొట్టేస్తుందా అనే భయంతో అమ్మవారు వస్తున్న గంగను చూసి "కంప కంప" అన్నది. అంటే వణికిందా తల్లి. భయకంపితురాలైపోయింది. ఎప్పుడైతే ఆ నదిని చూసి అమ్మవారు కంప అన్నదో అప్పటి నుంచి ఆ నదికి కంపానది అని పేరు వచ్చింది. అమ్మవారు ఆ నది ప్రవాహాన్ని ఆపాలి, శివలింగాన్ని కాపాడాలి అనే వుద్దేశ్యంతో తనశక్తులలో ఒకటైన కాళీ శక్తిని పిలిచింది. కాళి వచ్చి ఏం చేయాలమ్మా అని అడిగింది. 

ఇదిగో ఆ మహాప్రవాహం వస్తోంది అది శివలింగాన్ని ముంచేయకుండా నువ్వు అడ్డుకో అని చెప్పిందిట. వెంటనే కాళీశక్తి వచ్చి తన చేతిలో కపాలం పట్టుకొని వుంది. ఆ కపాలం పేరు విశ్వభక్షిణి. ఆ కపాలం పట్టి నదికి అడ్డుపెట్టిందిట. చిత్రం యేమిటంటే ఈ మహాశక్తి చేత అంత గంగానది ఈ కపాలంలోకి వెళ్ళిపోయింది. అప్పుడా తల్లి మంచి పని చేశావు శభాష్ అని మెచ్చుకుని నీకు నేను ఇప్పుడొక పేరు పెడుతున్నాను. ఇంత ప్రళయజలంలా వస్తున్న గంగని బంధించావు గనుక నీ పేరు ప్రళయబంధినీ దుర్గా అని పేరు పెడుతున్నాను అన్నది. ఇప్పటికీ కాంచీపురంలో ఈ అమ్మవారు వున్నారు. ప్రళయబంధినీ దుర్గా క్షేత్రం వుంది. ఈ తల్లికి నమస్కారం చేస్తే ప్రపంచానికి ఉత్పాతాలు రాకుండా కాపాడుతుంది. మనం ఇక్కడినుంచే నమస్కారం చేసుకుందాం. ఈ కథ వింటేనే విన్నవారికి బాధలు లేకుండా కాపాడుతుంది. పంచభూతలింగ మహాత్మ్యం వినడం సామాన్యం కాదు. అనేక జన్మల అదృష్టం వుండాలి. 

కాంచీపురంలో నలుగురు దుర్గలు వుంటారు. ముఖ్యంగా శివకంచిలో. ౧. ప్రళయబంధినీ దుర్గ, ౨. సంపత్కరీ దుర్గ - ఈవిడ సామాన్యురాలు కాదు. సంపత్కరీ దేవిగా కూడా భావించవచ్చు. సంపదలనిచ్చే తల్లి. ఒకావిడ ప్రళయాలనుంచి కాపాడేస్తుంది. ఇంకొకరు సంపదలిస్తుంది. ఇంకేంకావాలి? ౩. రేణుకాదుర్గ -ఆశ్చర్యకర ప్రసక్తి. ౪. వీరవరేశ్వరీ దుర్గ. గబగబా వెళ్ళిపోయి శివలింగం చూసి దణ్ణం పెట్టుకొని వస్తే లాభంలేదు. ప్రాకారంలోకి ప్రవేశించాక ప్రదక్షిణ చేయాలి. అక్కడ శివకంచి లోపల నాలుగు తీర్థాలున్నాయి. వాటిలో ఒకటి కంప.