యమునమ్మకు పుష్కరాల

దేశం నలుమూలనుంచీ లక్షలాది భారతీయులు శ్రద్ధావిశ్వాసాలతో యమునా జలాలను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో సరియైన రీతిలో పరిశీలిస్తే మన పూర్వీకుల ఔన్నత్యం అవగతమవుతుంది. పరమేశ్వరుడు ఎక్కడో అతీతంగా లేడనీ, ప్రకృతిలో ప్రత్యణువులో ప్రకాశిస్తున్నాడనీ, ఆ సత్యాన్ని ఆవిష్కరించుకొని నిరంతరం ఆనందంగా, ప్రేమగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా బతకమని బోధించడమే సనాతన మతసారం.

ఏడాదికో నదికి పుష్కరం. ఆ సమయంలో బృహస్పతి గ్రహ ప్రభాం, పవిత్ర పుష్కరుని దివ్యత్వం ఆయా నదులలో ప్రవేశిస్తుందని మన శాస్త్రాల మాట. ఏ రాజకీయ సిద్ధాంతాలు, సంఘసేవోద్యమాలు చేయలేని పనిని మన సనాతన సంస్కృతి సాధిస్తోమ్ది.

"ఈ దేశమంతా నాది" అనే భావన సనాతన ధర్మంవల్ల కలుగుతోంది. దేశమంతా ప్రవహించే నదులనీ, పుణ్యతీర్థాలనీ స్మరించుకుంటాం. పుష్కరాలు, కుంభమేళాలు వంటి పుణ్యకాలాల్లో, పండుగల్లో దేశమంతా ఒక నదీతీరానికో, ఒక దివ్యక్షేత్రానికో చేరి జనశక్తిని ప్రకటిస్తుంది. ఈ సమాగమంలో భాషల ఎల్లలు, ప్రాంతాల హద్దులు పనిచేయవు. పైగా - భిన్నప్రాంతాల సంస్కృతుల పరస్పరావగాహన, సామరస్య స్ఫురణ వెల్లివిరుస్తుంది. అన్ని భాగాలలోని కళలను, ఆచార వ్యవహారాలను ఒరికొకరు అందిపుచ్చుకుంటారు. తమ పూర్వీకులను తలంచుకొని వివిధ ధార్మిక కర్మలను ఆచరించడం కూడా మనిషికి పూర్వతరాల పట్ల వున్న కృతజ్ఞతనీ ధార్మికతనీ స్ఫురింపజేస్తుంది. ఈ విధంగా జాతీయ సమైక్యతను సాధిమ్చడంలో సనాతన ధర్మం బలవత్తర పాత్రను పోషిస్తోంది.

ఈ దేశపు నదులన్నింటికీ పురాణ కథలున్నాయి. వాటితో ఈ దేశవాసుల మనసులు మధురానుబంధంతో పెనవేసుకుపోయాయి. ఇవి కేవలం నీటి ప్రవాహాలు కావు. జీవ స్వరూపాలు. వీటికి ఆత్మ వుంది. అది మన ఆత్మలను పలకరిస్తుంది. మన పలకరింతలకు పులకరిస్తుంది. మనల్ని పోషిస్తుంది. లాలిస్తుంది. ఈ ప్రాణ బంధాన్ని మరింత అవగాహన చేసుకొనే ధార్మికతను ప్రబోధిస్తే, ఈ మాతృమూర్తుల పట్ల ప్రజల బాధతను తెలియజేసిన వారమవుతాం.

దేవతా మూర్తుల్నీ, అమ్మనీ ఎంత ప్రేమగా, భద్రంగా పవిత్రంగా చూడాలో అలాగే ఈ నదులపట్ల బాధ్యతతో, గౌరవంతో, పవిత్రతతో ప్రవర్తించాలనే స్పృహ ప్రతివారికీ కలగాలి, కలిగించాలి. అప్పుడే నిజమైన పుష్కర స్నానఫలం లభిస్తుంది. ఈ దేశపు అత్యధిక ప్రజావాహిని ఈ జలవాహినులలో కలసి జలకమాడి పూజించే ఈ పర్వాలను మతపరమైన క్రియలుగా భావించడం పరమ మూర్ఖత్వం. ఈ దేశప్రజలు అనాదిగా ఈ నేలతో, ఈ నీటిలో పెట్టుకున్న సనాతన బామ్ధవ్యానికి చిహ్నాలివి. అంటే - ఇవి ఈ దేశపు మట్టిలో పుట్టిన సంస్కృతికి ఆలవాలాలు. సంస్కారానికి సంకేతాలు. ఈ అవగాహన పాలకులకీ, ప్రజలకీ అవసరం. ప్రజలంతా పాల్గొనే ఈ చోట ఇంతటి అవగాహన, విశాల దృక్పథం కలిగించడంలో వివేకవంతులు తగిన బాధ్యత వహించాలి. ప్రతినది ఒడ్డునా మహా సామ్రాజ్యాలు, ఎన్నో నాగరికతలు, కళా సంస్కృతులు విలసిల్లిన ఘన చరిత్రలున్నాయి.

ఆ చరిత్రలు మిగిల్చిన అద్భుత వారసత్వ సంపదలున్నాయి. వాటిని స్మరించడానికి, కరదీపికలుగా గ్రహించడానికి, తరువాతి తరాలకు అందించడానికి ఇంత చక్కని పర్వ వేళలను ఏర్పరచారేమో మహర్షులు. ఒక్క మంచి పనితో, వేలాది సత్ప్రయోజనాలను సాధింపజేసే ఇలాంటి ఉత్సవాలు, వేడుకలు ప్రజలందరి హృదయాలను ఒకే సూత్రంతో ఏకీకృతం చేసే అద్భుత సాధనాలు.