వైద్యుడు నారాయణుడైన శ్రీహరి

శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే
షధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః!!

ఆ శ్లోకం పూర్తి పాఠమిది. "కృశించిపోయే లక్షణం గల, వ్యాధిగ్రస్తమైన ఈ శరీరానికి నిజమైన ఔషధం గంగాజలం.  వైద్యుడు నారాయణుడైన శ్రీహరి అని అర్థం.

శరీరం ధరించిన జీవుడు తనలోని జన్మాంతర పాప పంకిలాన్ని శుద్ధిచేసుకోవడం ముఖ్యకర్తవ్యం. అందుకు పవిత్ర గంగాజలపానం, శ్రీహరి స్మరణ ముఖ్యం. ఈ రెండే జీవన సార్థకతలు. జన్మకి సాఫల్యాలు అని చెప్పే బోధన ఇది. అంతేకాక - గంగాస్మరణ, నారాయన స్మరణ శక్తిమంతమైనవి. ఈ శ్లోకం చదివినవారికి వైద్యునిలోనున్న ప్రతిభారూపమైన నారాయణ శక్తి అనుకూలిస్తుంది. సరియైన స్ఫురణతో శ్రీహరి వైద్యుని ప్రేరేపిస్తాడు. వైద్యునిలోని వైద్యశక్తి పరమేశ్వరుడైన శ్రీహరి రూపమే కదా! హరిస్మరణతో అది మనల్ని బాగు చేసేలా ప్రేరేపించబడుతుంది. అలాగే గంగాస్మరణతో ఔషధం పవిత్రమై, ప్రభావశాలి అవుతుంది. పరానికీ, ఇహానికీ పనికివచ్చే ప్రయోజనాలను ఇచ్చే పరంపరాగత శ్లోకమిది.