పురందర దాసు
పరమాత్ముడు తలచుకుంటే పరమ లోభితో మహా దానాలు చేయించగలడు ...
పరమ నాస్తికుడితో మహా యాగాలు చేయించగలడు. మహా భక్తుడైన 'పురందర దాసు' జీవితం కూడా ఇందుకు
ఉదాహరణగా కనిపిస్తుంది. పురందరదాసు పూర్వనామం శ్రీనివాసుడు క్రీ.శ.15 వ శతాబ్దంలో ఆయన కర్ణాటక రాష్ట్రం హంపి సమీపంలోని 'పురందర గడ'లో కమలాంబ - వరదప్ప
దంపతులకు జన్మించాడు. శ్రీమంతుల కుటుంబానికి చెందిన పురందర దాసు సంస్కృత - ఆంధ్ర
భాషల్లో పాండిత్యాన్ని గడించాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆయనకి సరస్వతీ బాయితో
వివాహం జరిగింది.
భగవంతుడు ఆయనకి ఏ లోటూ లేకుండా చూస్తున్నప్పటికీ, ఆయన మాత్రం ఎవరికీ ఎటువంటి సహాయం చేసేవాడు కాదు. అలాంటి
పరిస్థితుల్లో తనది కానిది తనకి తెలియనిది ఏదీ లేదంటూ పాండురంగడు ఒక లీలా
విశేషాన్ని చూపుతాడు. దాంతో ధనం పట్ల అతనికి గల కోరిక, వ్యామోహం ఆవిరైపోతాయి.
పురందరదాసు తన దగ్గర గల ధనాన్ని పేదలకు పంచి ఆయన భక్తుడిగా మారిపోతాడు. వ్యాసరాయల
వారి చెంత మంత్రోపదేశం పొంది, అనుక్షణం పాండురంగడి
నామస్మరణ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆ పాండురంగడి పై నాలుగు లక్షల
డెబ్భై అయిదు వేల కృతులు రచించాడు.
ఒకసారి ఓ రాత్రివేళ పురందరదాసుకి బాగా దాహం వేసింది.
మంచినీళ్ల కోసం అప్పన్నను పిలిచాడు. చాలాసార్లు పిలిచాక అప్పన్న మంచినీళ్ళు తెచ్చి
ఇచ్చాడు. ఆలస్యంగా తెచ్చినందుకు కోపంతో అతని చెంపపై పురందరదాసు ఒక దెబ్బ కొట్టాడు.
మరునాడు ఉదయం ఆయన గుడిలోకి వెళ్లే సరికి పాండురంగడి విగ్రహం ముఖంలో అతనికి
స్పష్టంగా మార్పు కనిపించింది. ఒక చెంప వాచి ఆ వైపు కంటి నుంచి నీరుకారుతుండటం
చూసి ఆలోచనలో పడ్డాడు.
అప్పన్నను పిలిచి రాత్రి తాను మంచినీళ్లు అడగడం అతని చెంపపై కొట్టడం గురించి ప్రస్తావించాడు. తనకేమీ తెలియదని అతను చెప్పడంతో,
ఆ రూపంలో వచ్చింది ఆ పాండురంగడేనని అతనికి
అర్థమైపోయింది. దాంతో తనని మన్నించమంటూ స్వామి పాదాలపై సాష్టాంగపడి నమస్కరించాడు.
అందరూ చూస్తుండగానే స్వామి కంటినీరు ఆగిపోయింది. దాంతో మహాభక్తుడైన పురందరుడికి
అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.