భద్రాద్రి రాముడు
ఈ శ్రీరామ నవమికి సరిగ్గా 360 సంవత్సరాల క్రితం ఇదే నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి
ఆదివారం నాడే రామదాసు ఈ ఆలయానికి దేవ, బ్రాహ్మణ వత్తులు
నిలిపి, శ్రీహరి సన్నిధిన జరిగే
ఉత్సవ ప్రకరణముల వివరణములతో దేవాలయ ఆవరణలో రామస్తంభం అనే పేర శిలాశాసనాన్ని
వేయించాడు. అయితే, క్రీ.శ.1769లో ధంసా అనే బిరుదున్న ముస్లిం నాయకుడు తన సేనలతో భద్రాచల
రామాలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నాడు. రామస్తంభ శాసనాన్ని కూడా ఎవరో
విరగ్గొట్టారు. అదే శాసనాన్ని 180 సంవత్సరాల తర్వాత నాటి
నిజాం నవాబు ప్రధాని చందూలాల్ ప్రోద్బలంతో ఇప్పటికి (సరిగ్గా 180 సంవత్సరాల కిందట) మళ్లీ రాజా తూము లక్ష్మీనరసింహదాసు,
వరద రామదాసు నకీ.శ.1832లో) చెక్కించి నిలిపారు. ఆ శాసనాన్ని భక్తులు ఇప్పుడు
భద్రాచలం ఆలయ ఆవరణలోనే ప్రధానాలయం వెనుక చూడవచ్చు. భక్తులు సులభంగా అర్థం
చేసుకోవడానికి వీలుగా ఆ శాసన పాఠాన్ని యధాతథంగా ఇప్పుడు మనకు అర్థమయ్యే అక్షరాలలో
అందిస్తున్నాను.
స్వస్తిశ్రీ విజయాభ్యుదయ
శాలివాహన శక వర్షంబులు 1574 అగు నేటి వర్తమాన
వ్యావహారిక చాంద్రమాన నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ భానువారం శ్రీ భద్రాచల
సీతారామచంద్ర మహా ప్రభువు వారి సన్నిధాన శ్రీరామదాసు గారు శ్రీ తానీషా గారి అనుమతం
వెంబడిన జరిగించిన దేవ బ్రాహ్మణ వత్తులు శ్రీవారి సన్నిధాన జర్గే ఉత్సవ ప్రకరణములు
రాసివున్న శాసనం ధంసా ప్రపంచంలో శ్రీవారు పోలవరం వలస వేంచేసినప్పుడు వక
దుర్మార్గుడు శాసనం చెక్కి వేసినందున సర్వజనులకు తెలిసి సంతోషించేటందుకు లేకపోగా
దుర్మార్గుడు పుత్ర మిత్ర కళత్రాదులతోటి నశించిపోయినాడు.
తదనంతరం శాలివాహన శక
వర్షంబులు అగు నేటి 1754 నందన నామ సంవత్సర చైత్ర శు 9
ఇందువారం భద్రగిరి రామదాసు అనే రామదాసు హంశను
జన్మించిన భక్తుడు కంచీ నగరం నుంచి శ్రీ భద్రాద్రికి వచ్చి తనకు తన భార్యకు గల సకల
ఆభరణములు ధనము శ్రీవారికి అర్పణ చేసి ఆయన తల్లి అయిన రంగమ్మ అనే మభాగ్యవతి అనుమతం
వెంబడి ఆత్మ కుటుంబంతో కూడా హరిదాసులై స్త్రీలు సమ్మార్జన కయింకర్యమున్నూ పురుషుడు
భజెన మొదలయిన సేవాదులున్నూ జర్గిస్తుండగా శ్రీవారు నాసరుద్దవులా వారి నవాబుగిరిలో
చందూలాల్ అనే భగవదంశ సంభూతుడ్కి స్వప్నమందు దర్శనం కపచేసి వరద మొహరుతోటి వరద
రామదాసు అనిన్ని హసనబాదు పరగణా శ్రీవారి మొహరుతోటి వరద రామదాసు దస్కతుతోటి అమలు
జరిగించవలసిందనిన్ని, అదివరకు దుర్మార్గులు
ప్రపంచ పరిపాలన చేసులచాతను దేవ బ్రాహ్మణ వత్తులు నిరాటంకంగా జరగటం లేనందున అవి
విమర్శగా జరిగించవలసినదనిన్ని ఆజ్ఞ యిచ్చినందున చందూలాల్ అనే భగవదంశ సంభూతుడు అతి
భక్తియుక్తుడై భగవదాజ్ఞ ప్రకారం దేవ బ్రాహ్మణుల ఆగ్రహారాలు, వత్తులు రుస్ములు మొదలయినవిగాను అమాని గ్రామాదులు 55
సరబస్తాలు 11 సాయరున్ను శివాయ బాపతులతో కూడ 71 డెబ్బయి వక్క వెయ్యి చలామణీ రూపాయీల్కు హసనాబాదా పరగణా రకం
మేరుపరిశి అంద్కుగా 32 వేలు సర్కారుకు నగదు
చెల్లించె లాగున్నూ 100 జనం శిబ్బంది తోపు శ్రీవారి
సన్నిధిలో తయినాతీ వుండేలాగున్నూ వారికి 8000 రూపాయలు ప్రతి సంవత్సరం జీతాలు యిచ్చే లాగునను 18500
శ్రీవారి కైంకర్యము క్రింద జరిగేటట్టున్ను,
12500 సాదరు శిబ్బంది దరబారు వ్యయం నిమిత్తం గాను
నిర్ణయం చేసి అమలు వరద రామదాసు పరం చేసినారు. గనుక భవదనుగ్రహపాత్రుడైన రాజా తూము
లక్ష్మీ నరసింహ దాసున్ను, వరద రామదాసున్ను శ్రీహరి
ప్రేరణ వెంబడి హసనాబాదా పరగణాలో వుండే దేవ బ్రాహ్మణ వత్తులు అగ్రహారములు విమర్శించి
సర్వదుంబాలా జర్గలందులకు యేరుపాటు చేశిన వివరం.