సీతామాత మహత్త్వము - త్యాగరాజు వారి 'మా జానకి చెట్ట బట్టగా'

భక్తి జ్ఞాన వైరాగ్యములే కాకుండా చమత్కారంతో కూడిన కీర్తనలు త్యాగయ్య రచించాడు అనటానికి నిదర్శనం ఈ మా జానకి కీర్తన. నీ గొప్పతనము ఏమి లేదు, అంతా సీతమ్మ వలెనే నీకు కీర్తి అని రామునిపై చమత్కరిస్తు త్యాగయ్య నుతిస్తాడు. కాంభోజి రాగము గురించి చెప్పేది ఏముంది?. పైర గాలికి ఊగే పచ్చని వరిచేల నృత్యంలా, లయబద్ధంగా సాగే సీతారాముల డోలోత్సవంలా మృదువుగా సాగుతుంది ఈ రాగం. అటువంటి రాగానికి మహారాజపురం సంతానం వంటి విద్వాంసుల గళము కూడితే అది ఒక సుందర దృశ్య కావ్యమే. ఈ కీర్తన సాహిత్యము, అర్థము, శ్రవణం. 

సాహిత్యము:

పల్లవి: మా జానకి చెట్ట బట్టగా మహారాజువైతివి


అనుపల్లవి: రాజ రాజవార! రాజీవాక్ష విను! రావణారియని రాజిల్లు కీర్తియు ||మా జానకి||

చరణం:
కానకేగి యాజ్ఞ మీరక మాయాకారమునిచి శిఖి చెంతనే యుండి
దానవుని వెంటనే చని యశోక తరు మూలనుండి
వాని మాటలకు కోపగించి కంట వధియించకనే యుండి
శ్రీనాయక! యశము నీకే కల్గజేయలేదా త్యాగరాజ పరిపాల  ||మా జానకి||

అర్థము: 
మా సీతాదేవి నీ సహధర్మ చారిణి కావటం వలన నీవు మహారాజువైతివి. ఓ సార్వభౌమా! రావణుని సంహరించిన వాడు అనే గొప్ప కీర్తి నీకు సీతాదేవి వల్లనే కలిగింది. ఓ సీతాపతి! త్యాగరాజ పరిపాలా! నీతో అరణ్యమునకు వెళ్లి, నీ ఆజ్ఞ మీరక ప్రవర్తించుచు ఉన్నంతలో రావణుడు బలాత్కారముగా ఆమెను అపహరింప, వాని దగ్గర తన మాయా రూపమునే ఉంచి, తన నిజరూపుమును అగ్నిదేవుని చెంతనే ఉంచి, రావణునితో లంకకు పోయి, అక్కట అశోక వృక్షము నీడన ఉంది. రావణుని బెదిరింపు మాటలకు కనుచూపుతోనే వాని వధించే శక్తి కలిగియున్నా కూడా, రాక్షస స్త్రీలు మరియు రావణుడు పెట్టిన బాధలన్ని సహించి నీకు యశము కలిగించినది.

పరిశీలన: 
సీతాదేవి అయోనిజ, అసమాన పతివ్రత. తండ్రి మాట నిలుపుట కొరకు సాక్షాత్తు శ్రీహరి అవతారమైన తన భర్త పదునాలుగేండ్ల వనవాసానికి బయలుదేరుతుండగా, ఆయన ఎంత వారించినా, 'ధర్మపత్నిగా నీ సేవలో ఉండుటే నాకు నిజమైన భోగము, యోగము, ధర్మము' అని స్పష్టంగా, దృఢ సంకల్పముతో రాముని ఒప్పించి ఆయనతో అడవులకు నారచీరలో అనుగమిస్తుంది.  ఇక అప్పటినుంచి ప్రతి అడుగు ఆయన కను సన్నలలోనే. దండకారణ్య ప్రవేశము ముందు సీతారాములు అత్రి అనసూయల ఆశ్రమము దర్శిస్తారు. అక్కడ అతి వృద్ధులైన ఆ దంపతులకు సేవ చేస్తారు. ఆ సాధ్వి అనసూయ స్వయంగా సీతాదేవి పాతివ్రత్యాన్ని ఎంతో పొగడి ఆశీర్వదిస్తుంది. త్రిమూర్తులకు తల్లియైన ఆ అనసూయ (అసూయలేనిది) మన్ననలను పొంది సీత పతివ్రతా శిరోమణి అవుతుంది. 

రావణుడు తనను అపహరించ వచ్చినప్పుడు తన నిజరూపాన్ని అగ్నిదేవుని వద్ద దాచి, మాయా రూపములో రావణునితో వెళ్లి, వాని సంహారమునకు కారణయై, ఆ కీర్తి భర్తకు కలిగేలా పరిస్థితులు కలిగిస్తుంది ఆ లోకపావని.  యుద్ధానంతరము అగ్నిదేవుడు ఈ సీతాదేవి నిజరూపాన్ని తిరిగి రామునికి అప్పగించినట్లు కొన్ని రామాయణాల్లో ఉంది.

తరువాత లంకలోని అశోవనంలో తనలోని సంకల్పాన్ని తనను వెదకుతూ వచ్చిన రామదూత హనుమంతునికి అద్భుతంగా వివరిస్తుంది. 'అమ్మా! నీవు నా భుజాలపై ఎక్కు, చక్కగా నేను నిన్ను రాముని ముంగిట ఉంచుతాను' అని హనుమంతుడు మాతను వేడుకుంటాడు. అప్పుడు సీత, తనను వక్షస్థలములో పొడిచిన కాకాసురునిపై రాముడు బ్రహ్మాస్త్రము ప్రయోగించుట, ఆ కాకి ముల్లోకాలు తిరిగి, చివరకు రాముని శరణు వేడుట అనే కాకాసుర వృత్తాంతాన్ని ఉదాహరించి, అంత చిన్న కాకిపైన అంత క్రోధాన్ని చూపిన రామునికి తనపై గల ప్రేమను వివరించి, అటువంటి రఘువంశ తిలకుడు, దశరథ కుమారుడు స్వయంగా వచ్చి రావణుని సంహరించి నన్ను తీసుకువెళ్తాడు అని హితవు పలుకుతుంది. అంతకు మునుపు తనను బెదిరించ వచ్చిన రావణునికి, తన చుట్టూ చేరిన రాక్షస స్త్రీలకు కూడా రాముని యశమును, శౌర్యమును గట్టి మాటలతో త్రిప్పి కొడుతుంది. తన భర్తపై అంతటి సడలని నమ్మకము, ప్రేమ కలిగిన సీతాదేవిని, ఆమె సుగుణములను, పాతివ్రత్యాన్ని చమత్కారముగా ఈ కీర్తనలో నుతించారు త్యాగయ్య.
శ్రవణం మహారాజపురం సంతానంగారి గళంలో.