లోలార్కుని కథ

పూర్వం పరమేశ్వరుడు సూర్యుని పిలిచి ఈ విధంగా చెప్పాడు. "ఓ సూర్య దేవా! నువ్వు వెంటనే పవిత్రమైన కాశీనగరానికి వెళ్ళగలవు. అక్కడున్న రాజు దివోదాసుడు పరమధార్మికుడు.నేను కాశీ నగరంలో ఉండాలని అనుకుంటున్నాను. అది దివోదాసు అధర్మంగా నడుచుకున్నప్పుడే సాధ్యము అవుతుంది. ఇందుకే నేను ఎంతో మంది దేవతలను .ఋషులను కాశీ నగరానికి పంపాను. వాళ్ళంతా కలిసినప్పటికీ దివోదాసుడు ధర్మాచరణలో చిన్నమెత్తు లోపము కూడా కనిపెట్టలేకపోయారు. వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం కావడంతో అందరూ తిరిగివచ్చారు. ఈ సమస్త భూమండలంలోని ప్రాణుల గురించి నీకు బాగా తెలుసు. అందుకే నిన్ను "లోక చక్షువు" అన్నారు .నా సంకల్ప సిద్ధి కోసం నువ్వు కాశీ నగరానికి వెళ్ళ్గలవు. దివోదాసుని అధర్మంగా మార్చగలవు.కాని ఆయనను అవమానపరచవద్దు.ఎందుకంటే మంచివారిని అవమాన పరిస్తే పాపాలు చుట్టుకుంటాయి.


పరమేశ్వరుని ఆఙ్ఞను పరిపాలించడానికి శిరస్సువంచి ఆదిత్యుడు కాశీ నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఎంత గాలించినప్పటికీ, కర్మ సాక్షికి అధర్మవర్తనులు ఎంత మాత్రం కనిపించలేదు. అతను అనేక రూపాలు ధరించాడు. అక్కడి ప్రజలను తప్పు దోవ పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఐనప్పటికి ప్రజలు ధర్మమార్గాన్ని వదలలేదు.

ఇంకా చెప్పాలంటే స్త్రీపురుషులు తలచినంత మాత్రంలోనే అనేక సౌకర్యాలు కలుగవచ్చు. కానీ కాశీక్షేత్రంలో నివాసము మాత్రము అంత సులభముగా ప్రాప్తించదు. ఇలాగ కాశీ క్షేత్ర ధార్మిక ప్రభావంతో సూర్యుని మనస్సు కూడా కాశీనివాసానికై ఆరాటపడసాగింది. ఆదిత్యుడు ఆ విధంగా కాశీవాసలోలుడు కావడంవల్ల "లోలార్కుడు" అనే పేరుతో ప్రసిద్ధమై ,శివుడు చెప్పిన పనిని మరిచి కాశీనగరానికి దక్షిణ దిశనున్న వరుణ - అసి సంగమ ప్రదేశానికి సమీపములో స్థితుడు అయ్యాడు.

ప్రత్యేకించి సప్తమి తిధులలో కానీ భానువారం నాడు స్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త పాపాల నుండి విముక్తులు అవుతారు అని ప్రతీతి. ఈ స్వామిని దర్శించుకున్నంత మాత్రాననే మన దరికి ఎటువంటి దుఃఖాలు దరి చేరవు.


శ్రీ మిత్రాయ నమః