పచ్చకర్పూరం ముద్ద


స్వామికి ప్రతిరోజూ గడ్డం దిగువన ఒకటిన్నర తులాల మేలిరకం పచ్చకర్పూరం ముద్దను అద్దాలి! దీని కథ ఏమంటే, రామానుజాచార్యులు వారి కోరిక మేర తిరుమలపై నివాసం ఉంటూ, పూలతోట పెంచుతూ, నిత్యం స్వామి వారికి నవనవలాడే నాజూకు పూలు, పూల దండలను శ్రద్ధతో సమర్పించే ఆప్తశిష్యుడైన అనంతుడు ఒకనాటి ఉదయం సతీసమేతంగా పూలతోటలో నీళ్ళు పోస్తుంటాడు. దంపతుల భక్తిభావానికి, నిస్వార్థ సేవకు మురిసిపోయిన శ్రీనివాసుడు బాల వటువురూపంలో వచ్చి వారికి సహాయ పడబోగా ఆ అల్లరి పిల్లవాడు తమ పనులకు అడ్డు తగులుతున్నాడని భ్రమించి ఆగ్రహించిన అనంతుడు అతడిపై గడ్డిపార విసురుతాడు. ఆ గడ్డపార కొన ఆ బాలుని గడ్డం క్రిందుగా రాచుకుంటూ వెళుతుంది. వెంటనే ఆ బాలుడు ఆలయంవైపు పరుగిడుతూ అంతర్థానమవుతాడు!


తీరా, అనంతుడు పూలు తీసుకుని సాయంకాలం గర్భగుడికి వెళ్ళి చూడగా స్వామివారి గడ్డం దిగువన గాయం కనిపిస్తుంది. అతడికి వెంటనే ఉదయం జరిగిన సంఘటన గుర్తుకి వస్తుంది. పట్టరాని పశ్చాత్తాపంతో, ప్రేమాభిమానంతో అతడు తక్షణమే అక్కడ ఉన్న పచ్చకర్పూరం ముద్ద తీసుకుని గాయంపై గట్టిగా అడుముతాడు. దాంతో క్షణాలలో చిత్రంగా గాయం మాయమై అక్కడ గుర్తుగా మచ్చ మాత్రం మిగిలిపోతుంది. అదిగోఅప్పటినుంచి స్వామివారి గడ్డంపై ఈ పచ్చకర్పూరం అద్దడమనే ఆచారం ఏర్పడింది. ఈ మచ్చ మనకు విగ్రహంలో అగుపించడం ఒక మహావింత!