శ్రీమన్నారాయణుని లీలావతారాలు

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందములో అత్యంత సంక్షిప్తంగా శ్రీమన్నారాయణుని లీలావతార వర్ణనం ఉన్నది. బ్రహ్మదేవుడు నారద మహర్షికి బోధించినదానిని, శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు తెలియజేస్తాడు. ఈ సారాన్ని బ్రహ్మదేవుడు నారదునికి బోధించిన కాలం శ్రీరామావతారానికి ముందరిదని గమనించగలరు. పోతన భాగవతంయోక్క వాడుక తెనుగు అనువాదంనుండి యథాతదంగా ఈ టపాలో పొందుపరిచాను. అనువదించినది శ్రీ సముద్రాల లక్ష్మణయ్యగారు.

నారద బ్రహ్మ సంవాదమునారదా! మునీశ్వరులు తమ శరీరం, ఇంద్రియాలు, మనస్సు ప్రసన్నంగా వున్నప్పుడు మాత్రమే ఆ పరమాత్ముని మహితకళావిలసితమైన స్వరూపం చూడగలరు. ఎప్పుడు వాళ్ళు కుత్సితమైన తర్కవితర్కాలనే తమస్సుకు లోబడి అఙ్ఞానులై ప్రవర్తిస్తారో అప్పుడు ఆ దేవుని స్వరూపం గుర్తించలేరు.
నారద బ్రహ్మ సంవాదము
 నారద బ్రహ్మ సంవాదము

అని చెప్పి మళ్ళీ బ్రహ్మ ఇలా అన్నాడు.

పాపరహితుడా! వేయి తలలు, వేయి నేత్రాలు, వేయి పాదాలు కలిగి ప్రకృతిని ప్రవర్తింపజేసే ఆదిపురుషుని రూపమే మహాతేజస్వి అయిన ఆ దేవదేవుని మొదటి అవతారం. ఆ అవతార స్వరూపం నుండి కాలమూ స్వభావమూఅనే రెండు శక్తులు పుట్టాయి. అందులోనుంచి కార్యకారణరూపమైన ప్రకృతి పుట్టింది. ప్రకృతి నుండి మహత్తత్వం పుట్టింది. దానినుండి రాజసాహంకారం, సాత్వికాహంకారం, తామసాహంకారం అనే మూడు అహంకారాలు పుట్టాయి, వాటిలో రాజసాహంకారంనుండి ఇంద్రియాలు పుట్టాయి. సాత్వికాహంకారం నుండి ఇంద్రియగుణాలు ప్రధానంగా గల ఇంద్రాది దేవతలు పుట్టారు. తామసాహంకారం నుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే తన్మాత్రలు పుట్టాయి. ఆ తన్మాత్రలనుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు ప్రభవించాయి. వాటినుండి త్వక్కు, చక్షువు, శ్రోతం, జిహ్వ, ఘ్రాణం అనే ఙ్ఞానేంద్రియాలూ, మనస్సూ పుట్టాయి.

 విరాట్పురుషుడు

స్వయంప్రకాశుడైన స్వరాట్టువీటన్నిటి చేరికవల్ల విశ్వస్వరూపుడైన విరాట్పురుషుడు ఉదయించాడు. అతని నుండి స్వయంప్రకాశుడైన స్వరాట్టు ఆవిర్భవించాడు. అతనిలో నుంచి చరాచర రూపాలతో స్తావరజంగమాత్మకం అయిన జగత్తు పుట్టింది. అందుండి సత్త్వగుణ స్వరూపుడైన విష్ణుడూ, రజోగుణ స్వరూపుడైన హిరణ్యగర్భుడనబడే నేను, తమోగుణ స్వరూపుడైన రుద్రుడూ జన్మించాము. అందుండే సృష్టి ఉత్పత్తికి హేతువైన నాలుగు ముఖాల బ్రహ్మ ఉద్భవించాడు. ఆయనవల్ల దక్షుడు మొదలైన తొమ్మిది మంది ప్రజాపతులు పుట్టారు. వారినుండి నీవు, సనందుడు మొదలైన యోగీశ్వరులు, స్వర్గలోకంలో వుండే ఇంద్రాదులు, పక్షిలోక రక్షకులైన గరుడాదులు, మానవలోకాన్ని పాలించే మనువు, మాంధాత మొదలగువారు, తలలోకాన్ని పాలించే అనంతుడు, వాసుకి మొదలైన వారు, ఇంకా గంధర్వులూ, సిద్దులూ, విద్యాధరులూ, చారణులూ, సాధ్యులూ, రాక్షసులూ, యక్షులూ, ఉరగులూ, నాగులూ ఆ జాతులను పాలించేవారూ, ఋషులు, పితృదేవతలు, దైత్యులు, దానవులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కూశ్మాండులు మరిన్నీ పశుమృగాదులు ఉద్భవించాయి.


ఇలాంటి జగత్తు మొదటి పుట్టుకను మహతత్త్వ సృష్టి అంటారు. రెండవది అండగతమైన సృష్టి. మూడవది సమస్త భూతగతమైన సృష్టి. అందులో ఐశ్వర్యమూ, తేజస్సు, బలమూ గల పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీ మన్నారాయణుని అంశమందు పుట్టినవారుగా తెలుసుకో. ఆ అరవిందాక్షుని లీలావతారాలకు అంతం లేదు. అయన ఆచరించే మంచి పనులు లెక్కించడం ఎవరికీ శక్యం గాదు. ఆయినా నాకు తోచినంత వరకూ నీకు వినిపించుతాను. విను.