శ్రీ మన్నారాయణుని లీలావతారంబుల యభివర్ణనము

సూరివరేణ్యులకు ఆరాధనీయుడవైన నారదా! రేయింబవళ్ళూ ఇతరకథా ప్రసంగాలు వింటూ ఏ మాత్రం పుణ్యకథల పొంతబోని వీనులకు విష్ణుకథలు విందుచేస్తాయి. సకల లోక పూజనీయమై వెలుగొందే ఆ దేవదేవుని దివ్యమంగళ కథాసుధారసాన్ని నేను నీకు అందిస్తాను. ఆసక్తితో ఆస్వాదించవయ్యా! ఈ విధంగా పలికి నారదుని చూచి బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పసాగాడు.

యఙ్ఞవరాహావతారం
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడుండేవాడు. వాడు బాహుబలాటోపంతో భూచక్రాన్ని చాపచుట్టినట్లు చుట్టి సాగరగర్భంలో దాగాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యఙ్ఞవరాహరూపం ధరించి ఆ దానవరాజుతో దారుణమైన రణం చేశాడు. అపార పారావారం నడుమ కోరలతో క్రుమ్మి ఆ రక్కసుణ్ణి ఉక్కడించాడు. వజ్రాయుధం వ్రేటుకు నేలగూలే మహాపర్వతం లాగా వాడు అతిభీకరాకారంతో క్రిందపడ్డాడు. ఇది యఙ్ఞవరాహావతార కథ.

సుయఙ్ఞావతారం

ఇక సుయఙ్ఞావతారం ఎలా జరిగిందో చెబుతాను వినుమని నారదునితో బ్రహ్మ మళ్ళీ ఇలా అన్నాడు.

పూర్వం రుచి అనే ప్రజాపతికీ, స్వాయంభువ మనువు కూతురైన ఆకూతి అనే సుగుణవతికీ సుయఙ్ఞుడుఅనేవాడు పుట్టాడు. అతడు దక్షిణఅనే కాంతను పత్నిగా స్వీకరించాడు. ఆమె కడుపున సుయములు అన్న పేరుగల వేల్పులను జన్మింపజేశాడు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం ఇచ్చాడు. విష్ణువులాగా సమస్తలోకాల దుఃఖాన్ని పరిహరింప జేశాడు. తాత అయిన స్వాయంభువ మనువు తన మనుమని చరిత్రకు మనసులో ఎంతో సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరియేఅని పలికాడు. మునింద్రా! ఆ కారణంవల్ల ఉత్తమ ఙ్ఞానానికి నిధియైన సుయఙ్ఞుడు హరిఅవతారంగా ప్రశస్తి వహించాడు.

కపిలమహర్షి
బ్రహ్మదేవుడు పై కథ చెప్పి ఆపై షడ్దర్శనాలలో ఒకటైన సాంఖ్య యోగం ప్రవర్తింపజేసిన కపిలమహర్షి అవతారగాథను ఆలకించమంటూ ఇలా అన్నాడు.
కపిలమహర్షి
 కపిలమహర్షి

దేవహూతి అనే ఆమె నిశ్చలమతి అయిన సతి. దివ్యతేజస్వియైన కర్దమ ప్రజాపతి ఆమె పతి. ఆ దంపతులకు ఆనందం అతిశయింపగా తొమ్మండుగురు ఆడు తోబుట్టువులతో సహా శ్రీహరి కపిలుడుఅన్న పేరుతో ఆవిర్భవించాడు. ఏ యోగంతో నారాయణుని పొందటానికి వీలవుతుందో, ఆ మనోఙ్ఞమైన సాంఖ్యయోగాన్ని ఆ మహనీయుడు తల్లికి బోధించాడు. ఆ విధంగా ఆమె పాపాలు రూపుమాపి మునులు ఆపేక్షించే మోక్షాన్ని ఆమెకు ప్రసాదించాడు.

దత్తాత్రేయుడు
ఇక దత్తాత్రేయుని అవతారం ఎలా విలసిల్లిందో వివరిస్తాను విను.
 దత్తాత్రేయుడు

అత్రిమహర్షి మునులలో మేటి. ఆయన తనకు పుత్రుణ్ణి ప్రసాదించమని లక్ష్మీనాథుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి పాపరహితుడవైన ఓ మునీంద్రా! నేను నీకు దత్తుడనయ్యాను’” అని అన్నాడు. అందువల్ల హరియే అత్రికి దత్తాత్రేయుడై జన్మించాడు. ఆ మహనీయుని పాదపద్మపరాగం సోకి హైహయవంశానికీ, యదువంశానికీ చెందిన వారందరూ పవిత్రదేహులయ్యారు. ఆయన అనుగ్రహంవల్లనే వాళ్ళు ఇహలోకపరలోకాలు ప్రసాదించే యోగబలం అర్జించుకొన్నారు. ఙ్ఞాన ఫలాన్నీ, సుఖాన్నీ, ఐశ్వర్యాన్నీ, శక్తినీ, శౌర్యాన్నీ పొందారు. తమ కీర్తి మింట వెలుగొందుతుండగా ఉభయలోకాలలో ప్రసిద్ధి వహించారు. అలాంటి దివ్యరూపుడైన విష్ణుదేవుని వినుతించడం సాధ్యమా!

సనకాదులు
ఇక సనకాదుల అవతార ప్రకారం ఆలకించు.
సనకాదులు
పవిత్రాత్మా! నేను కాలగర్భంలో విశ్వాన్ని సృష్టింపదలచు కొన్నాను. అందుకై తపస్సు చేస్తూ సనఅని పలికాను. అందువల్ల సనఅనే పేరుతో సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడుఅనే నలుగురు పుట్టారు. వాళ్ళు బ్రహ్మమానసపుత్రులుగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివర అంతరించిపోయిన ఆత్మ తత్వాన్ని వాళ్ళు మళ్ళీ లోకంలో సంప్రదాయానుసారంగా ప్రవర్తింపజేశారు. నయశీలుడవైన నారదా! ఆ విష్ణుదేవుని కళలతో జన్మించిన వాళ్ళు నలుగురైనా నిజానికి వారి అవతారం ఒక్కటే.

నరనారాయణులు
ఇక నరనారాయణుల అవతార పద్ధతి ఆకర్ణించు.

వినుతిగాంచిన గుణాలు గలవారూ, మిక్కిలి పవిత్రమూర్తులూ అయిన నరనారాయణులనేవారు ధర్మానికి అధిష్ఠానమైన ధర్ముడికి, దక్షుని కుమార్తె అయిన మూర్తియందు జన్మించారు. ఆ పరమపావనులు బదరికావనానికి వెళ్ళి నిశ్చల తపస్సులో నిమగ్నులయ్యారు. వాళ్ళ తపస్సు ఫలిస్తే తన పదవికి ఎక్కడ ముప్పు మూడుతుందో అని మహేంద్రుడు మనస్సులో ఎంతో చింతించాడు. అప్సరసలను పిలిపించాడు. 

ఆ విధంగా అతడు సురసుందరులను పిలిపించి నరనారాయణుల తపస్సు చెడగొట్టండిఅని చెప్పి పంపాడు. ఆ కాంతలు ఎంతో సంతోషంతో కంతుని చతురంగసేనలా అన్నట్లు బయలుదేరి బదరీవనానికి వెళ్ళారు. అక్కడ నరుడూ, నారాయణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి దేవకాంతలు సవిలాసంగా వచ్చారు. అందచందాల తీరూ, కళానైపుణ్యాల సౌరూ, ఉట్టిపడేటట్లు పరియాచకాలు పలుకుతూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ విహరించారు. అలా విలాసలీలలతో తపోవనంలో విచ్చలవిడిగా విహరిస్తున్న అప్సరసలను నరనారాయణులు చూచారు. కాని ఏ మాత్రం చలించలేదు. కామానికి లోను కాలేదు. నిశ్చింతులై, నిర్మోహులై వాళ్ళు అలాగే నిరతిశయమైన నిశ్చలమైన ధ్యానంతో మహా తపస్సులో నిమగ్నులై వుండిపోయారు.

కోపం తమ తపస్సులకు లోపం కలిగిస్తుందని గ్రహించి సత్త్వసంపన్నులూ, బుద్ధిమంతులూ అయిన నరనారాయణులు వాళ్ళమీద ఏ మాత్రం కోపం చూపలేదు.

అప్పుడు నారాయణుడు వెంటనే తన ఊరూ భాగాన్ని గోటితో చీరాడు. అతని తొడలోనుండి అమరకాంతలు మెచ్చేటట్లుగా ఊర్వశి మొదలైన అప్సరః స్త్రీ సమూహం ఉద్భవించింది.

నారాయణుని ఊరువులో నుండి పుట్టడంవల్ల ఆమె ఊర్వశిఅని పేరుగాంచింది. ఇంద్రుడు పంపగా వచ్చిన దేవతాస్త్రీలు ఊర్వశి మొదలైన వాళ్ళ అందచందాలూ, హావభావాలూ, వినోదవిహారాలూ చూచి లజ్జతో కుంచించుకు పోయారు.

మనస్సులో అనుకుంటే చాలు, ఆ నరనారాయణులు సృష్టిస్థితిలయాలు చేయగలరు. అలాంటి మహానుభావుల తపస్సుకు భంగం కలిగించడానికి సురకాంతలు చేసిన శృంగార విలాసాలు కృతఘ్నుడికి చేసిన ఉపకారాల లాగా నిరుపయోగాలయ్యాయి. అందువల్ల వాళ్ళు సిగ్గుతో పరితపించారు. ఆ ఊర్వశినే తమకు నాయకురాలుగా చేసుకొని వచ్చినదారినే తిరిగిపోయారు.

పూర్వం రుద్రుడు మహాక్రోధంతో కాముణ్ణి కాల్చివేశాడు. కోపం అంత దారుణమయింది. అట్టి కోపాన్ని సైతం ఆ బుద్ధిమంతులు అవలీలగా జయించారు. ఇక కామాన్ని గెలవడం గురించి చెప్పేదేముంది? అలాంటి నరనారాయణుల అవతారం భువనత్రయాన్ని పవిత్రం చేసింది.

ధ్రువావతారం
ఇక ధ్రువావతారం వివరిస్తాను, విను.
ధ్రువావతారం
 ధ్రువావతారం

ధ్రువుడు ఉత్తమచరిత్రుడైన ఉత్తానపాదుడనే రాజుకు సత్పుత్రుడుగా జన్మించాడు. ప్రభావసంపన్నుడై పేరుగాంచాడు. చిన్నతనంలో ఒకనాడు తండ్రివద్ద ఉన్నప్పుడు సవతితల్లి సురుచి అతణ్ణి నిందావచనాలనే అస్త్రాలతో నొప్పించింది. దుఃఖితుడైన ధ్రువుడు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలించింది. భగవంతుడు సాక్షాత్కరించి అతణ్ణి అనుగ్రహించాడు. అతడు సశరీరంగా వెళ్ళి ఆకసంలో మహోన్నతమైన ధ్రువస్థానంలో స్థిరపడ్డాడు. ఆ స్థానానికి పైన వుండే భృగువు మొదలైన మహర్షులూ, క్రింద వుండే సప్తర్షులూ ఆ మహనీయుణ్ణి గొప్పగా ప్రశంసించారు. అతడు ధ్రువుడనే పేరుతో ప్రకాశించి విష్ణువుతో సమానుడైనాడు. ఇప్పుడు కూడా ఆ పుణ్యాత్ముడు ధ్రువస్థానంలోనే వున్నాడు.
పృథుచక్త్రవర్తి 
పృథుచక్త్రవర్తి
వేనుడనే భూపాలుడు భూసురుల శాపవచనాలనే వజ్రాయుధపు దెబ్బలకు గురియైనాడు. సిరినీ, పౌరుషాన్నీ కోల్పోయాడు. తుదకు నరకం పొందాడు. అతనికి పృథుడనే కుమారుడున్నాడు. అతడు తండ్రిని పున్నామనరకంనుండి రక్షించాడు. శ్రీహరి కళాంశభవుడైన ఆ పృథుచక్రవర్తి ఈ భూమిని ధేనువుగా జేసి అమూల్యమైన అనేక వస్తువులను పిదికాడు.

వృషభుడు
ఇలా చెప్పి బ్రహ్మ మళ్ళీ నారదుడితో ఈ రీతిగా అన్నాడు. ఇప్పుడు వృషభుని అవతారం తెలియపరుస్తాను, ఆలకించు. అగ్నిధ్రుడనే వాడికి నాభి అనే కొడుకు పుట్టాడు. నాభి భార్య సుదేవి. ఆమెకు మేరుదేవి అని మరో పేరు ఉండేది. ఆమెకు హరి వృషభావతారుడై అవతరించాడు. అతడు జడశీలమైన యోగం పూనాడు. ప్రశాంతమైన చిత్తం కల్గి ఇతరులతో పొత్తు వదిలాడు. ఇది పరమహంసలు పొందదగినస్థితిఅని తన్ను గూర్చి మహర్షులు ప్రశంచించేటట్లు ప్రవర్తించాడు.

హయగ్రీవావతారం
ఇక హయగ్రీవావతారం అభివర్ణిస్తాను విను.

హయగ్రీవుడు
సచ్చరిత్రుడా! మేలిమిబంగారు కాంతికలవాడూ, వేదస్వరూపుడూ, సర్వాంతర్యామీ, సాటిలేని యఙ్ఞపురుషుడూ అయిన దేవదేవుడు హయగ్రీవుడు అన్న పేరుతో నేను చేసిన యఙ్ఞంలోనుండి జన్మించాడు. సర్వాన్నీ పవిత్రం చేసే ఆ హయగ్రీవుని ముకుపుటాలలోని శ్వాసవాయువులనుండి వేదాలు ప్రాదుర్భవించాయి.

మత్స్యావతారం
ఇక మత్స్యావతారం సంగతి చెబుతాను విను. ప్రళయకాలంలో సమస్తమూ జలమయమయిపోయింది. ఆ పరిస్థితిని వైవస్వతమనువు ముందే గ్రహించి ఒక పడవపై కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు విచిత్రమైన మత్స్యావతార మెత్తాడు. భూతలానికి ఆశ్రయమైన ఆ దేవుడప్పుడు ఎల్లప్రాణులకూ నివాసభూతుడైనాడు. నా వదనంనుండి జారిపోయిన వేదశాఖలు సంకీర్ణం కాకుండా విభజించి దేవతల కోరికమేరకు మళ్ళీ నాకు ప్రీతితో అందజేశాడు. వైవస్వతమనువు అధిష్ఠించిన నావ సముద్రములో మునిగిపోకుండా కాపాడాడు. నాయనా! మహనీయమైన ఆ మత్స్యావతారాన్ని వివరించడం ఎవరికి సాధ్యం?

 
కూర్మావతారం
ఇక కూర్మావతార వృత్తాంతం తెలుపుతాను విను.  నారదా! పూర్వం దేవతలూ, రాక్షసులూ అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వంగా జేసుకొని క్షీరసాగరాన్ని మథించారు. ఆ కవ్వపు కొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వీపుదురద తొలగించుకోవటానికా అన్నట్లు గిరగిర తిరుగుతున్న గిరిని కూర్మరూపం ధరించి ధరించాడు.

నరసింహావతారం
ఇక నరసింహావతార వృత్తాంతం విను. హిరణ్యకశిపుడనే రక్కసుడు దేవలోకంపై దండెత్తి దేవతలను బాధించాడు. ప్రచండమైన గదాదండం చేబూని వస్తున్న ఆ దానవుణ్ణి శ్రీహరి చూచాడు. వాణ్ణి పరిమార్చి ముల్లోకాలకు క్షేమం కలిగించాలనుకొన్నాడు. వెంటనే కోరలతో భీతికొలిపే నోరూ, కోపంతో ముడివడ్డ కనుబొమ్మలూ గల నరసింహావతారం ధరించాడు. వాడియైన గోళ్ళతో ఆ రాక్షసేశ్వరుని వక్షం చీల్చి హతమార్చాడు.



ఆదిమూలావతారం
ఇక ఆదిమూలావతారం వివరిస్తాను విను.
 ఆదిమూలావతారం
ఆదిమూలావతారం

నారదా! గజేంద్రుడు మొసలిచేత పట్టుబడి దుఃఖించాడు. వేయి సంవత్సరాలు దానితో పెనుగులాడుతూ రక్షణకై మొరపెట్టుకున్నాడు. తక్కిన దేవతలు విశ్వమయులు కారు కాబట్టి అతని ఆపద మాన్పలేక పోయారు. అప్పుడతడు శ్రీహరీ! నీవే నాకిక దిక్కుఅని ఆర్తుడై ఆక్రందనం చేశాడు. అది విని వెనువెంటనే పరమాత్ముడు ఆదిమూల స్వరూపుడై వచ్చి పరమోత్సాహంతో మకరిని చంపి కరిని కాపాడాడు.

వామనావతారం
ఇక వామనావతారం వర్ణిస్తాను విను. 
యఙ్ఞాధిపుడైన విష్ణువు అదితి బిడ్డలలో కనిష్ఠుడు ఐనా ఉత్తమ గుణాలలో అందరికంటే జ్యేష్ఠుడయ్యాడు. ఆయన వామనాకారంతో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగులతో ముల్లోకాలనూ ఆక్రమించి వంచనతో అపహరించాడు. తాను సర్వేశ్వరుడై వుండికూడ ఇంద్రుడికి రాజ్యం ముట్టజెప్పడానికై ఆయన వంచనతో బలిని యాచించవలసి వచ్చింది. వత్సా! ధర్మాత్ముల సొమ్ము వినయంగా వెళ్ళి ఉచిత పద్ధతిలో గ్రహించాలి. అంతే కాని మూర్ఖత్వంతో పోట్లాడి ఆక్రమించ గూడదు సుమా! ఇది నిజం!
 వామనావతారం
వామనావతారం

పరమదాత అయిన బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి వామనుని పాదపద్మాలు కడిగిన పవిత్ర తీర్థాన్ని ఔత్సుక్యంతో తలమీద చల్లుకున్నాడు. తనతోపాటు మూడులోకాలనూ నారాయణుడికి ధారాదత్తం చేశాడు. విశ్వమంతటా శాశ్వతమైన యశస్సు నిలుపుకొన్నాడు. ఆ దానంవల్ల దేవలోకం మీద తనకున్న పెత్తనం పోతుందని జంక లేదు. తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పినా లక్ష్య పెట్టలేదు.

హంసావతారం, మనువు
నారదా! అంతేకాదు. ఆ పరమేశ్వరుడు హంసావతారమెత్తాడు. అతిశయమైన నీ భక్తి యోగానికి సంతసించాడు. నీకు ఆత్మతత్వం తెలియపరచే భాగవత మనే మహాపురాణం ఉపదేశించాడు. మనువుగా అవతరించి తన తేజోమహిమతో అమోఘమైన చక్రం చేబూని దుర్జనులైన రాజులను శిక్షించాడు, సజ్జనులను రక్షించాడు. తన కీర్తిచంద్రికలు సత్యలోకంలో ప్రకాశింప జేశాడు.

హంసావతారం
హంసావతారం
ధన్వంతరి
ఇంకా ధన్వంతరిగా అవతారం దాల్చాడు. తన నామస్మరణతోనే భూమిమీద జనానికి రోగాలన్నీ పోగొట్టుతూ ఆయుర్వేదం కల్పించాడు.
 
ధన్వంతరి
పరశురామావతారం
ఇక పరశురామావతారం ఎలా జరిగిందో చెబుతా, విను.
 
పరశురామావతారం
మునీంద్రులలో అగ్రగణ్యుడవైన నారదా! హైహయరాజులు లోక విరోధులై దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళను శిక్షించడానికి శ్రీమన్నారాయణమూర్తి భార్గవరాముడుగా అవతరించాడు. రణరంగంలో ఇరవైయొక్కసార్లు ఈ రాజసమూహాన్ని దారుణమైన తన గండ్రగొడ్డలితో చెండాడినాడు. బ్రాహ్మణులు వేడుకోగా భూమండలమంతా వాళ్ళకు దానం చేశాడు. జమదగ్నిసుతుడైన ఆ పరశురాముడు అలా శాశ్వత కీర్తితో వెలుగొందాడు.

శ్రీరామావతారం
ఇక శ్రీరామావతారం వివరిస్తాను విను. చక్రధరుడైన శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆయన సూర్యవంశమనే పాల్కడలికి పున్నమిచంద్రుడు. కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో పుట్టిన మేలి ముత్యం. తన పాదసేవకుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యభగవానుడు. దశరథమహారాజు గారి పుత్రకామేష్టి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు.

ఆ శ్రీరామచంద్రుడు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే సోదరులకు అగ్రజుడై జన్మించాడు. ఆ మహా పావనుడు పాపాలనే తీవలను ఛేధించే కొడవలిగా ఈ లోకంలో ప్రకాశించాడు.

శ్రీరామచంద్రుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు
శ్రీరామచంద్రుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు

ఆపైన శ్రీరాముడు శివుని ధనుర్భంగం ఓలి కాగా జనకమహారాజు పుత్రిక సీతాదేవిని చేపట్టాడు. ఆ మహాదేవి పాదాలు చివుళ్ళ వంటివి; ఫాలం అర్ధచంద్రుని వంటిది; భుజాలు తామరతూండ్ల వంటివి; దంతాలు మొల్లల వంటివి (కుందము / మల్లె); హస్తాలు పద్మాల వంటివి; నేత్రాలు కలువల వంటివి; పిక్కలు కాహళుల వంటివి; తొడలు కరభాల వంటివి; స్తనాలు చక్రవాలాక వంటివి; నడుము ఆకసం వంటిది; పిరుదులు ఇసుక తిన్నెల వంటివి; కంఠం శంఖం వంటిది; పలుకు చిలుకపలుకు వంటిది; గమనం గజగమనం వంటిది; చెవులు శ్రీకారాల వంటివి; ముక్కు సంపెంగ వంటిది; మోము చంద్రుని వంటిది. శరీరం స్వర్ణం వంటిది; చూపులు చేపల వంటివి; కనుబొమలు ధనుస్సు వంటివి; తల వెండ్రుకలు నీలాల వంటివి; ముంగురులు తుమ్మెదల వంటివి; నవ్వు అమృతం వంటిది; బొడ్డు సుడి వంటిది.
 
సీతారాములు

ఆ పైన, నీలిమబ్బువలె నల్లనివాడూ, సద్గుణాలతో ఒప్పేవాడూ, ఐశ్వర్యంలో ఇంద్రునితో సాటియైనవాడూ, చెడుగురక్కసులను చెండాడేవాడూ అయిన రామచంద్రుణ్ణి దశరథుడు అడవులకు పొమ్మన్నాడు.

అలా పంపేసరికి అడవులకు వెళ్తున్న రాముణ్ణి లక్ష్మణుడూ, సీతా వెంబడించారు. రఘువంశ లలాముడైన రాముడు సివంగులూ, సింహాలూ, అడవిపందులూ, ఏనుగులూ, పులులూ, కోతులూ, ఖడ్గమృగాలూ, జింకలూ, తోడేళ్ళూ, ఎలుగుబంట్లూ, అడవి దున్నలూ మొదలైన అడవి మృగాలతో అత్యంత భీకరమైన దండకారణ్యం లోకి ప్రవేశించాడు.

రాజరక్షణ నీతి సంపన్నుడూ, దయాసముద్రుడూ అయిన రామభద్రుడు ఆ మహారణ్యంలో నివసించాడు. అక్కడ లోకపావనులైన మునిగణాలకు అభయప్రదానం చేశాడు.

సూర్యవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడైన ఆ రామచంద్రుడు అందలి జనులందరూ ఆశ్చర్యపడగా కోపంతో మిక్కిలి భయంకరమైన బాణాలు ప్రయోగించి ఖరుడనే రక్కసుణ్ణి ఉక్కడగించాడు.

సింహపరాక్రముడైన శ్రీరాముడు సూర్యసుతుడైన సుగ్రీవుణ్ణి అనుచరుడుగా స్వీకరించాడు. ఇంద్ర పుత్రుడైన వాలిని నేల గూల్చి యమపురికి పంపాడు. వానరాధిపుడైన సుగ్రీవునికి కిష్కింధా రాజ్యాన్నీ, సింహం వంటి నడుము గల రుమనూ అప్పగించాడు.
 వాలిసంహారం
వాలిసంహారం
అటుపిమ్మట శ్రీ రామచంద్రుడు సీత కొరకై ముజ్జగాలకూ విరోధియైన రావణున్ని సంహరింప దలచాడు. వానర సేనలను వెంటబెట్టుకొని లంకవైపు పయనించాడు. దక్షిణ సముద్రతీరం చేరాడు. దాట వీలుగాని ఆ సాగరం బాట చూపనందుకు ఆయనకు ఆగ్రహం వచ్చింది.

అంతట ఆ మహావీరుడు నొసట కనుబొమలు ముడివడగా కోపం వల్ల ఎరుపెక్కిన నేత్రాలతో సముద్రం వైపు చూచాడు. అలా చూచేసరికి సముద్రం, నీటికోళ్ళూ, తాబేళ్ళూ, పాములూ, మొసళ్ళూ, తిమింగలాలూ, పవడపు తీగలూ, తరంగాలూ, కొంగలూ, కన్నెలేళ్ళూ, చక్రవాకాలూ మొదలైన జలజంతువులతో సహా నీళ్ళు తుకతుక ఉడకగా ఇంకి పోయింది.

అప్పుడు సముద్రుడు దయాసముద్రుడైన రామభద్రుడికి శరణాగతు డయ్యాడు. రాము డతనిపై దయచూపి యథాప్రకారం ఉండమని అనుగ్రహించాడు. నలుడనే వానర ప్రముఖునిచే వంతెన కట్టించి రాముడు సముద్రం దాటాడు.

పూర్వం శివుడు ఒకే బాణంతో త్రిపురాలను కాల్చివేశాడు. అదే విధంగా రాముడు పెద్ద పెద్ద గోపురాలు, శాలలు, ముంగిళ్ళు, మేడలు, రాజగృహాలు, రచ్చలు, తలుపులు, రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు, ఆయుధాగారాలు, రాక్షసగణాలు నిండివున్న లంకానగరాన్ని చీకటిలో భస్మీపటలం చేశాడు.

ఈ విధంగా ఐరావణగజం వలె తెల్లని కీర్తితో ప్రకాశించిన శ్రీరాముడు సమస్త భువనాలనూ వేధించి బాధించిన రావణుని హతమార్చినాడు. అతని తమ్ముడైన విభీషణుణ్ణి రక్కసులకు రాజుగా చేశాడు.
 
రావణసంహారం

సీ.   ధర్మ సంరక్షకత్వ ప్రభావుం డయ్యు ధర్మ విధ్వంసకత్వమునఁ బొదలి
      ఖరదండనాభిముఖ్యముఁ బొంద కుండియు ఖరదండ నాభిముఖ్యమున మెఱసి
      ఋణ్యజనానవ స్ఫూర్తిఁ బెంపొందియుఁ పుణ్యజనాంతక స్ఫురణఁ దనరి
      సంతతాశ్రిత విభీషణుఁడు గాకుండియు సంతతాశ్రిత విభీషణత నొప్పి

తే.     మించెఁ దనకీర్తిచేత వాసించె దిశలు, దరమె నుతియింప జగతి నెవ్వరికినైనఁ
        జారుతరమూర్తి నవనీశ చక్రవర్తిఁ, బ్రకటగుణసాంద్రు దశరథరామచంద్రు.

ఆయన ధర్మాన్ని రక్షించినవాడు అనే మహిమ కలిగి కూడా ధర్మవిధ్వంసుకుడై ప్రకాశించాడు; అనగా శివధనుర్భంగం చేశాడన్నమాట! ఖరదండనలో అభిముఖుడు కాకపోయినా ఖరదండనలో అభిముఖుడయ్యాడు; అంటే కఠినశిక్షలు విధించడానికి విముఖుడైన ఆ రాముడు ఖరుడనే రాక్షసుణ్ణి దండించడానికి సుముఖుడయ్యాడు. పుణ్య జనరక్షకుడై కూడ పుణ్యజనులను హతమార్చాడు; అనగా పుణ్యాత్ములను రక్షించి రక్కసులను శిక్షించాడన్నమాట! ఆశ్రితవిభీషణుడు కాకపోయినా ఆశ్రితవిభీషణుడయ్యాడు; అనగా ఆశ్రయించిన వారిపట్ల భయంకరుడు కాకుండా విభీషణునికాశ్రయం ఇచ్చినవాడయ్యాడు. తన విశాల యశస్సును దశదిశలా వ్యాపింపజేసి సుప్రసిద్ధుడయ్యాడు. మహాసుందరుడూ, మహారాజులలో మేటి, సుగుణాభిరాముడూ అయిన ఆ దశరథ రాముణ్ణి కీర్తించడానికి లోకంలో ఎవరికీ సాధ్యం కాదు.
 
లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ సీతారామచంద్ర మూర్తి

అలాంటి శ్రీరాముని అవతారం లోకపావనమై అస్మదాదులకు అనుగ్రహకారణ మయింది. ఇక కృష్ణావతారాన్ని వర్ణిస్తాను విను.

శ్రీకృష్ణావతారం
మునిశ్రేష్ఠుడవైన నారదా! రాక్షసాంశంలో పుట్టిన రాజులు పెక్కుమంది తమ అపారసేనాబలంతో అధర్మమార్గాన ప్రవర్తించారు. భూదేవికి అనేక బాధలు కలిగించారు. ఆమె దుఃఖిస్తూ హరితో మొర పెట్టుకొన్నది. పరాత్పరుడైన శ్రీమన్నారాయణుడు మదోన్మత్తులైన దానవులను సంహరించి భూభారాన్ని తొలగించాలనుకున్నాడు. యదువంశంలో వన్నెకెక్కిన వాసుదేవునకు రోహిణి, దేవకి అనే భార్యలయందు తన తెల్లని వెంట్రుకలతో బలరాముడుగానూ, నల్లని వెంట్రుకలతో కృష్ణుడుగానూ ఆయన వెంటనే అవతరించాడు.
 
బలరామకృష్ణులు
ఈ విధంగా పద్మాక్షుడైన శ్రీమన్నారాయణుడు భూభారమంతా నివారించడానికి తన రెండు వెంట్రుకలే చాలనుకున్నాడు. తన ప్రభావం తెలపడానికి తన ఆంశంలో పుట్టిన రామకృష్ణుల శరీరకాంతులు తెలుపు నలుపులుగా చేశాడు. ధవళమూ, నీలమూ అయిన రెండు వెంట్రుకల నెపంతో రాముడు, కృష్ణుడు అను పేర్లతో అవతరించాడు. వారిలో షడ్గుణైశ్వర్య సంపన్నుడూ, సాక్షాద్విష్ణు స్వరూపుడు అయిన కృష్ణుడు ఇతరజనులు నడిచిన మార్గంలో నడిచినా మానవాతీతమైన కార్యాలెన్నో చేశాడు. అందువల్ల పరమేశ్వరుడుగానే ప్రసిద్ధి చెందాడు. ఆ మహనీయుడొనర్చిన కార్యాలు గణించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు తెలిసినంతవరకూ తెలుపుతాను, విను. 

పూతనసంహారం
పూతనసంహారం
కృష్ణుడు పురిటింట్లో పొత్తులబిడ్డగా వున్న సమయమది. పూతన అనే రక్కసి చన్నులకు విషం పూసుకొని పాలివ్వడానికి వచ్చింది. కృష్ణుడు పాలతోబాటు దాని ప్రాణాలుగూడా త్రాగి దాన్ని యమలోకానికంపాడు.
 శకటాసురసంహారం
శకటాసురసంహారం
భక్తలోక రక్షకుడైన కృష్ణుడు మూడునెలల పిల్లవాడుగా ఉన్నాడు. శకటరూపంలో ఒక రాక్షసుడు అతణ్ణి పరిమార్చటానికి వచ్చాడు. అది గమనించిన బాలకృష్ణుడు తన కాలి తన్నుతో ఆ దానవుణ్ణి దండధరుని సమీపానికి సాగనంపాడు.
ఉలూఖల బంధము 
ఉలూఖల బంధము

కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని గోపికలు యశోదవద్ద గోలపెట్టారు. యశోద అతణ్ణి త్రాటితో రోకటి కట్టివేసింది. వెంటనే అతడు రోలీడ్చుకొంటూ వెళ్ళి ఆకసమంటే జంట మద్దులను నేలగూల్చాడు. అప్పుడు అక్కడి జనమంత కృష్ణుణ్ణి కీర్తించారు. 

యశోదకు నోటిలో విశ్వాన్ని చూపడం - విశ్వరూప దర్శనం

యోగివర్యా! బాల్యంలోనే ఇలాంటి పరమాద్భుతాలు ఎన్నో చేసిన కృష్ణుడు యశోద కొడుకని నేను నమ్మలేకున్నాను. ఒకనాడు అతడు తల్లికి సకలచరాచర ప్రాణులూ, అరణ్యాలూ, నదీనదాలూ, పర్వతాలూ, సముద్రాలూ వీటితో కూడిన వివిధ జగజ్జలాన్ని అపూర్వంగా తన నోట చూపాడు. అది చూచి ఆ తల్లి ఆశ్చర్య చకితురాలయింది.

కాళీయ మర్ధనం
యమునానది మడుగులో కాళీయుడనే సర్పరాజు నివసించేవాడు. అతని నాల్కలు రెండూ భయంకరమైన విషంతో నిండి వుండేవి. అతడు క్రక్కిన గరళం కలిసిన నీళ్ళు త్రాగి ప్రజలు ప్రాణాలు గోల్పోయే వారు. ఇలా వుండగా యాదవశ్రేష్టుడైన కృష్ణుడు కాళీయుణ్ణి ఆ మడుగునుండి వెడలగొట్టి గోవులనూ, గోపాలురనూ కాపాడాడు.

దావాగ్ని భక్షణం
దావాగ్ని భక్షణం
కుమారా! అది ఒకనాటి రాత్రి. గోపకులందరూ నిద్రిస్తున్నారు. ఇంతలో అమాంతంగా కార్చిచ్చు వాళ్ళను చుట్టుముట్టింది. కృష్ణా! మంటల్లో చిక్కుకొన్నాము. కాపాడు, కాపాడుఅంటూ వాళ్ళందరూ తన్ను వేడుకొన్నారు. అప్పుడు పద్మనేత్రుడు మీరంతా కళ్ళు మూసుకోండి! ఇదిగో క్షణంలో నేను ఆ దావానలాన్ని ఆర్పి వేస్తానుఅన్నాడు. వారలా చేశారు. కృష్ణుడు అలవోకగా కార్చిచ్చును కబళించి వేశాడు.

నందుని కాపాడుట
నందుని కాపాడుట
ఒక అర్ధరాత్రివేళ నందుడు ముందు వెనుకలు చూడకుండా యమునా నదీ జలాలలో స్నానం చేస్తూ మునిగిపోయాడు. అక్కడ వరుణుడి పాశాలలో చిక్కుకొన్నాడు. అప్పుడు దయాసింధుడైన హరి ఆ బంధంనుండి అతణ్ణి విడిపించాడు.

మయుని కుమారుడైన వ్యోమాసురుడు ఒకసారి తన మాయా ప్రభావంతో కృష్ణుని సహచరులైన గోపకులందరినీ ఒక గుహలో ప్రవేశపెట్టాడు. ఇంకెవరూ ఆ గుహలో దూరకుండా దారి మూసి వేశాడు. వెంటనే మహావేగంతో కృష్ణుడు ఆ క్రూరదానవుణ్ణి పోరాటంలో చంపాడు. గోపాలకుల నందరినీ కృపతో కాపాడినాడు. మునీంద్రా! అటువంటి కృష్ణుని మహామహిమ ఇంతింతని చెప్పతరమా!

గోపకులు ప్రతి సంవత్సరమూ ఇంద్రుడికి ప్రీతిగా యాగం చేసేవారు. ఆ యాగం చేయవద్దని శ్రీహరి వారికి బోధించాడు. గోపకులు కృష్ణుని మాట ననుసరించి యాగం చేయడం మానివేశారు. ఇంద్రుడు కోపోద్దీపితుడయ్యాడు.

వెంటనే వ్రేపల్లే కలతపడేటట్టు జోరున ఏడతెరపిలేని వాన కురవండిఅంటూ అతడు మేఘాలను ఆదేశించాడు. ప్రచండమైన మారుతవేగానికి పైకెగిరి ప్రళయకాలంలోని సంవర్తకాలవంటి ఆ మేఘాలు భీకరంగా అంతటా క్రమ్ముకొన్నాయి.

గోవర్ధనోద్ధారణం
వాన ప్రారంభ మయింది. అగ్ని జ్వాలల్లాగా మిరుమిట్లు గొలిపే మెరుపులతోనూ, మాటిమాటికి ఉగ్రంగా ఉరిమే ఉరుములతోనూ ఆ వర్షం అంతకంతకూ భయంకర మయింది! సూర్య చంద్రమండలాలతో సహా గగనాన్ని కప్పివేసి దిగంతరాలకు వ్యాపించాయి ఆ కారుమబ్బులు. ధారాళంగా కుండపోతగా రాళ్ళవాన కురియసాగింది.

విరామం లేకుండా అలా కురిసే పెద్ద వానజల్లుకు గోకులమంతా వ్యాకుల మయిపోయింది. జనులందరూ మతిభ్రమ చెంది మూర్ఛిల్లారు. ఆ విధంగా కలతపడి బాధతో కృష్ణా! కృష్ణా! కాపాడు! కాపాడు!మంటూ మొరపెట్టుకొన్నారు. అప్పుడు అనంత దయాసముద్రుడూ, భక్త జనుల పాలిటీ కల్పవృక్షమూ అయిన పద్మాక్షుడు ఏడేండ్ల బాలుడు స్తంబాలవంటి తన భుజాలతో అలవోకగా గోవర్ధన గిరిని గొడుగులాగ ఏడురోజులపాటు ఎత్తిపట్టుకొన్నాడు. గోవులకూ, గోపాలకులకూ ప్రాణరక్షణ కావించాడు. సప్తసముద్రాలతో చుట్టబడిన భూమినే ధరించిన ఆ పరమాత్ముడు ఒక్క కొండను గొడుగుగా ఎత్తి పట్టుకోవడం ఏమంత ఆశ్చర్యం.

అది ఒక శరత్కాలపు రాత్రి. పండువెన్నెలలో బృందావనమంతా తెల్లగా కన్పిస్తున్నది. విరబూసిన తామరలవంటి కన్నులుగల కృష్ణుడు ఆ వనంలో రాసకేళికి ఉపక్రమించాడు. ఆ క్రీడోల్లాసంతో పిల్లనగ్రోవి చేత బట్టాడు. దాని రంధ్రాలపై వ్రేళ్ళూనుతూ ఇంపుగా అనేక రాగాలను ఆలపించాడు. వాటిలో మంద్రస్థాయినీ, మధ్యమస్థాయినీ, తారాస్థాయినీ వినిపించాడు. దైవతం, ఋషభం, గాంధారం, నిషాదం, పంచమం, షడ్జం, మధ్యమం అనే స్వరాలూ, కళలూ, జాతులూ, ఆరోహణావరోహణ క్రమాలూ తేటపడేటట్లుగా అవ్యక్త మధురంగా గానం చేశాడు. ఆ గానానికి మ్రోళ్ళు చివురించాయి.

శంఖచూడుని భుజగర్వాన్ని ఆణచుట
శంఖచూడుని భుజగర్వాన్ని ఆణచుట

శ్రీహరి వేణువు నుండి వెలువడే మధుర ధ్వని పిలుపు విని గోపికలు పరిగెత్తుకు వచ్చారు. అప్పుడు కుబేరుని అనుచరుడైన శంఖచూడుడనే గంధర్వుడు వాళ్ళనెత్తుకుపోయాడు. వాళ్ళు కృష్ణ! కృష్ణ!అంటూ మొరపెట్టుకొన్నారు. వెంటనే మాధవుడు శంఖచూడుని భుజగర్వం పోకార్చి ఆ రమణీమణులను రక్షించాడు. అలాంటి వనమాలిని కొనియాడడం ఎవరికీ శక్యం కాదు.

కంసుని సభలో మల్లయుద్ధం
కంసుని సభలో మల్లయుద్ధం
ఆ పరమాత్ముడు నరకాసురుడు, మురాసురుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కువలయాపీడము అనే ఏనుగు, ముష్టికుడు చాణూరుడు మొదలైన మల్లురు, కంసుడు, శాంబరుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వలుడు, దంతవక్త్రుడు, ద్వివిదుడు అనే వానరుడు, గార్దబాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విదూరథుడు, రుక్మి, దర్దురుడు, వృషబాకారాలు గల ఏడుగురు ధనుజులు, ధేనుకుడు మొదలైన పెక్కుమంది రక్కసులను ఒక్క త్రుటిలో రూపుమాపాడు.

అంతేకాదు. బలరాముడు, భీముడు, అర్జునుడు మొదలైన విలుకాండ్ర రూపాలతో అవతరించి కఠినులు, నీచులు, దుర్మార్గులు అయిన రాజులను రణరంగంలో ఆరితేరిన భుజబలక్రీడతో శ్రీకృష్ణుడు హతమార్చాడు. సమస్త భూభారాన్ని తొలగించాడు. సజ్జనులను రక్షించాడు. అట్టి అనంతుణ్ణి నేను అనుక్షణము ఆరాధిస్తాను.

అటువంటి లోకశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని అవతార ప్రభావాన్ని చెప్పాను.

వ్యాసుడు
ఇక వ్యాసావతారంబు వినుము.
వ్యాసుడు
 వ్యాసుడు
ప్రతియుగంలో అల్పబుద్ధులూ, అల్పాయుష్కులూ, దుర్గతి పాలయ్యేవారు అయిన మానవులుంటారు. వాళ్ళకు భగవంతుడు నిర్మించినవీ, శాశ్వతములూ అయిన వేదాలు బోధపడవు. అలాంటి వాళ్ళను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర మహర్షి ప్రియపుత్రుడైన వ్యాసుడుగా ప్రభవించి ఆ వేదవృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు.

బుద్ధావతారం
ఇక బుద్ధావతారం విను. చపలస్వభావులూ, అసత్యవాదులూ, బేదాచారపరాయణులూ, అధర్మనిరతులూ, శుద్ధ పాషాండులూ అయిన దైత్యులు లోకాన్ని చంపుకు తినేవారు. పుండరీకాక్షుడు బుద్ధుడుగా అవతరించి ఆ రక్కసులను వారి దురాచారాలతోపాటు నిర్మూలించాడు.

కల్క్యవతారం
ఇక కల్కి అవతారం గురించి ఆలకించు.

కల్కి అవతారం
కల్కి అవతారం
కలియుగంలో బ్రాహ్మణులు భగవంతుని వినుతించరు. వేదవిహితమైన యఙ్ఞయాగాది కర్మలు ఆచరించరు. వాళ్ళ నోటినుండి వషట్‌, స్వాహా, స్వధాఅనే మంగళ వచనాలు వినిపించవు. వాళ్ళు సత్యం పాటించరు; నాస్తికులై ప్రవర్తిస్తారు. శూద్రులు రాజులవుతారు. ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరిస్తాడు. అధర్మం తొలగిస్తాడు. భూతలంలో ధర్మం స్థాపిస్తాడు.

ఇలా చెప్పి బ్రహ్మ మళ్ళీ నారదునితో ఈ విధంగా అన్నాడు. మునిశ్రేష్ఠా! శ్రీమన్నారాయణుడు స్వీకరించిన లీలావతారకథా విశేషాలు నేనిప్పుడు నీకు చెప్పాను. ఇంతకు ముందే శ్రీహరి ఆదివరాహం మొదలైన అవతారాలు స్వీకరించి చేయవలసిన పనులన్నీ చేశాడు. మన్వంతరముల సంబంధమైన అవతారాలు ఇంతవరకూ జరిగినవి ఉన్నాయి. ఇక జరుగబోయేవీ ఉన్నాయి. వర్తమాన కాలంలో ఆయన ధన్వంతరి, పరశురామావతారాలు ధరించి ఉన్నాడు. భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు దాల్చ గలడు. ఆ మహాత్ముడు సృష్టి మొదలైన వివిధ కార్యాలు నెరవేర్చడానికి మాయాగుణంతో నిండిన అవతారాలు స్వీకరిస్తాడు.

అనేక శక్తులతో కూడిన ఆ భగవంతుడు సృష్ట్యాదిలో తపస్సుగా, నేనుగా, ఋషులుగా, తొమ్మిదిమంది ప్రజాపతులుగా అవతరించి లోకాన్ని సృష్టిస్తూ వుంటాడు. ధర్మము, విష్ణువు, యఙ్ఞాలు, మనువులు, ఇంద్రుడు మొదలైన దేవతల రూపాలతో, రాజుల రూపాలతో అవతరించి లోకాలను రక్షిస్తూ వుంటాడు. అధర్మము, రుద్రుడు, భీకరసర్పాలు, రాకాసిమూకలుగా అవతరించి విశ్వాన్ని సంహరిస్తూ వుంటాడు.

పరమేశ్వరుడూ, సర్వస్వరూపుడూ అయిన శ్రీహరి ఈ విధంగా ఈ విశాల విశ్వం సృష్టికీ, స్థితికీ, లయానికీ హేతువై ప్రకాశిస్తాడు. భూమిలోని ధూళికణాల నయినా లెక్క పెట్టవచ్చుగాని ఆ భగవంతుని లీలావతారాలలోని అద్భుత కృత్యాలను లెక్కపెట్టడం ఎవ్వరికీ అలవికాదు. నీకు సంగ్రహంగా చెప్పాను. సవిస్తారంగా చెప్పడం నాకే సాధ్యం కాదు. ఇక ఇతరుల మాట చెప్పడ మెందుకు? ఇంకా విను.

ఆ మహాత్ముడు త్రివిక్రమావతారం ధరించాడు. ఆయన పాదాల విసురుకు ముల్లోకాలూ తల్లడిల్లాయి. అంతేకాదు. ఆ ముజ్జగాలకు ఆవల వెలుగొందే సత్యలోకంగూడా వణకిపోయింది. అప్పుడు ఆ దేవుడు కృపతో ముప్పునుండి తప్పించి ఆ లోకాలను రక్షించాడు. అటువంటి ఆ పరమాత్ముని పాదాగ్రానికుండే అప్రతిహతమైన శక్తి ఇంతింతని వర్ణించడం ఎవరికీ శక్యం కాదు.

శ్రీహరి
శ్రీహరి మాయాశక్తిని నేనే తెలుసుకోలేకున్నాను. ఇక సనందుడు, సనకుడు, సనత్కుమారుడు మొదలైన సజ్జన సంఘాలకు మాత్రం తెలుసుకోవడానికి వీలవుతుందా? ఆదిశేషుడు ఇతరమైన ఆలోచనలు వదిలి పెట్టి బుద్ధిని సదా భగవత్సేవకే అంకితం చేశాడు. వేయి నోళ్ళతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై కీర్తిస్తూ వుంటాడు. అట్టి శేషుడు గూడ ఆయన మాయామహిమ ఎలాంటిదో తెలుసుకోలేకున్నాడు. ఇక ఇతరుల సంగతి చెప్పాలా?

ఎవరు ఇతర చింతలు మాని సదా శ్రీమన్నారాయణుణ్ణే దృఢంగా నమ్మి సేవిస్తారో, వాళ్ళను, ఆశ్రితులు అర్చించే పాదపద్మాలు కలవాడైన పద్మనాభుడు మిక్కిలి దయగలిగి కల్లాకపటంలేని మనస్సుతో అనుగ్రహిసాడు. అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైన వాళ్ళు మాత్రమే సాటిలేనిదీ, దాటరానిదీ అయిన ఆ భగవంతుని మాయను నిరంతరం తరింపగలుగుతారు.

ఇంతేకాదు. ఇంక కొందరు పుణ్యాత్ములున్నారు. వాళ్ళ సంగతి వివరిస్తాను విను. వాళ్ళు సంసారంలో మునిగి తేలుతూ దినాలు గడిపినా చివరలో కుక్కలూ, నక్కలూ పీక్కొని తినే ఈ శరీరాలపై మమకారం పెట్టుకోలేదు. తమ దేహాలను పూర్తిగా భగవంతునికే అర్పించారు.

శ్రీకృష్ణ తత్వాన్ని తెలుసుకొన్న బ్రహ్మదేవుడు
శ్రీకృష్ణ తత్వాన్ని తెలుసుకొన్న బ్రహ్మదేవుడు

నేను బ్రహ్మను గదా అన్న గర్వంతో ఒకొక్కసారి రజోగుణం నన్ను పైకొంటుంది. ఆ సంధర్భంలో నేనా మహాత్ముని తత్వం ఇలాంటిదని తెలుసుకోలేను. రజోగుణం వదలి భక్తియుక్తుడనై ఆయన పాదపద్మాలను శరణాగతి భావంతో సేవించేటప్పుడు మాత్రమే ఆ భగవన్మహిమ తెలుసుకోగలుగుతున్నాను. అందుచేతనే శాస్త్రాలపై ఆధారపడక భక్తి ఙ్ఞానయోగాలతో మాత్రమే నేను ఆ పరమాత్మను సేవిస్తాను.

నేను కాదు. సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నీవు మొదలైన వాళ్ళూ, భగవంతుడైన శివుడూ, దైత్యులను పాలించే ప్రహ్లాదుడూ, స్వాయంభువుడనే మనువూ, అతని భార్య శతరూప అనే సతీమణీ, వాళ్ళ కుమారులైన ప్రియవ్రతుడూ, ఉత్తానపాదుడూ, పుత్రికలైన దేవహూతి మొదలైనవారూ, ప్రాచీనబర్హి అనే రాజేంద్రుడూ, ఋభువు అనే మహర్షి, వేనుని తండ్రి అయిన అంగుడూ, ఉత్తానపాదుని కుమారుడగు ధ్రువుడూ వీరందరూ భగవన్మాయను తర్కింపగల్గిన వారే? ఇంకా విను!

గాధి, గయుడు మొదలైనవారు, ఇక్ష్వాకువు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగరచక్రవర్తి, రఘుమహారాజు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, శ్రుతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, జనకమహారాజు, అభిమన్యుడు, ఆర్‌ష్ణిషేణుడు మొదలగు నిర్మలమతులైన మహాత్ములందరూ అనురక్తులై భక్తితో ఆ దేవుని తమ మనస్సులో నిల్పారు. ఆయనే గతి అని సేవించారు. అందువల్లనే దాట వీలుగాని విష్ణుమాయను దాటగలవారయ్యారు.

పాపరహితుడా! సహజంగా పుణ్యాత్ములైన వీళ్ళను గూర్చి చెప్పవలసిన పనిలేదు. పశువులైనా, పక్షులైనా, రాక్షసులైనా, అడవిలో జీవించేవారైనా, పాపజీవనులైనా, స్త్రీలైనా, శూద్రులైనా, హూణులు మొదలైన వారైనా ఎవరైనా సరే ఆ శ్రీమన్నారాయణుని మీది భక్తి యోగంతో అఖండమైన ఆత్మానందం పొందినవారైతే చాలు; అవశ్యం ఆ దేవదేవుని మాయావైభవమనే మహాసముద్రాన్ని సులభంగా తరిస్తారు.

కావున మునీంద్రా! ఎల్ల వేళలా మిక్కిలి శాంతుడై వుండేవాడూ, భయరహితుడూ, విశ్వమయుడూ, కేవల ఙ్ఞానస్వరూపుడూ, సర్వేశ్వరుడూ, శుద్ధాత్ముడూ, శాశ్వతుడూ, సముడూ, సత్తుకూ అసత్తుకూ అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో!

ఎవరు పరమాత్ముని చిత్తంలో ప్రతిష్ఠించుకొంటారో, అట్టి పుణ్యాత్ములూ, సచ్చరిత్రులూ అయిన మహనీయుల చెంతకు పోలేక అవిద్యసిగ్గుతో తల వంచుకొని పెడమొగమై దూరదూరాలకు తొలగి పోతుంది. ఇంతేకాదు.

పరమాత్ముడూ, చ్యుతి లేనివాడూ, అంతం లేనివాడూ అయిన శ్రీహరిని మనస్సులో స్థిరంగా భావించిన వాళ్ళు శోకం లేని సుఖస్థితి పొందుతారు. అలాంటి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతర కార్యాలు ఏమరపాటున గూడా చేయరు. ఆలోచిస్తే అది అంతే! వర్షం కురిపించే దేవేంద్రుడు దప్పిగొని నీళ్ళకొరకై బావి త్రవ్వుతాడా?

ఆ భగవంతుడు అందరికీ అన్ని ఫలాలు ఇచ్చేవాడు. అందరికీ శరణు పొందదగినవాడు. అన్ని శక్తులు గలవాడు. అన్ని లోకాలలోనూ ప్రసిద్ధి పొందినవాడు. అంతటా వ్యాపించినవాడు. సుదర్శన మనే చక్రం ధరించిన బ్రహ్మస్వరూపుడైన ఆ దేవుడు, తక్కిన ఈ సమస్త ప్రాణులూ చిక్కి స్రుక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంత కాలంలో గూడా ఆకాశంలాగా తానొక్కడు చెక్కుదెదరకుండా నిర్వికారుడై నిలిచి వుంటాడు.

తండ్రీ! అటు కారణాలకూ, ఇటు కార్యాలకూ అన్నిటికీ కారణభూతుడైనవాడు ఆ కమలాక్షుడే. ఆయన కంటే ఇతరు లెవరూ ఆశ్రయింపదగిన వాళ్ళు లేరు. షడ్గుణైశ్వర్య సంపన్నుడూ, తుది లేనివాడూ, ప్రపంచసృష్టి గావించే ఉదారుడూ అయిన ఆ పరమాత్ముని సద్గుణ పుంజాలను గొప్ప మనస్సుతో కొనియాడాలి. లేకుంటే మనస్సులు ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మను పొందలేవు.

వత్సా, ఈ పురాణ కథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై వుంది. మోక్షప్రదంగా వుండేటట్లు ఆ భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం. శాస్త్రాలన్నిటిలోనూ శ్రేష్ఠమైనది. ఈ పురాణకథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను. నీవు దీన్ని లోకంలో విస్తృతంగా ప్రచారం కావించు.

జన్మలలో పురుషజన్మం చాలా అపురూపం. అందులోనూ బ్రాహ్మణునిగా పుట్టడం మరీ అరుదు. అందువల్ల మానవులు అనిత్యమైన నిష్ప్రయోజన కార్యాలలో బడి దురవస్థల పాలు కాకుండా శ్రీహరిని సేవించి నిత్యమైన పరమపదం పొందడం ఉచితం కదా?

పద్మనేత్రుడూ, అన్నిటినీ మించినవాడూ, లక్ష్మీకాంతుడూ, పాపనాశకుడూ, పరమేశ్వరుడూ, చ్యుతిరహితుడూ అయిన శ్రీహరిని నిర్మలభక్తి గలిగి ఆసక్తితో భజించాలి. అలా చేయకుండా ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యాగాలు, సంధ్యోపాసనలు, అగ్నికార్యాలు, జపాలు, దానాలు, వేదాధ్యయనాలు మొదలైన పనులెన్ని చేసినా మోక్షం లభించదు.

మునిశ్రేష్ఠా! పద్మనేత్రుని మహిమను ఎల్లవేళలా స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ వుంటే వినాలి. మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి. అలా చేసే వాళ్ళు దేవుని మాయకు లోనుగారు. 


ఇలా పూర్వం బ్రహ్మదేవుడు మునిశ్రేష్ఠుడైన నారదునికి ముఖ్యకథను వివరించాడు. ఆ విషయాన్ని యోగీస్వరుడైన శుకుడు మహా భక్తితో పరీక్షిన్మహారాజుకు తెలియజేశాడు.