రుద్రము - నమకము - అనువాకము 2.

అనువాకము 2
యజుస్సు 1.  (13పదములు కల వచనరూప మంత్రమునే యజుస్సు అందురు)
నమో హిరణ్య బాహవే సేనాన్యేదిశాంచపతయే నమః.
బంగారు నగలు గల బాహువు లందుఁ గల యట్టియు, యుద్ధ రంగమున సేనను జేర్చు సేనా నాయకు డగునట్టియుదిక్కులను పాలించు నట్టి వాడుఁను  రుద్రునకు నమస్కారము.

యజుస్సు 2.
నమో వృక్షేభ్యో హరి కేశేభ్యః పశూనాంపతయేనమః.
హరిత వర్ణమైన కేశములు పర్ణ రూపమునఁ గల వృక్షాకార రుద్ర మూర్తులకు నమస్కారము అగు గాక. పశువులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగును గాక.

యజుస్సు 3.
నమస్సస్పింజరాయత్విషీమతే పథీనాంపతయేనమః.
సస్పి(లేత గడ్డి)వలె పసుపు, ఎఱుపు, రంగుల కలయిక గల మహా దేవునకు నమస్కార మగు గాక. కాంతి గల రుద్రునకు నమస్కార మగును గాక. శాస్త్రము లందు చెప్ప బడిన దక్షిణోత్తర తృతీయ మార్గములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు 4.
నమో బభ్లుశాయ  వివ్యాధినే న్నానాంపతయేనమః.
వాహనమైన ఎద్దుపై కూర్చుండు నట్టియు, శత్రువులను విశేషముగ పీడించు శివునకు నమస్కార మగును గాక. అన్నములైన ఓషధులను పాలించు ప్రభువగు రుద్రునకు నమస్కారము.

యజుస్సు 5.
నమో హరికేశాయోపవీతినే పుష్టానాంపతయేనమః.
నల్లని జుత్తు గల, మంగళ ప్రయోజనమైన యజ్ఞోపవీతము గల రుద్రునకు నమస్కారము. పరిపూర్ణ గుణులైన పురుషులకు స్వామియైన రుద్రునకు నమస్కార మగును గాక.

యజుస్సు 6.
నమో భవస్య హేత్యై జగతాంపతయేనమః.
సంసార భేదకుఁడైన రుద్రునకు నమస్కార మగును గాక. లోకములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కారమగును గాక.

యజుస్సు 7.
నమోరుద్రాయా  உஉతతావినేక్షేత్రాణాంపతయేనమః.
విస్తరింప బడిన ధనుస్సులతో రక్షించునట్టి రుద్రునకు నమస్కార మగు గాక. క్షేత్రములకు (శరీరములకు-పుణ్యక్షేత్రములకు) పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు  8.
నమస్సూతాయాహంత్యా వనానాంపతయేనమః.
సారథి యైనట్టియు, శత్రువులను సంహరింప శక్యుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక. అరణ్యములకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు 9.
నమోరోహితాయస్థపతయేవృక్షాణాం పతయే నమః.
లోహిత వర్ణుఁ డైనట్టియు, ప్రభు వైనట్టి రుద్రునకు నమస్కారము. చెట్లకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుఁ గాక.

యజుస్సు 10.
నమో మంత్రిణే  వాణిజాయకక్షాణాంపతయేనమః.
రాజ సభలో మంత్రాలోచన కుశలుఁ డైనట్టియు, మంత్రి రూపమున వణిజులకు స్వామి యైనట్టి రుద్రునకు నమస్కారము. వనము లందలి గుల్మ లతాదులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుఁ గాక.

యజుస్సు 11.
నమో భువంతయే వారివస్కృతా,యౌషాధీనాం పతయే నమః.
భూమిని విస్తరింప జేయు రుద్రునకు నమస్కార మగుఁ గాక. ధనము చేకూర్చునట్టి (సేవచేయుభక్తులకుచెందినట్టి) రుద్రునకు నమస్కార మగుఁ గాక. ఓషధులకు ప్రభువగు రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు 12.
నమ ఉచ్చైర్ఘోషాయా క్రందయతే పత్తీనాంపతయేనమః.
యుద్ధ సమయమున మహోన్నత ధ్వనిగా కల శివునకు నమస్కారము. శత్రువుల నేడిపించు శివునకు నమస్కార మగు గాక. పాదచారులైన యోధులకు పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగు గాక.

యజుస్సు 13.
నమః కృత్స్నవీతాయధావతే సత్వనాంపతయేనమః.
చుట్టునూ ఆవరింపబడిన సకల సైన్యము గల రుద్రునకు నమస్కారము. పరుగులిడుచున్నశత్రుసైన్యముల వెనుకనేగు రుద్రునకు నమస్కారమగుగాక. సాత్వికులై శరణాగతులైనవారి పాలకుఁడైన రుద్రునకు నమస్కార మగుగాక.

అనువాకము 2 సమాప్తము.