హారతి దీపం


జాతో బ్రహ్మకులే గ్రజోధనపతిర్యః కుంభకర్ణానుజః
పుత్రః శక్రజితః స్వయందశిశిరః పూర్ణాభూజా వింశతిః
స్వేచ్ఛః కామచరోరథాశ్వవిజయీమధ్యేసముద్రంగృహం
సర్వం నిస్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్భలే
     బ్రహ్మదేవుని వంశంలో జన్మించినప్పటికీ, కుబేరుని అన్నగా కలిగి ఉన్నప్పటికీ, కుంభకర్ణుడనే బలశాలి తమ్మునిగా ఉన్నప్పటికీ, ఇంద్రుని జయించిన ప్రతిభాశాలియైన ఇంద్రజిత్తు కుమారునిగా ఉన్నప్పటికీ, పదితలలు, ఇరవై చేతులు కలిగి ఉన్నప్పటికీ, ఆకాశగమనాది సిద్ధులు పొంది ఉన్నప్పటికీ, దుర్భేద్యమైన లంకాపట్టణానికి అధిపతియై ఉన్నప్పటికీ, గొప్ప గొప్ప రథాలు, గుర్రాలు, అస్త్రశాస్త్రాలను కలిగి ఉన్నప్పటికీ, చిత్తశుద్ధిలేని కారణం చేత మనోమాలిన్యం తొలగని కారణంచేత, కామాడులకు హృదయంలో ఆశ్రయం కల్పించినందువల్ల, లోపలి చీకటిని పోగొట్టుకోలేనందున రావణుడు తన జీవితాన్ని నిష్పలం చేసుకున్నాడు.
      కాబట్టి మనిషిలో అజ్ఞానాన్ని, హార్దిక తమస్సును పారద్రోలగల జ్ఞానజ్యోతి అంత్యంతావశ్యకమైయున్నది. అట్టి జ్ఞానజ్యోతికి బాహ్యదీపం ప్రతిక.
దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుర్తాంశ్చ సర్వాన్ కామంశ్చ దేహియే
ఓ దీప దైవమా! నీవు బ్రహ్మస్వారూపమై ఉన్నావు. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి, మా కోర్కెలన్నింటినీ తీర్చుమా.
సౌజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యొజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే
   శ్రేష్ఠమైన నేతిలో మూడు వత్తులతో వెలుగొందుచూ, మూడులోకాల యొక్క గాడాంధకారాన్ని పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించి సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు.
    ఇలా స్వామిని వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులనిస్తుంటాం. హారతి భక్తునిలోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఓ దివ్య తేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధామునిపై మనసును లగ్నం చేయడానికి హారతి ఉపకరిస్తుంది.
దీపాలను పట్టుకుని దైవం ముందు తిప్పే విషయాలను గురించి ఆగమాలలో చెప్పబడింది. దీప షోడశోపాసన అంటూ రకరకాల హారతి పద్ధతులను గురించి వివరించబడింది. 3,5,7 నుంచి 251 వరకు తిప్పే హారతుల పద్ధతులున్నాయి. హారతిని దైవం ముందు వెలిగించి తిప్పడాన్ని దీప నిరంజనమని కూడ అంటారు. కర్పూరాన్ని వెలిగించడం ద్వారానో, లేక మూడు, ఐదు, ఏడు వత్తులను నేతిలో ముంచి వెలిగించిన దీపంతోనో హారతిని ఇస్తుంటారు. సాధారణంగా హారతి, పూజకు ముగింపు సమయాలలో ఉంటుంది. ఈ హారతి సేవను చూసినవారి జీవితాల నుంచి, లేక హారతి సేవను చేసినవారి జీవితాల నుంచి పెనుచీకటి తొలగిపోయి వెలుగురేఖలు వెల్లివిరుస్తాయనేది పెద్దలవాక్కు.
    హారతులను ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారు చేస్తుంటారు. కుంభ (బిందె), కూర్మ (తాబేలు), నాగ (ఏడుతలలపాము) గోపుర రూపాలలోనున్న హారతి పళ్ళాలను మనం చూడగలం. సాధారణంగా హారతి ఇచ్చేందుకు వెడల్పాటి పళ్ళెం ఉపయోగించబడుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు చిన్న పళ్ళాలు లేక గరిటెరూపంలో హారతి వస్తువులను ఉపయోగిస్తుంటారు.
     అసలు స్వామికి హారతిచ్చే దీపస్తంభమే ఒక మోస్తరు దైవమనే చెప్పాలి. దీపస్తంభపు పైభాగం అగ్నికి ప్రతిరూపం కాగా, పిడిభాగం ఈశ్వర ప్రతిరూపం, అడుగుభాగం ప్రజాపతికి ప్రతిరూపం. ఆ దీపపుస్తంభాన్ని పైకి, కిందికి తిప్పుతున్నప్పుడు సూర్యుడు, అగ్నికి ప్రతిరూపంగా చెప్పా బడుతుంది. అలా హారతి ఇస్తూ తిప్పే దీపాలలో రకాలున్నాయి. ఒకే ఒక దీపం ఏకహారతి, ఇంకా రెండు, మూడు ఐదు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది దీపాలతో కూడిన హారతీ దీపపు సెమ్మెలుంటాయి. పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథాకారం రథదీపం, మనిషి పురుషదీపం, కొండ మేరు దీపం, శివపంచాకృతులు పంచబ్రహ్మదీపం, ఏనుగు ఆకారం గజ దీపం, ఎద్దు ఆకారం వృషభ దీపం, కుండ కుంభ హారతి దీపం అని అంటారు. అదేవిధంగా దీపపు సెమ్మెల సంఖ్యను బట్టి, ఆకారాన్ని బట్టి వాటికి సంబంధించిన అధిదేవతలను కూడా పేర్కొన్నారు. 
ఏకహారతి మహేశ్వరుడు
ద్విహారతి ఉమా మహేశ్వరులు
త్రిహారతి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు
పంచహారతి పంచభూతాలూ
సప్తహారతి సప్త ఋషులు
అష్టహారతి అష్టమూర్తులు
నవహారతి తొమ్మిది గ్రహాలు
దశహారతి దిశానాయకులు
నాగదీపహారతి  వాసుకి
రథదీపహారతి సదాశివుడు
మేరుదీపహారతి బ్రహ్మ
వృషభదీపహారతి నంది
పురుషదీప హారతి శరభేశ
పంచబ్రహ్మాదీప హారతి పంచముఖశివుడు
    అదేవిధంగా మనం హారతి పళ్ళాలను, లేక దీపాలను త్రిప్పుతున్నప్పుడు, ఏ పద్ధతిలో త్రిప్పాలన్న విషయమూ చెప్పబడింది. ముందుగా హారతితో దైవం ముందు త్రిప్పు తున్నప్పుడు, దైవం యొక్క తల భాగం నుంచి పాదాలవరకు దీప హారతిని త్రిప్పాలి. రెండవసారి తిప్పే హారతి స్వామి ముఖం నుండి మోకాళ్ళవరకు, మూడవ సారి తిప్పే హారతి మెడ, నడుము భాగాల మధ్య త్రిప్పాలని చెప్పబడింది.
     దైవం ముందు ఒకటికి లేక మూడు, ఐదు, ఏడు తొమ్మిది దీపాలతో కూడిన హారతులిస్తుంటారు. కొన్ని శాస్త్రాల ప్రకారం తొమ్మిది దీపాలహారతి నవగ్రహాలకు ప్రతీక అని, ఏడు దీపాలహారతి సప్తమాతృకలకు, ఐదు దీపాల హారతి పంచభూతాలకు ప్రతీకలని చెప్పబడుతున్నాయి. దేవాలయాలలో  దీపహారతిని ఇచ్చేముందు మంత్రజలాన్ని చిలరించి, హారతిపళ్ళెం పిడి పై ఒక పుష్పాన్ని ఉంది, తగిన హస్త ముద్రతో హారతిని స్వామి ముందు తిప్పుతూ ఆముఖ దేవతాభ్యో నమః దీపం సమర్పయామిఅనే మంత్రాన్ని పఠిస్తారు. హారతి పళ్ళానికి పిడి తప్పనిసరి. సాధారణంగా హారతి పళ్ళాలను ఇత్తడితో చేస్తుంటారు. వెండి హారతి పళ్ళాలను విరివిగా ఉపయోగిస్తుంటారు. కొన్ని కొన్ని దేవాలయాలలో దీపపు హారతులను ఏక, పంచహారతి సంఖ్యలుంటాయి.

ఏకహారతి: ఏక హారతి విధానంలో ఒక దీపపు సెమ్మెలో ఒకే ఒక వట్టి ఉంటుంది.
పంచహారతి: పంచహారతిలో ఐదు దీపపు సెమ్మెలలో ఐదు వత్తులుంటాయి. శైవాలయాలలో ఐదు పడగల ప్రతిమతో కూడిన దీపపు సెమ్మె ఉంటుంది. ఇందులో ఒక పడగ రాహువుకి ప్రతీక కాగా, మిగతావి కేతువుకి ప్రతీకలని అంటారు. ఇలాంటి హారతిని నాగహారతి లేక నాగదీపమని అంటారు. శ్రీరంగంలో పంచహారతి జరుగుతుంటుంది.
కూర్మహారతి: తాబేలు ఆకారంలో చేయబడిన హారతి పళ్ళానికి పదహారు వత్తులు అమర్చే వీలుంటుంది. ఈ హారతి పళ్ళాలను వెండితో చేస్తారు.
File:Adukku deepam1.jpg
రథహారతి: దీపపు సెమ్మెలు రథాకారంలో అమర్చబడి ఉంటాయి. ఒక్కొక్కవరుసలో ఐదు వత్తులుంటాయి. పుష్పాకృతులతో అలంకరించబడిన పిడి ఉంటుంది. ఈ రథహారతి హిందూ దేవాలయాలతోపాటు జైన దేవాలయాలలో కూడ చూడగలం.
చంద్రదీపం: ఈ దీప హారతి నెలవంక ఆకృతిలో ఉంటుంది.
నారాయణహారతి: పదిహేను వత్తుల వెండిహారతి పళ్ళెం.
కుంభహారతి: అన్ని రకాలైన హారతులను ఇచ్చిన తరువాత కుంభహారతితో ముగింపు పలుకుతుంటారు.
ధూపహారతి: సాంబ్రాణి పొగతో ఇవ్వబడే హారతి.
కర్పూరహారతి: కర్పూరాన్ని వెలిగించి ఇచ్చే హారతి.