వరదరాజస్వామి ఆలయం


కాంచీపురంలో ఆగ్నేయం వైపు ఉంటుంది విష్ణుకంచి. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి వరదరాజస్వామి ఆలయం. అంతేకాక కామాక్షీ మందిరంలో చోరవిష్ణువు అని ఉన్నాడు.ఆయన కూడ 108దివ్యక్షేత్రములలో ఒకడు. ఈ వరదరాజస్వామి ఆలయాన్ని విష్ణుకోటి, పుణ్యకోటి అని పిలుస్తారు. ఇంద్రుడు ఒకానొక శాపానికి గురై ఏనుగు రూపం ధరించి, తపస్సు చేసి శాపవిమోచనం పొందిన చోటు విష్ణుకంచి. ఏనుగు రూపాన్ని ఇక్కడ వదిలి దేవతగా మారి వెళ్ళి పోయిన ఆఏనుగు శరీరమే హస్తిగిరి అని కొండగా మారింది. ఆగిరిపై నారాయణుడు వెలిశాడు. నరసింహ మంత్ర ఉపాసన చేశాడు కనుక ఇంద్రుని గుండెల్లోనుంచి నరసింహస్వామి వెలికి వచ్చాడు. అందుకే హస్తిగిరి నరసింహస్వామి లోపల ఉంటాడు. పైన వరదరాజస్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడే బ్రహ్మ మహాయజ్ఞము చేశాడు. అక్కడ శుక్లుడు, హేముడు అనే వేదవేత్తలైన బ్రహ్మచారులుండేవారు. వీరిద్దరూ గౌతమ మహర్షి శిష్యులు. వారుభయులూ ఒకసారి గౌతమ మహర్షి ఆజ్ఞమేరకు సమిధలు తేవడానికి అరణ్యానికి వెళ్ళి అభిషేకం కోసం నదీ జలాలను కూడా తెచ్చుకున్నారు. తిరిగి వచ్చే సమయంలో ఒకచోట జలపాత్రను పెట్టి ఎండు కట్టెలు ఏరుతున్నారట. వారికి తెలియకుండా ఆచెట్టుమీద ఉన్న బల్లి ఈనీటిలో పడిందట. ఆనీటిని చూసి గౌతమమహర్షి మీరిద్దరూ బల్లులుగా పుట్టండి అని శపించారట. ఇంద్రుడు హస్తిరూపంలో తొండంతో వీరు ఉన్న కొమ్మని విరిచాడు. వీరిద్దరూ ఇంద్రునిపై పడ్డారు. ఇంద్రుని తపస్సు వల్ల వారిద్దరూ పవిత్రులై వారి దేహాన్ని విడిచిపెట్టి వారి వారి రూపాలకి వెళ్ళారు. అవే కాంచీపురంలో ఉన్న బల్లులు. మానవశరీరం హస్తిగిరి, ఇంద్రియాలు ఇంద్రుడు, బల్లులు ఇడ, పింగళ నాడులు. ఇక్కడ విష్ణ్వారాధన చేస్తే కోటి పుణ్యములు లభిస్తాయి.


యోగరహస్యం, మంత్రరహస్యం, దేవరహస్యములు ఇమిడియున్నవి భారతీయ క్షేత్రములు. అలాంటి వాటిలో మొదటిది పృథ్వీ క్షేత్రం మానవశరీరంలో మూలాధారం - కాంచీపురంలో ఏకామ్రేశ్వర రూపంలో ఉన్నాడు. దక్షిణాపథంలో కాంచీ, ఉత్తరాపథంలో కాశీ. పురాణంలో కాంచీక్షేత్ర మహాత్మ్యం గురించి చెప్తూ శివుడు పార్వతీ దేవితో స్వయంగా చెప్పిన మాట కాశీ, కాంచీ నాకు రెండు కళ్ళు. కళ్ళు రెండైనా చూపు ఒక్కటే. క్షేత్రాలు రెండైనా శివుడొక్కడే. కాశీకి జ్ఞానక్షేత్రం అని పేరు. దక్షిణా పథంలో కాంచీకి జ్ఞానక్షేత్రం అని పేరు. ఇక్కడ ఘటికా స్థలములని ఉండేవి. ఘటికా స్థలములు అంటే విద్యాకేంద్రములు. కాంచీపురం కళలకు నిలయం. దీనిని ఆధారం చేసుకొని కూతూ అనే నాట్యశైలి వ్యాప్తిలో ఉంది. ప్రస్తుత నెల్లూరు నుంచి మహాబలిపురం వరకు అఖండ కాంచీమండలం అని పేరు. గమనిస్తే ఈప్రాంతాలలో ఉన్న అమ్మవారి పేరు కామాక్షి. కాంచీపుర ఎల్లలుగా మహాబలిపురాన్ని, పినాకిని(పెన్నానది), శ్రీరంగం, పేర్కొన్నారు. ఈకాంచీపురంలో మూడు ప్రధాన క్షేత్రములు ఉన్నాయి. శివకంచి, విష్ణుకంచి, శక్తికంచి. వేదాలు ఒక సముద్రమైతే, దానిని మధించగా పుట్టిన రత్నాలు శక్తి, శివుడు, విష్ణువు అన్నారు అప్పయ్య దీక్షితులు గారు. ఈ రత్నత్రయం ఉన్న మహాక్షేత్రం కాంచీపురం.